నేపాల్

ఆసియాలోని ఒక దేశం

హిమాలయాలలో ఉన్న నేపాలు రాజ్యం, 2006 నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక హిందూ రాజ్యం. ఇది దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉంది. ఇది ఒక భూపరివేష్టిత దేశం (లాండ్‌లాక్)

नेपाल
Nēpāl
నేపాల్
Flag of నేపాల్
నినాదం
जननी जन्मभूमिष्च स्वर्गादपि गरीयसी
(సంస్కృతం: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ)
జాతీయగీతం
official_languages = నేపాలీ
నేపాల్ యొక్క స్థానం
నేపాల్ యొక్క స్థానం
రాజధానికాఠ్మండు
27°42′N 85°19′E / 27.700°N 85.317°E / 27.700; 85.317
అతి పెద్ద నగరం ఖాట్మండు
ప్రభుత్వం ట్రాన్సిషనల్
 -  రాజు
ప్రధాన మంత్రి
Gyanendra
Girija Prasad Koirala
Unification
విస్తీర్ణం
 -  మొత్తం 147,181 కి.మీ² (94th)
56,827 చ.మై 
 -  జలాలు (%) 2.8
జనాభా
 -  July 2005 అంచనా 27,133,000 (42nd)
 -  2002 జన గణన 23,151,423 
 -  జన సాంద్రత 196 /కి.మీ² (39th)
508 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $42.17 billion (81st)
 -  తలసరి $1,675 (152nd)
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) 0.526 (medium) (136th)
కరెన్సీ రూపాయి (NPR)
కాలాంశం NPT (UTC+5:45)
 -  వేసవి (DST) not observed (UTC+5:45)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .np
కాలింగ్ కోడ్ +977

చరిత్ర

మార్చు

నేపాల్ కు వెయ్యి సంవత్సరాల పెద్ద చరిత్ర ఉంది. కిరాంత్ లేదా కిరాతి అనేది 7వ లేక 8వ శతాబ్దములలో తూర్పు నుండి వలస వచ్చిన, చరిత్రకారులకు తెలిసిన మొదటి తెగ. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వము 563లో నేపాల్‌లోనే జన్మించాడు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అశోకుడు కూడా ఉత్తర భారతదేశంతో బాటు ఇప్పటి నేపాల్ లోని దక్షిణ ప్రాంతాలను (హిమాలయ పర్వత ప్రాంతాలు అశోకుని సామ్రాజ్యంలో లేవు) పరిపాలించాడు. అశోకుడు రుమ్మినిదేవి అను ప్రాంతమున ఒక స్తంభమును నెలకొల్పినాడు, స్యయంభూనాధ్ అనుచోట కొండకు పడమటి భాగమున కొన్ని బౌద్ధ కట్టడములను కట్టించినట్లు చెప్పబడుచుండెను. అంతేకాక అశోకుడు తన కుమార్తె అయిన చారుమతిని దేవపటాణ్ అను ప్రాంతమున నివసించు సుక్ష్యత్రియుడు అగు ఒక బౌద్ధ ధర్మదీక్షాపరాయణుడికిచ్చి వివాహము చేసినట్లు కొందరు చరిత్రకారులు చెప్పుచున్నారు. అశోకుని అనంతరము మగధ సామ్రాజ్యము విచ్ఛిన్నమయిపోయింది. ఇతర దేశములతోపాటు నెపాళదేశము కూడా సామ్రాజ్యంతర్భాగమున నుండుటను విరమించుకొనెను. ఈ విశేషము జరిగిన పిమ్మట చాలాకాలము వరకు అంతగ నేపాళ దేశపు చరిత్ర ఎవ్వరికి తెలియకుండెడిది. కాని క్ర్రీస్తు వెనుక 340 సంవత్సర ప్రాంతమందు గుప్తవంశీయుడు, భారతసామ్రాజ్యాధిపతి అగు సముద్రగుప్తుడు నేపాళ దేశమును తాను జయించిన దేశముల పట్టీలో పేర్కొనెను. ఇదియే అలహాబద్ స్తంభ శాసనమందీ పట్టీకలదు. క్రీస్తు శకం 200 నాటికి బౌద్ధ సామ్రాజ్యాన్ని హిందువులు అంతమొందించి, లిచ్ఛవి వంశ పరిపాలనను ప్రారంభించారు.

నేపాళ దేశమున నాగవాసము (Now Called Lake Table Land) అనుపేరుగల గొప్ప సరోవరము నుండెనట, ఇది మిక్కిలి లోతుకలదై అసంఖ్యాకముగ నీటి పక్షులతో మనోహరముగ ఆవృతమై యొప్పుచుండెను. ఈ సరోవరమున కర్కోటకుడగు 'నాగరాజూ పరిపాలించుచుండెను. ఆ కాలములో నాగసరోవరములో ఒక్క తామరమొక్క అయినా మొలవకుండెడిదట. ఇట్లుండగా అంతకు చాలాకాలము క్రిందట విందుమతీ నగరమునుండి విపస్య బుద్ధుడు ఈ సరోవరమునకు వచ్చినప్పుడు అతడొక తామర మొక్క మంత్రించి ఈ సరోవరమున పారవైచి "ఈ తామర పుష్పించిననాడు స్వయంభువుడగు బుద్దభగవానుడు జ్యోతివలె భక్తులకు కనపడునని" చెప్పి వెడిలిపోయినాడట. ఈ కారణముచేతనే స్యయంభూనాథ్, బోద్‌నాథ్ దేవాలయములందు జ్యోతి ఎల్లప్పుడు వెలుగుచూనే ఉండును. అటుపిమ్మట శిఖిబుద్ధుడు నాగవాసమందు నిర్వాణము పొందెను. ఆ తరువాత విశ్వభూబుద్ధుడు, బోధిసత్వుడు నాగవాసములో తప్పస్సు నొనర్చారు. ఈ బోధిసత్వుడినే కొందరు "మంజుశ్రీ" అని పిలిచెదరు. ఈ మంజుశ్రీ అను నాతడు కొందరు చైనా దేశము వాడని, మరికొందరు ఆంధ్రుడని మరికొందరు చెప్పుచున్నారు.

900వ సంవత్సరంలో లిచ్ఛవి వంశాన్ని పారద్రోలి ఠాకూర్లు, వారిని పారద్రోలి మల్లులు పరిపాలనకు వచ్చారు. వాళ్ళే 18వ శతాబ్దం వరకూ పాలించారు. 1768 లో పృథ్వి నారాయణ్ షా అనే గూర్ఖా రాజు ఖాట్మండును ఆక్రమించుకున్నాడు. 1814లో నేపాలు ఇంగ్లీషు వారితో యుద్ధం చేసింది (ది ఆంగ్లో నేపాలీస్ వార్). 1816లో సుగౌలి సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఇంగ్లీషు వారికి సిక్కిం ను, దక్షిణ భాగాలను ఇచ్చివేయడంతో ఇంగ్లీషు వారు వెనుదిరిగారు. కానీ 1857లో భారతదేశంలోని సిపాయిల తిరుగుబాటును అణచివేయడంలో ఇంగ్లీషు వారికి సహాయపడినందుకు గాను ఇంగ్లీషువారు దక్షిణ ప్రాంతాలను తిరిగి ఇచ్చివేశారు.

షా వంశాన్ని 1846లో జంగ్ బహద్దూర్ రాణా అంతమొందించి దేశ పరిపాలనను తన చేతిలోకి తీసుకున్నాడు. దీనికోసం అతడు దాదాపు కొన్ని వందల మంది రాకుమారులను, తెగల నాయకులను అంతమొందించాడు (దాన్నే కోట్ ఊచకోత అంటారు). 1948వ సంవత్సరము వరకూ రాణాలు వారసత్వ ప్రధాన మంత్రులుగా నేపాలను పరిపాలించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే త్రిభువన్ అనే క్రొత్త రాజు నేపాలు పాలనకు రావడానికి భారతదేశం సహాయపడింది. నేపాలీ కాంగ్రెసు పార్టీ ఏర్పడడానికి కూడా సహాయపడింది. రాజు త్రిభువన్ కుమారుడైన రాజు మహేంద్ర ప్రజాస్వామ్య ప్రయోగాన్ని, పార్లమెంటును రద్దు చేసి, పార్టీలు లేని పంచాయితీ పద్ధతి ద్వారా నేపాలును పరిపాలించాడు. అతని కుమారుడు బీరేంద్ర సింహాసనాన్ని అధిరోహించాడు. అతను కూడా 1989 వరకూ పంచాయితీ పద్ధతినే అనుసరించాడు. కాని ప్రజల ఆందోళన తర్వాత బలవంతంగా రాజ్యాంగ మార్పులను ఆమోదించాడు. 1991 మే నెలలో దాదాపు యాభై సంవత్సరాల తరువాత నేపాలలో ఎన్నికలు జరిగాయి. నేపాలీ కాంగ్రెస్ పార్టీ, కమ్మూనిస్టు పార్టీలకు ఎక్కువ ఓట్లు దక్కాయి. ఏ పార్టీ కూడా రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పరిపాలించలేక పోయింది. అందుకు కారణంగా ప్రజోపయోగ కార్యక్రమాలలో మార్పు లేకపోవటం, అవినీతి రోగం లాగా మారటాన్ని చూపిస్తారు.

ఫిబ్రవరి 1996 లో మావోయిస్టు పార్టీ ప్రజాస్వామ్యాన్ని మార్చి, సామ్యవాదాన్ని స్థాపించడం కోసం విప్లవాత్మక ధోరణిని ఎంచుకొని ప్రజా యుద్ధాన్ని ప్రారంభించింది. అదే ఆ తర్వాత అంతర్యుద్ధంగా మారి 10 వేల మంది మరణానికి దారితీసింది.

నేపాలు ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2001, జూన్ 1 నాడు సింహాసన వారసుడు దీపేంద్ర తన ప్రేమను ఒప్పుకోలేదని రాజభవనంలో రాజు బీరేంద్రను, రాణి ఐశ్వర్యను, తమ్ముడిని, చెల్లెల్ని, ఇద్దరు బాబాయిలను, ముగ్గురు పినతల్లులనూ కాల్చి చంపేశాడు. తర్వాత తనూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు కోమాలో ఉన్నా, సాంప్రదాయం ప్రకారం అతడిని వైద్యశాల పడక పైనే రాజుగా ప్రకటించారు. అతడు మూడు రోజుల తరువాత మరణించాడు.

అతని మరణం తరువాత బీరేంద్ర తమ్ముడు అయిన జ్ఞానేంద్రను జూన్ 4న రాజుగా ప్రకటించారు. వెంటనే అతను రాజ్యంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. మావోయిస్టులతో యుద్ధానికి నేపాలు సైన్యాన్ని రంగంలోకి దించాడు.

 
దుర్బర్నువ్కోట్

విభాగాలు

మార్చు

నేపాలును మొత్తం 14 ప్రాంతీయ విభాగాలుగా విభజించారు. భాగమతి, భేరి, ధావలగిరి, గండకి, జానక్ పూర్, కర్నలి, కోషి, లుంబిని, మహాకాళి, మేచి, నారాయణి, రప్తి, సగర్మత, సేతి

భౌగోళికం, వాతావరణం

మార్చు
 
హిమాలయ పర్వత దృశ్యాలు

భారత్, చైనా మధ్యలో భౌగోళికముగా నేపాల్ బంధింపబడి ఉంది. మొత్తం 1,47,181 చ.కి.మీ. వైశాల్యములో విస్తరించి ఉంది. అందులో 56,827 చ.మై. భౌగోళిక వైవిధ్యమున్నప్పటికీ, పర్వతాలతో నిండి ఉంది. అడ్డంగా మూడు వైవిధ్య భౌగోళిక స్వరూపాలు ఈ దేశంలో ఉన్నాయి. దక్షిణాన లోతట్టు ప్రాంతము, మధ్యన చిన్న పర్వతాలతో ఉన్న ప్రాంతము, ఉత్తరాన హిమాలయాలతో (ఎవరెస్టు, ఇతర ఎత్తైన శిఖరాలతో) కూడిన అతి ఎత్తైన ప్రాంతము (8,850 మీ లేదా 29,035 అడుగులు). మొత్తము నేపాలలో 20% భూమి మాత్రమే వ్యవసాయ యోగ్యమైనది. అడవుల కొట్టివేత కూడా ఒక ముఖ్య సమస్య.

ఎవరెస్టు శిఖరం

మార్చు

ఈ శిఖరం ప్రపంచంలోనే ఎత్తైనది. దీనిని నేపాలీలో సాగరమాత అనీ, టిబెట్ భాషలో ఖోమోలోంగ్మ అనీ పిలుస్తారు. ఇది నేపాల్-ఛైనా సరిహద్దులో ఉంది. సమున్నతమైన ఎవరెస్టు శిఖరము, హిమాలయ పర్వత సానువులతో బాటు, ప్రపంచములో 8000 మీ. దాటిన పది ఎత్తైన శిఖరాలలో ఎనిమిది నేపాలు లోనే ఉన్నాయి. ఇవి పర్యటకులకు ముఖ్య ఆకర్షణ. వీటిని ప్రకృతి వింతలుగా చెప్తారు. నేపాలలో ఐదు వాతావరణ ప్రాంతాలు ఎత్తుల వారీగా ఉన్నాయి. దక్షిణాన సమశీతోష్ణ మండలం మొదలుకొని చల్లని వాతావరణము, ఉత్తరాన అతిశీతల ప్రదేశాల వరకూ ఉన్నాయి. వర్షపాతం వివిధ ఋతువులలో ఋతుపవనాల పై ఆధారపడి వివిధ రకాలుగా ఉంటుంది. ఆ వర్షపాతమే మొత్తము సంవత్సర వర్షపాతములో 60-80% మేర ఇస్తుంది. సంవత్సరానికి తూర్పున 2500 మి.మీ., పశ్చిమాన 1000 మి.మీ., 1420 మి.మీ. ఖాట్మండు చుట్టుప్రక్కలా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఇది 4000 మి.మీ. దాకా, కొన్ని సార్లు 6000 మి.మీ. దాకా కూడా ఉండవచ్చు. ఋతుపవనాలు మంచి ఊపు మీద ఉన్నప్పుడు వర్షపాత వివరాలు. (జులై-ఆగస్టు).

దదెల్ధురా: 350mm
నేపాల్ గన్జ్: 510mm
బుట్వల్: 715mm
పోఖర: 920mm
ముస్తాన్గ్: 60mm
కాఠ్మండు: 370mm
చైన్పుర్: 320mm
నమ్ఛే బజార్: 220mm

ఆర్థికవ్యవస్థ

మార్చు
 
కొండ ప్రాంతాల్లో వ్యవసాయం

ప్రభుత్వము, మావోయిస్టుల మధ్య నిరంతరము జరిగే గొడవలు, తగవులు, చిన్న అంతర్యుద్ధముల వల్ల నేపాలు ఆర్థికముగా పతనము చెందినది. ప్రపంచములోని అత్యంత పేద దేశాలలో నేపాలు ఒకటి, కానీ ఆర్థికంగా ఓ ప్రబల శక్తిగా మారుటకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న దేశము, కానీ సరైన నాయకత్వం లోపం చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. సేవలు, వ్యవసాయం దీని ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. సుమారుగా 80% జనాభా, 41% స్థూల జాతియాదాయం ఈ రెండు రంగాల నుండే వస్తుంది. పారిశ్రామికీకరణ కేవలం వ్యవసాయాధార పరిశ్రమలయిన నార (jute), చక్కెర, పొగాకు, ఆహార పంటలకు మాత్రమే పరిమితం అయినది. వస్త్ర ఉత్పత్తి, తివాచీల తయారీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది, గత మూడు సంవత్సరాలలో ఇవి రెండూ దేశ విదేశీ మారక ద్రవ్య సంపాదనలో 80% ఆక్రమించినాయి. పారిశ్రామికాభివృద్ది చాలా వరకూ ఖాట్మండు లోయ చుట్టుప్రక్కల, మరియూ భిరత్ నగర్, బిర్గంజ్ వంటి నగరాలలోనే జరిగింది. వ్యవసాయాభివృద్ది 5%, వార్షిక జనాభావృద్ది 2.3%గా ఉంది.

1991లో ప్రభుత్వము ఆర్థిక సరళీకరణల ద్వారా వ్యాపారాన్ని, విదేశీ సంస్థాగత మదుపుదారులను ప్రోత్సహించడంద్వారా, ఆర్థికాభివృద్ది చాలా త్వరగా సాధించుదామని మొదలుపెట్టినది. కానీ రాజకీయ అస్థిరత్వం వల్ల, ఎక్కువగా వృద్ధి సాధించలేక పోయింది. ముఖ్యముగా జల విద్యుత్తు, పర్యటక రంగములలో అభివృద్ధికి బాటలు పరచింది. కానీ చిన్న ఆర్థికవ్యవస్థ, రాజకీయ అస్థిరత్వం, సహజ దుర్ఘటనలు (?), సాంకేతికపరంగా వెనుకబడి ఉండటం వల్ల, చైనా, భారత దేశాల మధ్య భౌగోళికంగా చిక్కుకొని పోవడం వల్ల ఎక్కువగా పెట్టుబడులు రాలేదు. కానీ ఇప్పటికీ తన అభివృద్ధి బడ్జెటులో 80%, మొత్తం బడ్జటులో 28% విదేశీ పెట్టుబడులే ఆక్రమించినాయి.

జనగణన వివరాలు,సంస్కృతి

మార్చు

నేపాలు బహు భాషా, బహు మత, బహు జాతులు గల సమాజం. ఈ క్రింద ఇవ్వబడిన లెక్కలు 2002 నేపాలు జన గణన నుండి ఇవ్వబడింది. [1]

భాషలు

మార్చు

నేపాల్‌కి వైవిధ్య భరితమైన భాషా సంస్కృతి ఉంది. అది మూడు భాషా సముదాయాల నుండి ఏర్పడింది. 1.ఇండో-ఆర్యన్, 2.టిబెటో-బర్మన్, 3.దేశీయమైన. 2001 జాతీయ లెక్కల ప్రకారం నేపాలులో మొత్తం 92 వివిధ భాషలు మాట్లాడతారు (93వ దాన్ని ఉన్నాగుర్తించలేకపోయారు). మాతృభాషగా నేపాలీలు మాట్లాడేది జనాభా శాతం ప్రకారం నేపాలి (49%), మైథిలి (12%), భోజ్ పురి (8%), థారు (6%), తమంగ్ (5%), నేవారి లేదా నేపాల్ భాష (4%), మగర్ (3%), అవధి (2%), బంటవ (2%), లింబు (1%), బజ్జిక (1%). మిగతా 81 భాషలు మాతృభాషగా 1% కన్నా తక్కువ మంది మాట్లాడతారు.

అధికార భాష దేవనాగరి లిపిలో వ్రాయబడే నేపాలీ భాష. వివిధ భాషలు మాట్లాడే నేపాలీలందరికీ, ఈ భాష భాషా మాధ్యమంగా ఉపయోగపడుతున్నది. దక్షిణ తెరాయ్ లేదా 5-10 మైళ్ళ వెడల్పు ఉన్న నేపాలు భారత సరిహద్దు ప్రాంతంలో హిందీ కూడా మాట్లాడతారు.

మతములు

మార్చు
 
పతన్‌లో హిందూ ఆలయం

ఆధికారికంగా నేపాలు ప్రపంచంలో ఏకైక హిందూ దేశము. కానీ దీర్ఘ కాలంగా అక్కడి చట్టాలు బలవంతపు మత మార్పిడులను, అన్య మత విద్వేషాన్ని అడ్డుకుంటున్నాయి. 2001 లెక్కల ప్రకారం 80.6% మంది హిందువులు, 11% మంది బౌద్ధులు. కాని ఇరు మతాల వాళ్ళూ ఇరు మతాల సంప్రదాయాలనూ, ఆచారాలనూ, సమానంగా ఆచరిస్తారు. ఇంకా 4.2% మంది ముస్లింలు, 3.6% మంది కిరాంతులనబడే వాళ్ళూ, 0.5% మంది క్రైస్తవులూ ఉన్నారు. వీరి సంఖ్య 2005 కు 6 లక్షలకు పెరిగింది.

నేపాల్ లో ముఖ్యమైన పండగలు

మార్చు

1 ముఖ్య పండగలు

నేపాలీలకు కార్తీక మాసం కృష్ణ పక్షం రోజులు చాల పవిత్రమైనవి. ఈ సందర్భంగా తీహార్ పండుగలను జరుపుకుంటారు. ఇవి ఐదు రోజులు పాటు జరుపు కుంటారు. యమలోకాధి పతి ఐన యమధర్మ రాజును పూజించడంతో ఈ పండగలు ప్రారంభ మౌతాయి. ఈ పండగల కొక ఇతిహాసము ఉంది. దాని ప్రకారం:

పండగ దినాల్లో కూడా భూలోకంలో మానవులు మరణిస్తున్నారనీ, వారి ఆత్మలను తీసుకు రావడానికి తమకు బాదగా వున్నదనీ, దీనికి నివారణోపాయాన్ని చెప్పమని యమధూతలు.... యమ ధర్మ రాజుకు మొర పెట్టుకోగా. యమ ధర్మరాజు ఒక తరుణోపాయం ఆలోచించి వారికి చెప్తాడు. దాని ప్రకారం. ఎవరైతే కార్తీక కృష్ణ పక్షం త్రయోదశి, చతుర్థశి ఆ తర్వాతి రోజు తమ తమ ఇళ్ళను దీపాలతో అలంకరిస్తారో వారికి అకాల మరణ భయం, నరకలోక ప్రాప్తి వుండదనీ శలవిస్తాడు. ఆ విధంగా ఆ అయిదు రోజులు యమ పంచకం పండుగలుగా జరుపుకుంటారు. 1.1 కాగ్ తీహార్

యమ పంచకంలో మొదటి రోజైన ఈ రోజున కాగ్ తీహార్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున అపశకునపు పక్షి అయిన కాకిని పూజిస్తారు. మానవుల మరణానికి కాకులు దూతలు బావించి ఈ రోజున ఇంట్లోని వారందరూ భోజనం చేయకుండా వుపవాసముండి, ఇంటిని దీపాలతో అలంకరించి పూజానంతరం కాకులకు అన్నం పెడతారు. 1.2 కుకుర్ తీహార్

రెండో రోజున కుకుర్ తీహార్ అనగా కుక్కల పండుగ . ముఖ్యంగా మరణానికి పుత్రులుగా నల్లని కుక్కలను chestnut రంగు కుక్కలను భావించి వాటిని పూజిస్తారు. వాటి ముఖానికి బొట్టు పెట్టి, మెడలో పూల దండలు వేసి, వాటికి మంచి ఆహారం పెట్టి పూజిస్తారు. అన్ని జంతువుల కన్న కుక్క మానవునికి అత్యంత విశ్వాస పాత్రమై నందున, మానవునికి తోడుగా వుండి, అతనికి ఇంటిని కాపలా కాస్తున్నందున ఈ విధంగా వాటికి రుణం తీర్చుకోవడంగా కూడా నేపాలీ ప్రజలు భావిస్తారు. ( సాధారణంగా భారతదేశంలో ఆలయాల లోనికి కుక్కలు ప్రవేశిస్తే అపవిత్రంగా భావిస్తారు. ఆ అపవిత్రతను తొలిగించ డానికి కొన్ని శుద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారు. కానీ నేపాల్ దేశంలో ఖాట్మండులోని పరమ పవిత్ర పశుపతి నాద్ దేవాలయంలో కొందరు పూజారులు కొన్ని కుక్కలకు నొసటన పసుపు పూసి కుంకుం బొట్లు పెట్టి వాటి మెడలో పూల మాల వేసి ఒక స్తంభానికి కట్టి ఆ ప్రక్కనే ఒక పూజారి కూర్చొని వుండగా నేను గమనించాను. కుక్కలు ఆలయంలో ఈ విధంగా వుండడము చూచి ఇదేదో పవిత్రమైన కార్యమై వుంటుందని భావించి కొంత లోతుగా పరిశీలించగా..... ఆలయానికొచ్చిన భక్తులు కుక్క వద్ద వున్న పూజారికి కుక్కలకు పూజా కార్యక్రమం చేయించి వారినుండి కొంత సంభావన స్వీకరించారు. ఇది నేను స్వయంగా చూసిన విషయం. బహుశా పూజించ డానికి కుక్కలు దొరక నందున ఆలయంలో ఈవిదంగా కుక్కలను పూజించే అవకాశం కల్పించబడినదని భావించ వచ్చు. ) 1.3 గోవుల పండగ

మూడోరోజున పశువుల పండగ జరుపు కుంటారు. (ఆంధ్ర ప్రదేశ్ లో పశువుల పండుగ లాంటిది కాదు) గోవును లక్ష్మీ ప్రతిరూపంగా భావించి పూజించడము హిందువులకు ప్రపంచ వ్వాప్తంగా వున్న ఆచారమే. హిందువు లందరూ గోమాత అవయవాలల్లో అన్ని రకాల దేవతలు కొలువై వున్నారని నమ్ముతారు. గోమాత పూజను నేపాలీలు కార్తీక పౌర్ణమి నాడు చేస్తారు. చీకటిని ప్రాలద్రోలి లక్ష్మీ దేవికి స్వాగతం పలకడానికి ప్రజలందరూ తమ ఇండ్లను దీపాలతో అలంకరిస్తారు. క్షీర సాగర మదనంలో లక్ష్మీ దేవి ఈరోజునే పుట్టిందని వీరి నమ్మిక. స్త్రీలందరినీ లక్ష్మీ దేవి అవతారులుగా ఈ రోజున భావిస్తారు. స్త్రీలు ఈ రోజున స్నానానంతరం కొత్త బట్టలు ధరించి లక్ష్మీ పూజలు చేసి bhailo పాటలు పాడుతూ ఇంటింటికి వెళతారు. ఆ ఇంటి ఇల్లాలు ...... పాటలు పాడుతూ తమ ఇంటి ముంగిటకు వచ్చిన స్త్రీలను లక్ష్మీ అవతారంగా భావించి వారిని దీపాలతో ఆహ్వానిస్తారు. ఇంట్లో కూర్చో బెట్టి ఒక పళ్ళెంలో వివిధ రకాల రొట్టెలు, పలు రకాల పండ్లు అలంకరించి అందులో కొంత డబ్బులు పెట్టి వారికి సమర్పిస్తారు. ప్రతిగా....., ఆ వచ్చిన స్త్రీలు ఆ యింటి వారిని లక్ష్మీ కటాక్షం కలిగి ధన ధాన్యాలతో తులతూగాలని దీవిస్తారు. ఈ పండుగ నేపాల్ దేశంలో ప్రతి పల్లెలోను ఇప్పటికీ జరుగు తున్నది. పట్టణాలలో అంతగా లేదు.

నేపాల్ లోని పశ్చిమ ప్రాంతాలైన దోటి, హుమ్లా ప్రాంతాల్లో భైలే పాటలు ఐదు రోజులు పాటు పాడుతారు. అంతే గాక పుష్య మాసంలో (జనవరి-పిబ్రవరి) 20 రోజులు జరుపుతారు. దీనిని మఖ్య భైలే అని అంటారు. 1.4 ఎద్దుల పండుగ

నాల్గవ రోజున కూడా ప్రజలు తమ ఇండ్లను దీపాలతో అలంక రిస్తారు. కాని పూజా విధానంలో ప్రజలు వారి వారి సంస్కృతిని బట్టి కొన్ని మార్పులతో జరుపు కుంటారు. సాధారణంగా ఈ రోజు అందరూ తలంటుకుని స్నానంచేసి ఎద్దులకు కూడా స్నానంచేయించి, అలంకరించి పూజిస్తారు. ఆవులను పాలు పితకరు, ఎద్దులను పనిలో పెట్టరు. శ్రీ కృష్ణున్ని పూజించేవారు ఈ రోజు గోవర్థన పూజ చేస్తారు. శ్రీ కృష్ణుడు గోవర్థన పర్వతాన్ని ఎత్తి అనేక పశువులను, ప్రజలను రక్షించినది ఈ రోజు ఇదేనని పూజ చేస్తారు. కొందరు కొత్త తరం వారు ప్రతి మానవుని లోను దేవుడున్నాడని నమ్మి ఆత్మ పూజ చేస్తారు.

గోవర్థన పూజ జరిగిన రాత్రి పురుషులు భైలిలో స్త్రీలు పాటలు పాడినట్లు పాటలు పాడుతారు. (men play their carol called devsi) దీన్ని దెవ్సీ అంటారు. ఇందులో స్త్రీలకు ప్రవేశం లేదు. పట్టణ ప్రాంతాల్లో పురుషులు ఈ మార్గాన్ని ధన సంపాదనకు మార్గంగా ఎంచు కుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఈ బృందం తాము అడిగినంత విరాళం ఇవ్వనందుకు ఇంటి వారితో వాగ్వివాదానికి దిగి అసభ్యంగా ప్రవర్తించడం కూడా జరుగు చున్నది. హోటళ్ళు వంటి కొన్ని వ్వాపార సంస్థలు ఈ దెవ్సీ బృందానికి తాము ఇంతే మొత్తమిస్తామని బయట బోర్డులు కూడా పెడ్తారు. పరదేశీ విహార యాత్రా వాహనాలను అటవీ ప్రాంతాలలో మధ్యలో ఆపి తాము అడిగి నంత ధనము ఇచ్చు నంత వరుకు వదలరు. ఆనందానికి ఆలవాలమైన ఈ పురాతన సాంప్రదాయం కొందరి స్వార్థపరులకు ధన సంపాదన మార్గంగా మారడంతో ప్రజాభిమానాన్ని కోల్పోతున్నది. 1.5 బాయిటికా

ఐదవ రోజు భాయ్ టికా పండుగను జరుపు కుంటారు. యమ పంచకంలో ఇది చివరి రోజు. ఈ రోజున యమ ధర్మ రాజు తన చెల్లె లైన యమునా' ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడని వీరి నమ్మిక. స్కాంద పురాణం లోని కార్తీక మహత్యం ప్రకారం పురుషులు ఈ రోజున తమ ఇంట్లో గాక తమ చెల్లెలి ఇంట్లో భోజనం చేయాలి. చెల్లెలు లేని పురుషులు ఈ రోజు కొరకు ఎవరైనైనా దత్తత తీసుకుని వారింట భోజనం చేయాలి. ఆ అవకాశం కూడా లేనివారు ఒక చెట్టు నైనా తమ చెల్లెలుగా భావించి ఆ చెట్టు క్రింద భోజనం చేయాలి.

ఆ సోదరి తన అన్నకు ఆయురారోగ్యాల నందించాలని కోరి అన్నగారి నుదుట రంగు రంగుల తిలకం దిద్ది తగు బహుమతులిస్తుంది. అదే విధంగా అన్నకూడ తన చెల్లెలికి నుదుట తిలకం దిద్ది ఆమెకు బహుమతులిస్తాడు.

ఈవిధంగా .... హిందువులు అధికంగా ఉన్న నేపాల్ దేశంలో హిందూ సాంప్రదాయ పండగలు అనేకం జరుపుకుంటారు. ఇక్కడ జరుపుకునే పండగలలో కొన్ని ప్రత్యేకమైన పండగలు కూడా గమనించ వచ్చు.(* మూల: యమ పంచక పండగల విశేషాలు... కొన్ని స్వయంగా చూసినవి. వివరాలు మాత్రం నేపాల్ లోని ఆంగ్ల దినపత్రికలైన The himalayan, and The khatmandu post)

నేపాల్ పర్యటన

మార్చు

ప్రపంచంలో అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించే దేశాలలో నేపాల్ ఒకటి. దీనికి కారణాలు అనేకం. అక్కడి ప్రకృతి రమణీయత కావచ్చు., హిందూ మతస్తులకు, బౌద్ధ మతస్తులకు సంబంధించిన అత్యున్నతమైన కేంద్రాలు కావచ్చు., ట్రెక్కింగు, రాప్టింగు వంటి సాహస క్రీడలకి ముఖ్య కేంద్రం కావచ్చు, ముఖ్యంగా అక్కడి ప్రజల స్నేహ పూరిత స్వభావం కావచ్చు. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టున్న హిమాలయాలు, పాతాళ లోకంలో వున్నాయా అన్నట్టున లోయలు, నదులు, సెలయేళ్లు, జలపాతాలు, హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలు, భౌద్దులకు అతి పవిత్రమైన ప్రార్థనా మందిరాలు ఇలా కారణాలేవైనా నేపాల్ దేశం పర్యాటకులకు నయనాందకరం చేసే దేశం. నేపాల్ దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరు కూడా పర్యటకమే.

ప్రపంచంలో చివరి హిందూ సామ్రాజ్యం

మార్చు

మొన్నటి దాక రాజుల పరిపాలనలో ఉన్న నేపాల్ దేశం ప్రపంచంలో ఉన్న ఏకైక హిందు రాజ్యం. భారత దేశానికి ఉత్తరాన ఆనుకునే ఉన్న ఈ దేశంలోనికి అడుగు పెట్టాలంటే భారతీయులకు ఎటువంటి పాస్ పోర్టు / వీసా / ఎలాంటి అనుమతి పత్రాలు అవసరం లేదు. వాహనాలకు మాత్రం కొంత రుసుము తీసుకొని అనుమతిస్తారు. అదే విధంగా భారతీయులు నేపాల్ లో స్థిరాస్తులు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. అందుకనే నేపాల్ లో ఉన్న పెద్ద పెద్ద హోటళ్ళు వ్యాపారం భారతీయుల చేతిలోనే ఉంది. ఇదంతా నేపాల్ --- భారత దేశాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జరుగు తున్నది. ఈ దేశంలో ఉన్న మొత్తం జనాభాలో ఎనభై శాతం హిందువులు. తక్కిన ఇరవై శాతంలో భౌద్దులు, ముస్లింలు, క్రిష్టియన్లు ఉన్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయాలు ఇక్కడున్నాయి. అలాగే భౌద్దులకు అత్యంత పవిత్రమైన ప్రార్థనా స్థలాలు ఇక్కడున్నాయి. హిందువులు, భౌద్దులు కలిసే ఉంటారు.

ద్రవ్యం (కరెన్సి)

మార్చు

నేపాల్ లోని ద్రవ్యమును కూడా రూపాయి అంటారు. భారత్ రూపాయిని ఐ.ఆర్ అని నేపాల్ రూపాయిని ఎన్.ఆర్. అని అంటారు. ద్రవ్య మారకానికి చాల చోట్ల అవకాశం ఉంది. కాని నేపాల్ లోని ప్రతి దుకాణంలోను, ఇతర ప్రదేశాలలోను భారత్ రూపాయిని తీసుకుంటారు. భారత్ రూపాయలు వందకు నేపాల్ రూపాయలు నూట అరవై ఇస్తారు. చిన్న నాణేలు అనగా పైసలు కూడా అక్కడ చలామణి లోవున్నాయి. భారత రూపాయి మారకానికి అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

ప్రవేశ ద్వారాలు

మార్చు

భారత్ భూభాగంతో కలిసి ఉన్న నేపాల్ లోనికి ప్రవేశించడానికి చాలా భూమార్గాలున్నాయి. అన్నింటిలోకి ఘోరక్పూర్ వద్ద ఉన్న మార్గమే ప్రధాన మైనది. ఈ బార్డర్ లో ఇరువైపుల కలిసి ఉన్న గ్రామం పేరు సునౌలి ఇక్కడ అసాధరాణమైన భద్రతా ఏర్పాట్లేమి వుండవు. అక్కడి స్థానిక ప్రజలు మామూలుగానే అటు ఇటు తిరుగు తుంటారు. భారతీయులు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నేపాల్ భూభాగంలోకి ప్రవేశించవచ్చు. కాని వాహనాలకు కొంత రుసుం కడితే లోనికి అనుమతిస్తారు. అలా నేపాల్ లోనికి ప్రవేశించిన వాహనాలు ఆ దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు. సరిహద్దు వద్ద నేపాల్ భూభాగం లోనికి ప్రవేశించిన పర్యాటకులకు సేద దీరడానికి, కాల కృత్యాలు తీర్చుకోడానికి అనేక ఏర్పాట్లుంటాయి. నేపాల్ భూబాగంలోనికి ప్రవేశించగానే ప్రత్యేకంగా కనిపించే విషయమేమంటే ఇంకా తెల్లవారకముందే అక్కడున్న చిన్న చిన్న అన్నశాలలు, సత్రాలు, బడ్డి కొట్టులు అన్ని తెరిచే వుంటాయి. ఆ దుకాణాల ముందు ఒక మేజా బల్ల వేసి దానిపై మద్యం సీసాలు పెట్టి వుంటారు. మందు బాబులు కూడా అప్పటికప్పుడు తమ పని కానిచ్చుకొని వెళు తుంటారు. మద్యంపై ఇక్కడ ఎటువంటి నియంత్రణ లేదు.

గ్రామాలు పంట పొలాలు

మార్చు

సరిహద్దు నుండి కొంత దూరమే మైదాన ప్రాంతం. అక్కడక్కడ పల్లెలు పంట పొలాలు వుంటాయి. ఇక్కడ వరి ప్రధాన పంట. ఆ వరి చాల ముతక రకం. వ్యవసాయం సాంప్రదాయ పద్ధతిలోనే జరుగుతున్నది. కొండ వాలున కొన్ని అడుగుల వెడల్పున చదును చేసి అక్కడే వరి పండిస్తుంటారు. ఆ పొలాలు చూడ్డానికి చాల అందంగా కనబడుతుంటాయి. కొండలకు అందమైన మెట్లు చెక్కారా అని అనిపిస్తుంది. అటు వంటి కొండల పాద భాగన మంచి పారుతున్నా అది కొన్ని వందల అడుగుల లోతులో వున్నందున ఆ నీటిని పొలాలకు పారించ లేరు. కొండల పైనుండి జారు వారే నీటి ధారలే ఈ పంటలకు జల వనరులు. ఇటు వంటి నీటి ధారలు చిన్నచిన్నవి చాల ఎక్కువ. కొన్ని పెద్ద పెద్ద జలధారలు వుంటాయి అవి జలపాతాల్లాగా కనబడుతుంటాయి. ఈ కొండలలో ప్రజలు అన్ని రకాల కూరగాయలు, పండ్లు కూడా పండిస్తుంటారు. పల్లెలు చాల పలుచగా వుంటాయి. ఇళ్లు దూర దూరంగా వుంటాయి. కొన్ని చోట్ల పొలాల మధ్యలోనే ఇళ్లుంటాయి. ప్రతి ఇంటి ముందు బంతి పూల చెట్లుంటాయి. రోడ్లు విశాలంగా వున్నా అక్కడ తిరిగే వాహనాలు చాల పాతవి. జీపుల్లాంటి డొక్కు వాహనాలు, రిక్షాలు మొదలగునవి ప్రయాణ సాధనాలు.

ఘాట్ రోడ్డు

మార్చు

నేపాల్ దేశం కొండలమయమైనందున అక్కడ రోడ్డులన్ని ఘాట్ రోడ్డులే. కొండ వాలులో రోడ్డుకు సరిపడినంత మేర చదును చేసి కొండ వాలు వెంబడి వంకర టింకరగా మెలికలు తిరుగుతూ రోడ్లుంటాయి. బస్సులో వెళుతుంటే ఒకవైపు ఆకాశం అంతెత్తున్న కొండలు, మరొక వైపున పాతాళం కనిపిస్తున్నదా అన్నంత లోతున ప్రవహిస్తున్న నది ఇలా వందలాది మైళ్ల పర్యంతం కనబడుతూనే వుంటుంది. లోయలో ప్రవహిస్తున్న నదిలో అతి శుభ్రమైన నీరుంటుంది. ఆ నది కూడా అనేక మలుపులు తిరుగుతూ ఎగుడు దిగుడుగా నురగలు కక్కుతూ ప్రవహిస్తుంటుంది. ఆ నదిలో రాళ్లన్ని అతి నును దేలి కాలు పెడితే జారిపోయేటట్లుంటాయి. వాటినే సాలగ్రాం లంటారు. నదులు చిన్నవైనా అవి అతి వేగంగా ప్రవహిస్తుంటాయి. ఆ నదులలో సాహసికులు ప్రత్యేక బట్టలు వేసుకుని తలకు టోపి పెట్టుకొని రబ్బరు బోట్లలో పోటి పడుతుంటారు. కొండ వాలులో బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఇదొక ఆనంద కరమైన దృశ్యం. రోడ్డు ప్రయాణికులకు టీ, కాఫీ, అల్పాహారం అందించడానికి అక్కడక్కడా చిన్న చిన్న జనవాసాలుంటాయి. అక్కడే సాహసిక క్రీడలైన రాప్టింగ్ (నదిలో రబ్బరు బోట్ల పోటీ) ట్రెక్కింగ్ ( తాళ్ల సాయంతో కొండలనెక్కే సాహస క్రీడ) లకు కావలసిన సామాగ్రిని అద్దెకిచ్చే దుకాణాలుంటాయి. ఇటు వంటి నివాస ప్రాంతాలలో కూడా నీటి వసతికి నది అత్యంత లోతులో నున్నందున దానిపై ఆధార పడకుండా కొండలపై నుండి జాలువారే జలధారలకు పైపు తగిలించి వారి అవసరాలకు వాడుకుంటారు. ఈ రోడ్డు పై ప్రయాణించే ప్రయాణికులకు మరొక ఆశ్చర్యపరిచే వినోదం మరొకటి కనువిందు చేస్తుంది. అవతిలి కొండ వాలులో పంటలు పండించే రైతులు ఇవతల నుండి నదిని దాటి అటు పక్కకు వెళ్లాలంటే. కొన్ని వందల అడుగుల లోతుకు దిగి అతి వేగంగా ప్రవహించే నదిని దాటి తిరిగి ఆ కొండ నెక్కి తమ పొలాలకు వెళ్ళాలి. ఆ నది చిన్నదే అయినా అతి వేగంగా ప్రవహిస్తుంటుంది. అందులోని రాళ్లు అతి నునుపుగా కాలు జారేటట్టుంటాయి. ఇటు వంటి ప్రమాదాన్నుండి తప్పించుకోడానికి వారు ఒక ఉపాయం కనిపెట్టారు. ఇవతల కొంత దిగువన ఒక బలమైన స్థంభాన్ని పాతి దానికి సమాంతరంగ నదికి అవతిలి వైపున కూడా ఇలాంటి స్థంభాన్ని పాతి ఈ రెండు స్థంభాలను ఒక బలమైన ఇనుప మోకుతో అనుసందానిస్తారు. పైన చక్రాలు కట్టిన ఊయాల లాంటి ఒక పెద్దబుట్టను ఆ ఇనుప మోకుకు తగిలించి ఆ బుట్టలో కూర్చొని తమ చేతులతో ఆ ఇనుప మోకును తమవైపుకు లాగుతూ వుంటే తాము కూర్చున్న ఆ బుట్ట ముందుకు సాగి అవతలి గట్టుకు చేరుకుంటారు. ఇది ఎంతో సాహసంతో కూడిన ప్రమాదకరమైన పనిగా అనిపిస్తుంది. ఇటువంటి సాహసాలు దారి పొడుగునా కనబడుతూనే వుంటాయి. ఒక్కోచోట కేవలం ఒక మనిషే కోతిలాగ ఆ ఇనుప తాడును పట్టుకొని అవతలికి వెళ్లే సందర్భాలు కూడా చూడొచ్చు. ఇలా ఎన్నో ప్రమాద భరితమైన సాహాసాలు చూస్తు ప్రయాణిస్తున్న బస్సు ప్రయాణికులలు కూడా అత్యంత ప్రమాదం పొంచి వుంటుంది. అదేమంటే వర్షాకాలంలో కొండ చెరియలు విరిగితే అవి కచ్చితంగా ఆ రోడ్డు పైనే పడతాయి. వాహనాలపై పడితే ఇక చేయగలిగింది ఏమీలేదు. ఖాళీ రోడ్డుపై పడినా వాటిని తొలిగించేంత వరకు వారి ప్రయాణం వాయిదా పడాల్సిందే.

పోక్రా లో దేవి జలపాతం

మార్చు

నేపాల్ లోని ముఖ్యమైన పట్టణాలలో పోక్రా ఒకటి. ఇది అతి చిన్న పట్టణం. కొండ కోనల్లో కట్టిన ఇళ్లతో అందంగా కనబడుతుంది. ఈ పట్టణానికి ప్రాముఖ్యతను ఆపాదించడానికి మరొక కారణమున్నది. అది పట్టణానికి అల్లంత దూరంలో మంచుతో కప్పబడిని హిమాలయా పర్వతాలు. వెండి కొండలవలే ప్రకాశిస్తున్న ఆ హిమాలయాలను దగ్గర నుండి చూడడానికి విమాన ప్రయాణాన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ చిన్న విమానాలలో హిమాలయాలకు కొంత దగ్గరికి వెళ్లి తిరిగి వస్తాయి. ఈ పట్టణాన్ని స్విజ్డర్లాండుతో పోలుస్తారు. దీనికి ఆసియాలోని స్విజ్డర్ల్యాండు అని అంటారు. హిమాలయాల అందాలను చూడడానికి మంచి సమయం సూర్యోదయానికి కొంత ముందు దాని తర్వాత కొంత సమయం. ఆ సమయానికి పర్యాటకులు తాము బస చేసిన భవనాల పైకెక్కి హిమాలయాల అందాలను తిలకిస్తుంటారు. సూర్యోదయానికి ఇంకా కొన్ని నిముషాలుందనగా ఆకాశం ఎర్ర బడుతుంది. ఆ కాంతిలో ఆ మంచు కొండలు బంగారు కాంతితో మెరిసి పోతుంటాయి. ఆ బంగారు కాంతి పొద్దెక్కే కొద్ది రంగు మారి వెండి కొండ వలే వెలుగు లీనుతుంది. ఆదృశ్యం అత్యంత నయానంద కరం. ఈ పట్టణంలో మరొక వింత దేవి జలపాతం. సాధారణంగా జలపాతాలను క్రింద నుండి పైకి చూసారు. కాని ఈ జలపాతాన్ని పైనుండి క్రిందికి చూడాలి. అంటే కొండ పైకెక్కి చూడాలని కాదు. భూమి పైనుండే విశాలమైన బావిలోనికి చూడాలి. ఆ బావి చుట్టూ ప్రమాద నివారణ కొరకు ఇనుప పట్టీలతో కంచె ఏర్పాటు చేశారు. దాని అంచున నిలబడి బావి లోనికి చూడాలి. లోపల బావి దరి లోనుండి అతి పెద్ద జల ప్రవాహం వచ్చి చాల లోతున్న బావిలోనికి పడుతుంది. ఆ ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. పర్యాటకులు నిలబడిన భూమి క్రింద సుమారు ఇరవై అడుగుల లోతోలోనుండి వచ్చి బావిలోనికి పడుతుంది. ఈ జలంతో ఆ బావి నిండి పోదు. ఆ వచ్చిన నీరు ఎలా వచ్చాయో అదే విధంగా భూమి లోపలికి వెళ్లి పోతాయి. అవి ఎక్కడ బయట పడతాయో. ఈ వింత జలపాతం పోక్రా పట్టణం మధ్యలోనే ఉంది. పోక్రాకు దిగువన కొంత మైదాన ప్రాంతమున్నది. అక్కడ వరి పంట పొలాలు ఎక్కువగా ఉన్నాయి. అల్లంత దూరంలో వున్న మంచు కొండల నుండి మంచు కరిగి వచ్చే నీరే వీరి పంటలకు సాగునీరు. ఆ నీరు అనేక చిన్న చిన్న కాలువగుండా స్వచ్ఛంగా ప్రవహిస్తుంటుంది.

కాఠ్మండు

మార్చు

కాఠ్మండు నగరం కొండల మధ్యన మైదాన ప్రాంతంలో ఉంది. ఇది ఈ దేశంలో అతి పెద్ద పట్టణం, దేశ రాజధాని కూడ. ఇక్కడ ఇది పెద్ద పట్టణమైనా భారతదేశంలో పట్టణాలతో పోలిస్తే ఇది చిన్నదే. బహుళ అంతస్తుల భవనాలు, భారీ కట్టడాలు చాల తక్కువ. ఈ దేశంలోని వాహనాలు చాల పాతవి డొక్కువి కూడాను. పాత జీపుల్లాంటి వాహనాలే ఇక్కడి ప్రయాణ సాధనాలు. కాఠ్మండులో ఒక ఆకర్షన అక్కడి జూద గృహాలు. వీటిని కాసినొ అంటారు. ఇక్కడ మద్యం సేవిస్తూ, అర్థ నగ్న నృత్యాలను వీక్షిస్తూ జూదం ఆడుతారు. ఈ జూదం ఆడడానికే దేశాలనుండి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరు. సాధారణ పర్యటకులు కూడా వెళుతుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగు సెంటర్లు కూడా ఉన్నాయి. కాని అవి ఎక్కువగా భారత్ లాంటి విదేశాల వర్తకులకు చెందినవే. అన్ని దేశాలకు చెందిన వస్తువులు ఇక్కడ అమ్ముతుంటారు. సామాన్యంగా ఇక్కడ తయారైన వస్తువులు అంటు ఏమి వుండవు. అన్ని విదేశాలవే. స్థానికుల కన్నా పర్యటకులే ఈ వస్తువులను కొంటుంటారు. ఇది కూడా అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి ఆదాయ వనరే. ఇక్కడ రుద్రాక్ష చెట్లెక్కువ. అందు చేత రుద్రాక్షలు ఎక్కువగా, చాల చవకగా దొరుకుతాయి. కొందరు పర్యాటకులు రుద్రాక్ష కాయలను కిలోల లెక్కన కొంటుంటారు. వాటిని పగల గొట్టి చూస్తే వారి అదృష్టం పండి అందులో ఒకటి రెండు ఏకముఖి రుద్రాక్షలు దొరికాయంటే వారి పంట పండినట్లే. వాటి ధర ఒక్కోటి కొన్ని వేల రూపాయలుంటుంది.

మనసులో అనుకొన్న కోరికలు తీర్చే మనోకామన

మార్చు
 
మనోకామని గుడి, నేపాల్

పోఖారా నుండి ఖాట్మండు కు పోయే దారిలో ఈ మనో కామని ఆలయం ఒక పెద్ద కొండపై ఉంది. బస్సు రోడ్డు కానుకొని త్రిశూల్ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడ నది లోనికి దిగ గలిగినంత లోతులోనే ఉంది. నదికవతల రెండు మూడు కొండలకవతల ఒక కొండపై మనో కామిని ఆలయం వెలసి ఉంది. అక్కడికి వెళ్లడానికి రోప్ వే" ఏర్పాటు ఉంది. ఆ రోప్ కారులో వెళుతుంటే ఆదృశ్యం . క్రింద నది, లోయలు, కొండ వాలులో పంటలు చాల మనోహరంగా వుంటుంది. గతంలో ఈ ఆలయానికి వెళ్ల డానికి మెట్ల దారి వున్నట్లు తెలిపే మెట్ల వరుసలు ఇప్పటి కనబడతాయి. ఈ రో ప్ కారులో మనుషులతో బాటు గొర్రెలు కూడా వెళుతుంటాయి. కొండ కొసన పెద్ద ఆలయం ఉంది. ఇది పగోడ పద్ధతిలో ఉంది. ఈ ఆలయంకొరకు వెలసినదే ఇక్కడున్న చిన్న గ్రామం. ఇక్కడి పూజారులను పండితులు అంటారు. వారు భక్తులను దేవి చుట్టు కూర్చో బెట్టి పూజ చేయిస్తారు. చివరన పూలు ప్రసాదం ఇస్తారు. ఇక్కడి అమ్మవారు భక్తుల మనసు లోని కోరికలు తెలుసుకొని వాటిని నెరవేరుస్తుందని భక్తుల నమ్మిక. ఈ ఆలయ ప్రాంగణంలో పావురాలు ఎక్కువగావున్నాయి. వాటికి గింజలను మేతగా వేస్తారు. ఇది చాల పురాతన ఆలయం. ఈ ఆలయం వెనుక ఒక జంతు వధ శాల ఉంది. ఇక్కడ తరచు దేవి కొరకు జంతు బలులు ఇస్తుంటారు. ఈప్రాంతం అంతా రక్త సిక్తంగా వుంటుంది. ఆ జంతువులు అనగా గొర్రెలు కూడా రోప్ కార్లలో రావలసిందే. ఇక్కడ చిన్న చిన్న హోటళ్లు ఉన్నాయి. అందులో ప్రతి టేబుల్ ముందు మద్యం బాటిళ్లు పెట్టి వుంటాయి. ఈ కొండ పై నుండి సుదూరంలో మంచుతో కప్పబడిని హిమాలయాలు కనబడు తుంటాయి.

 
రోప్ కారు

పశుపతినాధ్ ఆలయం

మార్చు

ఇక్కడ చూడ వలసిన ప్రదేశాలు చాల ఉన్నాయి. అందులో ఒకటి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పశుపతినాథ్ దేవాలయం. ఇది శివాలయం. చాల విశాలమైనది. కాని చాలవరకు శిథిలమయం. ఇక్కడి ప్రధాన ఆలయం పగోడ ఆకారంలో చాల ఎత్తుగా వుంటుంది. ఇందులో గర్భాలయం చతురస్త్రాకారంలో వుండి నాలుగు వైపుల ద్వారాలు కలిగుంటుంది. మధ్యలో ఉన్న శివ లింగానికి నాలుగు వైపుల నాలుగు ముఖాలుంటాయి. అవి ధర్మార్థకామ మోక్షాలకు ప్రతీకలని నమ్మకం. నాలుగు ద్వారాల వద్ద నలుగురు పండితులు ఉండి పూజలు చేయిస్తుంటారు. ఇక్కడి పూజారులను పండితులు అని అంటారు. వీరందరు తెలుగు వారేనని అంటారు. వారు తరతరాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఈ ఆలయంలోనికి హిందూవులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. కాని వచ్చే వారు హిందువు అవునో కాదో గుర్తించే ఏర్పాట్లేమి వుండవు. ఈ ఆలయం వెనుక వైపున భాగమతి నది ఉంది. అక్కడే ఆతి పెద్ద శ్మశానం ఉంది. అక్కడ ఎప్పుడు శవాలు కాలుతూనే వుంటాయి. గర్భ గుడికి ఎదురుగా అతి పెద్ద నంది ఉంది. ఆలయ ప్రాంగణంలో వివిధ మందిరాలలో కొంత మంది పండితులు భక్తులకు పూజలు వ్రతాలు చేయిస్తుంటారు. ఇక్కడ రుద్రాక్షలు ఎక్కువగా దొరుకుతాయి. రుద్రాక్ష మాలలు చాల చవకగా అమ్ముతుంటారు. భక్తులు ఒక రుద్రాక్ష మాలను కొని పూజారికిచ్చి దానిని గర్భ గుడిలోని శివుని పై వుంచి మంత్రాలు చదివి దానికి తిరిగి భక్తులకు ఇస్తారు. దాన్ని భక్తులు పవిత్రంగా భావించి ధరిస్తారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాలలో అనేక దుకాణలాలలో ముత్యాలు, నవరత్నాలు, అనేక రంగుల పూసలు విక్రయిస్తుంటారు. విదేశీ యాత్రికులే వీటిని ఎక్కువగా కొంటుంటారు.

మహావిష్ణు ఆలయం

మార్చు

శేషశయనుని పై పవళించినట్లు ఉన్న మహావిష్ణువు నల్లరాతి భారీ విగ్రహం తక్కువ లోతు నీళ్లున్న కోనేరులో తేలియాడుతున్నట్లున్న ఈ దేవుని భక్తులు నీళ్లలోకి దిగి పూజలు చేస్తుంటారు. ఆ విగ్రహం చేతులలో శంఖు, చక్రం, గధ మొదలైన ఆయుధాలున్నాయి. ఇది స్వయంభువని, బుద్ధుని అవతారమని ఇక్కడి వారి నమ్మిక. ఇది చాల పురాతనమైనది. ఈ చుట్టు పక్కల ఉన్న దేవాలయాల శిథిలాలను చూస్తుంటే గతంలో ఇక్కడ అతి పెద్ద ఆలయం ఉండేదని అర్థం అవుతుంది. అతి పొడవైన రుద్రాక్ష మాలలు ఇక్కడ ఎక్కువగా అమ్ముతుంటారు.

ముక్తినాథ ఆలయం

మార్చు

హిందువులు పవిత్రంగా భావించే నూట ఎనిమిది వైష్ణవ దివ్య ధామాలలో ముక్తినాథ ఆలయం 106 వది. పోక్రానుండి ముక్తినాధ్ ఆలయానికి వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. అంతా గతుకుల బాట. చిన్న చిన్న విమానాలు నడుపుతుంటారు. అవి కూడ వాతావరణం సరిగా లేకుంటే నడపరు. వాటిలో వెళ్లినా ఆ తర్వాత కూడా కొంత దూరం కాలి నడకన వెళ్లాల్సిందే. ఇది చాల కష్టతరమైన దారి ప్రయాసతో కూడుకున్న పని. ముక్తి నారాయణుడు స్వయంభువు. పద్మాసనంలో కూర్చొన్నట్లున్న మూర్తి. ఇక్కడ నూట ఎనిమిది ధారలలో నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లను నెత్తిన చల్లుకుంటే నూట ఎనిమిది దివ్యధామాలు దర్శించుకున్నంత ఫలితం వస్తుందని భక్తుల నమ్మిక.

సూర్యోదయ వీక్షణ

మార్చు

ఖాట్మండుకు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఒక కొండ మీద ఉదయిస్తున్న సూర్యుని చూడడానికి ఒక కేంద్రం ఉంది. సూర్యోదయానికి ముందే అక్కడికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లే దారి సన్నగాను మలుపులు తిరిగి వుంటుంది. కనుక పెద్ద వాహనాలు వెళ్లలేవు. చిన్న వాహనాలలో వెళ్లాలి. ఈ కొండ పైనున్న ఒక హోటల్ లో యాత్రికులకు కావలసిన టీ, కాఫీ ఫలహారాల వంటి వసతులు చాల బాగా వుంటాయి. కొండ ఎత్తుగ వున్నందున సుదూర ప్రాంతం చక్కగా కనబడుతుంది. సూర్యోదయ సమయానికి మేఘాలు అడ్డు లేకుంటే ఆ సూర్యోదయ దృశ్యం చాల అద్భుతంగా ఉంటుంది.

భక్తా పూర్

మార్చు
 
నేపల్ లో భక్తఫూర్ లో ఒక ఆలయం

నేపాల్ దేశంలో భక్తాపూర్ ఒక చిన్న పట్టణం. గతంలో ఇది ఇక్కడి ఒక రాజ్యానికి రాజధాని. ఈ రాజధాని నగరంలో చూడవలసిన అనేక దేవాలయాలు, రాజరికపు కట్టడాలు అనేకం ఉన్నాయి. పశుపతినాధ్ ఆలయాన్ని పోలిన ఆలయం కూడా ఇక్కడ ఉంది. అలాంటి దేవాలయాలు అనేకం ఉన్నాయి . కాని అన్ని శివాలయాలే. రాజ దర్బారు హాలు చాల గంభీరంగ ఉంటుంది. ఇక్కడే దుర్గమ్మ వారి ఆలయం ఒకటి ఉంది. ఇది ఆలయం లాగ కాకుండ నివాస గృహం లాగ వుంటుంది. ఆ ఆలయాన్ని కేవలం దసరా సందర్భంలో మాత్రమే తెరుస్తారు. లోన అత్యంత సంపద ఉన్నట్లు స్థానికులు చెపుతారు. గర్భ గుడిలోనికి వెళ్లనీకున్నా పరిసర ప్రాంతాలను చూడ వీలున్నది. ఈ ప్రాంతంలోని కట్టడాలు అతి మనోహరంగా ఉన్నాయి.

ప్రకృతి పరంగ ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అభయారణ్యాలతో అనేక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలతో ఎంతో ప్రశాంతంగా కనబడే నేపాల్ దేశం రాజకీయంగా అత్యంత వేడి. వాడి చర్యలు చాల ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదే ఈ దేశం ఆర్థికంగా ఎదగక పోవడానికి కారణం.

జాతులు, కులములు

మార్చు

నేపాల్‌లో 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తము 103 (ఒక గుర్తు తెలియని జాతితో సహా) జాతులు/కులములు ఉన్నట్లు తేలినది. కులములు అనే పద్ధతి హిందూ మతము నుండి వచ్చింది. జాతుల విభజన అనేది, చారిత్రక విశేషాల వల్ల, వారికే ప్రత్యేకమైన ప్రాంతీయ ఊహాజనితమైన కథల వల్ల జరిగింది. 2001 జనాభా లెక్కల ప్రకారం ముఖ్యమైన కులాలు క్షత్రియ (ఛెత్రి) 15.8%, బ్రాహ్మణ (హిల్) 12.7%, మధేషి 33%, మగర్ 7.1%, తమంగ్ 5.6%, నేవార్ 5.5%, మహమ్మదీయ 4.3%, కామి 3.9%, (జాతులు) రాయ్ 3.9%, గురుంగ్ 2.8%, దమాయ్/ధోలి 2.4%. మిగతా 92 కులాలు/జాతులు 2% కన్నా తక్కువగా ఉన్నారు. వీళ్ళలోనే ప్రఖ్యాతి గాంచిన షెర్పాలు కూడా ఉన్నారు.

పట్టణ జనాభా

మార్చు
ప్రాంతము జిల్లా జనాభా 19911 జనాభా. 2001 సరాసరి పెరుగుదల 2005 అంచనా
ఖాట్మండు ఖాట్మండు 414.264 671.846 4,7 807.300
లలిత్ పూర్ లలిత్ పూర్ 117.203 162.991 3,4 190.900
పోఖరా కాశీ 95.311 156.312 5,0 190.000
భిరత్ నగర్ మోరంగు 130.129 166.674 2,5 184.000
బిర్గంజ్ పార్ష 68.764 112.484 4,9 136.200
ధరన్ సంసారి 68.173 95.332 3,6 109.800
భరత్ పూర్ చిత్వాన్ 54.730 89.323 4,9 108.200
భూత్వాల్ రూపందేహి 44.243 75.384 5,3 92.700
మహేంద్రనగర్ కంచన్ పూర్ 62.432 80.839 2,7 89.900
జానక్ పూర్ ధనుషా 55.021 74.192 3,1 83.800
ధన్ గడి కైలాలి 45.094 67.447 4,1 79.200
భక్తపూర్ భక్తాపూర్ 61.122 72.543 1,7 77.600
హేతౌడా మక్వన్పూరు 54.072 68.482 2,4 75.300
త్రియుగ ఉదయపూర్ - 55.291 3,9 64.400
నేపాల్ గంజ్ బంకే 48.556 57.535 1,9 62.000
సిద్ధార్థ్ నగర్ రూపందేహి 35.456 52.569 2,9 58.900
మధ్యపూర్- తిమ్మి భక్తాపూర్ - 47.751 4,0 55.900
మేచి నగర్ జప - 49.060 2,8 54.800
గులరియ బర్డియ - 46.011 4,1 50.700
త్రిభువన నగర్ దంగ్దౌకురి 29.152 43.126 4,0 50.500
ఇటహ సంసారి - 41.210 4,3 48.800
లేన్కత్ కాశీ - 41.369 3,2 46.900
టికాపూర్ కైలాలి - 38.722 4,1 45.500
కీర్తిపూర్ ఖాట్మండు - 40.845 2,7 45.400
రత్నానగర్ చిత్వాన్ - 37.791 4,1 44.500
కమలమయి సింధూలి - 32.828 5,3 40.400
కలైయా బర 17.265 32.260 5,6 40.100
తులసీపూర్ దంగ్దేఖురి 20.752 33.876 4,0 39.600
భీరేంధ్ర నగర్ సుర్ఖేట్ 22.888 31.381 3,1 35.500
దమక్ జప 41.419 35.009 -1,7 35.000
రాజ్ బిరాజ్ సప్తరి 23.847 30.353 2,3 33.200
కపిలబస్తు కపిలబస్తు 17.146 27.170 4,6 32.500
బ్యాస్ తనహు 20.175 28.245 3,4 32.300
లహన్ సిరాహ 19.046 27.654 3,8 32.100
పుతలిబజార్ స్యంజ - 29.667 1,4 31.400
ప్రుథ్వినారాయణ్ గోర్ఖా - 25.738 2,2 28.100
పనౌటి కభ్రేపలంచోక్ - 25.563 2,4 28.100
గౌర్ రౌతహట్ 23.258 25.383 2,2 27.700
దీపాయల్-సిల్గధి దోటి 12.259 22.061 5,8 27.600
ఇనరువ సన్సరి 18.562 23.200 2,2 25.300
సిరాహ సిరాహ - 23.988 1,0 25.000
రాంగ్రాం నవల్ పరసి - 22.630 1,8 24.300
తాన్సేన్ పల్ప 13.617 20.431 4,0 23.900
జలేశ్వర్ మహోత్తరి 18.161 22.046 2,0 23.900
భగ్లంగ్ భగ్లంగ్ - 20.852 3,2 23.700
భీమేశ్వర్ డోలఖ - 21.916 1,3 23.100
ఖడ్బరి సంకువసభ - 21.789 1,5 23.100
ధనుకుట ధనుకుట 17.155 20.668 1,9 22.300
బీదుర్ నువాకోట్ 18.862 21.193 1,3 22.300
వలింగ్ స్యంజ - 20.414 2,0 22.100
నారాయణ్ దైలేఖ్ - 19.446 2,1 21.100
మలంగ్వ సర్లహి 13.666 18.484 2,7 20.600
భధ్రపూర్ జప 15.123 18.145 1,8 19.500
అమరగడి దడేల్ధుర - 18.390 1,1 19.200
దశరథచండ్ భైతడ్ - 18.345 0,2 18.500
ఇలాం ఇలాం 13.150 16.237 2,1 17.600
బనేప కభ్రేపలంచోక్ 12.622 15.822 2,3 17.300
ధులికేల్ కభ్రేప్లంచోక్ 9.664 11.521 1,6 12.300
మొత్తం పట్టణ జనాభా 1.742.359 3.197.834 3,5 3.545.500
increase 91-01 for first 36 mun. 1.742.359 2.528.218
  • 1991 నాటికి కేవలం 36 మున్సిపాలిటీలు మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి

సెలవు దినాలు

మార్చు

నేపాల్‌కు నాలుగు పంచాంగాలు ఉన్నాయి. ప్రభుత్వపు సౌర మాన పంచాంగము, చంద్రమాన పంచాంగము, నేపాలి సాంప్రదాయ పంచాంగము, పాశ్చాత్య పంచాంగము. నేపాల్ మతపరమైన సెలవు దినాలన్నీ చాంద్రమాన పంచాంగము ప్రకారము ఉంటాయి. అందువల్ల నేపాలీలకు సెలవు దినాల కోసమై ఒక స్థిరమైన తేదీలు అంటూ ఉండవు. సాధారణంగా రెండు ముఖ్యమైన సెలవు దినములు దషైన్, తిహార్‌లు, అక్టోబరు, నవంబరు మాసాలలో వస్తాయి.

ఇవి కూడ చూడండి

మార్చు

హేరంబ

బయటి లింకులు

మార్చు

మరిన్ని విషయాలకు ఈక్రింద ఉన్న రచనలు చూడండి

మార్చు
  • Barbara Crossette. 1995. So Close to Heaven: The Vanishing Buddhist Kingdoms of the Himalayas. New York: Vintage. (ISBN 0679743634)
  • Bista, Dor Bahadur. The Peoples of Nepal
  • Peter Matthiessen.1993, "The Snow Leopard". (ISBN 0-00-272025-6)
  • Joe Simpson. 1997. "Storms of Silence"
  • Samrat Upadhyay. 2001. "Arresting God in Kathmandu"
  • Joseph R. Pietri.2001. "The King of Nepal"
  • Maurice Herzog.1951. "Annapurna"
  • Dervla Murphy.1967. "The Waiting Land"
  • Jon Kraukauer.1997. "Into Thin Air"
  • Indra Majupuria.1996. "Nepalese Women". (ISBN 974-89675-6-5)
  • Dor Bahadur Bista.1996. "People of Nepal". Kathmandu.
  • Eva Kipp.1995. "Bending Bamboo Changing Winds". (ISBN 81-7303-037-5)
  • Broughton Coburn.1982/1991. "Nepali Ama". (ISBN 0-918373-74-3)
"https://te.wikipedia.org/w/index.php?title=నేపాల్&oldid=4339187" నుండి వెలికితీశారు