శుక్రుడు జ్యోతిషం

శుక్రుడు రాక్షస గురువు, భృగుపుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీగ్రహం. రుచులలో పులుపుకు ప్రతీక, తెలుపు వర్ణాన్ని సూచిస్తాడు. జాతి -బ్రాహ్మణ, అధి దేవత - ఇంద్రియాని. ఏడు వయసును సూచిస్తాడు. మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక. శ్లేష్మ, వాత ప్రకృతిని సూచిస్తాడు. తత్వము -జలతత్వం, దిక్కు -ఆగ్నేయము, రత్నము -వజ్రము, లోహము -వెండి, ఋతువు -వసంతం, దిక్బలం చతుర్ధ స్థానం, గుణము -రజోగుణము, ప్రదేశం -కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం. శుక్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్థ. వృషభం, తులా రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. రవి, చంద్రులు శత్రువులు. శని, బుధులు మిత్రులు. కుజుడు, గురువులు సములు. శుక్ర దశా కాలం ఇరవై సంవత్సరాలు. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిని, కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.

శుక్రాచార్యుడు

కారకత్వములు మార్చు

శుక్రుడు శారీరక సుఖము, భార్య, యౌవనం, సౌందర్యం, రాజసము, వినోదము, స్త్రీలు, ఐశ్వర్యం, జలవిహారం, ఆభరణములు, సౌందర్య సాధనములు, చతుష్షష్టి కళలు, వీర్యము, మన్మధుడు, సుగంధద్రవ్యములు, గౌరి, లక్ష్మి ఆలయములు, క్రీడా ప్రదేశములు, పాలు, పాల కేంద్రాలు, పాలకు సంబంధించిన వస్తు విక్రయము, వస్త్రములు దానికి సంబంధించిన వృత్తులు, అలంకార సామాగ్రి, పరిమళ ద్రవ్యములు వాటికి సంబంధించిన వృత్తులు, పానీయములు, పండ్లరసాలు వాటికి సంబంధించిన సంస్థలు, పెట్రోలు వాహనములు, నౌకలు, సముద్ర యానం, రస సంబంధం ఉన్న నిమ్మ, నారింజ, కమలా, బత్తాయి మొదలైన పండ్లు, నేత్ర, సుఖ, చర్మ, కంఠముకు సంబంధించిన రోగములు, దర్జీ, కళాసంబంధ వృత్తులు, సౌందర్య సంబంధిత వృత్తులు, స్నేహితులు, బహుమతులు, హనీమూన్, ప్రేమ, విందులు విలాస విహారాదులు, పూలు, అలంకరణ సామాగ్రి, లౌక్యము, లాభము, ఒప్పందము, ఆకర్షణ మొదలైన వాటికి కారకుడు.

రూపము మార్చు

శుక్రుని వర్ణం ధవళ వర్ణం. నాలుగు భుజములు కలిగి ఉంటాడు. చేతులలో దండము, కమండలం, రుద్రాక్షమాలను ధరించి ఉంటాడు. రథాన్ని అధిరోహిస్తాడు. ఇతడి తండ్రి భృగువు, తల్లి హిరణ్య కశిపుని కుమార్తె ఉష. ఇతడికి కావ్యుడు, సితుడు, భృగుసుతుడు, దానవాచార్యుడు, ఉశనుడు అనే ఇతర నామాలు ఉన్నాయి.

వ్యాధులు మార్చు

గర్భాశయ వ్యాధులు, మూత్ర పిండ వ్యాధులు, సుఖ వ్యాధులు మొదలైన వాటికి కారకుడు. కుజుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, గొంతు కాన్సర్, గొంతు వాపు మొదలైనవి కలుగుతాయి. బుధుడితో కలిసిన నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం, శనితో కలిసిన సుఖ వ్యాధులు, రాహువుతో కలిసిన గర్భ సంబంధిత వ్యాధులు, కేతువుతో కలిసిన సంతాన లేమి మొదలైన వ్యాధులు కలుగుతాయి.

వృత్తులు మార్చు

శుక్రుడు కళారంగ సంబంధిత వృత్తులు, స్వీట్ షాపులు, పానీయాల షాపులు, పండ్లరసాల వ్యాపారం, పాల సంబంధిత వృత్తులు, వెండి, బంగారు, రత్న వ్యాపారములు, ఫ్లాస్టిక్, కలప, రబ్బరుకు సంబంధించిన వృత్తులు శుక్ర ప్రభావితులకు లాభిస్తాయి. సముద్ర యానం, నౌకాయాన సంబంధిత వృత్తులు, సముద్ర సంబంధిత వృత్తులు, ఆహార సంబంధిత వృత్తి వ్యాపారాలు, ఉప్పు సంబంధిత వృత్తి వ్యాపారాలు, పెట్రోల, వాహన సంబంధిత వ్యాపారాలు, ముత్యాల వ్యాపారం, మత్యకారులకు సంబంధిత వృత్తి వ్యాపారాలను సూచిస్తుంది.

పురాణాలలో శుక్రుడి గురించి మార్చు

శ్రీకృష్ణుడు కుచేలుడికి అనుగ్రహించిన అపార ధన సంపత్తిని ఉశనుడు అపహరించబూనడంతో ఈశ్వరుడు ఆగ్రహించి శుక్రుడిని సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఉశనుడు తన తపశ్శక్తితో ఈశ్వరుడి ఉదరంలో ప్రవేశించి అతడిని స్తుతించసాగాడు. బోళాశంకరుడైన ఈశ్వరుడు ఉశనుడికి అభయం ఇచ్చి, శుక్ర శోణిత రూపంలో బయటకు పంపాడు. అప్పటి నుండి అతడికి శుక్రుడన్న పేరు సార్థకమయింది. చైత్ర శుద్ధ ఏకాదశి నాడు మఖ నక్షత్రంలో మన్మధ సంవత్సరంలో ఉశనుడు శుక్రుడిగా అవతరించాడు. శివుడు అతడి స్తుతికి మెచ్చి ధన్వీర్యాలకు అధిపతిగానూ, రాక్షసులకు గురువుగానూ చేసి గ్రహమండలంలో స్థానం కల్పించాడు. అసురుల గురువైన శుక్రుడు వారి అభ్యున్నతి కొరకు ఘోర తపస్సు చేసాడు. ఈశ్వరుడిని మెప్పించి మృతసంజీవనీ విద్యను సాధించాడు. శుక్రుడు సంపదలకు, మంత్రాలకు, రసాలకు, ఔషధులకు అధిపతి. అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన శుక్రుడు తన సంపదలను దానవ శిష్యులకు అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు. వర్షాలపై ఆధిపత్యం వహిస్తూ అతివృష్టి, అనావృష్టికి కారకుడౌతాడు. వర్షాలను నిరోధించే వారిని శాంతింపచేస్తాడు.

ద్వాదశ స్థానాలలో శుక్రుడు మార్చు

  • శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడు, సుందరశరీరం కలిగిన వాడు, సుఖజీవి, చిరంజీవి ఔతడు.
  • శుక్రుడు ద్వితీయస్థానమున ఉన్న బహువిధములుగా సంపదలు కలవాడు, కవి ఔతాడు.
  • తృతీయముస్థానమున శుకృడు ఉన్న జాతకుడు భార్యాహీనుడు, కష్టవంతుడు, బీదవాడు, దుఃఖవంతుడు, అపకీత్రి కలవాడు ఔతాడు.
  • చతుర్ధస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు వాహనములు కలవాడు, మంచిగృహం కలవాడు, నగలు, వస్త్రములు, సుగంధద్రవ్యములు కలవాడు ఔతాడు.
  • పంచమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు అపారధనవంతుడు, ఇతరులను రక్షించు వాడు, బహుమేధావి, పుత్రులు కలవాడు ఔతాడు, భార్య వల్ల లాభం, సుఖ సంసార జీవితంలో లాభం
  • షష్టమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు శతృవులు లేని వాడు, ధనమును లేని వాడు, యువతుల చేత వంచింపబడిన వాడు, విచారగ్రస్తుడు ఔతాడు.
  • సప్తమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు మంచి కళత్రం ఉన్న వాడు, పరస్త్రీ ఆసక్తుడు, కళత్రం లేని వాడు, ధనవంతుడు ఔతాడు.
  • అష్టమ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు చిరంజీవి, ధనవంతుడు, రాజు ఔతాడు.
  • నవమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు భార్యాబిడ్డలు, సంతానం, ఆప్తులు కలిగి రాజాశ్రయం కలిగి అభివృద్ధి చెందుతూ ఉంటాడు.
  • దశమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగినవాడు, మిత్రులు కలిగిన వాడు, ప్రభువు ఔతాడు.
  • ఏకాదశ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు పరస్త్రీ లోలుడు, బహు సుఖవంతుడు ఔతాడు.
  • ద్వాదశము స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు దేవతలతో సమానమైన సౌఖ్యవంతుడు, ధనవంతుడూ ఔతాడు.

వెలుపలి లింకులు మార్చు