సందాపురం బిచ్చయ్య
సందాపురం బిచ్చయ్య మహబూబ్ నగర్ జిల్లా, వీపనగండ్ల మండలంలోని వెంకటాంపల్లి గ్రామానికి చెందిన కవి. హిందీ పండితుడిగా ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ, మరో వైపు సూక్తి సాగర అను కలం పేరుతో తెలుగులో పద్య, వచన రచనలు చేస్తూ, తెలుగు సాహిత్యాభివృద్ధికి తన వంతు సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం వనపర్తికి సమీపంలోని నాగవరంలో స్థిరపడ్డాడు.
సందాపురం బిచ్చయ్య | |
---|---|
జననం | సందాపురం బిచ్చయ్య మహబూబ్ నగర్ జిల్లా, వీపనగండ్ల మండలంలోని వెంకటాంపల్లి గ్రామం |
నివాస ప్రాంతం | నాగవరం |
వృత్తి | ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | కవి |
మతం | హిందూ |
ఉద్యోగ జీవితంసవరించు
సందాపురం బిచ్చయ్య హిందీ సాహిత్య రత్న ( హిందీ బి.ఇడి.) పూర్తి చేసి, 1971లో హిందీ పండితుడిగా ఉద్యోగంలో చేరాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఉండవెల్లి, శ్రీరంగాపురం, అయ్యవారిపల్లె, వేపూరు, కొత్తకోట, సోలిపురం మొదలగు గ్రామాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు.2000 సంవత్సరంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యి, అప్పటి కలెక్టర్ అనంతరాము నుండి అవార్డును స్వీకరించాడు. ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ పిల్లలచే ఏకపాత్రలు, లఘు నాటికలు వేయించేవాడు. కవిత్వం, కథలు రాయడంలో శిక్షణ ఇచ్చేవాడు.
సాహిత్య కృషిసవరించు
బిచ్చయ్య తెలుగు భాషలో కథలు, కవితలు, ఏకపాత్రలు, నాటికలు మొదలగు ప్రక్రియలలో రచనలు చేశాడు. ఇప్పటికి పది పుస్తకాలను ముద్రించాడు. మరికొన్ని రచనలు ముద్రణకు సిద్ధం చేస్తున్నాడు. ఆయన రచనలు పలు పురస్కారాలకు ఎంపికయ్యాయి. 2000 సంవత్సరంలో చెన్నైకి చెందిన యునైటెడ్ రైటర్స్ అసోసియేషన్ సంస్థ వారు బిచ్చయ్యను జీవిత కాల సాఫల్య పురస్కారానికి ఎంపికచేయగా, అప్పటి రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ డాక్టర్ వై.వి. రెడ్డిచే పురస్కారాన్ని అందుకున్నాడు[1]. అనేక సాహిత్య సభల్లో పాల్గొని తెలుగు కవిత్వాన్ని వినిపించాడు.
రచనలుసవరించు
1971 లో హిందీ అధ్యాపకునిగా ఉద్యోగం చేపట్టిన తొలినాళ్లలోనే మన జాతీయ భాష అయిన హిందీని అతి సులువుగా నేర్చుకోవడానికి “ హిందీ అధ్యాపక్” పుస్తకాన్ని రచించినప్పటికీ, అనేక కారణాల వల్ల అది 1991 లో ముద్రించడం జరిగింది. బిచ్చయ్య , “సూక్తి సాగర్” అనే కలం పేరుతో వెలువడిన పుస్తకాలు 27ముద్రితాలు, 4 అముద్రితాలుగా వున్నాయి.
“హిందీ అధ్యాపక్” 1991
హిందీని అతిసులువుగా ఆట పాటలతో నేర్చుకోవడం ఎలా అని సూచించే పుస్తకం.
“శ్రీ నృహరీ శతకము” (పద్య సంపుటి) 1986
యాదగిరి లక్ష్మినరసింహ స్వామిని సంబోధిస్తూ 120 కందపద్యాలతో రాయబడిన శతకం.
“ఆత్మానందం” (పద్య సంపుటి) 1995
120 సీస పద్యాలలో రాయబడింది.
“శ్రీ పర్తి సాయి బాల్య లీలలు” 1995
గొల్ల సుద్దుల సంవాద, పాటలతో కూడిన నాటిక
“సూక్తి దీపిక” (కవితాసంపుటి) 1998
పశువులా ప్రవర్తిస్తున్న మనిషి మానవత్వం ఉన్న మనిషిగా బతకాలని ప్రబోధిస్తూ చేసిన రచన.
“జ్ఞాన దీపిక” (కవితాసంపుటి) 1999
92 పద్యాలతో, మనిషి ఆహారం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తూ చేయబడిన రచన.
“శాంతి దీపిక” (కవితాసంపుటి) 2003
“శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు సత్య సాయి భజన కీర్తనలు” 2006
“మానవ మనుగడకై ఎత్తుగడ” (పద్యగద్య సంపుటి) 2008
భగవద్గీత, ఉపనిషత్తుల ఆధారంగా మనిషి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమి చేయాలో, ఏ పద్ధతులను ఆచరించాలో తెలుపుతూ, పద్య, వచన రూపంలో రాయబడిన రచన.
సఖుడా! వివరించనా! (పద్య సంపుటి) 2010
“సూక్తి సాగర తరంగాలు” (పద్య సంపుటి) 2013
315 ఆటవెలది, తేటగీతి పద్యాలతో నీతిని బోధిస్తూ రాయబడింది.
“శతనామావళి” సంపుటి 2013
“శ్రీరామ నాగలింగేశ్వర శతకము” (పద్య సంపుటి) 2014
కవి తాను ప్రస్తుతం నివసిస్తున్ననాగవరం ప్రాంతంలోని రామ నాగలింగేశ్వరస్వామి పేరుతో రాసిన శతకం.
“ఆణిముత్యాలు” (పద్య గద్య గేయ సంపుటి) 2014
“అక్షర క్రమములో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రం” (ప్రతిపదార్థ వివరణ సహితం) 2015
“ఛాత్ర ప్రియుడా శతకము” (శిష్య ధర్మ సూక్తులు) 2016
“విజ్ఞులకు విజ్ఞప్తి” (పద్య సంపుటి) 2016
“సద్గుణేంద్ర” శతకము - 2017
“ఛందస్సు” (వర్గ ద్వయ రహిత రచన) 2017
“శిష్ట జ్ఞాని” శతకము (పద్య సంపుటి) 2018
“సర్వజ్ఞాని” శతకము (పద్య సంపుటి) 2018
“పద్యమే పంచామృతము” (పద్య సంపుటి) 2018
“అంతర్వాణి” శతకము (పద్య సంపుటి) 2018
“శ్రీరంగా శతకము” (పద్య సంపుటి) 2018,
“యెచట లేడు శతకము” (పద్య సంపుటి) 2019
“తెలుగు విలువ తెలిసి తిరుగు” (ద్విపద కావ్యము) 2019
“త్రిశత వృత్త – వృత్తి” (26 రకాలైన ఛందస్సుల వివరణ) 2019