శిఖండి మరియు ఎవరూ మీకు చెప్పని మరికొన్ని క్వీర్ కథలు


శిఖండి మరియు ఎవరూ మీకు చెప్పని మరికొన్ని క్వీర్ కథలు

రచయిత: దేవదత్త పట్నాయక్, అనువాదం : వేమన వసంతలక్ష్మి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,2023.

ఈ పుస్తకం శీర్షిక, ఉపశీర్షికలలోనే ఇందులో చర్చించబడిన విషయాలు స్ఫురిస్తాయి.

మనతో, మనచుట్టూ ఉన్న మనుషుల్లో వింతగా వేషధారణ, ప్రవర్తనతో మెలిగే మనుషులను గురించి పట్టించుకోము, లేదా అపహాస్యం చేస్తాము. దేవదత్త పట్నాయక్ అటువంటి వారు మన పురాణాలు, కావ్యాలు , జానపద గాథల్లో తరచూ కనిపిస్తారని సాధికారికంగా, శాస్త్రీయంగా పరిశీలించి ఈ గ్రంథం రాశారు. రామాయణ, భారత, భాగవత కథల్లొ, ఎన్నో పురాణ కథల్లో క్వీర్ గా కనిపించే నరనారుల పాత్రలను ప్రదర్శించారు. శాపవశాత్తూ పురుషులు స్త్రీలుగా మారడం, నదిలోనో, మడుగు లోనో స్నానం చేయగానే పురుషులు స్త్రీలుగా మారడం, పురుషులకు పురుషులపట్ల ఆకర్షణ, స్త్రీలకు స్త్రీలపట్ల ఆకర్షణ, స్త్రీ దేహంలో చిక్కుకొని పోయిన పురుషులు, పురుష దేహంలో చిక్కుకొని పోయిన మహిళలు, 'క్వియర్సు'లో ఎన్నో రకాలు న్నారని రచయిత వివరంగా రాశారు.

క్రీస్తు పూర్వంనాటి సింధు నాగరికతలో లభించిన నర్తకిశిల్పం రూపంలోనే 'క్వీర్' లక్షణాలు చూచారు పట్నాయక్. అజంతా గుహా చిత్రం పద్మపాణి బోధిసత్వుడిలో స్త్రీ సహజ కోమలత్వం చిత్రించబడినట్లు, మతం వ్యవస్థగా మారకముందు సమాజం 'క్వీర్' నడవడి కలవారిని మామూలుగా పరిగణించినట్లు, వ్యవస్థీకృత మతం, పీఠాధిపతుల ఆధిపత్యం కిందకు వచ్చాక 'క్వీర్' నడవడి కల వ్యక్తులు పరిహాస పాత్రులయ్యారని అంటారు రచయిత.‌

దేవదత్త పట్నాయక్ శిల్పం, చిత్రలేఖనం, పౌరాణికథలు వంటి అనేక ఆకరాలనుంచి ఉదాహరణలిచ్చి, ఈ ప్రతిపాదనను నిరూపణ చేశారు.

శివుడు భక్తురాలి ప్రసవం కష్టమైనపుడు తాను వృద్ధస్త్రీ రూపంలో వచ్చి కాన్పుచేసి పోతాడు. మల్లినాధుడనే తీర్ధంకరుడు గతజన్మలో చేసిన తప్పుకు మరుజన్మలో స్త్రీ శరీరంతో పుట్టినట్లు గాథ. ఇట్లా ఏవేవో కారణాలవల్ల స్త్రీలుగా, పురుషులుగా మారి, రెండు రూపాల్లో రతిసౌఖ్యం, శృంగారం అనుభవించినవారు, నిగ్రహం కోల్పోయి నపుంసకత్వం అనుభవించిన ఇంద్రుడు, పురుషులు శిశువును ప్రసవించడం, స్త్రీగా మారిన వినత పుత్రుడు, చంద్రుడి క్షీణకాలంలో పురుషరూపం ధరించే అరుణ, శత్రువులను శిక్షించడానికి స్త్రీ రూపం ధరించే వీరులూ, ఇట్లా పురాణ సాహిత్యంలోని క్కడెక్కడి కథలను తవ్వితీసి మనముందు పెట్టారు.

ఆయన నిరూపణ చేయదలచిన అంశం- మనలో కొందరు క్వీర్ గా కనిపించే స్త్రీపురుషులు అనాదిగా ఉన్నారని, వారి శృంగార భావనలు, వాంఛలు విపరీతమైనవని సమాజం ముద్రవేసిందని, మానవ ప్రకృతిలో వారూ భాగమని రాశారు. వారిని గురించి మాట్లాడడమే అనాగరికం, సభ్యత కాదనే దశను దాటుకొని, ఎక్కడా అశ్లీలం, అసభ్యం లేకుండా ఇందులో చర్చించారు. శిఖండి పాత్రే క్వీర్.లకు ప్రతీక. మూలాలు: శిఖండి మరియు ఎవరూ మీకు చెప్పని మరికొన్ని క్వీర్ కథలు, రచయిత:దేవదత్త పట్నాయక్, అనువాదం: వేమన వసంతలక్ష్మి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,2023.