షట్కర్మలు:

కూర్మ పురాణములో వివరించిన శ్లోకము ప్రకారము బ్రాహ్మణుల లక్షణాలు చెప్పినప్పుడు ఈ శ్లోకము చెప్పబడింది.

యజనం యాజనం దానం బ్రాహ్మణస్యప్రతిగ్రహః
అధ్యాపనం చాధ్యయనం షట్కర్మాణి ద్విజోత్తమాః

  • యజనం = యజ్ఞం చేయడం
  • యాజనం = యజ్ఞం నిర్వహించడం
  • అధ్యయనం = (వేదం) చదవడం
  • అధ్యాపనం = వేదం చదివించడం, చదువు చెప్పడం
  • దానం = ఇవ్వడం
  • ప్రతిగ్రహం = తీసుకోవడం

ఈ క్రింది ఆరింటిని కూడా షట్కర్మలు అంటారు :

  • శాంతి
  • వశీకరణం
  • స్తంభనం
  • విద్వేషణం (పగ సాధించడం)
  • ఉచ్ఛాటనం (శాసనోల్లంఘనం)
  • మారణం

మరోరకం షట్కర్మాచరణను చేసే ధర్మపత్నిని గురించిన ఈ శ్లోకాన్ని చిత్తగించండి :

కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ.

ఇంటి పనులు చెయ్యడంలో దాసీ మనిషి లాగా, మంచి ఆలోచన ఇచ్చేటప్పుడు మంత్రి లాగా, అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి లాగా, భోజనం పెట్టేటప్పుడు తల్లి లాగా, పడకటింటిలో రంభ లాగా ఈ షట్కర్మ (ఆరు పనులు) లతో ఉండేది ధర్మపత్ని. ఇదీ ఈ శ్లోకానికి అర్థం. ఇక్కడ షట్కర్మ బదులు షద్ధర్మ అని పాఠభేదం కూడా ఉంది.

అంటే క్రింది ఆరింటిని కుడా షట్కర్మలు గా చెప్పవచ్చునన్నమాట.

  • ఇంటి పనులు చెయ్యడం
  • మంచి ఆలోచనను ఇవ్వడం
  • చక్కగా అలంకరించుకోవడం
  • కష్ట సమయాలలో ఓర్పుతో ఉండడం
  • ప్రీతిగా భోజనం పెట్టడం
  • పడకటింటిలో ఆనందాన్ని ఇవ్వడం

యోగాకు సంబంధించిన శుద్ధి ప్రక్రియలు కూడా "షట్కర్మలు" లేదా "షట్ క్రియలు"గా పేర్కొనబడినది:

  • నేతి : నాసికా శుద్ధిచేయడం.
  • ధౌతి : జీర్ణమండలాన్ని శుద్ధిచేయడం.
  • నౌళి : ఉదరకండరాల్ని పటిష్ఠం చేయడం.
  • బస్తి : పెద్దప్రేగుల్ని శుద్ధిచేయడం.
  • కపాలభాతి : మెదడు ముందరి భాగాన్ని ప్రేరేపించడం.
  • త్రాటకం : కనురెప్పవెయ్యకుండా దృష్టిని కేంద్రీకరించడం.