శేద్య చంద్రిక
శేద్యచంద్రిక తెలంగాణలో తొలి తెలుగు పత్రిక. సేద్యచంద్రక తొలిపత్రిక అయినా అది అనువాద పత్రిక కావడంతో 1913లో శ్రీనివాసశర్మ సంపాదకత్వం లో హితబోధిని తొలిపత్రికగా పరిగణించారు. తెలుగు ప్రజల కోసం ముఖ్యంగా రైతుల కోసం తెలుగు అనువాద పత్రికను అందిస్తున్నట్టు శేద్యచంద్రిక సంపాదకీయంలో పేర్కొన్నారు. ఇది వ్యవసాయ శాస్త్ర సంబంధిత పత్రిక.
కాల నిర్ణయం
మార్చుశేద్య చంద్రికను పరిశీలించిన ఆరుద్ర, తిరుమల రామచంద్ర ఇది 1883 నాటిదని లెక్కగట్టగా మరికొందరు దీన్ని 1886 నాటిదని అంటున్నారు.[1] 1887లో ఈ పత్రిక వెలువరించుంటారని తెలంగాణ సాహిత్య వికాసం పరిశోధనా గ్రంథంలో ఉంది.[2]
తొలితరం తెలంగాణ పత్రికల వివరాలు
మార్చు- తెలంగాణలో తొలి తెలుగు స్వతంత్ర పత్రిక ‘‘హితబోధిని’’. మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ దగ్గరలోని ముష్టిపల్లి జాగీరుదారు బడారు శ్రీనివాస శర్మ 1913లో ‘హితబోధిని’ పత్రికను తీసుకొచ్చినట్లుగా చారిత్రక పరిశోధనల్లో బహిర్గతమైంది.
- 1890లలో ‘దినవర్తమాని’ తెలుగు పత్రిక వచ్చిందని వెల్దుర్తి మాణిక్యరావు, వి లక్షణరెడ్డి రాశారు.
- 1917లో ‘ఆంధ్రమాత’ పత్రిక స్వామి వెంకటరావు సంపాదకీయంలో వెలువడింది. ఇది సికింద్రాబాద్‌లోని ‘జగదీశ్వర్ ప్రెస్’లో అచ్చయింది.
- 1921లో మహబూబ్‌నగర్ కేంద్రంగా క్రైస్తవ మత పత్రిక ‘వర్తమాని’,
- 1922, నల్గొండ నుంచి ‘నీలగిరి’ వారపత్రికలు వెలువడ్డాయి.
- 1920 - 1930 మధ్యకాలంలో 45 పత్రికలు తెలంగాణ నుంచి వెలువడ్డాయి.
- వాటిలో 1926లో వచ్చిన ‘గోల్కొండ పత్రిక’, ‘నీలగిరి’ పత్రికలతోపాటు ‘ఆంధ్రాభ్యుదయం’, ‘సుజాత’ వంటి సాహిత్యపత్రికలు వికాసోద్యమానికి తోడ్పడ్డాయ
తొలినాటి ముద్రణాలయాలు
మార్చు- హైదరాబాద్ కేంద్రంగా 1800లో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ ‘‘ఆజమ్‌స్టీమ్’’ మొగల్‌పురాలో ప్రారంభమైంది.
- 1942 వరకూ ఆ ప్రెస్ ఉనికిలో ఉన్నట్టు ఆర్కైవ్స్‌లోని రికార్డుల ద్వారా తెలుస్తోంది.
- 1834-35 మధ్యకాలంలో నగరంలో మొదలైన తొలి ఉర్దూ లిపితో ప్రెస్ ‘‘ఛాప్‌ఖానా’’. ఇక తొలి తెలుగు ముద్రణాలయం 1870లో స్ధాపించారని ఆచార్య తూమాటి దోణప్ప రాశారు.
- అది 1950 వరకూ పనిచేసిందని సాహిత్య పరిశోధకులు వెల్లడించారు.
- వనపర్తి, గద్వాల ముద్రాక్షరశాలలు సుమారు వందేళ్ల కిందట స్థాపించారని సురవరం ప్రతాపరెడ్డి ఒక వ్యాసంలో ఉటంకించారు.
- ‘భాగవత వీర రాఘవీయ వ్యాఖ్యానం’, ‘రామేశ్వర విజయం’, ‘శృంగార మంజరీ భాణము’, ‘రామచంద్రోదయం’, ‘యాదవ భారతీయం’, ‘రాజవంశ రత్నావళి’, ‘వనపర్తి సంస్థానం’, ‘నారాయణ కవచం’, ‘రాజధీర మనోవిరాజితము’, ‘తామ్రకేతుని చరిత’ మొదలైన గ్రంథాలు ఆ ముద్రాక్షరశాలల్లోనే ముద్రించారు.
- సంస్థానాలు మినహా తెలుగు అచ్చు ఉన్న తొలి రెండు ముద్రణాలయాలు సికింద్రాబాద్‌లో ఉండేవి.
- ఒకటి 1890లో చికోటి వీరన్న కళాసీగూడలోని ‘చీకోటి ప్రింటింగ్ ప్రెస్’ను ప్రారంభించారు.
- రెండోది బాల్‌రెడ్డి, బచ్చువీరన్న ఆధ్వర్యంలో పార్క్‌లేన్‌లో బీవీఆర్ బాల్‌రెడ్డి అండ్ కంపెనీ ముద్రణాసంస్థను నెలకొల్పారు.
- 1905లో ఇసామియా బజార్ కేంద్రంగా కోకారామస్వామి నాయుడు స్థాపించిన ‘నియో సిల్వర్‌జూబ్లీ ప్రెస్’,
- 1907లో పార్క్‌లేన్‌లో ఎస్వీ రంగం ప్రారంభించిన ‘ఎస్వీ రంగం అండ్ సన్స్’ ప్రెస్‌లు తొలినాటి ముద్రణాసంస్థల్లో ముఖ్యమైనవి.
- 1948 నాటికి నగరం కేంద్రంగా పది లితో ప్రెస్‌లు ఉండేవని ‘తెలంగాణ సాహిత్య వికాసం’’ పరిశోధనా గ్రంథం ద్వారా తెలుస్తోంది.
విశేషాలు
మార్చుమహబూబ్ నగర్ నుంచి 1913లో వెలువడిన ‘హితబోధిని’ తొలి తెలంగాణ పత్రికగా చాలాకాలం వరకూ ప్రచారంలో ఉండేది. కానీ అంతకు మూడు దశాబ్దాల కిందటే ఉర్దూ మాతృకకు అనువాదంగా వెలువడిన పత్రిక ‘శేద్య చంద్రిక’. ఇది 1886లో లో ప్రారంభించబడినది.[3] ఇది మద్రాసు విశ్వవిద్యాలయం ఆవరణలోని ఓరియంటల్ మాన్యుస్క్రిప్టు లైబ్రరీ (ప్రాచ్యలిఖిత గ్రంథాలయం)లో దీని ప్రతులు లభ్యమవుతున్నాయి. 1975 నాటి మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ప్రదర్శనలో శేద్య చంద్రికను కూడా ప్రదర్శించారు. శేద్య చంద్రిక మొత్తం 40 పేజీలుంటుంది. చెక్కమీద చెక్కి ముద్రించే సాంకేతిక పరిజ్ఞానం వాడుకున్నారని ముద్రణాసాంకేతిక పరిజ్ఞానం మీద పరిశోధించిన వారు ఆ తరువాత తేల్చారు. ఉర్దూలో వెలువరించిన "ఫునూన్" అనే పత్రికకు ఇది అనువాదమని పత్రిక సంపాదకీయాన్ని బట్టి తెలుస్తుంది. అప్పట్లో జనం భాషలో ఉర్దూ పదాలు దొర్లేవనటానికి నిదర్శనంగా తెలుగు అనువాదంలోనూ అనేక ఉర్దూ పదాలు కనిపిస్తాయి[1].
ముఖచిత్రం
మార్చుముఖపత్రంలో అప్పటి నిజాం ఆదేశాలకు అనుగుణంగా రైతుల క్షేమం కోసం ప్రచురించినట్టు చెప్పుకోవటం కనిపిస్తుంది. పబ్లిషర్ గా "మున్షీ మహమ్మద్ ముష్తాక్ అహ్మద్" పేరు చెబుతూ ఫునూన్ పేరు ప్రస్తావించారు. చార్మినార్ సమీపంలోని పత్తర్‌గట్టి దగ్గర ‘పునూన్’ ముద్రణాలయంలో ప్రచురితమైనట్టు అధ్యయనకారుల పరిశీలనలో వెల్లడైంది[2].
శీర్షికలు
మార్చురైతులకు తెలియాల్సిన మెలకువల గురించి, ఆధునిక పోకడల గురించి, ఇతర దేశాల నుంచి అందుతున్న సమాచారం గురించి చెప్పటానికి ఇందులో ప్రాధాన్య మిచ్చారు. అదే సమయంలో వైద్య చిట్కాల వంటివి కూడా పత్రికలో చేర్చారు. రెవెన్యూ వసూళ్ళ వివరాలు, బకాయిల వివరాలు పేర్కొనటంతోబాటు రెవెన్యూ ఉద్యోగులు ఎవరెవరు ఎక్కడికి బదలీ అయ్యారో ఆ సమాచారం కూడా శేద్య చంద్రికలో పొందుపరచారు. వ్యవసాయం లాభదాయకంగా సాగటానికి అనుసరించాల్సిన పద్ధతుల గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. మొత్తంగా చూస్తే పేరుకు తగినట్టుగా ఇది పూర్తిగా రైతుల పత్రిక. తెలుగు మాత్రమే తెలిసిన రైతుల కోసం చేసిన ప్రయత్నమే ఇది[1].