శ్రీ రణమండల వీరాంజనేయస్వామి ఆలయం (ఆదోని)

రణమండల వీరాంజనేయస్వామి ఆలయం, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదోని పట్టణంలో ఉంది. ఇది రెండు కొండలపైన వెలసిన పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాలలో ఆంజనేయస్వామి ఆలయాలలో యాదాద్రి శ్రీ వీరాంజనేయ భైరవ దేవస్వామి ఆలయం ఒకటి. చాలామంది, యాదాద్రి, యాదవగిరి అని పిలువబడే ఆ క్షేత్రాన్ని గురించి తెలియకపోవచ్చు. కానీ 'ఆదోని శ్రీ వీరాంజినేయభైరవదేవస్వామి ఆలయం' అంటే ఇట్టే తెలిసిపోతుంది. ఆదోని పట్టణంలో రెండు కొండలపైన వున్న ఈ పుణ్యస్థలం నిత్యం భక్త జనసందోహంతో కళకళలాడుతూంటుంది. ఆ స్వామి కరుణ కోసం భక్తులు వస్తూంటారు.

చరిత్ర

మార్చు

విజయనగర సామ్రాజ్య సైనిక స్థావరంగా ఉన్న ఆదోని, ఆరోజుల్లో యాదవగిరి లేక యాదాద్రి అని పిలువబడుతుండేది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం బీజాపూర్ సుల్తానుల ఆధీనంలోకి వచ్చింది. అతని కాలంలోనే ఆదోని కోట బాగా అభివృద్ధి చేయబడిందని అంటారు. అనంతరం మొగలాయిల పరిపాలనలో, ఆ తదనంతరం నిజాం నవాబుల పరిపాలనలో నున్న ఆదోని, చారిత్రాత్మకంగా ఎంతో ఘనచరిత్రను కలిగి వుందని తెలుస్తోంది. సిద్ధిమసూద్ ఖాన్ కాలంలో ఆదోని కళల కాణాచిగా ఖ్యాతికెక్కింది. నవాబు సిద్ది మసూద్ ఖాన్ అన్ని మతాలను సమానంగా ఆదరించేవాడు. ఆవిధంగా నవాబుకు రాఘవేంద్రులు అంటే అమితమైన భక్తి ఏర్పడింది. రాఘవేంద్రులు మహాసమాధిని పొందబోతోన్న తరుణంలో తన కోసం మంచాలా గ్రామాన్ని (ప్రస్తుత మంత్రాలయం) దానం చేయమని అడగడమే ఆలస్యం, నవాబు ఆ గ్రామాన్ని ఇచ్చేసాడు. తానొక ముస్లిం అయినందున హిందూ మందిరంలోకి అనుమతి లభించదు. ఈ వేదన నవాబును పట్టి పీడిస్తున్న విషయాన్ని గ్రహించిన రాఘవేంద్రులు, తాము మహాసమాధి అయిన తర్వాత నిర్మించే బృందావనం వంటి దానిని మందిరం పైనే నిర్మిస్తే, నవాబు మహాసమాధిని చూసినట్లవుతుందని చెప్పగా అతని శిష్యులు అలాగే నిర్మించారు. ఇప్పటికీ ఆ కట్టడం మంత్రాలయం ఉంది. ఈ విధంగా హిందూ ముస్లింల సఖ్యతకు ఆదోని ప్రాంతం ఓ చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. నవాబు సిద్ధిమసూద్ ఖాన్ ఎన్నో హిందూ దేవాలయాలను పునరుద్ధరించాడు. రాఘవేంద్రుల పూర్వావతారం అని చెప్పబడుతోన్న గురువ్యాసరాయలు ఇక్కడ వశించారని, అతను తమ అమృతహస్తాలతో స్వయంభూమూర్తియైన శ్రీరణమండల వీరాంజనేయ భైరవస్వామి వారికి శ్రావణమాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా ఆధారాలున్నాయి. అదేవిధంగా భక్త ప్రహ్లాదుని మునిమనుమడు, సాటిలేని దాతగా ఎనలేని కీర్తిప్రతిష్ఠలనందిన బలి చక్రవర్తికి ఈ పుణ్యప్రాంతంతో సంబంధం ఉందని భక్తజనుల విశ్వాసం. ఒకే కొండపై మూడు కొండశిఖరాలు నెలకొని ఉండటం, ఆ మూడు శిఖరాలపై మూడు ప్రసిద్ధ దేవాలయాలు నెలకొని ఉండటం ఇక్కడి విశేషం. శ్రీరణమండల వీరాంజనేయ ఆలయం, శ్రీవామనతీర్థుల బృందావనం, శివమారుతీ ఆలయం అంటూ ఈ మూడు ఆలయాలు ఆదోని ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెబుతున్నాయి.

పేరు వెనుక చరిత్ర

మార్చు

'రణమండల' ఆంజనేయస్వామికి ఈ పేరు రావడం వెనుక ఓ ఉదంతం పెర్కొనబడుతోంది. పూర్వం ఈ ఆంజనేయునికి 'భైరవదేవుడు' అనే పేరు ఉండేదట. అయితే విజయనగర సామ్రాజ్యంలోని వీరభటులు ఇక్కడి నుండి యుద్ధానికి బయలుదేరే వేళల్లో "శ్రీరణమండల వీరాంజనేయ భైరవస్వామి" అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్ళేవారని నాటి శాసనాల ద్వారాట తెలుస్తోంది. కొండపైనున్న శ్రీరణమండల వీరాంజనేయస్వామివారి ఆలయాన్ని చేరుకునేందుకు సుమారు 600 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. అలా మెట్లెక్కుతున్నప్పుడు శివలింగానికి ప్రక్కనే నందీశ్వరుని దర్శించుకోగలం. అలా మెట్లెక్కుతూ ఇంకొంచెం దూరం పైకెలితే, ఓ చిన్న ఆలయంలో సంతాన ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. ఈ స్వామిని మ్రొక్కుకుంటే సంతానప్రాప్తి లేనివారికి సంతానం కలుగుతుందని భక్తజనుల విశ్వాసం. ముందుకు వెళితే వినాయకుని విగ్రహం ఉంది. విఘ్నవినాయకుని దర్శించుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకెళితే 'శ్రీరణమండల వీరాంజనేయస్వామి' వారి దివ్యదర్శనం లభిస్తుంది. అభయహస్తంతో భక్తులను దీవిస్తోన్న స్వామివారు సింధూరవర్ణంతో మెరిసిపోతూంటారు. స్వామి తులసి, తమలపాకు మాలలను ధరించి ఉత్తరదిశవైపు ముఖం చేసి తూర్పుదిక్కుకు చూస్తున్నట్లు దర్శనమిస్తాడు. స్వామివారికి గోపురముతో కూడిన ఆలయ నిర్మాణం లేదు. ఆకాశమే గోపురం, సూర్యచంద్రులే దీపాలుగా ఆదోని కొండే పీఠంగా ఈ స్వామి గోచరిస్తుంటాడు. స్వామివారికి ఆలయాన్ని నిర్మించేందుకై గతంలో ఎన్నెన్నో ప్రయత్నాలు జరిగాయట. అయితే తనకు ఒకే ఒకరోజులో ఆలయాన్ని నిర్మించగలిగితే, ఆలయనిర్మానానికి ఒప్పుకుంటానని, అలా కుదరనప్పుడు తనకు అసలు ఆలయమే వద్దని స్వామివారు ఓ భక్తునికలలో కనిపించి చెప్పారట. అప్పట్నుంచి స్వామివారికి ఆలయాన్ని నిర్మించే ప్రయత్నాలు జరగలేదు. అయితే ప్రస్తుతం స్వామి చుట్టూ చలువరాళ్ళతో గోడలను ఏర్పాటు చేసారు. ఈ స్వామివారు మరో ప్రత్యేకతతో భక్తజనలను విస్మయపరుస్తూంటాడు. భక్తులు స్వామివారికి సమర్పించుకునే నాణేలను స్వామివారి విగ్రహానికి వెనగ్గా వెళ్ళి వీపుకు అంటిస్తే, ఆ నాణేలు అయస్కాంతానికి అతుక్కుపోయినట్లుగా అతుక్కుపోతుండటం విచిత్రం. స్వామివారి వెనుక శివాలయం, శ్రీ సీతారామలక్ష్మణఆంజనేయసమేత రామాలయం ఇటీవలే నిర్మించబడ్డాయి. ఇంకొంచెం దూరం వెళితే అమ్మవారి సన్నిధి కనబడుతోంది. త్రినేత్రి అయిన ఈ అమ్మవారిని సంతానం లేనివారు కొలుచుకుంటుంటారు. ఈ తల్లి సన్నిధికి ప్రక్కన గణేశమందిరం ఉంది. అమ్మవారి ముందు రెండు పాదుకలు కనబడుతూంటాయి. అమ్మవారి సన్నిధికి ప్రక్కనున్న వృక్షానికి సంతానం లేనివారు సంతానప్రాప్తికోసం కట్టిన ముడుపులను చూడగలం. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో శ్రీరణమండలవీరాంజనేయస్వామివారికి ఉత్సవాలు జరుగుతూంటాయి. శ్రావణమాసం ప్రారంభమైనది మొదలు మండలకాలంపాటు స్వామివారికి విశేషంగా అభిషేకాలు, ఆకు పూజలు జరుగుతూంటాయి. ప్రతి శనివారం విశేషపూజలు జరుగుతాయి. శ్రావణమాసంలో మూడవ శనివారం నాడు విశేష పూజలతో పాటూ అన్నదాన, రథోత్సవం కార్యక్రమాలు ఉంటాయి. మండలం రోజుల తర్వాత భాద్రపద పౌర్ణమినాడు మహాపూజను నిర్వహిస్తూంటారు.

ఇతర ఆలయాలు

మార్చు

ఎత్తైన కొండపై ప్రకృతి అందాల మధ్య అలరారే ఈ కొండపైకి ఎక్కి, చుట్టుప్రక్కలా కలియజూసినప్పుడు, ప్రక్కనున్న కొండలపై శ్రీవేణుగోపాలస్వామి ఆలయం, శివమారుతీ ఆలయం, నవ తీర్థ హనుమాన్ ఆలయం అంటూ పలు ఆలయాలు దర్శనమిస్తూంటాయి. వేణుగోపాలస్వామివారి ఆలయాన్ని చేరుకునేందుకు మెట్లున్నాయి. కానీ, నవతీర్థ హనుమ ఆలయాన్ని చేరుకోవాలంటే కొండరాళ్ళపై పాక్కుంటూ చేరుకోవాలి. ఆ కొండపైకి ఎక్కడం సులభం కాదు. ఆదోనికి అన్ని నగరాల నుంచి బస్సుల ద్వారా చేరుకోవచ్చు. ఆదోనికి దగ్గరలోనున్న రైల్వేస్టేషన్ మంత్రాలయం రోడ్డు. మంత్రాలయం దర్శించుకునే భక్తులు ఆదోని శ్రీరణమండల వీరాంజనేయస్వామిని దర్శించుకుంటుంటారు..

ప్రదేశ వివరాలు

మార్చు

ఆదోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలం. పట్టణం. కర్నూలు జిల్లాలోని వ్యాపార పట్టణం, ఇది పురపాలక సంఘం. ఆదోని రైలుమార్గంలో హైదరాబాదు నుండి 225 కి.మీ, మద్రాసు నుండి 494 కి.మీలు దూరములో ఉంది.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు