శాంతరక్షిత

(శాంత రక్షిత నుండి దారిమార్పు చెందింది)

క్రీ. శ. 8 వ శతాబ్దానికి చెందిన శాంతరక్షితుడు (సా.శ. 725-788) సుప్రసిద్ధ భారతీయ బౌద్ధ సన్యాసి. తత్వవేత్త. బౌద్ధరర్మ ప్రచారకుడు. నలందా మహావిహారానికి ప్రధాన పీఠస్థవిరుడు. ఇతను ప్రధానంగా విజ్ఞానవాద (యోగాచార) సంప్రదాయకుడు. మాధ్యమిక శాఖలో స్వతంత్రిక సంప్రదాయవర్తనుడు. టిబెట్‌లో బౌద్ధధర్మాన్ని దృఢంగా స్థాపించాడు. ఇతని గ్రంథాలలో తత్వసంగ్రహం, మాధ్యమికాలంకార ప్రసిద్ధమైనవి.

శాంతరక్షిత (మధ్యలో వున్న వ్యక్తి) జీవితచరిత్రలోని ఘట్టాలను చిత్రించిన 19 వ శతాబ్దపు చిత్రలేఖనం. ముఖ్యంగా శాంతరక్షితుని టిబెట్ పర్యటనను ప్రత్యేకంగా వర్ణిస్తున్న ఈ చిత్రపటంలో ఆయా దృశ్య ఘటనలు కుడి-పైభాగం నుండి ప్రారంభమై సవ్యదిశలో కొనసాగాయి

జీవిత విశేషాలు

మార్చు

శాంతరక్షితుని గురించిన ఆధారాలు భారతదేశంలో ఎక్కువగా లభించలేదు. టిబెట్ గ్రంథాల నుండి ఇతని జీవిత విశేషాలు తెలుస్తున్నాయి. ఇతని జీవిత కాలం క్రీ. శ. 725-788 గా టిబెట్, చైనీయ ఆధారాలను బట్టి తెలుస్తుంది. రాహుల్ సాంకృత్యాయన్ ఇతనిని క్రీ. శ. 650 లో జన్మించినవానిగా పరిగణించారు. జన్మస్థల నిర్ణయంలో భేదాభిప్రాయాలున్నాయి. ఇతని జన్మస్థలం నేటి హిమాచల ప్రదేశ్ రాష్ట్రం లోని రేవల్సార్ (Rewalsar) ప్రాంతమని ఒక వాదన ఉంది. రాహుల్ సాంకృత్యాయన్ ప్రకారం శాంతరక్షితుడు సహోర్ (Zahore) ప్రాంతానికి చెందిన రాజకుమారుడు. ఈ సహోర్ ప్రాంతం నేటి బిహార్ రాష్ట్రంలో విక్రమశిల సమీపంలో ఉంది.

రాకుమారుడు కావడంతో శాంతరక్షితుడు బాల్యంలో సుశిక్షితమైన విద్యాభ్యాసం పొందగలిగాడు. చిన్నతనం నుంచే అతనికి బౌద్ధధర్మం పట్ల ఆసక్తి పెరిగింది. యుక్తవయస్సులో ఇంటిని విడిచి నలందా చేరుకొన్నాడు. నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్య జ్ఞానగర్భ వద్ద మూల సర్వాస్తివాద వినయాన్ని అనుసరించి ప్రవజ్యను, ఉపసంపదను స్వీకరించాడు. అనంతరం శాంతరక్షితగా పిలవబడ్డాడు. నలంద విశ్వవిద్యాలయంలో శాంతరక్షితుడు ఆచార్య జ్ఞానగర్భ వద్ద త్రిపీటకాలను, తదనంతరం ఆచార్య వినయసేనుని వద్ద అభిసమయాలంకారం వంటి మహాయాన గ్రంథాలను అభ్యసించాడు. మాధ్యమిక శాఖననుసరించి స్వతంత్రిక సంప్రదాయంలో ప్రజ్ఞావంతుడైనాడు.

విద్యాభాసం పూర్తయిన పిదప శాంతరక్షితుడు నలందా విశ్వవిద్యాలయంలోనే ఆచార్యుడయ్యాడు. తరువాత నలందా మహావిహారానికి ప్రధాన పీఠస్థవిరుడు అయ్యాడు. ఇతని ప్రసిద్ధ శిష్యులు హరిభద్ర, కమలశీలుడు. ఇక్కడ వున్న కాలంలోనే అనేక ప్రసిద్ధ గ్రంథాలను, వ్యాఖ్యలను రచించాడు. నలందాలో ముగ్గురు ప్రతిభావంతులైన మాధ్యమికాచార్యత్రయంలో ఒకడుగా పేరుగాంచాడు. మిగిలిన ఇరువురు యేషె నాయింగ్ పో (Ye shes snaying po), కమలశీలుడు.

రచనలు

మార్చు

శాంతరక్షితుడు భారతదేశంలో వున్నప్పుడు ఎన్నో తాత్విక గ్రంథాలను రచించాడు. వీటికి చైనా, టిబెట్ అనువాదాలు మాత్రమే లభిస్తున్నాయి. వీటిలో “తత్వసంగ్రహం” నకు మాత్రమే సంస్కృత ప్రతి లభిస్తుంది.

తాత్విక గ్రంధాలు

మార్చు
  • సత్యద్వయ విభంగ పంజిక – తన గురువు జ్ఞానగర్భ యొక్క గ్రంథంపై రాసిన వ్యాఖ్య (టీకా)
  • మధ్యమకాలంకార (Adornment of the Middle Way) – నాగార్జునుని మాధ్యమిక సిద్ధాంతంపై రాసిన గ్రంథం
  • మధ్యమకాలంకారవృత్తి – ఇది మధ్యమకాలంకార గ్రంథానికి రాసిన టీకా
  • భోదిసత్వ సంపరవింశికావృత్తి – చంద్రగోమి యొక్క గ్రంథంపై రాసిన టీకా
  • వాదన్యాయవిపంచితార్థ – ధర్మకీర్తి యొక్క వాదన్యాయంపై రాసిన టీకా
  • తత్వసంగ్రహం (Compendium on Realty) – ప్రాచీన, సమకాలిక తత్వవేత్తల యొక్క భారతీయ దర్శనాలను విమర్శనాత్మకంగా విశ్లేషించిన మహత్తర గ్రంథం.

తాంత్రిక గ్రంధాలు

మార్చు

ఇవికాక శాంతరక్షితుడు తంత్ర పైన కూడా చాలా గ్రంథాలు రాసినట్లు తెలుస్తుంది. వాటిలో 'జ్ఞానసిద్ధీ ముఖ్యమైనది. ఇది మూల సంస్కృత ప్రతిలో లభిస్తుంది.

మధ్యమకాలంకార (Adornment of the Middle Way)

మార్చు

ఈ గ్రంథంలో శాంతరక్షితుడు మాధ్యమిక తత్వం, యోగాచార తత్వం, బౌద్ధ ప్రమాణాల గురించి విపులంగా సమీక్షించాడు. మాధ్యమిక తత్వంలోని పరమ సత్యాన్ని (ultimate truth), యోగాచార తత్వంలోని సాంప్రదాయిక సత్యం (conventional truth) ల రెండింటిని ‘ఒక్కటీ లేదు. అనేకం లేదు’ (neither one nor many) అనే వాదనతో సమన్వయపరుస్తూ తాత్వికంగా విశ్లేషించాడు. ఈ గ్రంథం ప్రకారం పారమార్ధిక సత్యం తెలుసుకోవడానికి నాగార్జునుడు, ఆర్యదేవులు ప్రవచించిన మాధ్యమిక దృక్పధం అనుసరించాలి. సాంప్రదాయిక సత్యం గురించి తెలుసుకోవడానికి అసంగ, వసుబందు వంటి యోగాచారులు ప్రవచించిన చిత్తం లేదా విజ్ఞానం మాత్రమే (consciousness-only) అనే విజ్ఞానవాద దృక్పధం అనుసరించాలి. ఈ గ్రంథంలో సరైన జ్ఞానానికి దారితీసే తార్కిక విధానం, బౌద్ధ ప్రమాణాల గురించేకాక బౌద్ధ తర్కవేత్తలైన దిజ్ఞాగుని, ధర్మకీర్తిల అబిప్రాయాలు కూడా పొందుపరచబడ్డాయి.

యోగాచార-మాధ్యమిక సంప్రదాయం

మార్చు

శాంతరక్షితుడు మాధ్యమిక శాఖా సిద్ధాంతంపై ‘మధ్యమకాలంకారవృత్తి’ వంటి ప్రౌఢ టీకాలు రాసినప్పటికీ అతను మౌలికంగా యోగాచారవాది. ఈ విషయం అతని ‘తత్వసంగ్రహం’ ద్వారా అవగతమవుతుంది. ఇతను బుద్ధుని బోధనలను భావవివేకుని ఆలోచనాస్రవంతి నుండి గ్రహించాడు. భావవివేకుడు ప్రవచించిన పారమార్ధిక సత్యానికి చెందిన స్వాభావికతను ఆధారంగా చేసుకొన్నాడు. యోగాచార (విజ్ఞానవాద) శాఖకు చెందిన కొన్ని భావనలను మాధ్యమిక శాఖలో ప్రవేశపెట్టి యోగాచార-మాధ్యమిక సంప్రదాయాన్ని ఏర్పరిచాడు. అయితే శాంతరక్షితుడు తనకు తానుగా ఈ ‘యోగాచార-మాధ్యమిక’ సంప్రదాయాన్ని ఏర్పరచలేదు. ఇతని బోధనలను బట్టి టిబెటియన్ బౌద్ధంలో ఈ శాఖను చేర్చడం జరిగింది.

ఈ ‘యోగాచార-మాధ్యమిక’ సంప్రదాయ శాఖ ప్రకారం సంవృతి సత్యం, పారమార్ధిక సత్యంల గురించిన విశ్లేషణ చంద్రకీర్తి ఆలోచనలకు భిన్నంగా, భావవివేకుని ఆలోచనలకు దగ్గరగా వుంటుంది. అంటే ఇతని సంప్రదాయం, మాధ్యమిక శాఖలోని ప్రాసంగిక సంప్రదాయం కన్నా స్వతంత్రిక సంప్రదాయానికి దగ్గరగా వుంటుంది. ఈ విధంగా శాంతరక్షితుడు అసంగుని యోగాచార శాఖను, నాగార్జునుని మాధ్యమిక శాఖను సమన్వయం చేస్తూ, బౌద్ధంలో ‘యోగాచార-మాధ్యమిక’ సంప్రదాయాన్నిలేదా ‘యోగాచార- స్వతంత్రిక మాధ్యమిక’ సంప్రదాయాన్ని సుస్థిరం చేసాడు.

టిబెట్‌లో ధర్మప్రచారం

మార్చు

'లాసా'ను రాజధానిగా చేసుకొని పాలించిన టిబెటిన్ చక్రవర్తి స్రోంగ్‌చన్-సోమ్-పో (Songtsen sGampo సా.శ. 618-649) కాలంలో బౌద్ధధర్మం టిబెట్‌ లోకి ప్రవేశించింది. అయినప్పటికీ టిబెట్‌లో స్థిరంగా పాతుకోలేక పోయింది. సరైన బిక్షువులు గాని, బౌద్ధవిహారాలు గాని టిబెట్‌లో నెలకొనలేని పరిస్థితి కొనసాగింది. ఇటువంటి పరిస్థితులలో టిబెట్‌లో బౌద్ధధర్మాన్ని సుస్థిరంగా స్థాపించినవాడు ఆచార్య శాంతరక్షితుడు.

లాసా-మొదటి పర్యటన

మార్చు

సా.శ. 755 లో త్రిసోంగ్ దేచన్ లేదా ఖ్రి-స్రోంగ్-ల్దేవ్చన్ (Trisong Detsen సా.శ. 755-797) టిబెటిన్ చక్రవర్తి అయిన పిదప తన దేశంలో గల చైనీయ బౌద్ధ బిక్షువులతో సంతృప్తిపడక, భారతదేశం నుండి బౌద్ధ ధార్మిక గ్రంథాలను, ఆచార్యులను తనదేశానికి రప్పించుకోవాలని ఆశించాడు. అందుకోసం దూతలను లాసా నుండి భారతదేశానికి పంపాడు. అప్పటికే నేపాల్‌లో ధర్మప్రచారం చేస్తున్న శాంతరక్షితుడు టిబెట్ చక్రవర్తి ప్రార్థనను స్వీకరించి లాసాకు చేరుకొన్నాడు. చక్రవర్తి తనదేశంలో బౌద్ధధర్మాన్ని వ్యాపితం చేయమని, బిక్షు వ్యవస్థను స్థాపించమని శాంతరక్షితుని కోరాడు.

ఆచార్య శాంతరక్షితుడు తొలిదశలో టిబెట్ ప్రజలకు బౌద్ధధర్మంలోని ప్రాథమిక విషయాలైన దశకుశలాలు (Ten Virtues) గురించి, ప్రతీత్య సముత్పాద (The chain of casual reaction) గురించి బోధించాడు. క్రమేణా అష్టాదశ ధాతువుల (Eighteen Realms) గురించి, దుఃఖానికి కారణాలైన ద్వాదశ నిదానాలను (Twelve Nidanas) వివరించాడు. అయితే టిబెటిన్ ప్రజలకు మంత్ర తంత్రాల పట్ల సహజంగానే ఆకర్షణ ఎక్కువ. దానితో తాత్వికతతో కూడిన శాంతరక్షితుని ధర్మబోధనలు టిబెటిన్ ప్రజల మనస్సులను అంతగా ఆకట్టుకోలేక పోయాయి. దానితో శాంతరక్షితునికి బౌద్ధధర్మ వ్యాప్తిలో ఆశింఛినంత మార్పు రాలేదు సరికదా స్థానికంగా నిరసనలు కూడా తలెత్తాయి. శాంతరక్షితుని బౌద్ధ ఉపదేశాలతో తమ చక్రవర్తి అమితంగా ప్రభావితం కావడాన్ని జీర్ణించుకోలేని రాజాస్థానికులు దేశంలో సంభవించే సర్వ ఉపద్రవాలకు శాంతరక్షితుని బోధనలే కారణమంటూ ఆరోపించారు. శాంతరక్షితుని బోధనలతో టిబెట్ దేవతలు అసంతృప్తి చెంది ప్రకోపించడంతో రాజ్యానికి అనర్థం వాటిల్లిందని, దేశంలో విపత్తులు చెలరేగాయనే అపవాదులు లేవదీసారు. దానితో ఆచార్య శాంతరక్షితుడు లాసాను విడిచిపెట్టి తిరిగి నేపాల్‌కు వెళ్ళిపోయాడు.

లాసా-రెండవ పర్యటన

మార్చు

అయితే చక్రవర్తి అభ్యర్ధన మేరకు నాలుగు నెలల అనంతరం శాంతరక్షితుడు తిరిగి లాసాకు చేరుకొన్నాడు. మొదటిసారి బోధనలలో ఎదురైనా ప్రతికూలతలను అవగతం చేసుకొన్న శాంతరక్షితుడు రెండవసారి తన ధర్మబోధనలో టిబెటిన్ ప్రజల ఆకాంక్షల మేరకు మంత్ర తంత్రాలతో టిబెటిన్ దేవతలను ప్రసన్నం చేయగల సమర్ధుడూ, సమకాలిక బౌద్ధ్ధ ఆచార్యుడూ అయిన ఆచార్య పద్మసంభవుని సహకారాన్ని పొందాడు. లాసాలో శాంతరక్షితుని బోధనల కారణంగా టిబెట్ దేవతల ప్రకోపం మొదలయ్యిందనే పుకార్లు మళ్ళీ చెలరేగడంతో, టిబెటిన్ చక్రవర్తి ఉత్తరభారతదేశం నుండి ఆచార్య పద్మసంభవుని లాసాకు పిలిపించడం జరిగింది. అతను కూడా టిబెట్ ప్రజల ఆసక్తికి తగ్గట్లుగానే మంత్రతంత్రాలతో పూజలు జరిపి, బౌధధర్మానికి అనుకూలంగా టిబెటిన్ దేవతలను శాంతింపచేసినట్లు తెలుస్తుంది.

బౌద్ధధర్మ వ్యాప్తిలో టిబెటిన్ ప్రజల నుండి మరింత సహకారం పొందడానికి శాంతరక్షితుడు ఏడుగురు స్థానిక టిబెట్ జాతీయులను బౌద్ధ బిక్షువులుగా స్వీకరించాడు. దీనికోసం భారతదేశం నుండి 20 మంది సర్వాప్తివాద బిక్షువులను లాసాకు ఆహ్వానించి, సాంప్రదాయబద్దంగా ఒక ఉత్సవం నిర్వహించి, ఏడుగురు స్థానిక భోట్ లేదా టిబెట్ జాతీయులకు సర్వాప్తివాద సంప్రదాయం ప్రకారం ప్రవజ్యను, సన్యాసి దీక్షను ఇప్పించాడు. తరువాతి కాలంలో వీరు ' ఏడుగురు జ్ఞానోదయ సన్యాసులు ' గా (Seven Enlightened Monks) ప్రసిద్ధిచెంది టిబెట్‌లో బిక్షుసమాజాన్ని వ్యవస్థీకృతం చేయడంలో కీలక పాత్ర వహించారు.

సమా-యే బౌద్ధవిహారం (Samye monastery)

మార్చు
 
సమా-యే బౌద్ధవిహారం

ఆచార్య శాంతరక్షితుడు సమా-యే ప్రాంతంలో బ్రహ్మపుత్రానది ఒడ్డున ఒక బౌద్ధవిహారం నిర్మించాలని సంకల్పించాడు. టిబెటిన్ చక్రవర్తి త్రిసోంగ్ దేచన్ పోషణలో, శాంతరక్షితుని పర్యవేక్షణలో ఈ విహార నిర్మాణం సా.శ. 775 లో ప్రారంభించబడి సా.శ. 779 ప్రాంతంలో పూర్తయ్యింది.[1] దీని కోసం కోసం శాంతరక్షితుడు స్వయంగా లాసా నుండి బయలుదేరి సమా-యే ప్రాంతం లోనే నివాసం ఏర్పరుచుకొని నిర్మాణాన్ని ఆద్యంతం పర్యవేక్షించాడు. దీని నిర్మాణం భారతదేశంలోని బిహార్ లోని ఉద్దంతపురి (Odantapura or Uddandapura) బౌద్ధ మహావిహారాన్ని పోలివుంటుంది.[2] ఇది టిబెట్ లోని మొట్టమొదటి బౌద్ధ విహారంగా ప్రసిద్ధికెక్కింది. ఈ విహారంలోనే స్థానిక టిబెట్ జాతీయులకు తొలిసారిగా బౌద్ధ బిక్షువులుగా దీక్ష ఇవ్వడం జరిగింది. శాంతరక్షితుడు తను చనిపోయేవరకూ ఈ విహారంలోనే 12 సంవత్సరాలకు పైగా నివసిస్తూ ధర్మప్రచారం చేసాడు.

టిబెట్‌లో బౌద్ధగ్రందాల అనువాదం

మార్చు

శాంతరక్షితుడు ధర్మప్రచారానికి స్థానికేతర భాషలో వున్న బౌద్ధ సూత్రాలను స్థానిక టిబెటిన్ భాషలో అనువాదం చేయవలసిన ఆవశ్యకతను గుర్తించి, దానికోసం సామ్-యాస్-ద్జోన్ (Bsam Yas Djon) అనే సూత్రానువాద సంస్థను ఏర్పాటుచేశాడు. ముఖ్యంగా 'వినయ' సంబంధిత గ్రంథాల అనువాద కార్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. శాంతరక్షితుని నాయకత్వంలో 'వినయ'కు సంబంధించిన మూల సర్వాస్తివాద-వినయ, వినయ-విభంగ, వినయ-I వ భాగం, మూల సర్వాస్తివాద-వినయలోని సంఘటనలు, చాతుర్వినయ (Four Vinayas), ప్రవ్రజన మూలసిద్దాంతాలు (Fundamentals of Pravrajana), 'వినయ సూత్ర' లోని వినయ మూల సూత్రాలు, ఉపవాస మూలసిద్దాంతాలు మొదలగునవి టిబెట్ భాషలోనికి అనువదించబడ్డాయి.

వినయ సంబంధిత గ్రంథాలపైనే కాకుండా బౌద్ధంలోని నిగూఢమైన, బాహాటమైన మత సంప్రదాయాలకు సంబంధించిన గ్రంథాల అనువాదంపై కూడా శాంతరక్షితుడు ప్రత్యేక శ్రద్ధను నిలిపాడు. అతని ఆధ్వర్యంలో జరిగిన అనువాదాలలో పది వేలకు పైగా కథలు, మైత్రేయ సూత్ర, సదా ప్రార్ధిత సూత్ర (Sada Prarudita Sutra), లంకావతార సూత్ర, కోశామూల సూత్ర (Treasure Source Sutra), అవతంశక సూత్ర (Flower Adornment Sutra), పరినిర్వాణ సూత్ర మొదలగునవి ముఖ్యమైనవి. ప్రాతిమోక్ష ప్రతిజ్ఞలను, బోధిసత్వ ప్రతిజ్ఞలను తన ‘మాధ్యమికాలంకార’ గ్రంథంలో వివరించడం ద్వారా మాధ్యమిక భావాలను టిబెట్ లోని సామాన్య బౌద్ధం లోనికి స్థిరపరిచాడు. ఈ విధంగా శాంతరక్షితుడు బౌద్ధ ధర్మ సూత్రాలకు అనువాద గ్రంథాలను సిద్ధపరచడం ద్వారా టిబెట్‌లో స్థానిక భాషలో బౌద్ధధర్మ వ్యాప్తికి సంస్థాగతపరంగా కృషి చేసాడు.

శాంతరక్షితుడు-పద్మసంభవుడు

మార్చు

శాంతరక్షితుని సమకాలికుడు పద్మసంభవుడు. ఇతను వజ్రయాన శాఖకు చెందిన ఆచార్యుడు. ఇరువురూ భారతదేశం నుండి వచ్చి టిబెట్‌లో బౌద్ధధర్మ ప్రచారం చేసినవారే. అయితే టిబెట్ ప్రజలు శాంతరక్షితుని తమదేశంలో బౌద్ధధర్మ ప్రతిష్ఠాపకుడిగా గుర్తించినప్పటికీ, టిబెట్‌లో ఆచార్య పద్మసంభవునకే ఆదరణ ఎక్కువగా ఉంది. దీనికి కారణం టిబెట్ ప్రజలలో మంత్రతంత్రాల పట్ల, భూత ప్రేతాల పట్ల, ఇంద్రజాల విద్యలపట్ల సహజంగానే అమితాసక్తి, అపార విశ్వాసాలు నెలకొని ఉన్నాయి. ఆచార్య శాంతరక్షితుడు స్వాభావికంగా తత్వవేత్త. టిబెట్ ప్రజల అభిమతానికి అనుగుణంగా ధర్మ ప్రచారం కోసం తన స్థాయిని కొంతమేరకు తగ్గించుకొని తంత్ర గ్రంథాలు రచించినప్పటికి, తత్వవేత్త అయిన శాంతరక్షితుడు టిబెట్ ప్రజల మనస్సులను అంతగా గెలుచుకోలేకపోయాడు. దయ్యాలను వదలగొట్టే మంత్రం శక్తుల (జాదూ-టోనా) ఆరాటాన్ని తీర్చలేకపోయాడు. ఇటువంటి కార్యాన్ని పద్మసంభవుడు సలక్షణంగా చేయగలిగాడు కాబట్టే టిబెట్ ప్రజలకు శాంతరక్షితుని కన్నా పద్మసంభవుడే ఆరాధ్యనీయయ్యాడు.

శాంతరక్షితుడు తన తదనంతరం టిబెట్‌లో ధర్మప్రచారంనకు సంబంధించి ఏమైనా వివాదాలు చెలరేగితే తన శిష్యుడు కమలశీలుని పిలవమని, అతను పరిస్థితులను సరిదిద్దగలడని టిబెట్ చక్రవర్తి త్రిసోంగ్ దేచన్‌తో తెలిపినట్లు ఒక ఇతిహ్యం. శాంతరక్షితుడు సా.శ. 788 లో 63 సంవత్సరాల వయస్సులో టిబెట్ లోని సమాయే విహారంలో మరణించాడు. శాంతరక్షితుని పవిత్ర అవశేషాలు సమా-యే విహారంలో నేటికీ నిలిచివున్నాయి. శాంతరక్షితుని మరణంతో మళ్ళీ టిబెట్ బిక్షువులు వివాదం లేవదీసారు. ఆచార్యుని అభిమతం మేరకు రాజు కమలశీలుని పిలవడం, అతను లాసాలో మంత్ర పూజలు జరిపి వివాదాన్ని సద్దుమణిగేటట్లు చేయడం జరిగింది.

వారసత్వం

మార్చు

ఆచార్య శాంతరక్షితునికి ఇద్దరు ప్రధాన శిష్యులు.

  1. కమలశీల: శాంతరక్షితుని ముఖ్యశిష్యుడు. భావనాక్రమ, మధ్యమాలంకార పంజిక అనే వ్యాఖ్యను రచించాడు. టిబెటియన్ బౌద్ధం చైనీయ ప్రభావం నుండి విడివడి, భారతీయ నమూనాను అనుసరించడంలో, భారతీయ బౌద్ధబిక్షు ప్రతినిధిగా ఇతను కీలకపాత్ర వహించాడు.
  2. హరిభద్ర: బౌద్ధ తత్వవేత్త. 'అభిసమయాలంకార' మీద రాయబడిన 21 భారతీయ వ్యాఖ్యానాలన్నింటిలోను ఇతను రాసిన వ్యాఖ్య అత్యంత ప్రభావవంతమైనదిగా గుర్తించబడింది.

శాంతరక్షిత-పరామర్శ

మార్చు

బౌద్ధ దార్శనిక త్రిమూర్తులలో ఆచార్య శాంతరక్షిత ఒకడు. (మిగిలిన ఇరువురు దిజ్ఞాగుడు, ధర్మకీర్తి) ఇతని అమోఘ పాండిత్యానికి, అలౌకిక ప్రతిభకు గీటురాయి వంటిది 'తత్వ సంగ్రహం'. ఆచార్య శాంతరక్షితుని ప్రభావం భారతదేశంలో కన్నా టిబెట్‌లో ఎక్కువగా ఉంది. అసంగుని యోగాచార శాఖను, నాగార్జునుని మాధ్యమిక శాఖను సమన్వయం చేసిన శాంతరక్షితుని సంప్రదాయాన్ని టిబెట్‌లో ‘యోగాచార-మాధ్యమిక’ సంప్రదాయం లేదా ‘యోగాచార- స్వతంత్రిక మాధ్యమిక’ సంప్రదాయంగా పేర్కొంటారు. సా.శ. 8 వ శతాబ్దంలో టిబెట్‌లో బౌద్ధం పునర్వికాసం చెందడంలో కీలక పాత్ర వహించిన ముగ్గురిలో ఆచార్య శాంతరక్షిత ఒకరు. మిగిలిన ఇరువురు టిబెట్ చక్రవర్తి త్రిసోంగ్ దేచన్, ఆచార్య పద్మసంభవుడు. చైనీయ మద్దతుతో టిబెట్‌లో ఎదుగూబొదుగూ లేకుండా పడివున్న బౌద్ధధర్మాన్ని ఆచార్య శాంతరక్షిత భారతీయ ప్రభావంతో బలంగా వ్రేళ్ళూనికోనేటట్లు చేయగలిగాడు. టిబెట్లో ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొన్నప్పటికీ క్రమేణా స్థానిక ప్రజల నాడిని గ్రహించి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ధర్మప్రచారం కొనసాగించాడు. టిబెట్‌లో బిక్షువుల కోసం తొలి బౌద్ధవిహారం నిర్మించాడు. టిబెటియన్లకు బౌద్ధం పరాయి ధర్మంగా పరిగణించే ఆస్కారం లేకుండా చేసే చర్యలు చేపట్టాడు. బౌద్ధంలోని మూల గ్రంథాలను స్థానిక టిబెటియన్ భాషలోనికి అనువదింపచేయడం, బిక్షువులుగా స్థానిక జాతీయులను స్వీకరించడం, బౌద్ధ బిక్షువులను వ్యవస్థాపరంగా సుసంఘటితం చేయడం వంటి చర్యలతో టిబెట్‌లో భారతీయ బౌద్ధాన్ని అంతర్భాగంగా చేసాడు. ఇతని తదనంతరం ఇతని ప్రియ శిష్యుడు కమలశీలుడు టిబెట్‌లోని భారతీయ బౌద్ధ బిక్షువులకు ప్రాతినిధ్యం వహించి టిబెట్‌లో బౌద్ధధర్మాన్ని చైనీయ నమూనా నుండి భారతీయ నమూనాకు మరలించడంలో సఫలీకృతుడయ్యాడు. టిబెట్ దేశంలో బౌద్ధధర్మాన్ని సుస్థిరంగా స్థాపించిన బౌద్ధ ధర్మప్రచారకునిగా ఆచార్య శాంతరక్షిత చరిత్రలో నిలిచిపోతాడు.

రిఫరెన్సులు

మార్చు
  • Dorje, Gyurme. (1999). Footprint Tibet Handbook with Bhutan. 2nd Edition. Footprint Handbooks Ltd. ISBN 0-8442-2190-2.

మూలాలు

మార్చు
  1. Dorje (1999) p. 172.
  2. Yeshe Tsogyal (2004). The Lotus-born: The Life Story of Padmasambhava. Rangjung Yeshe Publications. p. 290. ISBN 978-962-7341-55-0.