శంకరకవి

తెలుగు కవి

కవి వంశము

మార్చు

శంకరకవి హరిశ్చంద్రోపాఖ్యానమును పద్యకావ్యమునుగా రచించెను. ఈకావ్యమును నెల్లూరికావ్య మనియు, కవిని నెల్లూరి శంకరకవి యనియు, బ్రౌన్ దొరగారు వ్రాసిరికాని యావ్రాత నిరాధారమైనది. కవి గోదావరి మండలములోని వాడు; కృతి నాయకుడైన యీడూరి యెల్లనయు గోదావరీమండలములోనివా డయి యీడూరి కరణమును కార్కొలనువాసస్థుడు నయియుండెను. ఈయంశములను కవి తనపుస్తకమునం దిట్లు చెప్పినాడు.-

గీ. మతి వితర్కింప గేవలమంత్రిమాత్రు
డే ధనంజయబాహుశౌర్యాధికుండు
సత్యవర్తను డీడూరిశాసనుండు
హితవచోహరి బాచయయెల్లశౌరి.

న. అమ్మంత్రినిధానంబునకు నిజస్థానంబు [ 159 ]

మ. అరవిందాసనవాస వాద్యమరలోకారాధ్యకర్కోటకే
శ్వరకారుణ్యసదాభిరక్షితము భాస్వద్దీప్తిమద్భూసురో
త్కరనిత్యశ్రుతిపాఠనిస్వన ముదాత్తశ్రీ నజస్రమ్ంబు ని
ద్ధరణిం బేర్కొన నొప్పు గార్కొలను గోదావర్యుపాంతంబునన్.

తన తాత ముత్తాలు కూడ గోదావరి నివాసులని కవి తన గ్రంధములో చెప్పియున్నాడు

మార్చు

ఒక్క కృతిపతిమాత్రమేకాక కృతిపతియొక్క తాతముత్తాతలును గోదావరిమండలములోనే పుట్టి పెరిగి యక్కడనే సంబంధబాంథవ్యములను జేసికొనుచుండిరి. కవి కృతిపతియొక్క ముత్తాతను వర్ణించుచు నతడు గోదావరి మండలములోని యుండి గ్రామములో సంబంధము చేసికొన్నట్లీ క్రింది పద్యమున జెప్పినాడు-

చ. ప్రెగడనమంత్రి బంధుజనబృందము పేర్కొన నుండిశాసనుం
డగుమతిశాలివీరసచివాగ్రణిపుత్రిక దిప్పమాంబికన్
దగుమహిమ న్వివాహ మయి ధన్యచరిత్రుల గాంచె బుత్రులన్
జగదభివర్ణనీయుల విశాలయశోవిభవాభిరాములన్.

ఈడూరి కరణమునకు కృతి నిచ్చుట

మార్చు

ఈడూరి కరణమునకు గృతి యిచ్చినకవియు తద్గ్రామపరిసరమున నివసించువాడే యై యుండవలెనుగాని యెక్కడనుండియో నెల్లూరినుండి వెదకుకొనుచు వచ్చినవాడయి యుండడు. కవి తన గ్రంథములోనే తానాయెల్లనార్యునికి బంధుడును విధేయుడు నయినట్లును తన్నతడింటికి బిలిపించి హరిశ్చంద్ర చరిత్రమును దన కంకితము చేయుమని కోరినట్లును చెప్పిన పద్యములలో నొకటి ఈ క్రింద ఈయబడినది.

మ. నను గౌండిన్యమునీంద్రగోత్రజు సుధాంధస్సింధుకల్లోలతు
ల్యనిరాఘాటవచోధురంధరుని డేచామాత్యసత్పుత్రు బా
వనచారిత్రు శశాంకమోళిపద సేవాలబ్ధసాహిత్యస
ద్ధనునిన్ బంధు విధేయు శంకరకవిన్ దాక్షిణ్యపుణ్యాధికున్.

కవి కాలాదులు తెలుపు గ్రంధస్త మూలాలు

మార్చు

కృతిపతియు గృతికర్తయు నిరువురును గూడ నాఱువేలనియోగులు. వారిరువురును కుతుబ్‌షా గోలకొండ నవాబుగా నున్నకాల [ 160 ] ములో నున్నట్లు కవికృతినాయకుని గూర్చి పంచమాశ్వాసాంతమున సంబోధించిన యీ పద్యమువలన దెలియవచ్చుచున్నది.

క. అలఘుప్రతాపకుతుబన|మల కేంద్రకృపాసమగ్రమహిమాన్విత కా
ర్కొలనిగ్రామని కేతన|జనసీమారక్షణై కచాతుర్యనిధీ.

ఈకుతుబనమల కేంద్రుడు సాధారణముగా నిభరామని చెప్పబడెడి యిబ్రహీము కుమారు డయినమహమ్మదు కుతుబ్‌షా. ఇతడు క్రీస్తుశకము 1581 వ సంవత్సరము మొదలుకొని 1611 వ సంవత్సరమువఱకును గోలకొండలో రాజ్యము చేసినందున, కవియు నప్పుడే యుండి పదునాఱవ శతాబ్దాంతముననో పదునేడవశతాబ్దాదియందో యీపుస్తకమును జేసియుండును. శంకరకవివిరచితమైన హరిశ్చంద్రోపాఖ్యానము మృదుమధురపాకము గలదయి రసవంత మయి సహృదయహ్లాదకరముగా నుండును. ఇందలి పద్యముల నొక్కొక్కయాశ్వాసమునుండి యొక్కొక్కదాని నిందుదాహరించెదను.

శా. ఆకర్ణింపుము పాకశాసన సుపర్వానీకసంసేవ్య భూ
లోకాధీశు డగణ్యపుణ్యుడు కృపాలోలాత్మకుం డర్థిర
క్షాకల్పద్రుమ మద్రిధీరుడు హరిశ్చంద్రాభిధానుండు ధా
త్రీకంతుం డొక డొప్పు సూనృతవచ:శ్రీవభవోపేతుడై. [ఆ.1]

చ. మును ధర యేలి చన్ననృపముఖ్యు లనేకులు చర్చచేసినన్
జనవర వారిలోన విలసన్మతిపారగు లెవ్వరైన సొం
పున దమవెంట ముంటిమొనమోపగజాలినయంతమేరయున్
గొని చనిరే ధరాతలము కొంకకుమీ యిల దానమిచ్చుచోన్. [ఆ.2]

సీ. పరమపావనతేజ పావక సదయాత్మ హరిణాంకమౌళిపర్యాయకాయ
యనఘపాతివ్రత్యమున మనోవాక్కాయకర్మవిస్ఫూర్తిచే ధర్మనిరతి
బూని చరించితినేని మత్ప్రాణేశ్వరుండు సూనృతవచోరూడి మెఱని
భూనుతకీర్తివిభూతిశోభితుడేని శీతలాకృత మౌనిశిష్యునకును [ 161 ]

విశదవాత్సల్యమున మున్ను కుశల మొసగి
పిదప గౌశికుఋణము సంప్రీతిదీర్ప
గూడునట్లుగ బెనిమిటి గొడుకు గరుణ
నరసి రక్షింపవయ్య జోహారునీకు.

శా. ఏణీలోచన నానిమిత్తమున నీ కీపాటు పాటిల్లెనే
క్షోణీనాథులరాణివాసములు చక్షుకౌతుకాపాదిని
శ్రేణీలాలితహర్మ్యవాటికలలో గ్రీడావి శేషంబులన్
బ్రాణేశాన్వితలై నిరంతరసుఖప్రౌడిన్ వినోదింపగన్. [ఆ.4]

మ. అకటా చేరెడు నేలకుం దగడె సప్తాంభోధివేష్టీభవ
త్సకలద్వీపకలాపభూపమకుటాంచత్పద్మరాగోజ్జ్వల
ప్రకటానర్గళనిర్గళత్కిరణశుంభత్పాదు డై నట్టిరా
జుకుమారుం డని యేడ్చె గన్ను గవ నశ్రు ల్కాల్వలై పాఱగన్. [ఆ.5]

మూలాలు

మార్చు

ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు [శంకరకవి ]

"https://te.wikipedia.org/w/index.php?title=శంకరకవి&oldid=3890688" నుండి వెలికితీశారు