శబ్దరత్నాకరము బహుజనపల్లి సీతారామాచార్యులు రచించి 1885లో ప్రచురించబడిన తెలుగు భాష నిఘంటువు. ఇందులో దాదాపు 34,000 ఆరోపాలు ఉన్నాయి. ఇది తెలుగు భాషలో అత్యంత ప్రభావవంతమైన నిఘంటువులలో ఒకటి. దీనిలోని శబ్దార్ధ స్వరూప నిర్ణయము శాస్త్రసమ్మతంగా ఉంది. పదపదార్ధములకు పూర్వకవిప్రయోగములెన్నో ఇవ్వడం వల్ల ఈ నిఘంటువునకు ప్రామణికత సిద్ధించింది.

శబ్దరత్నాకరము
శబ్దరత్నాకరము
కృతికర్త: బహుజనపల్లి సీతారామాచార్యులు
ముద్రణల సంఖ్య: 20కి పైగా
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నిఘంటువు
ప్రచురణ: దేశభాషా గ్రంథకరణసభ, మద్రాసు
విడుదల: 1885
ప్రచురణ మాధ్యమం: ముద్రణ
పేజీలు: 355
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-8120611573

వివరాలు

మార్చు

పరవస్తు చిన్నయసూరి ఆంధ్ర జనసామాన్యమునకు అందుబాటులో ఉండే ఒక తెలుగు పదముల నిఘంటువును రచింప దలచి పదాలను ప్రామాణిక గ్రంధ్రాల నుండి ఎత్తి వ్రాసుకుని, కొన్ని పదాలకు అర్థ నిర్ణయం చేసుకుని ఆ నిఘంటువు పూర్తి కాకుండానే మరణించాడు. అతని తరువాత బహుజనపల్లి సీతారామాచార్యులు తెలుగు పదాలతో పాటు తదపేక్షితములైన సంస్కృత పదాలను చేర్చి అకారాది క్రమంలో నిఘంటు నిర్మాణానికి పూనుకున్నాడు. "శరీరకష్టమును విత్త నష్టమును నించుకేనియుం బాటింపక రేయింబవళ్లు శ్రమించి" 1862 లో ప్రారంభించి సుమారు 23 సంవత్సరాలు కృషిచేసి ఈ నిఘంటువును నిర్మించాడు. ఈ నిఘంటు నిర్మాణం కొరకు రామానుజులు నాయుడు, అనంతాచార్యులు అనే వారిని వ్రాయసకారులుగా నియమించుకుని వారికి జీతం ఇచ్చాడు.

ఈ నిఘంటు నిర్మాణానికి అమరపద పారిజాతము, అభిదాన రత్నమాల, ఆంధ్రనామసంగ్రహము, ఆంధ్రభాషార్ణవము, ఆంధ్రనామశేషము, వేంకటేశ నిఘంటువు, సాంబ నిఘంటువు మొదలైన నిఘంటువులను అప్పకవీయము, కవిసర్పగారుడము, రత్నపరీక్ష వంటి లక్షణ గ్రంథాలను, రామాయణము, అచ్చతెనుగు రామాయణము, ఆధ్యాత్మ రామాయణము, ఉత్తర రామాయణము, కవిత్రయ భారతము, భాగవతము, జైమిని భారతము, వసుచరిత్రము, రాఘవ పాండవీయము, కళాపూర్ణోదయము, భోజరాజీయము, శృంగార నైషదము, పంచతంత్రము, ఆముక్త మాల్యద, నలచరిత్రము, కాశీఖండము, విష్ణుమాయా విలాసము, చమత్కార మంజరి, బసవపురాణము మొదలైన కావ్యాలను మొత్తము 104 గ్రంథాలను వెదికి పదములకు అర్థములను వ్రాసి, అవసరమైన చోట ఆయా పదాల వ్యుత్పత్తిని వ్రాసి, వాటి ప్రయోగాలను చూపాడు. ఇవే కాక అన్యదేశీయాలైన 123 ఆంగ్లపదాలను, 16 తమిళపదాలను, 4 కన్నడపదాలను చేర్చాడు.

ఈ నిఘంటువును 1885లో తొలిసారి చెన్నపట్టణములోని దేశభాషా గ్రంథకరణసభ వారు ప్రచురించారు. ఈ సందర్భంగా బహుజనపల్లి సీతారామాచార్యులను ఐదు వేల రూపాయలతో సత్కరించారు. 1951 నాటికి ఈ నిఘంటువు 10 ముద్రణలు పొందింది. 6వ ముద్రణలో నిడదవోలు వెంకటరావు ఈ నిఘంటువుకు మరొక 3115 కొత్త పదాలను జోడించి 116 పుటలను అదనంగా చేర్చాడు.