శాస్త్రము అనేది ఒక సంస్కృత పదం. దీని అర్థం "సూత్రం, నియమాలు, నిబంధనల పత్రం, సంకలనం, పుస్తకం లేదా గ్రంథం". ఈ పదాన్ని సాధారణంగా భారతీయ సాహిత్యంలో, నిర్వచించిన ప్రదేశంలో సాంకేతిక లేదా ప్రత్యేక జ్ఞానం కోసం ప్రత్యయం వలె ఉపయోగిస్తారు.[1]

కార్ల్ ఫ్రెడరిక్ గాస్, గణిత శాస్త్రవేత్తల యువరాజుగా ప్రశస్తుడు.

శాస్త్రానికి ఆంగ్లపదమైన -లజీ (logy) కి సమానమైన అర్ధం ఉంది. ఉదా. ఎకాలజీ, సైకాలజీ. అంటే ప్రత్యేకమైన అంశంపై శాస్త్రీయ, ప్రాథమిక జ్ఞానమును శాస్త్రం అనవచ్చు. ఆంగ్లంలో ఉన్న రకరకాల మాటలకి సమానార్ధకంగా తెలుగులో శాస్త్రం అన్న ఒక్క మాట వాడతారు. ఉదాహరణకి ఆంగ్లంలో మాథమెటిక్స్ కు తెలుగులో గణితం లేదా గణితశాస్త్రం అంటారు. ఆంగ్లంలో "ఫిజిక్స్" అన్న మాటని భౌతికం అని అనకుండా భౌతిక శాస్త్రం అంటారు. అలాగే "కెమిస్ట్రీ" ని రసాయనం అనేసి ఊరుకోకుండా రసాయన శాస్త్రం అంటారు. ఆంగ్లపదాలైన "బయాలజీ", "జుయాలజీ" పదాలలో ఉన్న "లజీ" ( -logy) ని కూడా శాస్త్రం అనే పదంగా వాడుతారు. ఇక్కడ "లజీ" అన్న పదం అర్థం "అధ్యయన శాఖ". ఇక జెనెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనమిక్స్ వంటి పదాలు -ics తో అంతమవుతాయి. ఇక్కడ ఈ పదం "శాస్తం" గా పిలువబడి ఆయా పదాలకు అర్థాలు జన్యుశాస్త్రం, గణాంకశాస్త్రం,అర్థశాస్త్రంగా మారుతాయి. ఆస్ట్రానమీ, ఎకానమీ వంటి -nomy తో అంతమయ్యే పదాలలో -nomy కూడా శాస్త్రంగా పిలువబడుతుంది. వాటిని ఖగోళశాస్త్రం, ఆర్థిక శాస్త్రం అనే అనువదిస్తాము. జాగ్రఫీ అనే పదంలో "జియో" అనగా భూమి, "గ్రఫీ" అనగా గియ్యడం, రాయడం అని అనుకుంటే జాగ్రఫీకి భూమిని గురించి బొమ్మలు గియ్యడం అనే అర్థం స్పురిస్తుంది. దీన్ని కూడా మనం భూగోళశాస్త్రం అనే తెలిగిస్తున్నాం.

శాస్త్రము అనగా సైన్సు అని ఒక అర్థము. రాయబడినది అని మరొక అర్దము కూడా చెప్పుకొనవచ్చు. ఉదాహరణకు మనము శాస్త్ర బద్దముగా అను పదానికి according to science అని అర్దము చెప్పుకొనడము చూడవచ్చు. అలాగే పురాణాలు, వేదాలు మొదలైన వాటిని అన్నింటినీ శాస్త్రాలు అని అంటారు.

పై ఉదాహరణలని బట్టి "శాస్త్రము" అన్న మాటకి బిగువైన నిర్వచనం లేదని తెలుస్తోంది. ఒకానొకప్పుడు ఉండేది. ఈ మధ్య పోయింది. ఈ పరిస్థితి తెలుగులోనే కాదు, ఇంగ్లీషులో కూడా ఉంది. పొలిటికల్‌ సైన్సు, సోషల్‌ సైన్సు మొదలైన మాటలు ఈ పరిస్థితికి ఉదాహరణలు. ఈ వ్యత్యాసాలని గుర్తిస్తూ, ప్రస్తుతం పబ్బం గడవాలి కనుక, ఈ శీర్షిక కింద వచ్చే "సైన్సు" అన్న మాట యొక్క అర్థం గణిత, భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాలు, వాటిమీద ఆధారపడ్డ అనువర్తిత (applied) శాస్త్రాలకి పరిమితం చేసి, మిగిలిన వాటిని వీటితో కలబెట్టకుండా ఉంటే సందిగ్ధతకి తావు ఉండదు.

మూలాలుసవరించు

  1. James Lochtefeld (2002), "Shastra" in The Illustrated Encyclopedia of Hinduism, Vol. 2: N-Z, Rosen Publishing, ISBN 0-8239-2287-1, page 626