శివ భారతము గడియారం వేంకట శేషశాస్త్రి గారు 1943లో రచించిన వీరరస ప్రధానమైన పద్య కావ్యము.నవీన ఆంధ్ర పంచకావ్యాలలో ఇది ఒకటిగా గుర్తించబడింది. రాణాప్రతాపసింహచరిత్ర, సౌందర నందము, ఆంధ్రపురాణము, బాపూజీ ఆత్మకథ అనేవి తక్కిన కావ్యాలు.

భారతావనిలో సనాతనధర్మ పునరుద్ధరణమునకై కంకణము కట్టుకొని హైందవ ధర్మ పతాకమును ప్రతిష్ఠించిన వీరుడైన శివాజీ చరిత్రమే ఈ శివ భారతము. ఇది 2,500 పద్యములు, 8 ఆశ్వాసములు గల బృహత్కావ్యము. శివాజీ కథ వివిధ ధార్మిక, తాత్త్విక, రాజకీయ ఉపదేశములతో వివిధ పాత్రల, విభిన్న మానసిక ప్రవృత్తుల సంఘర్షణలతో కూడుకొనియుండును.

శివభారతములో ప్రతి ఘట్టము రసవంతమైనవి. ఇందు లుకజీ-జీజియాల సంభాషణము, అభిప్రాయ భేదములు, పునహా పట్టణమున శివాజీ రాజ్యాంగ శిక్షణము, దాదోజీ చరమదశ - శివాజీ కృతజ్ఞత, రామదాసస్వామి సందర్శనము - ధర్మోపదేశము, భవానీ ప్రార్థనము, శివాజీ పాదుషాకు ఉత్తరము వ్రాయుట, షాజీ విడుదల, బాజీప్రభు మరణము, షాజీ మరణము, శివాజీ పాదుషా కొలువుకేగుట, తానాజీ ప్రతిజ్ఞ - నిర్యాణము, శివాజీ సంతాపము, భవాని కోవెలకేగి చేసిన విన్నపము మొదలైన ఘట్టములు ప్రముఖమైనవి.

కావ్య నామం

మార్చు

భరతవంశ రాజుల చరిత్ర భారతమైనది. శివాజీ భరతవీరుడు. భరతవీరుల చరిత్ర కూడ భారతమని చెప్పవచ్చును. శివము అనగా భద్రము, క్షేమమని అర్థము. భారతమనగా భారతదేశము. భారతదేశ క్షేమమును వర్ణించిన కావ్యము శివ భారతము.

కొన్ని ఉదాహరణలు

మార్చు

వీరు ఆంధ్ర కవులను స్తుతించిన పిమ్మట తిక్కన మహాకవి చేతి గంటమును ప్రత్యేకముగ ఇట్లు స్తుతించెను:

చం. హరిహరనాథశాంతమధురాకృతి లోపలి చూపునన్, బురా
చరిత తపఃఫలం బుభయసత్కవిమిత్రత వెల్గ, ధ్యాన త
త్పరు డయి భారతాగమము పల్కెడు తిక్కన వాక్కు వెంట ద
త్కరమున దాండవించు వరదాయిని లేఖిని నే భజించెదన్.

స్వతంత్ర రాజ్యస్థాపనకు త్వరపడుతున్న కుమారుడగు శివాజీని చూచి సహాజీ తొందరకూడదని ఇలా పలికెను:

మ. అలతం జెందకు, తొందరంబడకు పుత్రా ! చీకటుల్ వోయె వె
న్నెలరాదా ? కసుగాయ పండవలె గానీ బల్మి బండింతువా ?
యిలకుం గంగనుదెచ్చు క్రచ్చెఱుగవా ? యీ యేటిలో నెన్ని ము
న్కలతోనో నెఱయీతకాడగుట యన్నా ! యోపికన్ జూపుమీ.

గోహత్యకు పూనుకొనిన వారిని బాల శివాజీ ఇట్లు మందలించెను:

మ. ఇదియే ధర్మపథంబు ? మానవులు కారే ? జాలిలేదయ్యెనే
మది ! మీ కొండొక ముల్లు గ్రుచ్చుకొన "నమ్మా" యంచు వాపోదురే
కద ! మీ బిడ్డల నెవ్వడైన జెనకంగా వాదుకుం బోదురే
కద ! యే దిక్కునులేని జంతువనియేగా కత్తులన్ దూయుటల్.

తండ్రియగు షాజీని శత్రువులు బంధించిన విషయమును శివాజీ తల్లి జీజియాకు తెలిపిన విధానము:

ఉ. ఉన్నది చేత శస్త్ర మదియున్ బదనైనది లోన బౌరుషం
బున్నది మొక్కవోక యదియున్ బదనైనది వెంట మార్బలం
బున్నది మున్ను దూక నదియున్ బదనైనది ప్రాణశక్తి నీ
వన్నిటబోసి యొక్క తెరువాడుము తల్లి ! జయింతు సర్వమున్.

మూలాలు

మార్చు