వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 12వ వారం బయోగ్రఫీ

అచ్యుత దేవ రాయలు (అచ్యుతరాయలు) విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. తుళువ నరస నాయకుని మూడవ భార్య అయిన ఓబాంబ కుమారుడు. శ్రీకృష్ణదేవరాయల సవతి సోదరుడు. శ్రీకృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి చంద్రగిరి దుర్గములో గృహనిర్బంధములో ఉన్న అచ్యుతదేవరాయలు రాజయినాడు. ఇతడు 1529 నుండి 1542 వరకు పరిపాలించాడు.


శ్రీకృష్ణదేవరాయల మరణంతో విజయనగరములో అంతఃకలహాలు చెలరేగాయి. అచ్యుతరాయల్ని వారసునిగా ప్రకటించడం నచ్చని కృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయలు ప్రతిఘటించి అధికారం కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ విశ్వాసపాత్రులైన సాళువ నరసింగనాయకుడు వంటి సామంతులు ఆ ప్రయత్నాలు సాగనివ్వలేదు. ఇతడు తిరుమల, శ్రీకాళహస్తి, విజయనగరంలలో మూడుసార్లు పట్టాభిషేకము చేసుకున్నాడు. అచ్యుతరాయల పట్టాభిషేకాలను రాజనాథ డిండిమభట్టు వ్రాసిన అచ్యుతరాయాభ్యుదయములో వివరముగా వర్ణించాడు.


అచ్యుతరాయలు రాజ్యము చేపట్టేనాటికి వారసత్వ పోరు కారణంగా విజయనగర రాజధానిలోని కల్లోల పరిస్థితులను ఆసరాగా తీసుకొని సామ్రాజ్యంపై ప్రతాపరుద్ర గజపతి దండెత్తినాడు. అయితే రాయలు గజపతిని తిప్పికొట్టాడు. 1530లో గోల్కొండ సుల్తాను కులీ కుత్బుల్ ముల్క్ దండెత్తి కొండవీడును ముట్టడించగా వెలుగోటి గని తిమ్మనాయుడు అతన్ని ఓడించి సుల్తాను అశ్వదళానికి అపార నష్టం కలిగించి దండయాత్రను తిప్పికొట్టాడు. ఇతను అనేక యుద్దములందు విజయం సాధించాడు. శత్రు దండయాత్రల ప్రమాదాన్ని గుర్తించిన అచ్యుతరాయలు, రామరాయలుతో సంధి చేసుకున్నాడు.


ఇతని పరిపాలనా కాలములో హంపిలోని తిరువేంగళనాధుని ఆలయము నిర్మించినాడు. ఈ ఆలయం అక్కడ కొలువై ఉన్న దేవుని పేరుమీదుగా కంటే అచ్యుతరాయ ఆలయము అన్న పేరుతోనే ప్రసిద్ధి చెందింది. న్యూనిజ్ రచనలు అచ్యుతరాయలను వ్యసనలోలునిగా, కౄరునిగా చిత్రీకరించినా, ఈయన ప్రశంసనీయుడని, సామ్రాజ్యపు గౌరవాన్ని, సంపదను నిలబెట్టేందుకు పోరాడాడని చెప్పటానికి ఆ తరువాత కాలములో శాసన మరియు సాహిత్య ఆధారాలు లభించాయి. ఇప్పుడు కపిల తీర్ధముగా ప్రసిద్ధమైన తిరుపతి లోని ఆళ్వార్ తీర్ధాన్ని అచ్యుతరాయలు నిర్మింపజేశాడు. తిరుమలలో ఆలయానికి దక్షిణము వైపున అచ్యుతరాయలు మరియు ఆయన భార్య వరదాంబికల రాతి విగ్రహాలు చూడవచ్చు. కృష్ణదేవరాయల లాగానే అచ్యుతరాయలు కూడా సాహిత్య పోషకుడు. ప్రతి సంవత్సరం ఒక గ్రంథం రాయించి తిరుపతి వెంకటేశ్వరునికి సమర్పించేవాడు. అచ్యుతరాయలు స్వయంగా తాళమహోదధి అనే గ్రంథం సంస్కృతంలో రాశాడు. ఈయన ఆస్థానములో కన్నడ కవి చాటు విఠలనాధుడు, ప్రముఖ సంగీతకారుడు పురందరదాసు మరియు సంస్కృత విద్వాంసుడు రెండవ రాజనాథ డిండిమభట్టు ఉండేవారు. కృష్ణరాయల సభ భువనవిజయములాగే, అచ్యుతరాయల సభను వెంకట విలాస మండపము అని పిలిచేవారు. .....పూర్తివ్యాసం: పాతవి