శాంతి పర్వము షష్టమాశ్వాసము

(శాంతిపర్వము షష్టమాశ్వాసము నుండి దారిమార్పు చెందింది)


షష్టాశ్వాసం ప్రధమ భాగం

మార్చు

యోగసాంఖ్య యోగులు అక్షరమైన పరబ్రహ్మమును పొందారు అని భీష్ముడు చెప్పగా ధర్మరాజు " తాతగారూ ! ఉత్తరాయణము ప్రవేశించుటకు కొద్ది రోజుల వ్యవధిమాత్రమే ఉన్నది. కాని నేను మీ నుండి తెలుసుకోవలసిన విషయములు అనంతములు. దయచేసి నాకు అన్ని విషయములు వివరించండి ? " అని అడిగాడు.

అక్షరము

మార్చు

భీష్ముడు బదులుగా " ధర్మనందనా ! నీకు వశిష్టుడికి జనకుడికి జరిగిన సంభాషణ వివరిస్తాను. ఒక సారి జనకుని వద్దకు వచ్చిన వశిష్టమహామునికి నమస్కరించి అతిథిసత్కారం చేసి " మునివరా ! ఆద్యంతం లేనిది, పునరావృత్తి రహితమైనది, నాశనం లేనిది, శుభప్రథమైనది అయిన తత్వం గురించి వివరించండి " అని అడిగాడు. వశిష్ఠుడు " నేత్రములు, కళ్ళు, ముఖం, చేతులు, కాళ్ళు ఉండి కూడా ఆద్యంతం వృద్ధి క్షయం లేనిదానిని అక్షయం అంటరు. అక్షరం నుండి 24 క్షరతత్వములు ఉద్భవించాయి. అక్షరతత్వం విక్రియగా వైరుధ్యం పొందడమే ప్రకృతి అవ్యక్తం అంటారు. వాటి నుండి మహాతత్వం దాను నుండి అహంకారం దాని నుండి పంచభూతములు వాటి అయిదు గుణాలైన శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాదులు పది ఇంద్రియములు మనసు పుట్టాయి. ఇలా 24 క్షరతత్వాలు గోచరాలు ఔతాయి. 25 వ తత్వమైనక్షర తత్వమే పరతత్వము. ఈ అక్షరతత్వము సత్వగుణముతో చేర్చి తనకు అర్హమైన ధర్మములు ఆచరించి దివ్యత్వము పొంది స్వర్గసుఖాలు అనుభవిస్తుంది. రజోగుణముతో కలిసి మానవునిగా పాప పుణ్యకార్యాలు చేస్తూ కష్టసుఖాలను సమానంగా అనుభవిస్తుంది. తమోగుణముతో కలిసి కేవలం పాపకార్యములాచరించి పశుపక్ష్యాది జన్మలెత్తి దుఃఖమును నరకమును అనుభవిస్తుంటుంది. అక్షరతత్వము వర్ణరహితమైనది అయినా సత్వగుణంతో చేరి శ్వేత వర్ణం, రజోగుణంతో చేరి ఎరుపు వర్ణం, తమోగుణంతో చేరి నలుపు వర్ణంగా భ్రమింప చేస్తుంది. అక్షరతత్వం గుణరహితమైనా అహంకారంతో చేరి అనేక విధములైన వికారము పొందుతూ ఉంటుంది. అక్షరతత్వం అమలినమైనది అయినా త్రుగుణాత్మకమై యజ్ఞములు, యాగములు, ఉపవాసము, భూశైనము, నియమ నిష్టలు, సన్యాసం, ముని వేషధారణ చేసి నారచీరలు ధరించి జడలుకట్టించి దండధారణ మొదలైనవి చేసి శరీరమును బాధపెడుతూ ఉంటుంది. అక్షరతత్వానికి చావు పుట్టుకలు లేవు. అది అమలినము అమృతము అయినది. కాని తనను తాను మరచి ఈ అవలక్షణములను తనకు ఆపాదించుకుని భ్రమలా ఉంటుంది. తనను తానుతెలుసుకున్న నాడు మబ్బువిడిచిన చంద్రుడిలా ప్రకాశిస్తుంది " అని వశిష్ఠుడు చెప్పాడు.

జంతుసృష్టి

మార్చు

స్త్రీకి కాని పురుషుడికి కాని విడిగా సంతానోత్పత్తి చేసే శక్తి లేదని స్త్రీ పురుషుల కలయిక వలనే పునరుత్పతి సాధ్యమని వేదములు ఘోషిస్తున్నాయి. ఆ జీవికి స్త్రీ నుండి రక్తము, చర్మము, మాంసము లభిస్తాయి. పురుషుడి నుండి మజ్జ, ఎముకలు, నరాలు లభిస్తాయి. మొత్తం ప్రాణికోటికి ఇలాగే జరుగుతుంది. ప్రకృతి పురుషుడు ఒకరిని ఒకరు ఆకర్షించడం వలనే ఈ సమస్త సృష్టి జరుగుతుంది కదా ! స్త్రీ పురుష సంబంధాలు వారిప్రవర్తన వలన తెలుస్తుంది కాని మోక్షమార్గం ఎలా ఉంటుందో తెలియడం లేదుకదా ! అవ్యక్తము, అనుపమానమూ, అతీంద్రియము, అనంతము, అనామము, అమలము అయిన తేజస్సు ఒకటి ప్రకాశిస్తుందని వేదాలు చెప్తున్నాయి కదా ! ఆ తత్వాన్ని గురించి వివరించండి " అని జనకుడు వశిష్టుడిని కోరాడు. వశిష్ఠుడు "మహారాజా ! సకల శాస్త్రములను అధ్యయనం చేసిన నువ్వువాటిని సరిగా అర్ధం చేసుకోలేక పోయావు. అర్ధం చేసుకోలేని విద్య వ్యర్ధంకదా ! కనుక నేను చెప్పేది శద్ధగా విను " సాంఖ్యము యోగము ఒక దానిని ఒకటి అనుసరించి ఉంటాయి కాని రెండూ ఒకటే. సాంఖ్యముకు మూలము వేదము. ఈ సృష్టిలోని సకల ప్రాణులకు మూడు లింగాలు ఉన్నాయి. కాని ఆత్మకు లింగబేధము లేదని వేదాలు ఘోషిస్తున్నాయి. విత్తనము నుండి విత్తనము, మనిషి నుండి మనిషి, ఇంద్రియముల నుండి ఇంద్రియములు, మనసు నుండి మనసు పుడుతుంది. కాని ఆత్మబీజము నుండి కాని, మనిషి నుండి కాని, ఇంద్రియముల వలన కాని మనసు వలనకాని జన్మించదు. ఆత్మ నిర్గుణము, నిరాకారము, నిర్వికల్పము. కనుక ఆత్మకు సుఖదుఃఖము భవబంధాలు లేవు. ప్రకృతికి లింగబేధము లేకున్నా దాని నుండి ఉద్భవించిన ప్రాణులకు లింగబేధము ఉంది. ఋతువులకు రూపము లేకున్నా వాటి స్వభావాల అనుసరించి వాటికి నామాలు ఉన్నాయి. కనుక ప్రకృతిలో గుణములు ఉన్నా ఆత్మకు గుణములు అంటవు. ఇదే అక్షరముకు క్షరముకు కల భేదము. వీటిని ఏకము అనేకము, తత్వము నిస్తత్వము, దర్శనము అదర్శనము అని కూడా పిలుస్తారు. అక్షరపరబ్రహ్మము మూఢులకు అవివేకులకు కనబడదు. వివేకము కలిగిన సాంఖ్యులు, యోగులు తమ బుద్ధితో వివేచనతో ఈ 25వ తత్వమైన అక్షరపరబ్రహ్మాన్ని తెలుసుకొనగలరు " అని చెప్పాడు.

ఆత్మ ఏకత్వము అనేకత్వము

మార్చు

జనకుడు " మహర్షీ ! ఆత్మకు ఏకత్వము అనేకత్వము ఉన్నాయి కదా ! అలాగే విద్య అవిద్య ఉన్నాయి కదా ! నా బుద్ధిమాంధ్యము వలన నేను తెలుసుకొనజాలక ఉన్నాను కనుక క్షరము, అక్షరము, సాంఖ్యము, యోగము గురించి వివరించండి " అని అడిగాడు. వశిష్ఠుడు " జనకమహారాజా ! యోగమనగా ధ్యానము. అది రెండు విధములు. మొదటిది ప్రాణాయామము, రెండవది మానసిక ఏకాగ్రత. మొదటిది సగుణోపాసన రెండవది నిర్గుణోపాసన. ప్రాణాయామము మూత్రవిసర్జన సమయంలో భోజనము చేసిన తరువాత చెయ్యకూడాదు. యోగి మితాహారము తీసుకోవాలి. ఇంద్రియములను నిగ్రహించాలి. శబ్ధ, రస, రూప, గంధాదుల వంక మనసు మరల్చకూడదు. బుద్ధి మనసునందు నిలిపి మనసును ఆత్మ అందు నిలపాలి. కోరికలు విసర్జించి శిలాసదృశ్యముగా ఉండాలి. అలాంటి యోగి పగటికి రాత్రికి భేదము లేక నిరంతర ధ్యానములో మునిగి ఉంటాడు. గాలిలేని చోట వెలిగేదీపంలా నిశచలమనస్కుడై ఆనందం అనుభవిస్తాడు. దీనినే యోగము అంటారు. ప్రకృతివాదులైన సాంఖ్యులు ఈ ప్రకృతిని అవ్యక్తము అంటారు. ప్రకృతికి జన్మనిచ్చే ధర్మము ఉంది కనుక తానుగా బుద్ధి, అహంకారము, పంచభూతములు, విషయవాంఛలు, ఇంద్రియములుగా లోకమంతా విస్తరించి ఉంటుంది. దీనికి పురుషుడు అధిష్టానుడు. ఈ సృష్టి అనులోమానుపాతంగా జరుగుతూ ఉంటుంది. సంహారసమయంలో విలోమానుపాతంగా జరుగుతుంది. జననమరణ సమాయాలలో ప్రకృతి ప్రకోపిస్తుంది. ప్రకృతి, క్షేత్రము, అవ్యక్తము మూడూ ఒకటే. దానిని సత్వము అనికూడా అంటారు. జీవుడికి క్షేత్రము గురించి తెలుసు కనుక అతడిని క్షేత్రజ్ఞుడు అంటారు. జీవుడు ఈ అవ్యక్త పురములో ఉండడం వలన అతడిని పురుషుడు అంటారు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం. పురుషుడికి ఈ జ్ఞానము తెలుసు. ప్రకృతి సగుణాత్మకము పురుషుడు నిర్గుణుడు. 24 వికారములకు సాక్షిగా పురుషుడు నిలిచి ఉంటూ కైవల్యాం పొందుతాడు అదే పునరావృత్తి రహితమార్గము. ఈ సత్యము తెలిసిన వాడికి మరణం అంటే భయం ఉండదు.

విద్య అవిద్య

మార్చు

జనక మహారాజా ! నీకు సాంఖ్యమును యోగమును, అక్షరము గురించి వివరించాను. ఇంక విద్య అవిద్య గురించి వివరిస్తాను. విద్య అంటే 25 వ తత్వమైన అక్షర పరబ్రహ్మము. కర్మేంద్రియములకు జ్ఞేనేంద్రియములు, జ్ఞానేంద్రియాలకు మనసు, మనసుకు పంచభూతములు, పంచభూతములకు అహంకారం, అహంకాముకు బుద్ధి, బుద్ధికి అవ్యక్తము, అవ్యక్తముకు 25వ తత్వమైన అక్షర పరబ్రహ్మము వరుసగా విద్యగా పరిగణించబడతాయి. జనకమహారాజా ! నీకు క్షరముఅక్షరము గురించి ఇంతకు ముందు వివరించాను. కొందరు ప్రకృతిని క్షరమని, జీవుడిని అక్షరమని అనుకుంటారు. మరి కొంత మంది ప్రకృతి, జీవుడు కూడా క్షరమని అంటారు. మరి కొంతమంది జీవుడు, ప్రకృతి కూడా అక్షరని అంటారు. రెండింటికీ ఆది అంతము లేక పోవడము, ఈశ్వరతత్వం కలిగి ఉండటం వలన సారూప్యము ఏర్పడింది. జీవుడు, ప్రకృత్తి సహజములైన మహత్తు, అహంకారములతో చేరి, ప్రకృతి తానుగా తలుస్తాడు. అప్పుడు జీవుడు క్షరమౌతాడు. అదే జీవుడు ప్రకృతి వికారములకు లోబడక స్వతంత్రుడైతే అక్షరుడౌతాడు. జీవుడికి జ్ఞానప్రకాశం కలుగగానే ఈ విధంగా అనుకుంటాడు " ఇంత కాలము ప్రకృతి అనుకుంటున్నాను. ఈ ప్రకృతి తన వికృతులతో నన్ను భ్రమింప చేసింది. కాని నీరు నీటిలోని చేప వేరు అన్నట్లు ప్రకృతి వేరు, జీవుడు వేరు. నేను నిష్కళంకుడను, నాకు రూపము లేదు, నాకు ఈ ప్రకృతితో సంబంధం లేదు కనుక నేను దానికి దూరంగా ఉంటాను. అసలు ఈ తప్పు ప్రకృతిది కాదు నాదే, సంగమం అంటే ఏమిటో తెలియని వాడిని ప్రకృతితో ఎందుకు కలిసాను. నాకు ఇన్ని రూపములు సంభవించడానికి కారణం ఈ ప్రకృతే కారణం కదా ! ఈ ప్రకృతితో కలిసిన కారణంగా మమతా మమకారాలు చెలరేగి జన్మ వెంట జన్మ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ ప్రకృతిని వదిలి నిర్మలంగా ఉన్నాను. అహంకారం మమత కారణంగా ప్రకృతి ఇన్ని రూపాలు ధరించడానికి కారణం అయింది. నేను ఈ రెండింటిని వదిలితే ప్రకృతి నన్ను ఏమీ చెయ్య లేదు. సోమరితనం, చెడు అలవాట్లయందు ఆసక్తి ప్రకృతి లక్షణములు. అందుకే ఈ ప్రకృతిని వదిలి నిశ్చలానందాన్ని పొందాలి " ఇలా ఆలోచుస్తూ జీవుడు అక్షరత్వమును పొందుతాడు. ధర్మనందనా ! పూర్వము ఈ విద్యను బ్రహ్మ వశిష్టుడికి చెప్పాడు, వశిష్ఠుడు నారదునికి చెప్పాడు, నారదుడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాను. దీని వలన నీకు శాశ్వతానందం కలుగుతుంది.

వసుమంతుడు

మార్చు

భీష్ముడు ధర్మరాజుకు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఒకరోజు వసుమంతుడు అనే రాజు వేటకై అడవికి వెళ్ళి అక్కడ భృగువంశ సంజాతుడైన ఒక మునిని చూసి " మునిపుంగవా ! ఈ లోకములో కాని పరలోకములో కాని ఆచరించతగిన ధర్మము ఏదో చెప్పండి " అని అడిగాడు. అందుకు ఆముని " మహారాజా ! మనం ప్రతి రోజు చేసే మంచి పనులు చెడ్డ పనుల వలన మనకు సుఖముదుఃఖము కలుగుతున్నాయి. అత్యాశతోను పనులు చెయ్యాలనుకోవడం తప్పు. తియ్యటి తేనె కొరకు కొండమీదకు ఎగబాకుతున్నామని అనుకుంటారు కాని అక్కడ నుండి జారితే విరగబడతాము తెలుసుకోరు. ధర్మాన్ని జ్ఞానాన్ని నిర్మలమైన మనస్సుతో అభ్యసించాలి. ఎల్లప్పుడూ సత్సంగంతో గడపాలి. అలా చేసిన మానవునికి ఇహలోక సుఖమే కాక పరలోకసుఖము ప్రాప్తిస్తుంది. బ్రాహ్మణులకు హితమైన పనులు చెయ్యాలి. అర్హులకు దానమివ్వాలి. ఇచ్చిన తరువాత దానికి బాధపడకూడదు. క్రోధమును కామమును వదలాలి. మనసు దృఢంగా ఉంచుకోవాలి. మనసికంగా బలహీనుడైనందు వలన పూర్వము మహాభిషుడు బ్రహ్మలోకం నుండి భూమికి జారాడు. యయాతిమహారాజు మనో ధైర్యము ఉండటం చేత ఆపదల నుండి బయటపడ్డాడు " అని చెప్పిన ముని మాటలకు వసుమంతుడు కామక్రోధములను వదిలి మనోధైర్యము పొంది ధర్మ మార్గాన నడిచాడు.

యాజ్ఞవల్క్యుడు

మార్చు

ధర్మరాజు " పితామహా ధర్మము అధర్మము అను బేధము లేనిది, చావు పుట్టుకలు లేనిది, సకల సందేహములను నివృత్తి చేయకలిగినది, శుచియై, నిత్యమై, అవ్యక్తమై, ధుఃఖ రహితమై, ఆనందమయమై, పరతత్వమై ఉంటుందో దానిని నాకు వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీకు జనకుడు యాజ్ఞవక్యుల మధ్య జరిగిన సంభాషణ గురించి వివరిస్తాను. సకలలోకములలోకెల్లా విజ్ఞానఖని అయిన యాజ్ఞవల్క్యుడితో జనకుడు " మునీంద్రా ! ఇంద్రియములు, అవ్యక్తము అయిన ప్రకృతి, బ్రహ్మము, పరతత్వము, పంచభూతములు ఎలా పుట్టాయి. ఎలా లయమౌతాయి. ఆకాలమును గురించి వివరించండి " అని అడిగాడు. అందుకు యాజ్ఞవల్క్యుడు " మహారాజా ! సృష్టిని, లయమును ప్రకృతి కల్పిస్తుంది. ఒక రోజులో పగలు పది కల్పములు, రాత్రి ఒక కల్పము ఉంటాయి. పగలు సృష్టి జరుగుతుంది, రాత్రి లయము జరుగుతుంది. ఈ లోకము లోని జీవరాశులకు జీవనాధారముగా ఓషధులు సృష్టించబడ్డాయి. సృష్టికార్యము కొరకు బ్రహ్మ సృష్టించబడ్డాడు. ఆ బ్రహ్మ పంచభూతములు సృష్టించాడు. వాటికి శబ్ధ, స్పర్శ, రస, రూప, గంధములు అను గుణములను సృష్టించాడు. వీటిని గ్రహించడానికి పంచ జ్ఞానేంద్రియములను పంచ కర్మేంద్రియములను సృష్టించాడు. ఈ ఇంద్రియములకు మనసు అధినేత. జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి మనసు చేతనే విషయము గ్రహిస్తాయి కాని స్వయముగా ఏమీ చేయలేవు. మిగిలిన అన్ని అవయమలు మనసుచేత నియంత్రించబడతాయి. ఈ విషయము జ్ఞానులు అజ్ఞాలు సమానంగా గ్రహించగలరు. ఇంద్రియములు విశ్రమించినా మనసు విశ్రమించదు. కనుక ఇంద్రియములను ప్రాపంచిక విషయముల నుండి నిగ్రహించి మనసును అదుపులో ఉంచాలి. అది అభ్యాసము మీద అలవడుతుంది.

ప్రళయము

మార్చు

ఇక ప్రళయము గురించి వివరిస్తాను. రాత్రి కాగానే అవ్యక్తమైన ప్రకృతి అహంకార పూరితుడైన పురుషుని ప్రభోదిస్తుంది. ఆ పురుషుడు 12 రూపములు ధరించి సర్వభూతములను లయం చేస్తాడు. ఆ తరువాత భూమి అంతా జలమయమౌతుంది. ఆ జలమును కాలాగ్ని ఆవిరి చేస్తుంది. కాలాగ్నిని వాయువు తుదముట్టిస్తుంది. వాయువు ఆకాశంలో లయమౌతుంది. ఆ కాశం మనసులో లయమౌతుంది. ఆ మనసును అహంకార పూరితుడైన పురుషుడు కబళిస్తాడు. ఆ అహంకారం అవ్యక్తమైన ప్రకృతిలో లీనమౌతుంది. ఇలా రాత్రి జరుగుతుంది. తరువాత పగలు రాగానే తిరిగి పునఃసృష్టి జరుతుంది.

ఆధ్యాత్మము ఆదిభౌతికము ఆది దైవతము

మార్చు

ఇక ఆది భూతము, ఆది దైవతము, ఆధ్యాత్మము గురించి చెప్తున్నాను. మన శరీరంలోని పాదము, ఆపానము, జననేంద్రియము, చేతులు, నాలుక ఆధ్యాత్మము. అవి వరుసగా నడచుట, విసర్జించుట, సృష్టించుట, కార్యనిర్వహణ అనునవి అది భూతములు. వీటికి వరుసగా విష్ణువు, సూర్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు అది దేవతలు. అలాగే కళ్ళు, నాలుక, ముక్కు, చర్మము, చెవి ఆధ్యాత్మములు. వాటి గుణములైన దృష్టి, రుచి, వాసనా, స్పర్శ, శబ్ధములు అధిభూతములు. వాటికి వరుసగా సూర్యుడు, వరుణుడు, భూమి, వాయువు, ఆకాశము అదిదేవతలు. మనసు ఆధ్యాత్మము, మనసు విషయాలను గ్రహించడం స్పందించడం అనేవి అది భూతములు. మనసుకు అదిదేవత చంద్రుడు. ఇది వేదప్రమాణము. బుద్ధి ఆధ్యాత్మము విషయ పరిజ్ఞానము, శాస్త్రపరిజ్ఞానము దానికి అధిభూతములు. బుద్ధికి క్షేత్రజ్ఞుడు అదిదైవతము. అహంకారము ఆధ్యాత్మము. బుద్ధికి అభిమానము, స్వాతిశయము అధి భూతము. దానికి అదిదేవత బ్రహ్మము.

ప్రకృతి పురుషుడు

మార్చు

ఇంక ప్రకృతి పురుషుడు గురించి వివరిస్తాను. ప్రకృతి తన ఇష్టం వచ్చిన విధంగా త్రిగుణాల ఆధారంగా అనేక రకములైన వికృతులను ఒక ఆటగా పెంపొందిస్తూ ఉంటుంది. ఒక దీపము అనేక దీపములు వెలిగిస్తున్నట్లు ఈ ప్రకృతి అనేక రూపములను ఆవిష్కరిస్తుంది. సంతోషము, ఆనందము, ఆరోగ్యము, కోపరహితమైన స్వభావం, మంచి నడవడి, పరిశుభ్రత, ప్రకాశవంతంగా ఉండటం, మనసు స్థిరంగా ఉండటం, అహింస, నీతి నియమము, సిగ్గు, శ్రద్ధ, సత్యము, శుచి, ఆచారము, కరుణ, లోభరహిత నడవడి, కామవాంఛలు, ఇతరుల మీద చాడీలు చెప్పని గుణం సత్వ గుణాలు. తగవులాడుట, అహంకారము, గర్వము, కామవాంఛలు, కోపము, నిర్ధయ, మాత్సర్యము, భోగలాలసత, దుఃఖము ఇవి రజోగుణ లక్షణాలు. సదా ఏడుపు, అధికమైన మోహంతో ఉండటము, ఎప్పుడూ తింటూ ఉండటం, అనవసరమైన వాదనకు దిగడం, మూర్ఖత్వం, ఒకరితో ఒకరికి కలహాలు పెట్టడం ఇవి తమోగుణ లక్షణాలు. జీవాత్మ ఈ గుణములకు అతీతుడు కాని జీవుడు అనేక రూపములతో కళంకితుడౌతున్నాడు. జీవుడు చైతన్య మూర్తి ప్రకృతి చైతన్య రహితమైనది. జీవుడి ప్రకాశంతో ఎప్పుడూ వెలుగుతున్నా జీవుడు ప్రకృతికి వశవర్తియై ఉంటాడు. జీవాత్మ తన నిజ స్థితిని తాను తెలుసుకోలేదు. జీవాత్మ ప్రకృతికి లోనై త్రిగుణాత్మకమైన కర్మలను ఆచరిస్తూ ఉంటుంది. సత్వగుణ ప్రధాన కర్మలను ఆచరించి స్వర్గ లోక ప్రాప్తి పొందుతూ ఉంటుంది. రజోగుణ ప్రధాన కర్మలను ఆచరించి మానవజన్మ ఎత్తుతుంది. తమోగుణ ప్రధానకర్మలను ఆచరించి రౌరవాది నరకములను పొందుతుంది. తనను తాను తెలుసుకున్న జీవుడు ఈ త్రిగుణములలో చిక్కు కొనక అంతర్ముఖుడై అక్షర రూపమైన ప్రబ్రహ్మ పదమును పొందుతాడు అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.

జీవుడు జీవాత్మ

మార్చు

జనకుడు " మునివర్యా ! పురుషుడు చైతన్యవంతుడని ప్రకృతి జడమని చెప్పారు కదా దానిని వివరించండి " అని అడిగాడు. యాజ్ఞవల్క్యుడు " జనకమహారాజా ! సగుణము అగుణము కాదు. అగుణము సగుణము కాదు. త్రిగుణాత్మకము అవ్యక్త్యమైన ఈ ప్రకృతి చైతన్యవంతమైన జీవాత్మ స్థితి ఎలా పొందుతుంది. జీవాత్మ సహజ స్థితి తెలుసుకునే జ్ఞానం ప్రకృతకి లేదు. కాని పురుషుడికి ప్రకృతి దాని స్వభావము తెలుసు. కనుక ఈ ప్రకృతి అచేతనము. పురుషుడు చేతనత్వం కలవాడు. సదా ప్రకృతిలో విహరిస్తున్న పురుషుడికి దాని వికారములు అంటవు. ఇది ప్రకృతి పురుషుల సంబంధము. సదా నీటిలో ఉండే తామర రేకులకు నీరు అంటదు. అలాగే పురుషుడు ప్రకృతిలో లీనమై ఉన్నప్పటికీ ప్రకృతి వికారములు అంటవు.

యోగము ప్రాణాయామము

మార్చు

జనకమహారాజా ! నీకిక యోగము గురించి చెప్తాను. సాంఖ్యము కలుగు జ్ఞానము యోగముతో కలిగే బలమూ రెండూ సాటి లేనివి. కొంత మంది సాంఖ్యము యోగము వేరు వేరు అంటారు కాని నాను మాత్రం రెండూ ఒకటే అని భావిస్తాను. 'మనోధారణ ప్రాణాయామము అనునవి రెండు ప్రధాన యోగములు. మొదటిది నిర్గుణము రెండవది సగుణము. మనో ధారణ అంటే మనసును ఏకాగ్రతగా ఉంచడం. ప్రాణాయామము అనగా శ్వాసను క్రమపద్ధతిలో వదిలి పీల్చడం. ఇది మానవుడికి అసౌకర్యం కలిగించదు. క్రమపద్ధతిలో ప్రాణాయామం చేస్తూ ఇంద్రియములను అదుపులో ఉంచుకున్న వాడు యోగసిద్ధి పొందగలడు. ప్రాణాయామం చేసే సాధకుడు నియమ నిష్టలు పాటించాలి. ప్రాణాయామముకు రోజూ కొంత సమయము పాటించాలి. శరీరముకు అసౌకర్యం కలుగని రీతిలో ప్రాణాయామం అభ్యసించాలి. ఇలా ప్రాణాయామం పగలు రాత్రి అభ్యసించాలి. దీని వలన లోపలి వెలుపలి శరీరం శుద్ధి పొందుతుంది. యోగసిద్ధికి ప్రాణాయామము దానివలన కలిగే అంతః బాహ్య శుద్ధి మూలము. ఇది సగుణతంత్రం. మనోధారణ నిర్గుణతంత్రము. ఇంద్రియములను మనసులో, మనసును అహంకారంలో, అహంకారమును బుద్ధిలో, బుద్ధిని ప్రకృతిలో లీనం చేయడమే ధ్యానం. నిరంతరం ధ్యానంలో నిమగ్నమైన వాడికి ముసలితనము లేదు. యోగికి మలినములు అంటవు, నిరంతర ఆనందము పొందుతూ పరమాత్మ దర్శనం పొందుతాడు. యోగి గాలిలో పెట్టిన దీపంలా నిశ్చలంగా ఉంటాడు. నిర్మలాకాశంలా ఉంటాడు, అటుపోటులకు చలించని సముద్రంలా ఉంటాడు. అతడి చుట్టూ భయంకర శబ్ధాది మనసుని కలవర పెట్టే విషయములను పట్టించు కొనడు. దీనినే యోగ మార్గం అంటారు. కాని ఈ మార్గంలో నడవడానికి ఎలాంటి అలసత్వం పనికి రాదు. ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండాలి. ఈ యోగికి ఎవరికి అందని మోక్షం లభిస్తుంది.

మరణం లోకాలు

మార్చు

మరణ సమయంలో ఈ యోగికి పాదముల నుండి ప్రాణములు పోయినట్లైన విష్ణుపదము, పిక్కల నుండి పోయిన వసువులు ఉండే లోకమును, జానువుల (మోకాళ్ళ) నుండి పోయిన సాధ్యులు ఉండే లోకము లభిస్తుంది, విసర్జకావయవము నుండి పోయిన సూర్యలోకము లభిస్తుంది, తొడల నుండి పోయిన ప్రజాపతిలోకము లభిస్తుంది, జననేంద్రియముల నుండి పోతే భూలోకప్రాప్తి లభిస్తుంది, పార్శ్వముల నుండి పోతే మరుత్తుల లోకము ప్రాప్తిస్తుంది, బొడ్డులోనుండి పోతే చంద్రలోకము లభిస్తుంది, చేతుల నుండి పోతే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది, వక్షస్థలం నుండి పోతే కైలాసప్రాప్తి లభిస్తుంది, ముఖములో నుండి పోతే విశ్వదేవతలు ఉండే లోకం లభిస్తుంది. చెవుల నుండి పోతే దిక్పాలకులు ఉండే లోకం లభిస్తుంది. ముక్కుల నుండి పోతే వాయుదేవుడు ఉండే లోకం లభిస్తుంది. కళ్ళ నుండి పోతే అగ్ని దేవుడు ఉండే లోకం లభిస్తుంది. కనుబొమల నుండి పోతే అశ్వినీ దేవతలుండే లోకం ప్రాప్తిస్తుంది. నుదురు నుండి పోతే పితృ దేవతలు ఉండే లోకం లభిస్తుంది. తలపైభాగం (బ్రహ్మరంధ్రం ) నుండి పోతే శాశ్వతానందం ఇచ్చే మోక్షం లభిస్తుంది.

మరణ సమయము

మార్చు

మరణసమయం ఆసన్నమైనప్పుడు ఆకాశంలో అరుంధతీనక్షత్రం కనిపించదు. ముక్కు చెక్కినట్లు కనపడినా, చంద్రుడు మలినంగా కనపడినా అతడి ఆయుస్షు ఒక సంవత్సరమని తెలుసుకోవాలి. ముఖవర్ఛస్సు పెరిగినా తరిగినా, తెలివితేటలు పెరిగినా తరిగినా అతడి ఆయువు ఆరునెలలే అని తెలుసుకోవాలి, పూర్ణచంద్రుడిలో, సూర్యబింబంలో వెలితి కనపడితే అతడి ఆయుర్ధాయం ఏడురోజులే అని తెలుసుకోవాలి. దేవాలయముకు వెళ్ళినప్పుడు దేవుడికి సమర్పించిన పుష్పములు, సుగంధద్రవ్యములు దుర్ఘంధం వెదజల్లితే అతడి ఆయుస్షు ఆరునెలలు మాత్రమే చెవులు ముక్కు వాలిపోయినా దంతములు రంగుమారినా కళ్ళలో కాంతి సన్నగిల్లినా, శరీరం నల్లబడ్డా అతడికి తక్షణమే మృత్యువు అని తెలుసుకోవాలి. మానవుడు అంత్య కాలంలో చేరినప్పుడు ఏ కారణం లేకుండానే కళ్ళలో నుండి నీరు కారుతూ ఉంటుంది. తలమీద నుండి పొగలు సెగలు వచ్చినా అతడికి చివరి దశ ఆసన్నమైనదని తెలుసుకోవాలి. యోగి అయిన వాడు ఈ సూచనలు గమనించి నిరంతర ధ్యానసమాధిలో ఉండి జీవుడిని ప్రమాత్మలో కలపడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి యోగి ప్రాణములు విడువగానే పరమాత్మలో లీనమై శాశ్వతానందం పొందుతాడు.

పరతత్వము

మార్చు

జనకమహారాజా ! పరతత్వము గురించి వివరిస్తాను. ఈ ప్రశ్న సూక్ష్మమైఅది కనుక వివరిస్తాను. నేను సూర్యుడిని గురించి తపస్సు చేసాను. సూర్యుడు నాకు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని చెప్పాడు. యజుర్వేదము అధ్యయనము చేసే శక్తిని ప్రసాదించమని నేను కోరాను. యజుర్వేదాధ్యయన శక్తి ప్రసాదించే సమయాన నన్ను నోరు తెరవమని చెప్పాడు నేను నోరుతెరవగానే వాగ్దేవి నానోట్లో ప్రవేశించింది. నా శరీరం తాపంతో దహించుకు పోయింది. సూర్యుడు నన్ను చూసి కొంచెం సమయము ఓర్చుకుంటే చల్లబడుతుంది అన్నాడు. తరువాత సూర్యుడు " ఓ విప్రుడా ! నీకు వేదవిద్య లభిస్తుంది. నీకు సాంఖ్యము యోగము లభిస్తుంది. నీ మనసు ఉల్లాసంగా ఉంటుంది " అని పలికి సూర్యుడు వెళ్ళాడు. నేను నా స్వగృహముకు వెళ్ళి సరస్వతీదేవిని ఉపాసించాను. నాకు సరస్వతీదేవి ప్రత్యక్షం అయింది. ఆ దేవిని చూడగానే నాకు యజుర్వేదము స్పురణకు వచ్చింది. నేను యజుర్వేదమును అధ్యయనం చేసి శిష్యులకు నేర్పుతూండగా కొంత కాలం గడిచింది.

విశ్వావసుడు

మార్చు

ఇంతలో విశ్వావసుడు అనే గంధర్వుడు ఒక రోజు నావద్దకు వచ్చాడు. నేను అతడికి అతిథి సత్కారాలు చేసిన తరువాత అతడు నన్ను " విశ్వము అనగా ఏమి ? అ విశ్వము అనగా ఏమి ? మిత్రావరుణులు ఎవరు ? జ్ఞానము జ్ఞేయము అనగాేమి ? తపస్సు అనగా ఏమి ? తపస్సు కానిది ఏమి ? సూర్యుడు అతి సూర్యుడు ఎవరు ? విద్య అనగా ఏమి ? అవిద్య అనగా ఏమి ? తెలుసుకో తగినది ఏది ? తెలుసుకో కూడనిది ఏమి ? కదిలేవి ఏవి ? కదలనివి ఏవి ? వేదములు ఆమోదించినవి ఏవి ? నాకు వివరించాండి " అని అడిగాడు. నేను " భూత వర్తమాన కూడిన అవ్యక్తమైన ప్రకృతియే విశ్వము అంటారు. గుణరహితుడైన పురుషుడు అవిశ్వము. మిత్రావరుణులే పురుషుడు, ప్రకృతి. జ్ఞానము, జ్ఞేయము, తపస్సు, తపస్సు కానిది, సూర్యుడు, అతి సూర్యుడు, ఇవన్ని ప్రకృతి పురుషులు. విద్య, అవిద్య, తెలుసుకో తగినది, తెలుసుకో లేనిది, కదిలేది, కదలనిది వరుసగా ప్రకృతి పుషులను తలపిస్తాయి. అజములు, అవ్రణములు, అక్షయములు, అతీద్రియములు ప్రకృతి పుషులు అంటారు. ఈ రెండు తత్వములు కలిసిన రోజు ప్రకృతి పురుషుని వలె గోచరిస్తుంది. వేదార్ధమును తెలుసుకో లేని వాడు వేదము చదివినా ప్రయోజనం లేదు కేవలం కంఠశోష మిగులుతుంది. వేదముల అర్ధము, సారము తెలుసుకున్న పండితుడు క్షరము అక్షరమైన పరతత్వము గురించి తెలుసుకోకలడు. అప్పుడు క్షరమును వదిలి పెట్టి అక్షరయోగము కొరకు ప్రయత్నిస్తాడు. 25వ తత్వమైన అక్షరతత్వము తెలుసుకున్నవాడు పరతత్వము గురించి తెలుసుకుంటాడు. ప్రకృతి పురుషులను వేరు వేరుగా చూడవచ్చు. 25వ తత్వము అయిన అక్షర తత్వము 26వ తత్వమైన పరతత్వము ఒకటే. 26వ తత్వమే పరమేశ్వరుడు అతడే పురుషోత్తముడు. అది నిరంజనుడు, నిత్యము, జ్ఞానము, ఆనంద స్వరూపము " అని యాజ్ఞవల్క్యుడు పలికాడు.

పురుషుడు ప్రకృతి

మార్చు

విశ్వావసుడు " 25వ తత్వము గురించి దానికన్న మిన్న అయిన పరతత్వము గురించి నారద, జైగీష, దేవల, కపిల, సుమంత, పైల మొదలైన మహా మునుల గోష్టిలో విన్నాను. కాని అర్ధము చేసుకోలేక పోయాను కనుక మిమ్ము ఆశ్రయించాను. దయచేసి వివరించాండి " అని అడిగాడు. యాజ్ఞవల్క్యుడు " విశ్వావసా ! సమయంలో నీ మనసులో చేరిన మలినంవలన నీకు అర్ధము కాలేదు. కనుక మనసు నిశ్చలం చేసి విను. అవ్యక్తమైన మైన ప్రకృతి పురుషుడు వేరు అని తెలుసు కదా ! పురుషుడు ప్రకృతితో చేరి అనేక రూపములు పొందుతూ జనన మరణ చక్రంలో ఇరుక్కు పోతూ ఉంటాడు. పురుషుడిని జీవుడు అంటారు. ప్రకృతి పురుషుడిని చూడలేక పోయినా పురుషుడు ప్రకృతిని చూస్తూ అందులో లీనమై ఇక పరమాత్మ వైపు చూడ లేడు. కాని పరమాత్మ ఈ పురుషుడిని ప్రకృతిని సాక్షీ భూతంగా చూస్తూ ఉంటాడు. పురుషుడు పరమాత్మను దర్శించే ఉపాయము చెప్తాను. పురుషుడు ప్రకృతితో స్నేహం చేస్తూ ప్రకృతే తాను అనుకుని క్రమంగా ప్రకృతిలో లీనమౌతాడు. అందువలన అహంకారం పెరుగుతుంది. ప్రకృతిలోని వస్తువుల మీద మమకారం పెరిగి వాటిని పొందాలన్న కోరిక పెరుగుతుంది. పురుషుడు ప్రకృతిని చూస్తున్నంత కాలం పరమాత్మను దర్శించ లేక జీవుడిగా మిగిలి పోతాడు. ఎప్పుడైతే పురుషుడు తానే ప్రకృతి ప్రకృతే తాను అన్న భావన విడిచి నీటిలో ఉన్న తామరలా తాను వేరు నీరు వేరు అనుకుంటాడో అప్పుడు ప్రకృతిలో సంచరిస్తున్న పురుషుడు తాను వేరు ప్రకృతి వేరు అని తెలుసుకుని పరమాత్మను దర్శిస్తాడు. పురుషుడికి జనము, వృద్ధాప్యము, మరణము తప్పవని తెలుకుని యోగి సాంఖ్యమును, యోగమును ఆశ్రయించి మమకారాన్ని వదిలి పునర్జన్మ లేని పరతత్వాన్ని పొందుతాడు. ప్రకృతి వేరు తాను వేరని పురుషుడు భేదం గ్రహించినప్పుడే పరమాత్మను చేరగలడు. పురుషుడు వేరు పుషోత్తముడు వేరని సామాన్యులు అనుకుంటారు కాని విజ్ఞులకు అభ్యాసం వలన ఇద్దరూ ఒకరే అని గ్రహించగలుగుతారు. అజ్ఞాని మాత్రం పురుషుడు వేరు పురుషోత్తముడు వేరని అనుకుంటారు. మమకారమును పోగొట్టుకున్నప్పుడు పురుషోత్తముడిని గురించి తెలుసుకోగలుగుతారు " అని చెప్పాడు. యాజ్ఞవల్క్యుని బోధలకు సంతృప్తి చెందిన విశ్వావసుడు వెళ్ళి పోయాడు.

యాజ్ఞవల్క్యుడు

మార్చు

యాజ్ఞవల్క్యుడు జనకుడితో ఇంకా ఇలా చెప్పాడు. " జనక మహారాజా ! నేను చెప్పిన విధముగా ఆచరించిన మానవులు, దేవతలు పురుషోత్తముని గురించి తెలుసుకోగలరు. జనన మరణములను జయించడమే ముక్తి అంటారు. జజన మరణాలను జ్ఞాన సముపార్జన వలన మాత్రమే జయించగలరు. కనుక జ్ఞాన సముపార్జన ముఖ్యము. జ్ఞానము గురుముఖతః లభ్యమౌతుంది. గురువుకు కులము అనేది ముఖ్యము లేదు. జ్ఞానమును ఉపదేశించిన వాడే గురువు. గురువు వద్ద అత్యంత శ్రద్ధాసక్తులు శిష్యునకు లేకున్న జ్ఞానము లభించదు కనుక శిష్యుడికి శ్రద్ధాసక్తి ముఖ్యము. అజ్ఞానంతో జనన మరణ చక్రంలో ఇరుక్కున్న జీవుడు జ్ఞానంతో మాత్రమే ఆ చక్రము నుండి విడివడగలడు. జనకమహారాజా ! నీవు ఇక నేను చెప్పినవి శ్రద్ధగా ఆచరించిన మోక్షమును పొందగలవు " అని చెప్పాడు. ఆ మాటలకు జనకుడు అమితానందం పొందాడు. ధర్మనందనా ! జనకుడికి యాజ్ఞవల్క్యుడు చెప్పిన మాటలు వింటివి కదా నీవు కూడా వాటిని శ్రద్ధగా ఆచరించి ముక్తిని పొందు " అని భీష్ముడు పలికాడు.

గృహస్థధర్మము మోక్షము

మార్చు

ధర్మరాజు " పితామహా ! గృహస్థధర్మాలను విడువకుండా మోక్షసాధన సాధ్యమేనా ? వివరించండి. " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీకు జనకుడికి సులభకు మధ్య జరిన సంభాషణ వివరిస్తే ఈ విషయము అవగతము ఔతుంది. జనకుడు యోగదర్మంలో చిక్కు పోయినప్పుడు ఆయన రాజ్యంలోని సులభ అనే స్త్రీ ఆయన జ్ఞాన పరిజ్ఞానం పరీక్షించాలని అందమైన భిక్షుకి వేషంలో ఆయన సభకు వచ్చింది. జనకమహారాజు ఆమెకు కడుపార భోజనం పెట్టించాడు. సులభ ఆయనను పరీక్షించాలని తన అందచందాలతో ఆకర్షించాలని ప్రయత్నించింది. జనకుడు నవ్వుకుని " అమ్మా ! నీవు ఎవరు ? ఎక్కడ నుడి వచ్చావు ? ఇక్కడకు వెళుతున్నావు ? నీ భర్త ఎవరు ? నీవు ఏమి చేస్తుంటావు ? అని అడిగాడు " అందుకు సులభ మౌనం వహించింది. జనకుడు " సరే నేను చెప్పేది విను. అమ్మా నేను పంచశిఖుడు అనే మహర్షి శిష్యుడను. ఆయనద్వారా నేను సాంఖ్యము, యోగము, రాజ్యపాలన అనే మూడు దీక్షలు అభ్యసించాను. పైన చెప్పిన మూడు మోక్షమార్గములు కనుక పరతత్వాన్ని పొందటానికి ప్రయత్నిస్తున్నాను. మోక్షముకు వైరాగ్యము మూలము. వైరాగ్యమును దృఢమైన జ్ఞానముతో లభిస్తుంది. నేను వైరాగ్యమును అందువలన జ్ఞానమును పొందాను. రాజ్యపాలన చేస్తూ రాజ్య సుఖముల మధ్య ఉండి కూడా నిస్సంగుడనై తిరుగుతున్నాను. ఎవరైనా నా కుడి భుజానికి చందనము రాస్తూ ఎడమ భుజము నరికినా నేను కోపించను నాకు మట్టి బంగారము రెండూ సమమే. మోక్షగాములు జ్ఞానము, కర్మ రెండింటిని గురించి అత్యంత నిష్టతో ఆచరించాలని చెప్తారు. నాకు మాత్రం మా గురువుగారి శాసనమే అత్యంత నిష్ట. కొందరు గృహస్థధర్మము సన్యాసానికి ఆడ్డు అని అనుకుని సన్యాసం స్వీకరించినా మనసు గృహస్థజీవితాన్ని మరువ లేదు. మనసులో కోరికలు పెట్టుకుని సన్యాసం స్వీకరించినా ఫలితం లేదు. కేవలము దండము కమండలము ధరించి తల గొరిగించుకుని కాషాయము కట్టినంత మాత్రాన మోక్షము రాదు. ఆత్మజ్ఞానము పొందాలి. గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఆత్మజ్ఞానము పొంద వచ్చు. అలాంటి వారికి చివరకు మోక్షము లభిస్తుంది.

సన్యాసము

మార్చు

సన్యాసం స్వీకరిస్తే గృహస్థాశ్రమంలో ఉన్న దుఃఖములు తొలగి పోతాయని చాలా మంది సన్యాసం స్వీకరిస్తారు. కాషాయం ధరిస్తారు. రాజుగా నాకు పట్టే ఛత్రం వంటిదే కాషాయము ధరించడము. సుఖాన్నిచ్చినా దుఃఖాన్ని ఇచ్చినా నాకు రాజలాంఛనాలు తప్పవు. సన్యాసులకు కాషాయం మోక్షం ఇచ్చినట్లు నాకు ఛత్రమూ మోక్షం ఇస్తుంది. కనుక మోక్షము జ్ఞానము వలన వస్తుంది కాని కాషాయ వస్త్రధారణా కమండలము ఇవ్వదు. నేను రాజునైనా ఈ ప్రాపంచిక సుఖములను త్యజించి మోక్షమార్గాన్ని అవలింబించాను. కనుక నాకీ రాజలాంఛనాలు అడ్డురావు కాని నీవు ఎవరు ? ఎందుకు నన్ను పరీక్షించ వచ్చావు. దాని వలన నీకు కలిగే ప్రయోజనము ఏమిటి ? ఓ మగువా ! నీవు బ్రాహ్మణ స్త్రీవి, యోగినివి, పరుల భార్యవు ప్రస్తుతము నీవు భర్త వద్ద లేనట్లుంది. నేను క్షత్రియుడను రాజును గృహస్థాశ్రంలో ఉన్న వాడిని. నిష్టగా ఆచార వ్యవహారములు పాటించు వాడిని. నీవు నా మీద మరులు కొనడం అపకీర్తి హేతువు ఇందుకు బాధ్యురాలవు నీవే. ఇందుకు ఫలితము నీదే. నన్ను కోరి నీవిలా సుందర రూపంలో వచ్చావు. యోగశక్తిని ఉపయోగించి అధర్మంగా కోరిక తీర్చుకోవడానికి మలినమైన బుద్ధితో నీ స్వస్వరూపము దాచి నా వద్దకు వచ్చావు. ఇది యోగినులు అవలంబించే పద్ధతి కాదు. నీ కుటిల ప్రయత్నము మాను. ఇంతటి చిన్న వయసులో నీకీ యోగవిద్య ఎలా అబ్బింది " అని అడిగాడు. అందుకు బదులుగా సులభ " మహారాజా ! చెప్పే వాడికి వినే వాడికి ఇంపైన మాటలే మంచి మాటలు ఔతాయి కాని మిగిలినవన్నీ మూర్ఖపు మాటలే. ఈ ప్రపంచం పంచ భూతాత్మకము. పంచ భూతములు కలిసినట్లే కనిపించినా వేటికి అవి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటాయి ఒక దాని మీద ఒకటి ఏదీ ఆధారపడదు. శరీరంలో పంచ భూతములు, పది ఇంద్రియములు మనసు ఇవన్నీ కలిసినట్లు ఉన్నా వేటికి అవే ప్రత్యేకత కలిగి ఉంటాయి. అలాగే మానవులందరూ పైగుణాలు కలిగి కలిసినట్లు కనిపించినా ఎవరికి వారే ప్రత్యేకత కలిగి ఉంటారు. ఈ చైతన్యము జవనాశ్వము వలె పరుగులు తీస్తూ ఉంటుంది కనుక ఎవరు ఎక్కడ ఉంటారో ఎక్కడి నుండి వచ్చారో ఎవరికి తెలుసు. మహారాజా ! నిన్ను నీవు ఎలా దర్శిస్తావో లోకంలోని ప్రజలందరిని అలాగే దర్శించాలి కదా ! అటువంటి నీవు నన్ను చూసి నీవు ఎవరు ? అలా వచ్చావు ? అని అడగవచ్చునా ! క్షత్రియుడవైన నీవు నీ పాలనలో ఉన్న ప్రజలను మంచివారు, మధ్యస్థులు, చెడ్డవారని విభజించి వారిని సామ, దాన, బేధ, దండోపాయాలతో పాలిస్తుంటావు అలాగే శత్రువులను జయిస్తావు.అటువంటి నీవు ముక్తి మార్గంలో పయనించే యోగివి ఎలా ఔతావు ? ముక్తి మార్గం అంటే ఇదేనా ? రాజా ! విషయవాంఛలకు, జయాభిలాషకు లోబడిన నీవు యోగివి కావు" అన్నాడు.

పరిక్షార్ధం సులభ వాదన పొడిగించడం

మార్చు

సులభ " మహారాజా ! నీకు నువ్వు జ్ఞానివి అనుకుంటున్నావు. అది ఒక మానసికరుగ్మత కనుక నీ బంధువులకు చెప్పి వైద్యం చేయించు. లేకున్న నాకిలా నీతులు చెప్పవు. ఇవన్నీ విన్న తరువాత కూడా నీవు నేను ఎందుకు ముక్తుడను కాను అని అడిగిన నేను చెప్పే సమాధానము విను. రాజువైన నీవు సదా ధర్మార్ధ కామాల గురించి ఆలోచిస్తూ రాజ్య తంత్రముల గురించి ఆలోచిస్తూ ఉంటావు. మేలుకొనమని, స్నానాదులు చెయ్యమని, భోజనం చెయ్యమని సేవకులు చెప్పిన కాని వినవు. నీ చుట్టూ ఉన్న మంత్రులు, సామంతులు, సుందరీ మణులు నీ మెప్పును ఆశిస్తూ నీ పనులను నిన్ను చేసుకోనివ్వరు. నీకు ఏ పని చెయ్యడానికి స్వతంత్రం ఉండదు నీకు నచ్చిన భోజనం కూడా నీ అంతట నిన్ను తిననివ్వరు. నీవు అర్హత అనర్హత తెలుసుకుని దానం చెయ్యాలి. కనుక ధనం ఎలా కూడబెట్టాలో ఆలోచన చేస్తూ ఉండాలి. నీ పక్కనే ఉంటూ గోతులు తవ్వే వారిని సదా ఒక కంట కనిపెట్టే ఉండాలి. కనుక రాజా ! రాజులకు సుఖాలు తక్కువ దుఃఖాలు తక్కువ. అలాంటి రాజులు ముక్తి మార్గంలో ఎలా ప్రయణించగలరు. కనుక నువ్వు ముక్తి మార్గంలో పయనిస్తున్నానని చెప్పడం అబద్ధం. రాజా ! పంఛశిఖ మహర్షి వద్ద ఉపదేశం పొందిన నీవు నేను నీ దగ్గరకు రాగానే అసహ్యించుకున్నావు. ఇదేనా ద్వందమును వదిలి ముక్తి మార్గంలో ప్రవర్తించే యోగులు ఆచరించే విధానం. మోక్షాసక్తుడు ద్వందమును వదలాలి, దేనియందు ఆపేక్ష లేక నిర్వికారంగా, చెలించని మనసుతో ఉండాలి. యతులు జనావాసాలను వదిలి అరణ్యవాసం చేయాలి. నీవు ముక్తుడవని పొరపాటు పడి నిర్వికారుడవని అనుకుని నీ మనస్సులో ప్రవేశించాను. నేను నిన్ను నా అవయములతో ముట్టుకోలేదు అయినా నీవు నన్ను చూసి భయపడి దూషించావు. అలా ఎందుకు చేసావు ? రాజా ఈ సభలోని పెద్దలు వింటూ ఉండగా నీవిలా మాట్లాడడం న్యాయమా ! ఎదుటి వారిని ఇలా కించపరచడం ధర్మమా ! అత్యంత గోప్యమైన స్త్రీ పురుష సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడటం మీ కీర్తికి, గొప్పతనానికి హాని కదా ! ఇది ధూర్తలక్షణం కాదా ! మహారాజువైన నీకు ఇలాంటి నికృష్టులకు కూడా తగని మాటలు తగునా ! తామరాకు మీద నీటి బొట్టులా జీవిస్తున్న నా వంటి యోగిని గురించి తెలుసుకోలేని నువ్వు పంఛశిఖమహర్షి శిస్యుడని చెప్పుకోవడం అబద్ధం కాదా ! రాజా ! నీవు గృహస్థ ధర్మానికి, మోక్షమార్గానికి కూడా దూరం అయ్యి రెండింటికి చెడిన రేవడివి అయ్యావు. అన్ని తెలుసును అనుకుని భ్రమలో పడి బ్రతుకుతూ ఉన్నావు. ముక్తులు ముక్తులు కలవడం సాధారణం. ఆకాశంలో ఆకాశం కలిసినట్లు శూన్యంలో శూన్యం కలిసినట్లు ముక్తి మార్గంలో ఉన్న వారిని చూసినప్పుడు ముక్తిమార్గులు కలిసి పోతారు. యోగినిని అయిన నన్ను నీవు చూసినప్పుడు చలించావు కనుక నీవు ముక్తి మార్గమున చరించడం అబద్ధము. మనము ముక్తులము కాదని అనుకున్నా మన కలయిక అధర్మం కాదు. నేను ప్రశస్తమైన చరిత్ర కలిగిన ప్రధన మహారాజు వంశ సంజాతని. నేను క్షత్రియ కాంతను. నా పేరు సులభ. నా పూర్వీకులు శతశృంగ పర్వతముల మీద ఎన్నో యజ్ఞ యాగములు చేసారు. సాక్షాత్తు దేవేంద్రుడే వారి వద్దకు వచ్చి పరమార్ధము గురించి సద్గోష్ఠి చేసేవాడు. నాకు వివాహం చేసుకోదగ్గ పురుషుడు లభించక మోక్షమార్గంలో పయనిస్తున్నాను. నాను క్షత్రియ వనితను కనుక మన కలయిక అధర్మం కాదు. ఇక దాపరికం ఎందుకు నేను నిన్ను పరీక్షించ వచ్చాను. కాని నీవు ముక్తి మార్గంలో పయనించడం లేదని తెలుసుకున్నాను " అని అనర్గళంగా చెప్పిన సులభ జనకుడి ముఖం చూసి నవ్వుతూ " జనక మహారాజా ! నీవు ముక్తి మార్గంలో పయనిస్తున్నావా లేదా అని పరీక్షించడం అగ్ని వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా అని పరీక్షించడం వంటిది. నేను కేవలం అజ్ఞానంతో ఇలా ప్రవర్తించానని అనుకో ! జనకమహారాజా ! నీ మాటలలో ఇసుమంతైనా అసత్యం, దోషము లేదు. మునులతో కూడా కీర్తింపతగిన నీకు మోక్షము కరతలామలకం. నేను రాగానే మీరు నన్ను ఎంతో గౌరవించారు. అందుకని మీతో ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందో అని హాస్యముకు ఇలామాట్లాడాను. నేను చెప్పినవన్నీ అబద్ధములు నేను నిన్ను పరీక్షించడానికి వచ్చానన్నది మాత్రమే నిజం. సౌజన్య మూర్తులైన మీరంతా నన్ను మన్నించండి " అన్నది సులభ. ఆ మాటలకు జనకుడు మంత్రులు ఇతర సభికులు తేకగా ఊపిరి తీసుకున్నారు. సులభ వాఖ్చాతుర్యానికి అభినందించారు. ఆరోజుకు సులభ అక్కడే ఉండి మరునాటికి తన దోవన తాను పోయింది " అని చెప్పిన భీష్ముడు " ధర్మనందనా ! జనక సులభల సంవాదనతో నీ సందేహం తీరింది కదా ! " అని అడిగాడు.

శుకుడు వైరాగ్యము

మార్చు

ధర్మరాజు " పితామహా ! వ్యాసపుత్రుడైన శుకునకు వైరాగ్యము ఎలా కలిగింది " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! వ్యాసుడి కుమారుడైన శుకుడు మొదట సాధారణంగానే ఉన్నాడు. అందరితో కలిసి పోయి శరీరము శాశ్వతం అనుకుని తనకు వ్యాధులు, మరణం ఉంటాయన్న విషయం మరచి విషయవాంఛలలో మునిగి పోయాడు. అది చూసిన వ్యాసుడు తన కుమారుడికి వైరాగ్యం బోధిస్తూ " కుమారా ! శుకా ! నీవు ఇంద్రియములను, మనసును తప్పుమార్గమున పోనీయక అదుపులో ఉంచుకుని వాటిని సరి అయిన మార్గములో పెట్టు. కోపరాహిత్యం, సత్యం పలకడం, ఇంద్రియములను అదుపులో పెట్టుకోవడం, ధర్మమార్గంలో నడవడం, సత్ప్రవర్తన కలిగి ఉండటం, తపస్సు చేయడం, అహింసామార్గము అవలంబించడం ఇవి ధర్మమార్గమాలు. వీటిని అవలంబిస్తూ ఆకలి దప్పులను అదుపులో పెట్టుకో. నీవు సంపాదించిన బిక్ష ముందు దేవతలకు సమర్పించి తరువాత అతిథులకు పెట్టి తరువాత నీవు భుజించు. పంజరంలో పిట్టలా శరీరంలో ఉన్న జీవుడిని మరిచి నీ ఇచ్ఛ వచ్చిన రీతిలో చరించడం ధర్మము కాదు. ఒక్కోరోజు గడిచే కొద్దీ కొంత ఆయుస్షు లెక్కన నీ ఆయుస్షు తరుగుతూ ఉంటుంది. చివరకు మృత్యువు నిన్ను కబళిస్తుంది. ఆ విషయం ఎరుగక నిద్రావస్థలో ఉండటం నీకు ధర్మమా ! ఈ శరీరం రక్త మాంసమయం. జగతిన ఉన్న ప్రాణులన్నీ అంతే. శరీరక సుఖములకు అలవడిన మానవుడు పెద్దల మాటను పెడచెవిన పెట్టి లోకము గురించి తలపక తామనుకున్నదే నిజమని భ్రమిస్తుంటారు. శారీరక సుఖమే ప్రధానమని అనుకోవడంలో ముందుగా సుఖం ఉన్నా తరువాత ఆపద కలిగిస్తుంది. కనుక బుద్ధిమంతులు నడిచే తోవను వదిలి దుర్మార్గులు నడచు తోవను నడవడం నీకు ధర్మంకాదు. ధర్మమార్గాన నడిచే సజ్జనుల బాటలో నడుస్తూ వారి ఉపదేశములను విను. సాలెపురుగువలె నీ చుట్టూ బంధనం కలిగించుకోవడం అజ్ఞానుల లక్షణం. సంసారంలో ఇంద్రియములే జలం, కామ, క్రోధ, లోభములే మొసళ్ళు. ఆ సాగరం దాటడానికి జ్ఞానం ఒక్కటే మార్గం. మూఢునిలా కోరికలతో మనసుని తృప్తి పరుస్తూ ఉంటే నీకు తెలవకుండా మృత్యువు నిన్ను కబళిస్తుంది. నీవలా ఉండ వద్దు. బ్రాహ్మణత్వం పొందడం చాలా కష్టం. నీ పూర్వజన్మ సృకృతం వలన నీకీ జన్మ లభించింది. నీవు దానిని వృధా చేస్తున్నావు. నీవు ఇకనైనా దుష్టసాంగత్యం వదిలి త్పస్సు, ఇంద్రియ నిగ్రహం, నిశ్చలత్వం, వివేకము మొదలైన మంచి గుణములను అలవరచుకో. కుమారా ! నీవు బ్రాహ్మణ జన్మ ఎత్తింది శారీరక సుఖము అనుభవించడానికి కాదు. నియమ నిష్టలతో జీవితము గడిపి పరలోక సుఖములు అనుభవించడానికి కదా ! ఇహలోక కామ సుఖములు అనుభవించడం తన మెడకు తాను ఉరి వేసుకోవడమే కదా ! వివేకవంతులు ఆపని ఎన్నటికి చెయ్యరు. ఒక వేళ చేసినా ఆ ఉరిత్రాడు తెంచుకుని జ్ఞానమార్గంలో నడవడం అలవర్చుకోవాలి. మూర్ఖులు మాత్రమే ఈ విషయము గ్రహించ లేక ఉరిత్రాడుకు వ్రేలాడుతూ ఉంటారు. కుమారా ! శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే నిన్ను భార్యాబిడ్డలు, మిత్రులు అనుగమిస్తారు. ఆ తరువాత నిన్ను మరచి పోతారు. కనుక వారితో పొద్దుపుచ్చక వైరాగ్యం అలవరుచుకుని నిన్ను నీవు తెలుసుకుని ఆత్మసాక్షార్కారం చేసుకో. ముసలితనము, మరణము పుట్టినప్పటి నుండి నిన్ను వెన్నంటుతూ ఉంటాయి. కనుక మృత్యువు నీ కొరకు వేచి ఉండక ఎప్పుడైనా కబళించ వచ్చు మంచి పనులు చేయడానికి ముహూర్తం కొరకు ఎదురుచూడ వద్దు. కుమారా ! భార్యా బిడ్డలు నీ వెంట రారు. నిన్ను శ్మశానానికి మోసుకు వెళ్ళి అక్కడ కాల్చి వారిదారిన వారు పోతారు. ఇన్ని రోజుల నుండి వెంట ఉన్న నిన్ను అనుగమించని వారి కొరకు తాపత్రయపడుతూ వల్లమాలిన మమకారం పెంచుకోవడం ఎందుకు ? కాలం ఈ లోకాన్ని అతలాకుతలం చేస్తుంది కనుక ధైర్యంతో ప్రాపంచిక విషయములను వదిలి అంతర్ముఖుడవు కా ! కుమారా ! నీవు ఈ జన్మకు ముందు ఎన్నో జన్మలు ఎత్తావు. ఆ జన్మలో భార్యా బిడ్డలు, మిత్రులు ఉన్నారు వారూ మరణించారు. అలాగే ఈ జన్మలోని వారూ మరణించే వారే ! కనుక నీవూ, నీ భార్యా బిడ్డలు, బంధు మిత్రులు నిరంతరం పుడ్తూ చస్తూనే ఉంటారు. ఈ సత్యం తెలుసుకో . వివేక వంతులు" నేను ఎవరిని ? ఎవరి వాడను ? ఎక్కడ నుండి వచ్చాను ? ఎక్కడకు పోతాను ? పుట్టక పూర్వము ఎవరి వాడనో తెలియదు. మరణించిన తరువాత ఎవరి వాడనో తెలియదు. ఎక్కడ నుండి వచ్చానో తెలియదు. ఎక్కడకు పోతానో తెలియదు. అని తలచిన నీకిక బంధనాలు ఉండవు. కష్టాలు భార్యమీద వ్యామోహంతో మొదలై పరలోకం వరకు వెన్నంటి ఉంటాయి. కనుక వివేకవంతులు భార్యా వ్యామోహంలో పడరు. అనుభవించకుండా, దానం చెయ్యకుండా దాచుకున్న ధనం ఎందుకు ? ఇంద్రియములను జయించలేని ధనం, దర్పం ఎందుకు. ధర్మప్రవర్తన లేని వేదాధ్యనం లేని శాస్త్రవిజ్ఞానం నిష్ప్రయోజనం. ఇంద్రియములను జయించ లేని ఆత్మ దర్శనం ఎందుకు. కనుక కుమారా ! సంసారం త్యజించి జితేంద్రియుడవు కమ్ము " అని ఉపదేశించాడు. ధర్మనందనా ! ఇలా తండ్రి వలన బోధింపబడిన వాడై శుకుడు వైరాగ్యం పొందాడు " అని భీష్ముడు చెప్పాడు.

శుకజననం

మార్చు
 
ఆకాశమార్గమున నిప్పు వలె వస్తున్న శుకుని చూస్తున్న వ్యాసాదులు

ధర్మరాజు " పితామహా ! శుకుడు వ్యాసుడి కుమారుడని చెప్పారు కదా ! శుకుడి జన్మవృత్తాంతం ఏమిటి ? అతడి తల్లి ఎవరు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము మేరు పర్వతంలో కర్ణికార వనము అని ఒక వనము ఉంది. ఆ ప్రాంతంలో వ్యాసుడు పుత్రుడి కొరకు శివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలని అడిగాడు. అప్పుడు వ్యాసుడు జలము, వాయువు, ఆకాశము, భూమి, అగ్నితో సమానుడైన పుత్రుడు కావాలని శివుని కోరాడు. అలాగే ఇస్తాను అని శివుడు వరమిచ్చి అంతర్ధానం అయ్యాడు. అలా వరమును పొందిన వ్యాసుడు హోమము చెయ్యడానికి అరణిని మధించ సాగాడు. అప్పుడు ఘృతాచి అనే అప్సరస అక్కడకు వచ్చింది. ఆమెను చూసిన వ్యాసుడు మోహపరవశుడైయ్యాడని గ్రహించిన ఘృతాచి చిలుకరూపం దల్చింది. తిరిగి వ్యాసుడు అరణిని మధిస్తున్నా మనసులో ఘృతాచి రూపం నిలిచి పోయింది. అప్పుడు వ్యాసుడి తేజస్సు వెలుపలికి వచ్చి అరణిలో పడింది. వ్యాసుడు ఇది గ్రహించకనే అరణిని మధించడంతో అరణి నుండి వ్యాసుడి శుక్లము సంయోగంతో ఒక బాలుడు జన్మించాడు. అతడే శుకుడు. అతడు పుడుతూనే అగ్నివలె వెలిగిపోసాగాడు. అప్పుడు మందాకిని స్త్రీ రూపం ధరించి శుకుడికి పురిటి స్నానం చేయించింది. ఆకాశం నుండి కమండలం, జింక చర్మము శుకుడి ముందు పడ్డాయి. దేవ దుంధుభులు మ్రోగాయి. దేవతలు పూల వానలు కురిపించారు. ఇంద్రాది దేవతలు, పార్వతి సమేతంగా శివుడు అక్కడికి వచ్చి అందరూ కలిసి శుకునకు ఉపనయనము చేయించారు. దేవేంద్రుడు శుకుడికి దివ్యకమండలం ఇచ్చాడు. దేవతలు మాసిపోని దుస్తులను ఇచ్చారు. వేదములు తమకు తాముగా శుకుడిలో చేరాయి. శుకుడు బృహస్పతిని తన గురువుగా ఎంచుకున్నాడు. బృహస్పతి వద్ద వేదాధ్యనం చేస్తున్నా ఆశ్రమంలో ఉన్న సహోద్యాయులతోటి ఆటపాటల వలన చదువు మీద శ్రద్ధ చూపలేక పోయాడు. అప్పుడు శుకుడు తండ్రి అయిన వ్యాసుడి వద్ద సాంఖ్యము, యోగమును ఉపదేశం పొంది వైరాగ్యం పొందాడు. ఆ తరువాత శుకుడు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం అందు శ్రద్ధ చూపక మోక్ష మార్గం చూపమని తండ్రిని కోరాడు. వ్యాసుడు " కుమారా ! నీవు విదేహరాజైన జనకుడి వద్దకు వెళ్ళి అడిగిన అతడు నీకు మోక్షమార్గం చూపగలడు. నీవు సర్వశక్తి సమన్వితుడవైనా నీవు జనకుడి వద్దకు పాదచారివై వెళ్ళు. అతడి ముందు అహంకారం ప్రదర్శించక వినయం చూపించు " అని వ్యాసుడు చెప్పాడు.

శుకుడు జనకుడు

మార్చు

తండ్రి మాటప్రకారం శుకుడు కాలినడకన మిధిలానగముకు చేరాడు. రాజభవనంలోకి ప్రవేశించబోతుంటే భటులు అడ్డగించారు. కాని శుకుడు కోపించక ప్రశాంతంగా నిలబడిన శుకుడిని చూసి భటులు కంగారుపడి లోపలకు వర్తమానం పంపాడు. తరువాత అతడిని భటులు సగౌరవంగా శుకుడిని లోపలకు తీసుకు వెళ్ళారు. జనకుడు పురోహితులను ఎదురు పంపి శుకుడిని ఆహ్వానించి అతడి అతడి కాళ్ళు కడిగి సింహాసనం మీద కూర్చుండజేసాడు. ఇది చూసి మంత్రులు ఆశ్చర్యచకితులు కాగా అత్యంత సౌందర్యవంతులైన స్త్రీలు వచ్చి నాట్యంచేయసాగారు. శుకుడు ఎలాంటి వికారానికి లోనుకాక వారిని చూడసాగాడు. జనకుడు శుకుడికి అన్నపానములు ఏర్పాటు చేయమని బ్రాహ్మణులకు చెప్పాడు. అలా జనకుడు అతడి వెంట ఉండి అతడికి అన్ను సదుపాయములు చేస్తూ అనేక మాటలు చెప్తూ ఆరోజు గడిపాడు. మరునాడు జనకుడు శుకుడి వద్దకు వచ్చి " వచ్చిన కారణమేమిటి ? " అని అడిగాడు. శుకుడు " మా తండ్రిగారు చెప్పగా ! నేను మీ వద్దకు మోక్షమార్గ ఆసక్తుడనై వచ్చాను. విప్రుడి కర్తవ్యం ఏమిటి ? మోక్షం ఎలా పొంద వచ్చు వివరించండి " అని అడిగాడు. జనకుడు " లోక పూజ్యుడైన చరిత్ర కలవాడా ! బ్రాహ్మణుడు ఉపనయనం చేసుకుని యజ్ఞోపవీతం ధరించి, బ్రహ్మచర్యం పాటిస్తూ వేదములు అభ్యసించాలి. తరువాత వివాహము చేసుకుని భార్య వలన సంతానం పొందాలి. యజ్ఞ యాగములు చెయ్యాలి. దేవతలను, పితృదేవతలను తృప్తిపరచాలి. అతిథులను సత్కరించాలి. తరువాత వానప్రస్థ ఆశ్రమం స్వీకరించి అడవులకు వెళ్ళాలి. అక్కడ కాషాయాంబర ధారణ చేసి అతిథి సత్కారం చేసి వైరాగ్యం పొందాలి. తన ఆత్మ అందు అగ్నిని వ్రేల్చి అందు కోరికలను వేల్చాలి. తుదకు పరమపదమైన బ్రహ్మపదం చేరాలి " అన్నాడు జనకుడు.

ఆశ్రమధర్మాల అవసరం

మార్చు

శుకుడు " జనకమహారాజా ! మీరు చెప్పినది సాధారణ బ్రాహ్మణుడికి వర్తిస్తుంది. ప్రజ్ఞకలిగి జ్ఞానోదయమైన వాడికి ఈ మూడు ఆశ్రమములతో పని ఏమిటి ? జ్ఞానదృష్టితో బ్రహ్మపదము గురంచి ఎరిగిన వానికి ఈ మూడు ఆశ్రమధర్మాచరణ అవసరమా ! ఈ విషయమై వేదములు ఏమి వివరిస్తున్నాయి ! " అని అడిగాడు. జనకుడు " నీవన్నట్లు జ్ఞానము విజ్ఞానము మోక్షసాధనములు. వాట్ని గురుముఖతః నేర్చుకోవాలి. వాటి వలన ముక్తి పొంద వచ్చు. జీవుడు చివరిగా జ్ఞానవిజ్ఞానాలను కూడా వదిలి వేస్తాడు. పూర్వము ఋషులు, మనుజులు, ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు కాకుండా సన్మార్గంలో నడవడానికే ఈ నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. ఈ నాలుగు ఆశ్రమాలు సక్రమంగా పాటించిన వాడు ముక్తి పొందడం తధ్యం. అలా కాకుండా పూర్వజన్మ పుణ్యము వలన జ్ఞానోదయమైన వాడు ఈ మూడు ఆశ్రమాలు వదిలి బ్రహ్మచర్యం వలన ముక్తిని పొంద వచ్చు. అతడు త్రిగుణాతీతుడై కలిగి బ్రహ్మచర్యంలో ముక్తి పొందకలిగిన వాడికి ఈ మూడు ఆశ్రమాలతో పని లేదు. మానవుడు ముక్తి పొందాలంటే సత్వమార్గము అవలంబించాలి. లేకున్న అది అసాధ్యము. ఈ విశ్వం తన అందు ఉన్నట్లు తాను విశ్వం అందు ఉన్నట్లు తలచిన వాడు ముక్తి పొందుతాడు. యయాతిమహారాజు " జ్యోతిస్వరూపుడైన పరమాత్మ మన ఆత్మలోనే ఉన్నాడు అని తెలుసుకుని ముక్తిని పొందాడు. ఇది తెలుసుకున్న మునులు తమవలన పరులకు పరుల వలన తమకు భయంలేకుండా బ్రతకగలడు. అప్పుడతడు ముక్తి పొందగలడు. నాకు అది కావాలి, ఇది వద్దు అని తలపక సకల ప్రాణుల అందు సమదృష్టి కలిగి, కోరికలను వదిలి పెట్టి, పరులకు కీడు తల పెట్టని మానవుడు ముక్తి పొందగలడు. దృశ్యములందు, శబ్ధములందు సమదృష్టి కలిగి విషయములలో లీనం కాకుండా, రాగద్వేషములు, సుఖ దుఃఖముల అందు ప్రభావితం కాకుండా జీవించ కలిగిన మానవుడు ముక్తిని పొందగలడు. ఇనుమును, బంగారమును, నిందను, స్తుతిని సమంగా భావించేవాడికి తాబేలు తన డిప్పలోకి తాను ముడుచుకున్నట్లు ఇంద్రియములను తనలోనికి లాగగలిగిన వాడికి ముక్తి తప్పక లభిస్తుంది. నేను చెప్పిన విషయాలు నీ తండ్రి దయవలన నీకు ప్రాప్తించాయి. నేను చెప్పినదాని కంటే నీకు తెలిసినది ఎక్కువ. బాల్యచాపల్యము వలన, నీ భావనలో సందేహములు, భయములు ఉండటం వలన నీవు సర్వజ్ఞుడన్న విషయము నీవు ఎరుగక ఉన్నావు. జ్ఞానము స్మగ్ర రూపం తాల్చినప్పుడే మోక్షము సిద్ధించగలదు. కనుక నీవు దృఢసంకల్పంతో పరిపూర్ణత సాధించు. నీకిక కొరత లేదు. మోక్షం తప్పక సిద్ధిస్తుంది. నీ సంశయములు వదిలి పెట్టు. పుట్టక ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో అదే నీ శాశ్వత స్థానం " అని జనకుడు శుకుడికి జ్ఞానబోధ చేసాడు. జనకుడి జ్ఞాన బోధలతో శుకుడు సంశయములు తీరి తానెవరో తెలుసుకుని తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళాడు.

షష్టాశ్వాసంద్వితీయ భాగం

మార్చు

సంశయరహితుడై శుకుడు వాయువేగ మనోవేగాలతో తండ్రి అయిన వ్యాసుని చేరడానికి హిమాలయాల వైపు బయలు దేరాడు. వ్యాసుడు తన శిష్యులైన సుమంతుడు, వైశంపాయనుడు, జైమిని, పైలుడు అనే వారితో వేదాధ్యాయనం చేయిస్తున్నాడు. శుకుని చూసిన వ్యాసుడు సంతోషించాడు. శుకుడు తండ్రి పాదములకు నమస్కరించి కూర్చున్నాడు. తనకు జనకుడికి జరిగిన సంభాషణ సారమును వివరించాడు. వ్యాసుడు శుకుని కూడా తన శిష్యులతో చేర్చి వేదాధ్యయనం చేస్తున్నాడు. ఒక రోజు వ్యాసుడి శిష్యులు వ్యాసుడితో " గురువర్యా ! వేదాధ్యయనంలో మేము అయిదుగురిమే ఈ లోకంలో అందరికన్నా మిన్నగా ముందుండాలి. మమ్మల్ని మించి ఇంకెవరికి వేదం చెప్పకూడదు. ఇలా మాకు వరం ప్రసాదించండి " అని కోరాడు. వ్యాసుడు " ఆసక్తి కలిగిన బ్రాహ్మణ కుమారులకు వేదవిద్య నేర్పిన వాడికి బ్రహ్మపదము కరతలామలకము. ఈ మాట మీరు వినలేదా ! ప్రతివాడు కష్టములు అనుభవించిన తరువాత సుఖము అనుభవిస్తాడు. మానవుడు ఎన్నటికీ స్వార్ధపూరితుడు కాకూడదు. కనుక ఇటువంటి కోరిక మీకు ధర్మంకాదు " అన్నాడు. ఆ మాటలు విన్న శిష్యులు ఒకరిని ఒకరు చూసుకుని " గురువర్యా ! మీరు మమ్ము ఇక్కడే ఉంచితే అది ఎలా సాధ్యం ఔతుంది. మేము పర్వతశిఖరం దిగి ఆసక్తులైన వారిని వెతికి పట్టుకుని వారితో వేదాధ్యయనం చేయించమంటారా ! వారితో యజ్ఞయాగములు చేయించమంటారా " అని అడిగారు. వ్యాసుడు " శిష్యులారా ! మీరు ఇది చెప్పడానికి ఇంత డొంక తిరుగుడుగా మాట్లాడడం అవసరమా ! మీరు పర్వతశిఖరములు దిగి జనావాసాలకు వెళ్ళి విద్యాదానం చేస్తానంటే నేను కాదనగలనా ! " అని వాత్సల్యంగా అన్నాడు. శిష్యులు వ్యాసుడి కాళ్ళ మీద సాంష్టాంగ పడ్డారు. వ్యాసుడు వారిని లేవనెత్తి దీవించి " ఈ మూడు లోకాలలో మీకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి. మీరు జాగ్రత్తగా ఉంటూ వేదములను ప్రచారం చెయ్యండి " అన్నాడు. వ్యాసుడి నలుగురు శిష్యులు వెళ్ళగానే వ్యాసుడు తన కుమారుడితో ఆశ్రమంలో ఒంటరిగా మిగిలి పోయాడు.

వ్యాసాశ్రమమునకు నారదుడి ఆగమనము

మార్చు

ఒకనాడు నారదుడు వ్యాసాశ్రమమునకు వచ్చి అక్కడ వేదఘోష వినిపించక పోవడం చూసి ఆశ్చర్యపోయాడు. వ్యాసుడితో " వేదఘోష వినిపించక పోవడానికి ఏమి కారణం ? " అని అడిగాడు. వ్యాసుడు " నారదా ! శిష్యులంతా నన్ను విడిచి వెళ్ళారు " అని చెప్పాడు. నారదుడు " అయితే మాత్రం ఏమి ? నీవు నీ కుమారుడైన శుకునితో కలిసి వేదపఠనం చెయ్యవచ్చు కదా ! " అన్నాడు. వ్యాసుడికి తన పొరబాటు తెలిసి వచ్చింది. వెంటనే తన కుమారుడైన శుకుడితో కలిసి వేదాధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఒక రోజు పెనుగాలి వీచింది. వెంటనే వ్యాసుడు వేదాధ్యయనం ఆపాడు. శుకుడు " తండ్రీ ! ఈ గాలి ఎందుకు వీస్తుంది " అని అడిగాడు. వ్యాసుడు " కుమారా ! దేవమార్గంలో విష్ణువు పితృమార్గంలో సూర్యుడు పైకి కిందికి పయనించడం వలన ఈ ఝంఝుమారుతం వీస్తున్నది. కుమారా ! నీకు వాయువుల గురించి చెప్తాను. సమానవాయువు దేవతలలో జన్మించాడు. సమానుడికి ఉదానవాయువు, ఉదానుడికి వ్యానము అను వాయువు జన్మించాడు. వ్యానుడికి అపానుడు, అపానుడికి అపానుడికి ప్రాణుడు జన్మించారు. ప్రపంచం అంతా ఈ ఐదు వాయువులతో నిండి ఉంది. ప్రవహుడు, ఆవాహుడు, ఉద్వహుడు, వివహుడు, పవహుడు, పరాహుడు అను ఏడుగురు వాయుదేవతలు. వీరు అదితి పుత్రులు. వీరు మొదట చెప్పిన పంచ వాయువులతో కలిసి ఉంటారు. వర్షములు రాకడకు పోకడకు ఈ వాయువులే కారణం. విష్ణువు నిట్టూర్పు వేగము అపరిమితము. దేవతలు విమానాలలో తిరుగుతున్నప్పుడు ఝుంఝుమారుతం వీస్తుంది. ఇలాంటి సమయంలో వేదాధ్యయనం చేసిన కీడు జరుగుతుంది కనుక ఆపి వేసాను " అని చెప్పిన వ్యాసుడు తరువాత స్నానం చెయ్యడానికి ఆకాశగంగ వద్దకు వెళ్ళాడు.

శుకుడికి నారదమహర్షి దివ్య బోధ

మార్చు

శుకుడు నారదుడు వింటుండగా వేద పఠనం చేసాడు. నారదుడు అందుకు మెచ్చుకుని ఏమి వరము కావాలో కోరుకో అని అడిగాడు. శుకుడు " నారద మహర్షి ! ఈ లోకంలో పుట్టిన వాడికి హితమైనది ఏది ? వివరించండి " అని కోరాడు. నారదుడు " కుమారా ! పూర్వము సనత్కుమారుడు మునీశ్వరులకు చెప్పిన మాటలే నీకూ చెప్తాను. సత్యవాక్పరిపాలనమే తపస్సు. మానవుడి నేర్చిన విద్య అతడికి కన్ను వంటిది. త్యాగమే సుఖదాయకము. కోరికలే దుఃఖహేతువు. మానవుడు ఇహ లోకబంధములలో చిక్కుకుంటే ఈ జన్మలో కాదు కదా ! పైజన్మలో కూడా ముక్తి లభించదు. కామము, క్రోధము ముక్తి సాధించడానికి శత్రువులు. ఈ రెండు వదిలిన వాడికి ముక్తి తధ్యం. ఇతరుల నుండి ఏమీ ఆశించక సమస్తకర్మలను త్యాగం చేసిన పండితుడికి దుఃఖము దరి చేరక ముక్తి సిద్ధిస్తుంది. ఇతరులను తాకకపోవడం, ఎమీ ఆసక్తితో చూడక పోవడం, ఇతరులతో మాట్లాడక పోవడము ఇవి కూడా ముక్తి మార్గములే. అహింసావ్రతం ఆచరిస్తూ ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ, చపలత్వం వదిలిన వాడికి ముక్తి కరతలామలకం. సనత్కుమారుడు మునులకు ఇలా బోధించాడు. భార్యాబిడ్డలు బంధుమిత్రుల మోహంలో పడిన మానవుడు ఊబిలో పడిన ఏనుగులా అటూ ఇటూ కొట్టుకుంటాడే కాని దాని నుండి బయటపడ లేడు. నిరంతర భోగములలో మునిగి తేలే వాడు వలలో చిక్కిన జింక వలె గిల గిలా కొట్టు కుంటూ ఉంటాడు. ధర్మము, అధర్మము, సత్యము, అసత్యము రెండింటినీ వదిలి పెట్టాలి. అది ఎలా సాధ్యపడుతుందంటే అహింసను పాటిస్తే అధర్మము విడిచి పెట్టవచ్చు. కర్మను వదిలినప్పుడు ధర్మమును వదలచ్చు. బుద్ధిని ఉపయోగించి సత్యమును అసత్యమును వదిలి పెట్టవచ్చు. ఆత్మసాక్షాత్కారం పొందిన వాడికి బుద్ధితో పనిలేదు. పండితుడు దైనందిక కార్యాలలో వస్తూపోతూ ఉండే శోకమును భయమును పట్టించుకోడు. కుమారా ! పంచభూతములు దశ ఇంద్రియములు, మనసును మూట కట్టుకుని ఉన్న ఈశరీరం కొరకు తాపత్రయ పడకూడదు. భార్యాబిడ్డలకు, బంధుమిత్రులకు, ఊరిలో జనాలకు కలిగే బాధలకు మనం విచలితులం కాకూడదు " అని నారదుడు శుకుడికి చెప్పగానే శుకుడికి ఉన్న కొంచం మాయకూడా తొలగి పూర్తి వైరాగ్యం కలిగి " మహర్షి ! నీ మాటలతో నా సందేహములన్నీ తీరి జ్ఞానోదయం అయింది. సూర్యుని దయపొంది సర్వము త్యజించి యోగసిద్ధి సాధిస్తాను " అని చెప్పి నారదమహర్షి వద్ద శలవు తీసుకుని తన తండ్రి అయిన వ్యాసుడి వద్దకు వెళ్ళి తన నిశ్చయం తెలియ చేసాడు. పుత్రుడి జ్ఞానసంపదకు వ్యాసుడు ఆనందించాడు. శుకుడు తండ్రికి నమస్కరించి బయలు దేరాడు. వ్యాసుడికి ఇంకా పుత్ర మమకారం తీరకు " నాయనా ! శుకా ! నిన్ను ఇంకా కనులార చూడాలని ఉంది కొంత సమయం నా వద్ద ఉండకూడదా ! " అని అడిగాడు. కాని శుకుడిలో ఇప్పుడు ఏ మమకారం లేదు అతడు మారుమాటాడక నిర్వికారంగా అలా వెళ్ళి కైలాస శిఖరం వరకు పోయాడు. శుకుడు అక్కడ ఒక సమతల ప్రదేశంలో తూర్పు ముఖంగా కూర్చుని ఆత్మావలోకనం చేసుకున్నాడు. సూర్యుడు ప్రత్యక్షం కాగానే శుకుడు సూర్యుడికి సాష్టాంగ నమస్కరించి సూర్యుని వలన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు. అదేసమయంలో అక్కడకు చేరిన నారదుడితో " మహర్షి ! మీ దయవలన నాకు వైరాగ్యం కలిగింది. నాకు సరి అయిన మార్గం దొరికింది అని చెప్పి త్రిగుణాతీతుడై యోగశక్తితో శుకుడు ఆకాశ మార్గాన పోతూ దారిలో ఉన్న పర్వతాలను, చెట్లను చూసి నమస్కరించి " నన్ను వెతుకుతూ వచ్చే నాతండ్రి నన్ను పిలిచినప్పుడు మీరు నా కొరకు బదులు పలకండి " అని ప్రార్థించాడు. అవి శుకుడి ప్రార్థన మన్నించాయి.

శుకుడి ఆకాశయానం

మార్చు

ఆ తరువాత శుకుడు ఉత్తరదిక్కుగా పయనమయ్యాడు. అతడు అతి తక్కువ ఎత్తులో గంగాతీరంలో ఆకాశమార్గాన వెళ్ళసాగాడు. ఆ సమయంలో వస్త్రాలను గట్టున విదిలి గంగానదిలో స్నానం చూస్తున్న అప్సరసలు శుకుడిని చూసి కూడా వికారము చెందక అలా స్నానమాడసాగారు. వ్యాసుడు కూడా తన యోగశక్తితో ఆకాశమార్గాన శుకుడిని పిలుస్తూ పోసాగాడు . అతడికి వృక్షాలు పర్వతాలు బదులు చెప్పసాగాయి. అప్పటికే శుకుడు సర్వభూతాత్మకుడయ్యాడు. గంగాతీరాన చేరిన వ్యాసుడిని చూసిని అప్సరసలు కంగారు పడి వస్త్రధారణ చేసి వ్యాసుడికి నమస్కరించారు. తన దివ్యశక్తితో అప్సరసల మనసులోని విషయం గ్రహించిన వ్యాసుడు కుమారుడి వైరాగ్య సంపదకు ఆనందించినా తనను తలచుకుని సిగ్గుపడ్డాడు. అప్పుడు మహాశివుడు వ్యాసుడి వద్దకు వచ్చి " వ్యాసామునీంద్రా ! నాడు నువ్వు నీ తపస్సుతో నన్ను మెప్పించి నా వద్ద నుండి పంచభూతములకు అతీతుడైన కుమారుడు కావాలని అడిగావు కదా ! నేను నీకు అలాంటి కుమారుడిని ప్రసాదించాను. నీ తపోవిశేషం, నా ప్రభావం కలిసి శుకుడికి పరమగతి లభించింది. నీవు దీనికి ఆనందించాలి కాని విచారించడమెందుకు. వ్యాసమహర్షీ ! నీ కుమారుడి కీర్తి ఆచంద్రార్కం వర్ధిల్లుతుంది " అని చెప్పి మహాశివుడు అంతర్ధానం అయ్యాడు " అని చెప్పిన భీష్ముడు ధర్మజా ! శుకచరిత్ర చదివిన వారికి విన్న వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు లభించడమే కాక తుదకు మోక్షం లభిస్తుంది " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

ఆరాధించవలసిన దైవం

మార్చు

ధర్మరాజు " పితామహా ! మీ వలన నేను నాలుగు వర్ణాల గురించి తెలుసుకున్నాను అలాగే వారు ఆరాధించవలసిన దైవము గురించి చెప్పండి " అని భీష్ముడిని అడిగాడు అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. వైశంపాయనుడు " జనమేజయా ! నేనిప్పుడు నీకు భీష్ముడి చేత ధర్మరాజు చెప్పబడిన విష్ణుకథను చెప్తాను. భీష్ముడు " ధర్మనందనా ! ఒక రోజు నా తండ్రి వలన నేను విన్న నారాయణ నారద సంవాదాన్ని వివరించి నీకు చెపితే నీకు కలిగిన సందేహం తీరగలదు. అవ్యయుడు, సనాతనుడు, విశ్వాత్ముడు అయిన నారాయణుడు అనే మహాముని బదరికావనంలో తపస్సు చేసుకుంటున్నాడు. నారదుడు ఆయనకు భక్తితో నమస్కరించి " మహర్షీ ! మోక్షసిద్ధికి ఆరాధించవలసిన దైవము గురించి వివరించండి " అని కోరగా నారాయణుడు " నారదా ! ధృవము, అచలము, ఇంద్రియములకు గోచరము కానిది, సూక్ష్మమైనది, సాటిలేని ఏకైక శక్తి, సకల ప్రాంణులలో అంతరాత్మగా వెలుగొందేది పరమాత్మ ఒక్కడే " అన్నాడు. నారదుడు " మహర్షీ ! నీవు లోకరక్షణార్ధమై మీరీ అవతారమెత్తారు అని విద్వాంసులు చెప్తారు కదా ! అప్పుడు నీ మూల ఆకృతి ఎలా ఉంటుంది నాకు చెప్పు మహర్షీ ! నాకు గురుభక్తి, వేదముల అందు ఆసక్తి ఉంది. నీ మూల స్వరూపము గురించి తెలుసుకోవడానికి నాకు అర్హత ఉంది అని నీవు అనుకున్నట్టైన నాకు తెలుపుము " అని అడిగాడు. నారాయణుడు " నారదా ! ముందు ఏకాగ్రత సాధించు. అప్పుడు నీకు పరమాత్మను దర్శించే శక్తిని నీకు ప్రసాదిస్తాను " అన్నాడు. ఆ మాటలకు తృప్తి చెందిన నారదుడు నారాయణుడికి నమస్కరించి నారదుడు ఆకాశమార్గాన మేరుపర్వత సమీపానికి వెళ్ళాడు. అక్కడ క్షీరసాగరానికి ఉత్తరదిక్కున ఉన్న శ్వేతద్వీపములో ఆహారము తీసుకోకుండా, ఇంద్రియ నిగ్రహము కలిగి, చెమటపట్టని, శరీరము నుండి సుగంధములను వెదజల్లుతున్న మునీశ్వరులను చూసాడు " అని చెప్పగానే ధర్మరాజు " పితామహా ! ఆ మహానుభావులు ఎవరు వివరించండి " అని ఆసక్తితో అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఆ మహాపురుషుల గురించి పూర్వము కొంత మంది నా తండ్రికి మునులు చెపుతున్నప్పుడు విన్నది నేను నీకు చెప్తాను.

ఉపరిచర మనువు

మార్చు

పూర్వము ఉపరిచరమనువు అనే విశిష్టమైన ఆచారసంపన్నుడు ఉన్నాడు. అతడు సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, విష్ణుభక్తి, నైతికబలము కలవాడు. ఈ భూమినంతా పాలించిన ఉపరిచరమనువు భ్రాహ్మణుల అందు భక్తి, యజ్ఞయాగముల అందు ప్రీతి ఉన్నాయి. ఉపరిచరమనువు రాజ్యమును వదిలి అడవులకు వెళ్ళి తపస్సు చేయసాగాడు. దేవేంద్రుడు ఉపరిచరమనువును చూసి " మహారాజా ! నీకీ తపసు ఎందుకు నేను నీతో సఖ్యము చేయదలిచాను కనుక నీవు నీ రాజ్యముకు వెళ్ళి పరిపాలన చేస్తూ నీవు కోరినప్పుడల్లా అమరావతికి వస్తూ పోతూ ఉండు. నీవు ఆ విమానము ఎక్కి నీకు ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళ వచ్చు " అన్నాడు. ఇంద్రుడి మాట కాదన లేక ఆ విమానాన్ని స్వీకరించాడు. ఆ విమానాన్ని ఇంతకు పూర్వము వసువు ఎక్కి తిరిగాడు కనుక అతడు ఉపరిచరమనువు అని కారణ నామధేయుడయ్యాడు.

సప్తఋషులు ధర్మశాస్త్రాలు

మార్చు

కల్పాదిలో మరీచి, అంగీరసుడు, అత్రి, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, వశిష్ఠుడు అనే మహామునులూ చిత్రుడు, శిఖండి అను వార స్వాయంభువమనువు తో చేరి విష్ణువు గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేసారు. విష్ణువు వారికి ప్రత్యక్షం అదృశ్యరూపంలో గోచరించి వారితో " మీరంతా ధర్మశాస్త్రాలు రచించే శక్తి కొరకు నా గురించి తపస్సు చేసారు. నేను మీలో సరస్వతీదేవిని నియోగించాను. మీరు రచించు ధర్మశాస్త్రములు సకల జగములకు హితవును, గౌరవమును కలిగిస్తాయి. అంగీరసుడు అనే మహామునికి బృహస్పతి అనే కుమారుడు జన్మిస్తాడు. అతడు మహాత్ముడు వ్రాసిన ధర్మశాస్త్రములను చదవి అధ్యయనం చేయడానికి అర్హుడు కనుక మీరు అతడికి ధర్మశాస్త్రములను భోదించండి. బృహస్పతి ఉపరిచరమనువుకు ఆ ధర్మశాస్త్రములు బోధిస్తాడు. అతడు ధర్మశాస్త్రములు అధ్యయనం చేయగల సమర్ధుడు. ఉపరిచరమనువు బృహస్పతి వలన భోదించబడిన ధర్మశాస్త్రాలను లోకముకు అందిస్తాడు. ఉపరిచర మనువు యజ్ఞయాగముల అందు ఆస్కడు, నా భక్తుడు. అతడి వలన ధర్మశాస్త్రములు లోకములో ప్రచారమౌతాయి " అని చెప్పాడు.

ఉపరిచరమనువు అశ్వమేధయాగము

మార్చు

ఉపరిచరమనువు అశ్వమేధయాగము చేయసాగాడు. ఆయాగముకు సప్తరుషులు ఋత్విక్కులుగా విచ్చేసారు. ఆ యాగముకు బృహస్పతి ప్రధానఋత్విక్కుగా ఉన్నాడు. ప్రజాపతి పుత్రులైన ఏకతుడు, ద్వితుడు, త్రితుడు అను మునులు సదస్యులుగా వ్యవహరించారు. ఆ ఆశ్వమేధయాగము జరుగుతున్న సమయంలో అహింసావ్రతుడైన మహారాజు మనువు ఆ యజ్ఞములో జంతుబలికి అంగీకరించ లేదు. జంతువులకు బదులుగా అరణ్యకములో చెప్పబడిన మంత్రములను పఠించి విష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. అతడి నిష్ఠకు మెచ్చిన విష్ణువు అదృశ్యరూపంలో వచ్చి తన హవిర్భాగమును స్వీకరించాడు. అది చూసిన బృహస్పతికి కోపము దుఃఖము ఒక్కటిగా వచ్చి ఉపరిచరమనువుతో బృహస్పతి " మనుమహారాజా ! యజ్ఞములో పురోడాశము సమర్పించినప్పుడు దేవతలు స్వయంగా వచ్చి హవిస్సును స్వీకరించాలి. కాని విష్ణువు అదృశ్యరూపంలో వచ్చి స్వీకరించాడు. అది నాకు బాధ అన్పించింది " అన్నాడు. మహారాజు బృహస్పతిని అనునయించాడు. అక్కడ ఉన్న సదస్యులు " దేవగురూ ! మీరు అలకమానండి. హరికి సమర్పించిన హవిర్భాగము హరి స్వీకరించాడు. అందుకు మీరు ఎందుకు బాధపడతారు ? అసలు విష్ణువును ప్రత్యక్షంగా చూడటము ఎవరికి సాధ్యము. బ్రహ్మమానస పుత్రులమైన మేము విష్ణు దర్శనం కోరి ఎన్నో ఏళ్ళు తపస్సు చేసినప్పుడు " అశరీరవాణి " పాల సముద్రములో ఒక దీవి ఉన్నది. అందు తెల్లటి వారు, ఇంద్రియనిగ్రహం కల వారు, దివ్యదేహం కలవారు, ఆకలి లేనివారు అయిన విష్ణుభక్తులు ఉన్నారు. వారికి మాత్రమే విష్ణువు తన స్వస్వరూపముతో దర్శించే భాగ్యమును కలిగించాడు. ఆ సమయంలో మీరు అక్కడకు చేరగలిగితే మీకు విష్ణుదర్శనం ఔతుంది " అని పలికింది.

విష్ణు లోకము

మార్చు

ఆ మాటలను విని మేము శ్వేతద్వీపముకు వెళ్ళాము. అశరీరవాణి చెప్పినట్లు అక్కడ ప్రకాశవంతమైన దివ్యదేహము కలవారు అయిన విష్ణుభక్తులు కనిపించారు. ఇంతవరకు ముల్లోకాలలో అటువంటి వారిని మేము చూడ లేదు. వారి ముందు సహస్ర భానుప్రకాశంతో సమానమైన రూపము వారి ముందు ప్రత్యక్షం అయింది. అప్పుడు వారు జయీభవ, విజయీ భవ, జయ హృషీకేశ, పుండరీకాక్ష అని అని జయధ్వానాలు చేసారు. మేము ఎంత ప్రయత్నించినా మా కన్నులతో ఆ తేజో రూపము చూడలేక పోయాము. అప్పుడు అశరీర వాణి " బ్రహ్మమానస పుత్రులారా ! మీరు విష్ణుమూర్తిని చూడలేదని దిగులు చెందకండి. విష్ణుభక్తులను చూసిన విష్ణువును దర్శించినట్లే. అయినా మీరు చేసిన తపస్సు, నియమ నిష్ఠలు మీకు విష్ణుదర్శనం చేస్తాయి. కాని మీ తపస్సు విష్ణుదర్శనముకు చాలదు. అనేక సంవత్సరాలు అత్యంత భక్తితో తపస్సు చేసిన కాని విష్ణుదర్శనం లభించదు " అని వినిపించింది. ఆ మాటలు విని మేము వెను తిరిగాము. కనుక బృహస్పతీ నీవు విష్ణుదర్శనం గురించి ఆలోచించక మిగిలిన యజ్ఞకార్యము సమాప్తము చెయ్యి " అని చెప్పారు. ఆ మాటలు విన్న బృహస్పతి యోగమును శ్రద్ధగా పరిసమాప్తము చేసాడు. అలా ఉపరిచరమనువు జనరంజకముగా పాలన సాగించాడు.

దేవతలకు మునులకు మధ్య జరిగిన చర్చ

మార్చు

ఒక సారి దేవలోకములో దేవతలకు మునులకు మధ్య యజ్ఞయాగములను గురించిన చర్చ జరుగుతుంది. దేవతలు అందరూ యజ్ఞములో అజములను బలి ఇవ్వాలని తీర్మానించారు. మునులు దానికి వ్యతిరేకించి అజములకు యుగములు మారినప్పుడు అర్ధము మారుతుందని చెప్పారు. కృతయుగములో అజములంటే ఔషధులు అని అంటారు. ఇంతలో అక్కడకు వచ్చిన ఉపరిచరమనువును చూసి దేవతలు మునులు వారి వివాదము పరిష్కరించమని కోరాడు. ఉపరిచరమనువు దేవతల పక్షం వహించి యజ్ఞములో అజములను బలి ఇవ్వాలని తీర్పు చెప్పాడు. వేదార్ధమును పక్షపాతము వహించి వక్రీకరించినందుకు మునులు కోపించి ఉపరిచరమనువును శపించారు. ముని శాపప్రభావము వలన మనువు భూమిలోని ఒక లోయలో పడి పోయాడు. దేవతలు అతడి వద్దకు వచ్చి అతడికి ఆకలిదప్పులు లేకుండా చేసి మహా విష్ణువు అనుగ్రహంతో తిరిగి పూర్వ స్థితిని పొందగలవు. అని ఊరడించి వెళ్ళారు. ఉపరిచరమనువు విష్ణువును గురించి ధ్యానించడం మొదలు పెట్టాడు. అతడి భక్తికి మెచ్చి గరుత్మంతుడిని పంపి ఉపరిచరమనువుని బ్రహ్మలోకం పంపాడు. ఉపరిచరమనువు విష్ణుమూర్తి మహిమకు కరుణకు ఆనందించాడు.

మహానుభావులు

మార్చు

భీష్ముడు ధర్మరాజుతో " ధర్మనందనా ! నేను నీకు శ్వేతద్వీపంలో ఉండే మహా పురుషులగురించి చెబుతుండగా ప్రసంగవశాత్తు ఉపరిచరమనువు గురించి చెప్పాను. ఇక ఆ మహానుభావుల గురించి చెప్తాను. నారదుడు శ్వేతద్వీపముకు వెళ్ళి అక్కడ ఉన్న అద్భుత శరీరాలతో ప్రకాశిస్తున్న మహాపురుషులను చూసి వారికి నమస్కరించాడు. వారుకూడా నారదుడిని ఆదరించారు. అప్పుడు నారదుడు విష్ణువును గురించి స్తోత్రం చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు నారదుడి ముందు విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. విష్ణువు అనేక శిరస్సులు, అనేక బాహువులు, అనేక పాదములు, అనేక రంగులతో కమండలంతో ఓంకారము గాయత్రిని జపిస్తూ చతుర్వేదములు పారాయణం చేస్తూ నారదుడి ముందు ప్రత్యక్షం అయ్యాడు. నారదుడు వినయంతో విష్ణుమూర్తికి నమస్కరించాడు. అప్పుడు విష్ణుమూర్తి " నారదా ! నన్ను చూడడం అందరికీ సాధ్యం కాదు. లేశమాత్రమైనా అహంకారము లేనంత మాత్రాన అనన్య భక్తివలన నీవు నన్ను చూడగలిగావు. నీకు కావలసిన వరము కోరుకో " అన్నాడు. నారదుడు " పరాత్పరా ! నీ దివ్యదర్శనం కంటే నా కేమీ వద్దు " అన్నాడు. విష్ణువు " ఎవరు ఇంద్రియనిగ్రహము కలిగి త్రిగుణాతీతుడై ప్రళయకాలంలో కూడా నిశ్చలంగా వెలుగుతుంటాడో అతడే ఆత్మసాక్షి, అజుడు, నిష్కళంకుడుగా వెలుగుతుండే అతడు క్షేత్రజ్ఞుడు, జీవుడు అనబడే వాసుదేవుడు అతడే, సంకర్షుణుడు అతడే. మనస్సు , అహంకారమే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని అంటారు. ఇది నామాయ నేను 24 తత్వములకు అధినాధుడనైన 25వ తత్వమును. పరపురుషుడను నాకంటే వేరు పరము లేదు. మహామునులు సతతము ఎవరి కొరకు తపస్సు చేస్తుంటారో ఆ వాసుదేవుడను నేనే. ఈ చరాచర జగత్తులో ఉన్న సకలభూతములలో ఉన్న ధాతుశక్తి వేరుగా లేదు ఆ శక్తిని నేనే. ఆ జీవశక్తి సర్వవ్యాప్తంగా సకల లోకములలో విస్తరించి ఉంది. లేని ఎడల ఈ లోకలో చైతన్యము లేదు. జీవుడు వేరు శరీరము వేరు జీవుడిని గురించి నేను తెలుసుకున్నాను అనుకోవడము నా మాయవిలాసము. ఆ మాయ నేను కల్పించినదే. జీవుడికి నాకు భేదము లేదు రెండూ ఒకటే. అచంచలమైన భక్తితో నన్ను కొలిచిన వారికి నేను ముక్తి ప్రసాదిస్తాను. అదిత్యులు, మరుత్తులు, రుద్రులు మొదలైన దేవతా గణములు, బ్రహ్మదేవుడు, చతుర్వేదములు నా స్వరూపములే. నేనే బ్రహ్మదేవుడిని సృష్టించి ఈ సృష్టి కార్యము అప్పగించి నేను నిర్వికారంగా, నిమిత్త మాత్రంగా, ఏకాకిగా కోరిన వారికి సహకరిస్తాను.

లోకరక్షణ

మార్చు

ఒక్కోసారి జగత్రక్షణార్ధమై అవతారం ఎత్తుతుంటాను. వరాహరూపంలో హిరణ్యాక్షుడిని, నరసింహరూపంలో హిరణ్యకశిపుని, పరశురాముడిగా క్షత్రియకులాన్ని, ధశరధపుత్రుడిగా రావణుడిని సంహరించాను. యాదవకుల సంజాతుడనై ఇంద్రకుమారుడి సాయంతో భూభారాన్ని తగ్గించాను. పూర్వము నేను నరుడు, నారాయణుడు అనే రెండు రూపాలతో మునులుగా అవతరించి లోకరక్షణ చేసాను. తరువాతి కాలంలో మానవరూపంలో అవతరించి లోకకంటకులైన కాలయనుడిని, కంసుడిని, మురాసురుడిని, నరకాసురుడిని, బాణాసురుడిని సంహరించాను. బాణాసుర వధసమయంలో నన్ను ఎదిరించి నిలిచిన దేవసేనాని కుమారస్వామితో, మహాశివుడితో పోరాడి బాణాసురుడి గర్వము అణిచాను. అంతకు ముందు మత్సత్వము, కూర్మత్వము పొంది దేవతలను వేదములను రక్షించాను. ధర్మరక్షణ కొరకు నేను చేయవలసినది చేసాను. నేను చేయవలసిన కార్యము పూర్తికాగానే నేను తిరిగి నా మూల ప్రకృతిలో చేరిపోతాను. నారదా ! నీవు ఏకాగ్రచిత్తుడవై నన్ను ధ్యానించినందున ఇది నీకు చెప్పాను " అని విష్ణువు బోధించాడు. తరువాత నారదుడుకి శ్వేతద్వీపంలోని మహాపురుషులను చూపి నారదా కాంతి దేహధారులై నిరంతరం నన్నే ధ్యానించే ఈ మహాపురుషులకు నీ ఉనికి భంగము కలిగిస్తుంది కనుక నీవు ఇక ఇక్కడ నుండి వెళ్ళు " అని చెప్పాడు.

బదరికావనము

మార్చు

విష్ణుమూర్తి ఆదేశంతో నారదుడు శ్వేతద్వీపము నుండి బదరికావనము వెళ్ళి అక్కడ ఉన్న నరనారాయణులను దర్శించుకున్నాడు. అక్కడ తాను సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖతః విన్న వేదార్ధసారమును, యోగము, సాంఖ్యముల సారమును మునులందరికీ ఉపదేశించాడు. అక్కడి నుండి బ్రహ్మసభకు వెళ్ళి అక్కడి వారికి విస్ష్ణుమూర్తి సందేశం వినిపించాడు. అలా ఆ ఉపదేశం క్రమంగా ముల్లోకాలలో వ్యాపించింది. దానిని నేను నా తండ్రి శంతనుడి ద్వారా విని ఇప్పుడది నేను నీకు చెప్పాను. ఈ ఉపదేశమును దేవతలు మునులు ఎంతో శ్లాఘిస్తారు. వారు విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తారు, శ్రద్ధతో జపిస్తారు, ఏకాగ్రతతో ధ్యానిస్తారు. ధర్మనందనా ! నీవు కూడా విష్ణుమూర్తిని అనన్య భక్తితో పూజించి తరించు. నీవు దీనిని విష్ణుభక్తులకు, నీతిపరులకు, ఇంద్రియ నిగ్రహము కల వారికి మాత్రమే ఉపదేశించు. నీవిప్పటి వరకు విన్న కథలేవి ఈ ఉపదేశముకు సాటి రావు. ఇది విన్న వారికి, తెలుసుకున్న వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు తప్పక సిద్ధిస్తాయి. అని భీష్ముడు నారదుడికి స్వయంగా విష్ణుమూర్తి ఉపదేశించిన ఉపదేశమును ధర్మరాజుకు ఉపదేశించాడు. ఈ పవిత్రమైన ఉపాఖ్యానమును పఠించుతూ పాండవులు విష్ణుమూర్తిని భజిస్తూ కాలంగడిపారు " అని వైశంపాయనుడు జనమే జయుడికి చెప్పాడు.

వ్యాసమహర్షి ఆకాశగమనం

మార్చు

జనమేజయమహారాజా వ్యాసుడు కూడా విష్ణుమూర్తిని తలచుకుంటూ ఆకాశమార్గాన ప్రయాణిస్తున్నాడు " అని వైశంపాయనుడు చెప్పగా జనమేజయుడు " మహర్షీ ! నీవు మోక్షము అత్యంత సుఖప్రథము చెప్పావు. కాని సదా ప్రాపంచిక సుఖములలో మునిగితేలే ప్రజలు వారే కాక దేవతలు కూడా హవిర్భాగాలు పొందడానికి చూపించే ఉత్సుకత మోక్షసాధన అందు చూపరు కదా ! ఇలా ఎందుకు జరుగుతుంది అని నా మనసు సదా మధనపడుతుంది. మానవులే కాక దేవతలు సహితము ఇలా మోక్షమార్గమును వదిలి కర్మబంధాలలో చిక్కుకు పోవడానికి కారణమేమిటి ? నాకు వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! వ్యాసభగవానుడు తన శిష్యులకు నాలుగు వేదములను భారతమును బోధించాడు. ఆ సమయంలో సుమంతుడు, పైలుడు, జైమిని నీవు అడిగిన విధంగా మేము మా గురువు గారిని అడిగాము. అప్పుడు మా గురువైన వ్యాసుడు " నేను ఒకప్పుడు భూతభవిష్యత్తు వర్తమానం తెలుసుకోవడానికి క్షీరసాగరంలో తపస్సు చేసాను. ఆ నారాయణుడి దయ వలన నాకు భూత, భవిష్యత్తు వర్తమానం తెలుసుకునే దివ్యజ్ఞానం లభించింది. దాని ప్రభావంతో నేను ఈ కల్పంలో బ్రహ్మదేవుడు మొదలైన వారు చేసిన పనులు చూడగలిగాను. వాటిని మీకు చెప్తాను. మరుత్తులు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు మొదలగు దేవతా గణములు, మునులు, బ్రహ్మదేవుడిని చూసి మాకర్తవ్యము బోధించండి అని అడిగారు. బ్రహ్మదేవుడు " నా మనసులో మెదిలే విషయమే మీరు నాకు గుర్తుచేసారు. మనమందరం విష్ణుమూర్తిని అడిగి మన కర్తవ్యం తెలుకుందాము రండి " అని వారిని విష్ణులోకము తీసుకు వెళ్ళి అక్కడ వారంతా కలి విష్ణువును గురించి తపస్సు చేయగా వారికి అప్పుడు ఒక దివ్యమైన వాక్కు వినిపించింది.

పరమాత్మ వాణి

మార్చు

దివ్యవాణి " దేవతలారా ! మునులారా ! మీరు వచ్చిన పని నాకు తెలుసు. బ్రహ్మదేవుడు ఈ లోకములకు గురువు. ఆయన చెప్పినదే వేదవాక్కు. నాకు కూడా ఆయన చెప్పినదే వేదవాక్కు. మీరందరూ కలిసి వేదోక్తంగా యజ్ఞము చేసి అందు నాకు హవిర్భాగం కల్పించండి " అని పలికింది. ఆ మాటలకు ఆనందించిన బ్రహ్మదేవుడు ఒక యాగముకు ఏర్పాటు చేయమని దేవతలకు ఆదేశం ఇచ్చాడు. దేవతలందరూ వేదోక్తంగా యాగం చెయ్యడానికి పూనుకున్నారు. ఆ యాగమునందు విష్ణుమూర్తికి హవిర్భాగము కల్పించారు. విష్ణుమూర్తి అదృశ్యరూపంలో ఆకాశంలో నిలబడి " దేవతలారా ! మునులారా ! మీరు నేను చెప్పినట్లు యజ్ఞము చేసారు. మీరు చేసిన పుణ్యముకు తగిన ప్రతిఫలం ఇస్తాను. మరీచి, పులహుడు, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, క్రతువు, వశిష్ఠుడు అను బ్రహ్మమానసపుత్రులు వేదములకు ఆచార్యులు. వీరు ఏర్పరిచిన నియమాలు, ఆచారములు, పద్ధతుల ప్రకారం మానవులు యజ్ఞములు చేస్తారు. అందులో మీకందరికి హవిర్భాగములు సమర్పిస్తారు. దానితో వారు తృప్తి పొందుతారు. బ్రహ్మమానస పుత్రులైన సన, సనక, సనంద, కపిల, సనత్కుమారులు సహజమైన జ్ఞానసంపద కలిగి ముక్తి గురించే సదా చింతిస్తుంటారు. వీరు మోక్షధర్మములను జగములకు వివరిస్తారు. మీ అందరికి తల్లి, తండ్రి, గురువు బ్రహ్మదేవుడే. అతడు నా అభీష్టము మేరకు లోకాలను శాసిస్తాడు. నా నుండి పుట్టిన రుద్రుడు లోకాలకు ఆరాధనీయుడు, పూజ్యుడు, సకల వరములను ప్రసాదించు కరుణామయుడు. ఇక మీరు వెళ్ళి మీ విధించిన వేదోక్త కర్మలను బ్రహ్మ, మరీచి, ప్రజాపతులు చెప్పినట్లు విని ఆచరించండి. ఇది కృతయుగము అను పేరుతో ఉత్తమమైన కాలంగా వర్ధిల్లుతుంది. యజ్ఞయాగములలో పశువధ చేయరాదు. ఇందు ఏమాత్రము సందేహము లేదు " అన్నాడు. దేవతలు, మునులు విష్ణుమూర్తికి నమస్కరించి వెళ్ళారు.

హయగ్రీవుడు

మార్చు

దేవతలు, మునులు వెళ్ళినా అక్కడే ఉన్న బ్రహ్మదేవుడి ముందు హయగ్రీవరూపంలో వేదాధ్యయనం చేస్తూ దండ కమండలములతో ఎదుటకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మదేవుడిని కౌగలించుకుని బ్రహ్మదేవా ! నీవు సర్వ లోకములకు విధాతవు, గురుడవు, అధిపతివి అందుకే నేను ఈ జగముల భారం నీ అందు ఉంచి నేను సుఖంగా ఉన్నాను. ఈ లోకమును సక్రమంగా నడపడం నీ బాధ్యత. ఈ లోకమును నడపడంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నేను కల్పించుకుని తీర్చుతుంటాను " అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. ఇలా యజ్ఞయాగములలో అగ్రభాగమునకు అర్హుడు, యజ్ఞధారి అయిన అయిన మహావిష్ణువు ప్రవృత్తి ధర్మమును నిర్వహించడానికి బ్రహ్మదేవుని, దేవతలను నియమించి తాను మాత్రం నివృత్తి ధర్మమును నిర్వర్తిస్తూ జ్ఞానమూర్తి అయి సర్వత్రా సంచరిస్తున్నాడు. అని వ్యాసుడు వైశంపాయనుడికి చెప్పాడు.

విష్ణుతత్వము

మార్చు

వ్యాసుడు ఇంకా ఇలా " వైశంపాయనా ! ఈ సమస్త లోకములను వాటిని పదిలంగా రక్షిస్తూ తిరిగి వాటిని తనలో లీనం చేసుకునే విష్ణుమూర్తిని నేను కొలుస్తాను. అజుని, విశ్వమే తన రూపముగా కలవాడిని, మృత్యంజయుడిని, దేవతలకు అధినాధుడిని, ఆది అయిన వాడిని, నాలుగు వేదములను అధ్యయనం చేసిన వాడిని, ఆత్మతో కాని ఎరుగ లేని వాడిని, ఈశానుడిని, నాశనం లేని వాడిని, అన్ని తపములకు కర్మఫలదాతను నేను ఆశ్రయిస్తాను. ఈ విధంగా వ్యాసుడు నారాయణుడిని స్తుతించాడు. వ్యాసుడు మమ్ము చూసి నా పూర్వ వృత్తాంతము మీకు చెప్పాను. మీరు కూడా నాకు విష్ణుమూర్తి చెప్పిన ఉపదేశములను ఆచరించండి. ఆ పరమేశ్వరుడిని కొలవండి. వేదముల చెప్పిన ప్రకారము నడవండి " అమ్ని మాకు చెప్పాడు. మేము వ్యాసుడు చెప్పిన విధముగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదముల ప్రకారము ఈ త్రిలోకాధిపతిని స్తుతించాము. మనసులో ఆరాధించాము " అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు. జనమేజయ మహారాజా ! వ్యాసుడు మాకు బోధించిన పుణ్యప్రథమైన విష్ణుతత్వము చదినను విన్న విప్రుడు వేదవేదాంగములను చదివిన ఫలమును పొందుతాడు, క్షత్రియుడు సర్వత్రా విజయము పొందుతాడు, వైశ్యుడు ధనలాభము పొందుతాడు, శూద్రుడు అత్యంత సుఖములను పొందుతాడు. పెళ్ళికాని వారికి పెళ్ళి జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం జరుగి మంచి పుత్రుడిని పొందుతుంది. గొడ్రాలు సంతానవతి ఔతుంది " అని వైశంపాయనుడు ఫలశృతి చెప్పాడు.

విష్ణు నామములు నిర్వచనాలు

మార్చు

జనమేజయుడు వైశంపాయనుడిని " మునివరా ! నిర్వచింప వీలుకాని గూఢమైన విష్ణునామాలను నాకు వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! పూర్వము అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇదే అడిగాడు. అందుకు కృష్ణుడు అర్జునునికి వివరించిన విష్ణునామప్రాశస్తము గురించి చెప్పాడు. " అర్జునా ! నీవు నేను సనాతులమైన నరనారాయణులము. ఈ ప్రపంచాన్ని ఉద్దరించడానికి ఈ భూమి మీద అవతరించాము. నీకు నేను గూఢమైన నా నామములు వాటి అర్ధములు వివరిస్తాను. అర్జునా ! నారములు అనగా జలములు. ఆయనము అనగా నివసించు స్థలము. నేను సదా జలములో నివసిస్తాను కనుక నాకు నారాయణుడు అనే నామము వచ్చింది. ఈ జగములన్నీ నాలో నివసిస్తాయి. నేను జగమంతా ఉంటాను కనుక నన్ను వాసుదేవుడు అంటారు. ఇంద్రియములను నిగ్రహించడము కంటే ఉత్తమమైన ధర్మము లేదు. అట్టి జనులు సదా నన్ను కొలుస్తుంటారు. జగములన్నీ నా ఉదరములో ఉన్నాయి కనుక నన్ను దామోదరుడు అంటారు. అన్నము, జలము, ఆహారము, అమృతము, వేదములు, పృశ్ని పేరుతో పిలువబడుతూ ఉంటాయి. అవి నా గర్భంలో ఉన్నాయి కనుక నన్ను పృశ్నిగర్భుడు అంటారు. సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్ని శిఖలు, నాకు తల వెంట్రుకల వంటివి. అందుకని నన్ను కేశవుడు అంటారు. లోకరక్షణార్ధము నేను బ్రాహ్మణతత్వము, క్షాత్రము అవలంభిస్తుంటాను. బ్రాహ్మము బ్రాహ్మణులకు, క్షాత్రము క్షత్రియులకు పరమ ధర్మములు. కనుక బ్రాహ్మణులు, క్షత్రియులు తమ ధర్మములు తప్పక నెరవేరుస్తూ ముల్లోకముల విరాజిల్లుతుంటారు. బోధించడం, స్థాపించడం అగ్నికి చంద్రునికి కర్తవ్యములు. అఖిల లోకములను ఆనందింపచేసే సూర్యచంద్రులు నా రూపమే. సూర్యచంద్రుల రూపంలో లోకములకు మేలు చేసినందు వలన వరదుడు, లోకభావనుడు, ఈశ్వరుడు, హృషీకేశుడు మొదలైన నామములు నాకు వచ్చాయి. యజ్ఞములో హవిర్భాగమును హరిస్తాను కనుక నాకు హరి అనే నామము వచ్చింది. గోవులను రక్షించడానికి గుహలో పడకుండా కొండను ఎత్తి పట్టుకున్నాను కనుక నాకు గోవర్ధనుడు అనే నామము వచ్చింది. నేను రోమరహితుడనై అందంగా ఉంటాను కనుక నాకు శిపివిష్టుడుఅనే పేరు వచ్చింది. నేను భూమిని దున్నుతుంటాను కనుక నా వర్ణము నలుపు కనుక నన్ను కృష్ణుడు అంటారు. నేను సత్వగుణ ప్రధానుడను నన్ను సత్వగుణము వీడదు, సత్వగుణమును ఆచరిస్తాను. నా జన్మ సత్వగుణ ప్రధానము కనుక నాకు సాత్వతుడు అన్న పేరు వచ్చింది. నాకు చ్యుతి లేదు కనుక నాకు అచ్యుతుడు అన్న పేరు వచ్చింది. మానవశరీరములో మూడు ధాతువుల రూపములో ఉంటాను కనుక నాకు త్రిధాతువు అన్న పేరు వచ్చింది. నా తేజస్సు వలన ఘృతము ఏర్పడింది కనుక నాకు ఘృతార్చి అనే పేరు వచ్చింది. ధర్మములలో వృషము అత్యుత్తమము. ఆ ధర్మమును నేనే కనుక నాకు వృషుడు అన్న పేరు వచ్చింది. ఆది, మద్యము, అంతము లేని వాడను కనుక నాకు అనాది, అమధ్యుడు, అనంతుడు అని కూడా పులుస్తారు. సదా శుచి అయిన మాటలు వింటాను కనుక నాకుశుచిశ్రవుడు అన్న పేరు వచ్చింది. వరాహావతార సమయముంలో నేను ఒకే కొమ్ముతో భూమిని పైకెత్తి పట్టుకున్నందున నాకు ఏకశృంగుడు అనే పేరు వచ్చింది. నేను ఎల్లప్పుడు ఈ లోకమును చైతన్యవంతము చేస్తాను కనుక నన్ను విరించి అంటారు. నేను విద్య రూపంలో అశరీరంగా సూర్యుడిలో లీనమై ఉంటాను కనుక నన్ను కపిలుడు అంటారు. యోగమును హిరణ్యము అంటారు కనుక అటువంటి యోగము నా కుక్షిలో ఉంది కనుక నన్ను హిరణ్యగర్భుడు అంటారు. ధర్మరక్షణార్ధము నరుడిగా నారాయణుడిగా ఈ లోకములో ఉధ్భవించాను కనుక నన్ను ధర్మజుడు అంటారు. నేను నరనారాయణులుగా గంధమాధన పర్వతము మీద తపస్సు చేసుకుంటున్న సమయాన పరమశివుడు దక్షయజ్ఞము ధ్వంసం చేయపూనగా ఆ యజ్ఞము నావక్షస్థలంలో దాగింది. అప్పుడు నా వక్షస్థలము మీద ఉన్న కేశములు ముంజముల (గడ్డిపోచల) వలె మారినవి. అందుకని నాకు ముంజకేశుడు అని పేరు వచ్చింది. అప్పుడు యజ్ఞమును తరుముతూ వచ్చిన మహాశివుడు నాతో కలియబడ్డాడు. అప్పుడు నేను ఒక బాణమును అభిమంత్రించి పరశువు రూపంలో శివుని మీదకు విసిరాను. అప్పుడు మహాశివుడు ఆ పరశువును ఖండించాడు కనుక నాకు ఖండపరశువు అని పేరు వచ్చింది.

శివకేశవుల యుద్ధము

మార్చు

అనిచెప్పిన కృష్ణుడితో అర్జునుడు " కృష్ణా ! నీవు మహాశివుడు చేసిన యుద్ధంలో ఎవరు గెలిచారు. నాకు చెప్పవా ! " అని అడిగాడు.కృష్ణుడు " అర్జునా ! ఆ సమయంలో రుద్రుడు నారాయణుడు ఒండొరులతో యుద్ధంచేయ సంకల్పించారు. రుద్రుడు తన త్రిశూలంతో నారాయణుడి వక్షస్థలం తాకాడు. నారాయణుడు తన చేత్తో రుద్రుడి మెడ పట్టుకున్నాడు. అది తెలిసి అక్కడకు బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి ఇద్దరినీ సమాధానపరిచాడు. బ్రహ్మదేవుడు " మహాశివా ! నీవు ఈ జగములంతకూ శివుడవు. శివుడంటే శుభంకరుడు. కనుక నీవు నీ కోపమును ఉపసంహరించు. జ్ఞానులందరికి శివుడు కేశవుడికి మధ్య భేదములేదని తెలుసు. వేదములతో తెలుకొనతగినది, నిర్గుణమైనది, ద్వందములకు అతీతమైంది, అరూపమైంది అయిన ఒకే మూల తత్వము రెండు రూపములతో విరాజిల్లుతుంది. శివకేశవ తత్వము అంటే అదే. నిజానికి శివకేశవులకు భేదము లేదు. నరనారాయణులు ఈ జగత్తుకు ఆది పురుషులు. నీ దివ్యబుద్ధితో చూస్తే అది నిజమని మనమంతా ఆయన నుండి ఉద్భవించామని అవగతమౌతుంది. కనుక మహాశివా వెంటనే నీవు నారాయణుడిని ప్రసన్నం చేసుకో " అని శివుడిని ప్రార్ధించాడు. అప్పుడు శివుడు ప్రసన్నుడై తన కోపమును విడిచిపెట్టి నారాయణుడికి నమస్కరించాడు. నారాయణుడు " మహాశివా ! ఎవరైతే నిన్ను తెలుసుకుంటాడో వారు నన్ను తెలుసుకున్నట్లే ! నిన్ను సేవిస్తే నన్ను సేవించినట్లే. మహాశివా ! శివకేశవులకు భేదము లేదు. మహాశివా ! ఈ రోజు నుండి నా గుండెల మీద ఉన్న శ్రీవత్సము నీ త్రిశూలముకు గుర్తుగా ఉంటుంది. నీ కంఠము మీద ఉన్న నలుపు ఈ రోజు నుండి నా గుర్తుగా నా చేతిముద్రతో శ్రీకంఠముగా పిలువబడుతుంది " అని విష్ణువు చెప్పి " అర్జునా ! ఆ విధంగా నాకూ మహాశివుడికి మధ్య సఖ్యత కుదిరింది. ఇది చూసి బ్రహ్మ మొదలైన దేవతా సమూహములు ఆనందించారు. కనుక అర్జునా ! నేను వివిధ రూపములతో ఈ లోకములో ప్రవర్తిస్తుంటాను. నీవు కూడా అభవుడు, అమృత్యుడు అయిన శివుని పూజించి తరించు. నేను పక్కన ఉండి సదా రక్షించాను కనుక మహా భారత సంగ్రామంలో నీకు విజయము లభించింది. నీవు యుద్ధం చేసే సమయంలో మహాశివుడు త్రిశూలధారి అయి నీరధము ముందు నిలిచి శత్రు సంహారంచేసాడు. ఆ కారణంగానే నీవు విజయుడివి అయ్యావు. నీవు ఈ విషయం తెలుసుకోవడం మంచిది " అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు " అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.

నరనారాయణులు

మార్చు

జనమేజయుడు " మునీంద్రా ! అటు మహాశివుడు ఇటు విష్ణువు తోడుగా ఉండగా అర్జునుడికి విజయం లభించండంలో ఆశ్చర్యం ఏముంది. నారదుడు శ్వేతద్వీపంలో మహావిష్ణుదర్శనం చేసుకుని వచ్చిన తరువాత నరనారాయణుడికి నారదుడికి మధ్య జరిగిన సంభాషణా వివరములు చెప్పండి " అని అడిగాడు. వైశంపాయనుడు " నరనారాయణులు నారదుడికి అతిథి సత్కారములు చేసి శ్వేతద్వీప విశేషణాలు వివరించండి " అని అడిగారు. నారదుడు " మీ కృపాకటాక్షంతో నేను శ్వేతద్వీపంలో మహావిష్ణువును దర్శించాను. ఆయన రూపముకు మీ రూపముకు ఏమీ తేడా లేదు. అక్కడ తెల్లని శరీరము కలవారు, ఆకలిదప్పులు లేని వారు, ఇంద్రియనిగ్రహము లేని వారు, మౌనంగా ఉండే వారు అయిన మానవులను చూశాను. వారు విష్ణుమూర్తిని భక్తిశద్ధలతో కొలుస్తున్నాడు. విష్ణుమూర్తి కూడా వారితో విహరిస్తున్నాడు. నన్ను కృప చేసి నాకు క్షేత్రజ్ఞుడు, తన రాబోవు జన్మల గురించి, అవతారముల గురించి తెలియజేసాడు. ఆ శ్వేతద్వీపము చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ సూర్యచంద్రులు గాలిలేదు . మహావిష్ణువుకు ఏకాంత చిత్తముతో ధ్యానించే వారంటే ఇష్టమని తెలిసి నేను విష్ణువును ఏకాంతచిత్తంతో ధ్యానించాను. తరువాత విష్ణువు వద్ద శలవు తీసుకుని మీ వద్దకు వచ్చాను. నేను కూడా ఇక్కడే ఉండి మీదయకు పాత్రుడనౌతాను అన్నాడు. నరనారాయణుల అనుమతి పొంది నారదుడు బదరికావనంలో వేయి దివ్య సంవత్సరాలు తపస్సు చేసి తరువాత నరనారాయణుల వద్ద శలవు తీసుకుని హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ తన శిష్యబృందంతో పూజలంకుంటున్నాడు.

హరిమహిమ

మార్చు

జనమేజయ మహారాజా ! సమస్త పాపహరమైన హరికథను భక్తిశ్రద్ధలతో విన్నావు. నీవు ఎల్లప్పుడూ విష్ణుమూర్తిని భక్తితో కొలుచిన నీకు మహోన్నతి కలుగుతుంది. హరిని ద్వేషించే వారు ఇహలోక సుఖాలకు పరలోక సుఖాలకు దూరము కావడమే కాక వారి పితరులకు కూడా నరకము ప్రాప్తిస్తుంది. ముల్లోకములలో ఉన్నవారందరికి హరియే ఆత్మ. హరిని ద్వేషించడం అంటే వారిని వారు ద్వేషించుకున్నట్లే అలాంటి వారికి ఆపదలు తధ్యము. మా గురువైన వ్యాసమహర్షి కూడా విష్ణువు అవతారమే. ఆయన చేత రచింపబడిన లోక పూజనీయమైన భారతము మనకు అందరికి తెలుసు. అటువంటి భారతమును అధ్యయనం చేసే శక్తి సాక్షాత్తు విష్ణుమూర్తికి తప్ప వేరెవరికి సాధ్యం కాదు. భారతంలో చెప్పబడిన ధర్మములు చెప్పడం మా గురుదేవులకే సాధ్యం " అని చెప్తున్న వైంశంపాయనుడిని చూసి జనమేజయుడు " మహాత్మా ! మహావిష్ణువు హయగ్రీవుడిగా బ్రహ్మలోకం వెళ్ళాడు అన్నారు కదా ! పురుషోత్తముడైన విష్ణుమూర్తికి హయగ్రీవ అవతారం ఎత్తవలసిన అవసరం ఏమి ఉన్నది ? వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! ప్రళయకాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి ప్రళయము అంతరించిన తరువాత మేలుకొని తిరిగి సృష్టి చేయాలని సంకల్పించాడు. వెంటనే అహంకారం ఆవిర్భవించింది. విష్ణునాభి నుండి కమలంలో ఆవిర్భవించిన ఆ అహంకారముకు బ్రహ్మ అన్న నామధేయము జరిగింది. బ్రహ్మ ముందుగా వేదములను సృష్టించాడు. ప్రళయ కాలములో లయమైన సత్వ, రజో, తమో గుణాలలో మొదటిది అయిన సత్వ గుణము ముందుగా పుట్టింది. బ్రహ్మ సత్వగుణ సంపన్నుడయ్యాడు. రజో తమో గుణాలు రాక్షసగుణాలు అయ్యాయి ! వారిలో ముఖ్యులు మధు కైటభుడు. వారు తొలుతగా పుట్టిన వేదములను తీసుకుని పోయి పాతాళంలో దాచి పెట్టారు. " సృష్టికి మూలము వేదములే, అవి లేకుండా సృష్టి చేయలేను, నన్ను ఈ ఆపద నుండి ఎవరు రక్షిస్తారు " అనుకుని బ్రహ్మదేవుడు విష్ణువుని అనేక విధముల స్తుతించాడు. జలములలో శయనించి ఉన్న విష్ణువు హయగ్రీవ రూపంతో వేదములను వెదుకుతూ పాతాళముకు వెళ్ళి భయంకరంగా ప్రణవ నాదం చేసాడు. ఆ నాదం విన్న మధు కైటబులు ఆ ప్రణవ నాదం వినవచ్చిన దిక్కుకు పరుగెత్తారు. ఇంతలో హయగ్రీవుడు వేదముల బంధనములు ఊడదీసి తీసుకు వెళ్ళి బ్రహ్మదేవుడికి ఇచ్చి తిరిగి యధావిధిగా శయనించాడు.

మధు కైటబులు

మార్చు

ప్రణవధ్వని వచ్చిన దిక్కుకు పరుగెత్తిన మధుకైటభులకు అక్కడ ఎవరూ కనపడక వేదములు పెట్టిన చోటుకు వెళ్ళి చూసి అక్కడ వేదములు కనిపించక పోవడంతో వారికి భయంకరమైన కోపము వచ్చింది. నానారభస చేస్తూ అటూఇటూ తిరుగుతూ ఉండగా యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి వారికి కనిపించాడు. వారు విష్ణువును యుద్ధముకు ఆహ్వానించగా విష్ణువు యుద్ధోన్మాదులైన మధుకైటబులను సంహరించాడు. అలాసృష్టి జరగడానికి సాయం చేసాడు. బ్రహ్మదేవుడు సృష్టిచేయడం ప్రారంభించాడు. అప్పటి నుండి హయగ్రీవుడు అన్ని అవతారముల కంటే మహిమాన్వితుడయ్యాడు. వేదములను రక్షించిన హయగ్రీవుడిని వేదములు సదా ఆశ్రయించి ఉంటాయి. జనమేజయమహారాజా ! హరి త్రిగుణములలో హెచ్చుతగ్గులను కలిగిస్తుంటాడు కనుక మానవులలో కూడా త్రిగుణములు హెచ్చుతగ్గులుగా ఉంటుంది. అందుకే మానవులలో ఒకరు గుణవంతులు మరొకరు గుణరహితులు ఔతారు. మానవులలో త్రిగుణాలకు కారణం అయిన శ్రీహరి త్రిగుణాలను నాశనంచేసే శక్తి ఆయనకే ఉంది. వేదములు, యజ్ఞములు, పుణ్యకార్యములు, పంచభూతములు శ్రీహరి రూపాలే " అని వైశంపాయనుడు చెప్పాడు.

ఏకాగ్రత

మార్చు

జనమేజయుడు " మహాత్మా ! ఏకాగ్రచిత్తులు గొప్ప వారు అన్నావు కదా ! అసలు ఏకాగ్రత అంటే ఏమిటి ? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా ! పూర్వము శ్రీకృష్ణుడు మీ తాతగారైన అర్జునుడికి భారతయుద్ధ ఆరంభంలో సాంఖ్యము, యోగముల సారము బోధించారు. దానినే భగవద్గీత అంటారు. అది నేను ఎప్పుడో విన్నాను ఇప్పుడు నీకు చెప్తాను శ్రద్ధగా విను. ఏకాగ్రత ధర్మమును పూర్వము నారాయణుడికి ఉపదేశించాడు. దానిని బ్రహ్మ దక్షుడికి ఉపదేశించాడు. దక్షప్రజాపతి తన మనుమడైన సూర్యుడికి ఉపదేశించాడు. సూర్యుడు దానిని మనువుకు ఉపదేశించాడు. మనువు ఇక్ష్వాకుడికి ఉపదేశించాడు. ఇక్ష్వాకుడి నుండి ఆ ఏకాంతిక ధర్మము యోగ్యులైన వారికి పరంపరగా అందజేయబడింది. ఈ ఏకాంతిక ధర్మమును మహావిష్ణువు నుండి ఉపదేశం పొందిన నారదుడు తన శిష్యులకు ఉపదేశించాడు. వారి నుండి వారి శిస్యులకు అలా పరంపరగా సకల జనులకు చేరింది. ఏగాగ్రత ధర్మము దుర్మార్గులకు మాత్రము అవగతము కాదు. ఈ ఏకాగ్రత ధర్మము అహింసకు మూలము. ఈ అహింసా వ్రతముతో శ్రీహరి ప్రీతి చెందుతాడు. హరి అన్నా క్షేత్ర్తజ్ఞుడు అన్నా ఒకటే. శ్రీహరి తన భక్తులకు వాసుదేవాది నాలగు రూపములలో దర్శనం ఇస్తాడు. ఈ నలుగురిలో వాసుదేవుడు ప్రధముడు, రెండవ వాడు సంకర్షుణుడు, మూడవ రూపము ప్రద్యుమ్నుడు, నాల్గవ రూపము అనిరుద్ధుడు. ఎన్ని రూపములలో దర్శనం ఇచ్చినప్పటికీ అంతర్లీనంగా ఉండే రూపము ఒక్కటే. ఆ దైవస్వరూపము మన ఇంద్రియములకు గోచరం కాదు. అనన్య భక్తి, తపస్సు, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలవారికి మాత్రమే ఆ దైవస్వరూపము గోచరమౌతుంది. ఏకాంతధర్మము శాంత మనస్కుడికి కరతలామలకం. ఈ ఏకాగ్ర ధర్మము మనలోని అన్ని చింతలను తుడిచి వేయు ఆయుధము " అని వైశంపాయనుడు చెప్పాడు.

నోములు వ్రతాలు

మార్చు

జనమేజయుడు" మహాత్మా ! ప్రజలు అత్యున్నతమైన ఏకాగ్రతావ్రతం ఆచరించక ఏవోవో పూజలు నోములు వ్రతాలు ఏ ప్రయోజనాన్ని ఆచరిస్తున్నారు ? వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " మహారాజా ! మనస్సు త్రిగుణముల వలన ప్రభావితమౌతుంది. అందులో ఉత్తమమైన సాత్వికగుణము కలవారి యోగక్షేమములు శ్రీ మహావిష్ణువే చూసుకుంటాడు. వారే ఏకాగ్రచిత్తం కలిగిన ఏకాంతికులు. వారికి దైవచింత తప్ప వేరే వ్యాపకం లేదు. రాజసము తామసము అవలంబించిన వారు ప్రాపంచిక విషయాలలో మునిగి భోగలాలసలో నిమజ్ఞులై ఉంటారు. అలాంటి వారు శ్రీహరికృపకు పాత్రులు కాలేరు. ఏకాంతికులు ఏకాంతచిత్తంతో సేవించే వారు విష్ణుమూర్తి మనసులో చోటుచేసుకుంటారు. ఈ విషయాన్ని వేదాలు కూడా ఉద్ఘాటిస్తున్నాయి. మా గురువుగారు దయతో నాకు ఉపదేశించిన ఈ ఉపదేశము విని నేను పవిత్రుడనైనాను. జనమేజయా ! నీవు కూడా ఆచరించగలిగిన ఏకాగ్రవ్రతము ఆచరించి ఏకాగ్రతతో శ్రీహరిని ధ్యానించి తరించి శాశ్వతత్వాన్ని పొందు " అని వైశంపాయనుడు. జనమేజయుడు" ఓ మహర్షీ ! లోకములో యోగము, సాంఖ్యము, వేదములు, పాశుపతము, పంచరాత్రము, ఇంకా అనేక సాధనాలు ఉన్నాయి కదా! అన్నిటికీ నిష్టలు ఒకే విధంగా ఉంటాయా ! లేక వేరువేరుగా ఉంటాయా ! అసలు వీటిని ఎవరు ఉపదేశించారు ? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! వేదములకు, సాంఖ్యముకు, యోగముకు, ఇతర శాస్త్రాలకు మూలకర్త శ్రీహరే ! అన్నీ ఆయనను చేరడానికి ఉన్న మార్గాలే ! వేదములను నారాయణ పుత్రుడు అయిన వ్యాసుడి చేత ఉపదేశించబడింది. సాంఖ్యమును కపిలుడు ఉపదేశించాడు, యోగమును హిరణ్యగర్భుడు ఉపదేశించాడు, పాశుపతమును శివుడు ఉపదేశించాడు, వైష్ణవము అను పంచరాత్రమును సాక్షాత్తు విష్ణుమూర్తి చేత ఉపదేశింపబడింది " అని వైశంపాయనుడు చెప్పాడు.

వ్యాసుడు

మార్చు

జనమేజయుడు " మహర్షీ ! తమరు వ్యాసుడు పరాశరుడి పుత్రుడని అన్నారు కదా ! మహావిష్ణువుకు కుమారుడు ఎలా అయ్యాడు " అని అడిగాడు. వైశంపాయనుడు " మహాభారతకథను రచించి అలసి పోయిన వ్యాసుడు అలసి పోయి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ వ్యాసుడు శిష్యుల చేత పరచర్యలు అందుకుంటూ వారికి వేదములను భారతమును దాని అర్ధములను బోధిస్తున్నాడు. ఆ సమయంలో నేను మరి కొందరు శిష్యులు వ్యాసుడికి పాదాభివందనం చేసి " గురువుగారూ ! తమరిని నారాయణుడి పుత్రుడు అంటారు కదా ! అది ఎలా సంభవించింది " అని అడిగాము. వ్యాసుడు " ఆది కాలములో సృష్టి చేయ సంకల్పించిన నారాయణుడు ముందుగా నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ సకల జీవకోటిని సృష్టించాడు. బ్రహ్మముఖము నుండి వేదములు పుట్టాయి. ఆ వేదములు అధ్యయనం చేయడానికి శ్రీమన్నారాయణుడు అపాంతరతముడు అనే వాడిని మనసంకల్పం చేత సృష్టించాడు. అతడు నారాయణుడిని తన కర్తవ్యము ఏమిటని అడిగాడు. నారాయణుడు నీవు వేదములను అధ్యయనం చేసి వాటిని వ్యాసం చెయ్యి అని చెప్పగా వేదవ్యాసుడు అందుకు అంగీకరించాడు. అప్పటికి కలగాపులగంగా ఉన్న వేదములను అధ్యయనం చేసిన అపాంతరతముడు వాటిని నాలుగు వేదములుగా విభజించాడు. దానికి ప్రీతి చెందిన నారాయణుడు " ఇలారా వేదవ్యాసా ! నీవు నా కుమారుడవు . నీవు అన్ని మన్వంతరములలో ఉంటావు. నీకు త్రికాలజ్ఞానము ప్రసాదిస్తున్నాను. నీకు నా కథలు, ధర్మములు, ఈ లోకములో చేయతగిన అన్ని కార్యములు గోచరిస్తాయి. నీవు రాబోవు కాలములో పరాశరకుమారుడిగా జన్మిస్తావు. నీకు పుట్టిన కుమారులు కురుసామ్రాజ్యాన్ని పాలిస్తారు. వారు వారి కుమారులు రాజ్యకాంక్షతో ఒకరితో ఒకరు కలహించి యుద్ధములు చేసి సర్వనాశనం ఔతారు. అపాంతరతమా ! కాలక్రమేణా ! మరలా వేదములు ఒకదానితో ఒకటి కలిసి పోతాయి. ఈ లోకములకు కలిగిన ధర్మసందేహములను తీర్చగలిగిన వాడివి నీవే. నీవు సాంఖ్యమును , యోగమును అభ్యసించి లోక పూజితుడవు ఔతావు. కుమారా ! ఇన్ని చేసినా నీకు వైరాగ్యము సిద్ధించదు కాని నీకు విరాగి అయిన పుత్రుడు జన్మిస్తాడు. అతడికి వైరాగ్యము సిద్ధిస్తుంది వెళ్ళు " అని చెప్పి విష్ణుమూర్తి అంతర్ధానం అయ్యాడు " అని చెప్పిన వ్యాసుడు నాకు త్రికాలజ్ఞం లభించింది కనుక నాకు పూర్వ జన్మలలో జరిగినది అన్నీ అవగతమయ్యింది. నేను నారాయణుడి మానసపుత్రుడను. నేను ప్రతిజన్మలో నారాయణుడి గురించి తపస్సు చేసి ఆయన దయకు పాత్రుడను ఔతాను " అని నా గురువు వ్యాసుడు తన పూర్వజన్మ వృత్తాంతమును మాకు వివరించావు " అని వైశంపాయనుడు చెప్పాడు.

నారద నారాయణ సంవాదము

మార్చు

వైశంపాయనుడు " జనమేజయా ! నారద నారాయణ సంవాదము, నారదుడు బదరికాశ్రమంలో నరనారాయణులను కలుసుకుని శ్వేతద్వీపము విశేషాలు గురించివివరించడం, నారాయణుడి అనుమతి తీసుకుని నారదుడు బదరికావనంలో తపస్సు చేయడం, తిరిగి హిమవత్పర్వతాలకు వెళ్ళి తపస్సు చేయడం, హయగ్రీవుడి వృత్తాంతం అన్నీ మాకు మా గురువువుగారు చెప్పే సమయంలో అక్కడ ఉన్న శ్రీకృష్ణుడు, ధర్మరాజాదులు విన్నారు, అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు తన నామార్ధములను వివరించాడు. వేదములు, సాంఖ్యము, యోగము, పాశుపతము, పంచరాత్రము, ఏకాంతిక ధర్మము వాటి గురించి మా గురువుగారు వివరించగా ధర్మరాజాదులు విన్నారు. ఇప్పుడు నీ కోరిక మీద నేను నేను నీకు చెప్పాను. ఈ లోకంలో ఏకాంతిక ధర్మముకు మించినది మరొకటి లేదు " అని జనమే జయుడికి చెప్పాడు.

ఉత్తమ ధర్మము

మార్చు

ధర్మరాజు " పితామహా ! ఈ లోకములో ధర్మములన్నీ చెప్పారు కదా ! వాటిలో ఆచరించతగిన ఉత్తమధర్మము ఏది ? " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! అన్ని ధర్మములు ఉత్తమమైనవే పనికిరాని ధర్మము ఏదీ లేదు. వాటిలో వారివారికి నచ్చిన ధర్మాలు వారు ఆచరిస్తారు. తమకు నచ్చిన ధర్మాలను ఆచరించే జనులను అనేకులు మన జీవితంలో తారసపడతారు. ఒక సారి నారదుడు లోక సంచారము చేస్తూ దేవేంద్రుడి వద్దకు వెళ్ళాడు. దేవేంద్రుడు నారదమునిని తగురీతిని సత్కరించి ఉచితాసనమున కూర్చుండ పెట్టి " నారద మునీంద్రా ! నీవు అన్ని లోకములను సంచరిస్తుంటావు కదా ! నీకు ఎక్కడైనా అత్యంత ఆశ్చర్యకరమైనది కనిపించిందా ! " అని అడిగాడు. నారదుడు " గంగానదికి దక్షిణ తీరంలో మహాపద్మము అనే నగరములో భృగుడు అనే భ్రాహ్మణుడు నివసిసిస్తున్నాడు. అతడు ధర్మపరుడు, సత్యవాది, అహంసా వాది, ఇంద్రియనిగ్రహము కలవాడు, తనకు ఉన్న దానితో తృప్తిచెందే వాడు. కోపము అసలే లేని వాడు, తాను న్యాయంగా సంపాదించిన ధనముతో దేవ కార్యములు, పితృ కార్యములు, అతిథి సత్కారములు చేసే వాడు. అతడికి తగినట్లు వినయ సంపన్నులైన కుమారులు కలిగారు. అయినా అతడు సదా ఏ కార్యము చేస్తే మేలు కలుగుతుంది, ధర్మకార్యాలు ఏవి ఆలోచిస్తూ ఉండే వాడు. ఒకరోజు వారి ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు.

ఆత్మదర్శనం

మార్చు

భృగుడు అతడికి అతిథి సకారాలు చేసి " అనఘా ! నేను ప్రతిరోజు ఆత్మ దర్శనం చేయడానికి ప్రత్నిస్తాను కాని నా మనసును ప్రాపంచిక విషయముల నుండి మరల్చలేక పోతున్నాను. కనుక నాకు ఆత్మదర్శనం సాధ్యం కావడం లేదు. నాకు మార్గము ఉపదేశించండి " అని అడిగాడు. భ్రాహ్మణుడు " భృగూ ! నేను కూడా ! నీ మాదిరి ఆత్మదర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసి ప్రాపంచక విషయాలలో పడి పొంద లేక పోయాను. నాకూ సరి అయిన దారి కనపడ లేదు. నాకు సరి అయిన మార్గము గోచరించ లేదు. కొందరు బ్రహ్మచర్యము వలన, కొందరు గృహస్థాశ్రమంలో ఉండి, మరి కొందరు తపమాచరించి, కొందరు యజ్ఞయాగములు చేసి, మరి కొందరు నిష్కామ కర్మలు చేసి మరి కొందరు ఆత్మదర్శనం పొందారు. కొంత మంది తల్లి తండ్రులను సేవించి, మరి కొందరు భక్తితో భవంతుడిని కొలిచి, కొందరు మంచి నడవడి ప్రవర్తనతో, కొందరు ఇంద్రియ నిగ్రహముతో ప్రఆశాంత జీవితము గడుపుతూ, కొంరౌ సత్యము, అహింస పాటించి ఆత్మ దర్శనం పొందుతారు. ఆత్మ దర్శనానికి అనేక కార్యములు ఉన్నా అది అంత సులువైనది మాత్రం కాదు. నైశారణ్యములో ఉన్న గోమతినదీ తీరాన మహాపద్మతటాకము తీరాన ఒక మహాసర్పము నివసిస్తుంది. ఆ మహాపద్మతటాక తీరంలో పూర్వము మాంధాత తపమాచరించాడని ప్రతీతి. అక్కడ ఉన్న నాగరాజు పేరు పద్ముడు. అతడు మహా ధర్మాత్ముడు, దయకల వాడు. అతడికి అతిథులంటే ప్రేమ ఎక్కువ. నీవు పద్ముడిని దర్శించి అతడి వద్ద ఉపదేశం పొంద వచ్చు " అన్నాడు.

సూర్యరధము

మార్చు

భృగువు బంధు మిత్రుల అనుమతి తీసుకుని మిత్రుల అనుమతి తీసుకుని భృగువు నైశారణ్యముకు వెళ్ళాడు. అక్కడ నాగేంద్రుడిని దర్శించగా అతడి భార్య భృగువును భక్తితో పూజించి " మహానుభావా ! తమరు ఇక్కడకు వచ్చిన కారణం ఏమిటి ? " అని అడిగింది. భృగువు " అమ్మా ! నేను నీ భర్తను దర్శించాలని వచ్చాను. నీ భర్త ఎక్కడ ? " అనీడిగాడు. అందుకు ఆమె " నా భర్త ఒక సంవత్సరానికి ఒక మాసము సూర్యరధానికి పగ్గంగా ఉంటాడు. ఈ మాసము అతడి వంతు కనుక వెళ్ళాడు. ఇంకా ఒక ఎనిమిది రోజుల అనంతరం వస్తాడు. మీరు వచ్చిన పని చెపితే నేను ఆపని చేయగలిగితే చేస్తాను " అన్నాడు. భృగువు " అమ్మా ! నేను నీ భర్తను చూడ వచ్చాను కనుక నేను అతడి కొరకు వేచి ఉంటాను. అతడు రాగానే నా గురించి చెప్పమ్మా " అని అడిగాడు. అలా ఆరు రోజులు గడిచే వరకు భృగువు ఆహారపానీయములు ముట్ట లేదు. నాగేంద్రుడి సేవకులు వచ్చి " అయ్యా ! మాకు అన్నిటి కంటే అతిథిసేవ ముఖ్యము. మీరు అన్యధా భావించ మా ఆతిథ్యము స్వీకరించి మేము తెచ్చిన అన్నము, ఫలములు, కందమూలములలో వాటిలో ఏవైనా మీకు ప్రీతికరమైనవి తినండి " అని వేడుకున్నారు. భృగువు " అయ్యా ! మీరు ఇంత చెప్పవలెనా ! నేను నాగరాజు దర్శనం చేసుకునే వరకు ఆహారం ముట్టను. నాకు ఆకలి దాహము కలగడము లేదు. మీకు ఎటువంటి మాట రానీయను. ఇక రెండుదినములలో నాగరాజు రాకున్న నేను మీ ఆతిథ్యము స్వీకరిస్తాను " అన్నాడు. వారు వెళ్ళి పోయారు. ఎనిమిదవ రోజుకు సూర్యుడి వద్ద నుండి నాగరాజు వచ్చాడు. నాగరాజు భార్యతో " అతివా అందరూ క్షేమంగా ఉన్నారు కదా ! దేవ కార్యములు, అతిథి పూజలు చక్కగా జరుగుతున్నాయా ! నేను లేనందున్న పొరపాట్లు జరుగ లేదు కదా ! " అన్నాడు. అందుకు ఆయన భార్య " నాధా ! మీరు ఇంతగా చెప్పాలా ! మీరు నాకిచ్చిన శిక్షణ వలన దేవతా పూజలు, అతిథి సత్కారాలు చక్కగా చేసాను. నాధా ! శిష్యులకు గురువు ఎడల భక్తి. భ్రాహ్మణులకు వేదముల ఎడ భక్తి, క్షత్రియులకు ప్రజారక్షణలో భక్తి, వైశ్యులకు ధనసంపాదనలో భక్తి, శూద్రులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను సేవించడంలో భక్తి, యజమాని ఎడల సేవకులకు భక్తి, సర్వులకు ఉపకారం చేస్తూ ఆదరించడం గృహస్థులకు భక్తి, ఏకాంతంలో తపస్సు చేయడం యోగులకు భక్తి, పతి ఎడల భార్యకు భక్తి ఇవి ప్రతివారు ఆచరించతగిన సువ్రతములు. అనేక ధర్మశాస్త్రాలు తెలిసిన మీ భార్యను నేను మీకు అయిష్టమైన పనులు చేస్తానా ! నాధా నాది ఒక మనవి మీ దర్శనార్ధమై మన ఇంటికి ఒక పావనుడైన బ్రాహ్మణుడు మన ఇంటికి వచ్చాడు. అతడు మీ దర్శనం ఆశించి నిరాహారి జపము చేస్తూ అయి ఎనిమిది రోజులుగా వేచి ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయనను పరామర్శించండి " అన్నది. నాగరాజు " లలనా ! దేవతలు, అసురులు గౌరవించే నేను ఒక సామాన్య బ్రాహ్మణుడిని పరామర్శించడానికి వెళ్ళడమా ! " అన్నాడు. ఆమె " నాధా ! అలా కాదు. మీ దర్శనం కోరి ఎనిమిది దినముల నుండి నిరాహారి అయి వేచి ఉన్న బ్రాహ్మణుడి కోరిక తీర్చకపోవడం ధర్మమా ! ఆ బ్రాహ్మణుడిని నిరాశపరచిన పాపంలో ఇప్పటి వరకు నీవు సంపాదించిన పుణ్యము, ఉచితానుచిత జ్ఞానము, కృపాగుణము, ధర్మశాస్త్ర పాండిత్యము దగ్ధంచేస్తావా ! నీ ధర్మనిరతి ఇదేనా ! బ్రాహ్మణుడిని నిరాశపరచిన బ్రహ్మహత్యాపాతకము చుట్టుకుంటుంది. నాధా ! మౌనవ్రతముతో దృఢమైన జ్ఞానను, దానం చేసినందు వలన అభ్యుదయము, ఎదుటి వారి ఆశలు సఫలం చేసినందు వలన నరకబాధలు తొలగి పోతాయి స్వర్గసుఖాలు కలుగుతాయి అని పెద్దలు చెప్తారు కదా ! వర్షం కొరకు వేచిచూచే చాతక పక్షిలాగా ఆ బ్రాహ్మణుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు రోషము తగ్గించుకుని బ్రాహ్మణుడిని పరామర్శించండి " అని హిత బోధ చేసింది. నాగరాజు " తరుణీ ! ఎవరో అపరిచితుడిని చూడడానికి నాకు రోషము వచ్చినది నిజము. నాలో కలిగిన గర్వము, రోషం నీ బోధనతో తొలగించి నేను అధర్మవర్తనుడిని కాకుండా కాపాడావు. పూర్వము ఈ గర్వము కోపము చేతనే కార్తవీర్యార్జునుడు, రావణాసురుడు వరుసగా పరశురాముడి చేతిలో శ్రీరాముడి చేతిలో మరణించారు. కనుక కోపము వదలడం మేలు కలిగిస్తుంది. భృగువు ఆయన దర్శనం చేసుకుని నీ వంటి భార్య వలననే కదా ! నాకు ఇంతటి పాపములో కూరుకు పోవలసిన ఆపద తప్పింది కదా ! " అని చెప్పి నాగరాజు వడివడిగా బ్రాహ్మణుడిని చూడడానికి వెళ్ళాడు.

మహాపద్ముడు

మార్చు

నాగరాజును చూసిన భృగువు సంభ్రమంతో ఎదురువెళ్ళాడు. ఇద్దరూ ఒకరి క్షేమము ఒకరు తెలుసుకున్న తరువాత ఒక చెట్టు కింద కూర్చున్నారు. నాగరాజు " మహాత్మా ! తమరు ఎనిమిది దినముల నుండి నా కొరకు వేచి ఉన్నారు . మీ కోరిక ఏదైనా తప్పక నెరవేరుస్తాను " అన్నాడు. బ్రాహ్మణుడు " నాగరాజా ! నీ గురించి విని నీ వద్దకు వచ్చాను. నీవు సూర్యభగవానుడి వద్దకు వెళ్ళావని విన్నాను. అందుకని మీ కొరకు ఎదురు చూస్తున్నాను. మీరు నా సందేహములు తీర్చండి " అని అడిగాడు. నాగరాజు " మీ వంటి వారి సందేహము తీర్చుడమే నా జన్మకు ధన్యత అడగండి " అన్నాడు. బ్రాహ్మణుడు " నాగరాజా ! నా సందేహములు తరువాత అడుగుతాను. ముందుగా మీరు సూర్యరధము వెంట వెళ్ళునప్పుడు జరిగిన అద్భుతముల గురించి వివరించండి " అని అడిగాడు. నాగరాజు " బ్రాహ్మణోత్తమా ! ఆశ్చర్యములలో ఆశ్చర్యము ఆదిత్యుడు. అతడి వలన ఈ లోకములోని జీవజాలము చైతన్యంతో జీవిస్తుంది. సూర్యకిరణ ప్రభావంతో దేవతలు, వాలఖిల్యులు, మహామునులు, సిద్ధులు, పక్షిజాతులు హాయిగా జీవిస్తున్నారు. సూర్యకిరణ వేడితో వేడిక్కిన జలములు మేఘముల రూపుచెంది వర్షిస్తున్నాయి. ఇంతకంటే అద్భుతము ఏమి కావాలి. బ్రాహ్మణోత్తమా ! సూర్యుడు వర్షములు కురిపిస్తున్నాడు. తిరిగి కిరణముల వేడిచేత ఆ నీటిని లాక్కుంటున్నాడు ఇంతకంటే వేరొక ఆశ్చర్యము ఏమి ? ఈ సూర్యుడి వలన బీజములు వృక్షములు ఔతాయి. ఇది అద్భుతము కదా ! ఇంత ఎందుకు ఆ నిరంజనుడు, అక్షరుడు, అజరుడు, అద్వయుడు, శాశ్వతుడు అయిన పురుషోత్తముడు సూర్యుడి ద్వారా వెలుగుతున్నాడు. ఇంత కంటే వేరొక అద్భుతము ఏమి ?

అగంతకుడు

మార్చు

ఒకరోజు మధ్యాహ్నము సూర్యుడిలా వెలిగిపోతున్న ఒకడు ఎదురు వచ్చాడు. అతడిని చూసి సూర్యుడు తన చేతిని అందివ్వగా అతడు సూర్యుడి చేతిని పట్టుకుని క్రమంగా అతడిలో లీనం అయ్యాడు. ఇంతవరకు రథము మీద కూర్చున్న వాడు సూర్యుడా ! లేక వచ్చిన వాడా సూర్యుడా ! అన్న సందేహము రథము లాగుతున్న నాగరాజులందరికీ కలిగినా ! నేను మాత్రము ధైర్యము చేసి సూర్యుడిని అడిగాను. సూర్యుడు ప్రేమగా నన్ను చూసి " వచ్చిన వాడు దేవతలు, యజుడు, గంధర్వుడు, నాగజాతి వాడు ఎవరూ కాదు. ఊంఛవృత్తితో జీవించు వాడు. అతడు నియమ నిష్టలతో జీవితము గడుపుతూ, కందమూలములు, ఫలములు, నీరు మాత్రమే స్వీకరించి జీవిస్తున్నాడు. అతడికి కోరికలు లేవు, తనకు ప్రాప్తము లేని దానికి అర్రులుచాచడు, సర్వభూతహితుడు అందుకే అతడు సిద్ధిపొంది సూర్యలోక ప్రవేశం చేసాడు " అని చెప్పాడు. బ్రాహ్మణోత్తమా ! ఇలాంటి అద్భుతాలు ఎన్నింటినో చూసాను " అని నాగరాజు చెప్పాడు. ఆ మాటలు విన్న భృగు నాగరాజుతో " నీ మాటలతో నా సందేహములన్నీ తీరిపోయాయి. ఇక నేను వెళ్ళి వస్తాను " అన్నాడు. నాగరాజు " అదేమిటి బ్రాహ్మణోత్తమా ! ఎంతో కష్టపడి ఇంత దూరము వచ్చావు. నీవు వచ్చిన పని చెప్ప లేదు. నీ కోరిక ఏమిటో అడుగు నేను తీరుస్తాను. నాయందు నీవు ఉన్నావు నీ అందు నేను ఉన్నాను మన ఇద్దరి అందు ఈ ప్రపంచం ఉంది. నిశ్చింతగా ఉండండి " అన్నాడు నాగరాజు. భృగు " నాగరాజా నీవు చెప్పినది నిజము. నీవు నేను ఈ సమస్త జీవరాశులు అంతా ఒకటే. ఎలాంటి భేదము లేదు. నేను ఏమి తెలుసుకోవడానికి వచ్చానో అది నాకు అవగతము అయినది. నాకు ఆత్మదర్శనం అయింది. అందరినీ సమ దృష్టితో చూడాలన్నది ఒక వ్రతముగా పెట్టుకుంటాను. ఇక నాకు శలవు ఇప్పించండి " అని చెప్పి భృగువు అక్కడ నుండి వెళ్ళి పోయాడు.

బయటి లింకులు

మార్చు