శ్రీ జ్ఞానప్రసూనాంబికా శతకము

శ్రీ జ్ఞానప్రసూనాంబికా శతకమును గంటి కృష్ణవేణమ్మ తన 20వ యేట 1939లో రచించింది. గృహలక్ష్మి పత్రికాధిపతి కె.ఎన్.కేసరి ఈ శతకాన్ని ప్రచురించాడు. దీనికి చేబ్రోలు సరస్వతీదేవి ఉపోద్ఘాతము వ్రాసింది. నాగపూడి కుప్పుస్వామయ్య దీనిని పరిష్కరించాడు.

శ్రీ జ్ఞానప్రసూనాంబికా శతకము
కవి పేరుగంటి కృష్ణవేణమ్మ
మొదటి ప్రచురణ తేదీ1939
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంశ్రీ జ్ఞానప్రసూనాంబికా!
విషయము(లు)భక్తి
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుశార్దూల మత్తేభాలు
ప్రచురణ కర్తకె.ఎన్.కేసరి, చెన్నపురి
ప్రచురణ తేదీ1939
మొత్తం పద్యముల సంఖ్య101

వివరాలు

మార్చు

శ్రీ జ్ఞానప్రసూనాంబికా! అనే మకుటంతో వెలువడిన ఈ శతకంలో కవయిత్రి భక్తి అంశాలతో పాటు అనేక లౌకిక విషయాలను ప్రస్తావించింది. ప్రాచీనార్యాచార విముఖులైన నేటి(ఈ శతకము వ్రాసే నాటి) యువతుల గూర్చి వాపోయింది. విదేశీ విద్యలను ఈసడించింది. స్వదేశ ప్రజాస్థితిని, పాలకుల దురత్యయాలను వర్ణించి దేశాభిమానాన్ని వ్యక్తపరిచింది. అవివేకులైన రాజులను దూషించింది.

అక్కడక్కడా మంచి సామెతలను, ఉపమానాలను ఉపయోగించడంలో ఈ కవయిత్రి అందె వేసిన చెయ్యి. దానికి తార్కాణాలు ఈ క్రింద చూడండి.

  1. ధరలోనం బులిఁజూచి నక్కయును వాతల్వెట్టుకొన్నట్టులౌ
  2. జనని సంతోషింపదే యర్భకుల్ కలమోదంబునఁ బల్క
  3. సూకరముల్ మెచ్చునె పుష్పసౌరభము, పంకంబు న్మదిన్మెచ్చెడిన్
  4. కాకం బెల్లరఁ దిట్టెనే? పికము బంగారంబు లందిచ్చెనే?
    లోకంబుల్పగయౌను వాక్పరుషతన్ తీయగా వాకొన్నంతనె మిత్రులయ్యెదరుగా!
  5. పాముం బాలను బోసి పెంచికొన సంభావించునే ముద్దిడన్
  6. వేముం దేనియవోసి పెంచినను, దేవీ, తీపి రానేర్చునే?
  7. పాలన్ముంచిన నీటముంచినను నీ పాదంబులే నమ్మితిన్
  8. సరసీజంబులక్రింద ఖేకములు వాసంబుండి పద్మవ్రజో
    తర సౌగంధ్యములన్ గ్రహింపనివిధిన్
  9. స్వాతివర్షంబులోఁ జినుకుల్ ముత్తెపుఁ జిప్పలం బడిన రంజిల్లుంగదా ముత్తెమై
  10. చిలుకం బంజరమందు నిల్పి పలుకుల్ చెన్నారనేర్పించినన్
    బలుకున్ముద్దుగ, వాయసంబు నిడి పక్వంబైన పండ్లిచ్చుచుం బలుకుల్ నేర్పినఁ బల్క నేర్చికొనునే?

మచ్చు తునకలు

మార్చు

మును నాయిందిర కోడలైన రతియుం బూతాత సావిత్రియున్
ఘనమౌ దీర్ఘసుమంగలీత్వమును నీ కారుణ్యభాగ్యంబునన్
దనియంగల్గిరి, నాకు నట్టి వరమత్యంతానుకంపామతిన్
జననీ యిమ్ము నినున్ భజింతునెపుడున్ జ్ఞానప్రసూనాంబికా!

పరభాషల్ పఠియించి ప్రౌడఫణితిన్ భాషింపఁగావచ్చు, నా
పరవేషాదులఁ దాల్చి మానవులు విభ్రాంతాత్ములైయున్నచో,
ధరలోలన్ బులిఁజూచి నక్కయున్ వాతల్వెట్టుకొన్నట్టులౌ
ఖరదై తేయ మహోగ్ర గర్వదమనీ! జ్ఞానప్రసూనాంబికా!

తల్లీ, యాశ్రితకల్పవల్లి, నిజభక్తామౌఘ విధ్వంసినీ!
ఫుల్లాంభోరుహపత్రనేత్ర, నిను నేఁ బూజింతు నేవేళ నా
యుల్లంబందు వసించి సల్లలితమౌ నుక్తుల్ సుశబ్దాళితో
సల్లాపింపఁగఁ జేయు నీస్తవమున్ శ్రీ జ్ఞానప్రసూనాంబికా!

నినుఁబూజించుటహస్తభూషణములౌ నిత్యంబు నిన్ బారుటే
ఘనరత్నాంచితతారహారములు నీ గాధాసమాకర్ణనం
బన, తాటంకమణిద్వయమ్ము భవదీయానంద దివ్యాలయాం
గణము న్మెట్టుటె పాదభూషలుగదా శ్రీ జ్ఞానప్రసూనాంబికా!

నయవాక్యంబులఁ దృప్తులై వరములన్నాకాధివుల్గూర్తు, రా
నయవాక్యంబుల కుబ్బుచున్ బ్రియము భూనాథోతాముల్గూర్తు రా
నయవాక్యంబులఁ బ్రీతలై సుఖములన్నారీమణుల్గూర్తు, రా
నయవాక్యంబుల మూర్ఖుఁడెట్లు పలుకున్ శ్రీ జ్ఞానప్రసూనాంబికా!

అనిఁబోరాడఁగలేక, సత్యమును ధర్మాధర్మ విజ్ఞానమున్
గని పాలింపక, పండితప్రముఖ సత్కారంబుఁ గావింప, కో
జననీ సొమ్ములు రమ్మునన్ బొదలఁగా సాల్వల్ పయింగప్పి "నే
జననాథుం"- డన గంగిరెద్దు గతియౌ శ్రీ జ్ఞానప్రసూనాంబికా!

పరకాంతారతులౌచు, నీచులనుడుల్ పాటింపు చున్మత్తులౌ
ధరణీనాథు లెఱుంగ నేర్తురె కవిత్వాసారశైత్యంబు, సూ
కరము ల్మెచ్చునె పుష్పసౌరభము పంకంబున్మదిన్మెచ్చెడిన్
ఖరముల్ మెచ్చునె గంధధూళి శ్రీ జ్ఞానప్రసూనాంబికా!

దాసీ భోగ విలాస లాలసులు, నిద్రాయత్తచిత్తుల్, పర
త్రాసోన్మత్తులు, మధ్యపాననిరతుల్ దంభప్రతాపుల్ దుర
భ్యాసాసక్తులు, రాజులైనఁ దనరున్నారాజ్యపున్లక్ష్మి రా
కాసుం జేరిన రంభయట్లు శ్రీ జ్ఞానప్రసూనాంబికా!

మూలాలు

మార్చు