సద్దామ్ హుస్సేన్ ఉరితీత


ఇరాక్ పూర్వ అధ్యక్షుడు సద్దామ్ హుస్సేన్ 2006 డిసెంబర్ 30 న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల 7 నిమిషాలకు ఉరి తీయబడ్డాడు. ఆయన పదవిలో ఉన్నప్పుడు మానవీయతకు విరుద్ధంగా చేసిన అకృత్యాలను విచారించిన ప్రత్యేక న్యాయ స్థానం 1982 లో దుజైల్ అనే పట్టణంలో 148 మంది షియాలను హతమార్చాడన్న అబియోగాన్ని నిర్దారించి ఈ శిక్షను అమలు జరిపింది. బాగ్దాదుకు ఈశాన్యంగా ఉండి పూర్వం సద్దాం ఉపయోగించిన “కాంప్ జస్టిస్” అనే చోట ఈ శిక్ష అమలు జరపబడింది. 1980 వ దశకం చివర్లో దాదాపుగా ఒక లక్షా ఎనభై వేలమంది కుర్దులను విష ప్రయోగం ద్వారా హతమార్చాడన్న అభియోగాన్ని కూడా సద్దాం ఎదుర్కొన్నప్పటికీ ఎలాంటి శిక్ష పడకుండానే ఆ విచారణ ముగిసింది. సద్దాం తో పాటు ఆయన సహచరులైన బార్జాన్ ఇబ్రహీం ఆల్ తిక్రిత్, ఆవాద్ హమీద్ ఆల్ బందర్ లు కూడా దోషులుగా నిర్దారించబడ్డారు. అయితే వారు ఈదుల్ అధా పండుగ తర్వాత శిక్షించ బడాలని నిర్ణయించ బడినందున సద్దాం ఒక్కడే ప్రస్తుతం ఉరి తీయబడ్డాడు.


ఉరికి ముందు సద్దామ్ నల్లని ముసుగు ధరించటానికి నిరాకరించాడు. భయపడొద్దంటూ తనతో అన్నాడని ఇరాక్ జాతీయ భద్రతా సలహాదారుడు మౌఆఫక్ ఆల్ రుబాయీ ఆల్ అరేబియా టెలివిజనుకు చెప్పాడు. ఉరి తీసే సమయంలో సద్దాం చాలా ప్రశాంతంగా, నిర్భయంగా ఉన్నాడని ఆ సమయంలో అక్కడున్న ఓ ఇరాక్ ఉన్నతాధికారి చెప్పాడు. ఉరికొయ్యకు తనను తీసుకెళుతున్న సమయంలో అతడు ఎలాంటి ప్రతిఘటన చూపకుండా ఇస్లాం మత విశ్వాసాన్ని వల్లించాడు.విచారణ సమయంలో తనతో అట్టిపెట్టుకొన్న ఖురాన్ ను తన వెంట తీసుకెళ్ళాడని ఫాక్స్ న్యూస్ రిపోర్టర్ పేర్కొన్నాడు. దేవుడు గొప్పవాడని, తన జాతి జయిస్తుందని పాలస్తీనా అరబ్బులదే నంటూ సద్దాం ఆ సమయంలో నినదించాడని ఆ రిపోర్టర్ పేర్కొన్నాడు. సద్దామును ఉరి తీసిన సమయంలో అమెరికా ప్రతినిధులెవ్వరూ అక్కడ లేరు.


ప్రస్తుతం జోర్డాన్ చెరలో ఉన్న సద్దాం పెద్ద కుమార్తె రఘాద్ హుస్సేన్ తన తండ్రి మ్రుత దేహాన్ని తాత్కాలికంగా యెమెన్ లో ఖననం చెయ్యాలని, ఇరాక్ విముక్తమయ్యాక తిరిగి అక్కడ ఖననం చెయ్యాలని తనను టెలిఫోన్ లో కోరినట్లు ఆ కుటుంబానికి చెందిన సమీప బంధువు పేర్కొన్నాడు.


ఈ సంఘటన యావత్తూ చిత్రీకరించ బడిందని దేవుని చిత్తమైతే అది చూపించ బడుతుందని ఇరాక్ చట్ట సభలో షియా విభాగానికి పూర్వం ప్రతినిధిగా ఉన్న మరియం ఆల్ రయేస్ అనే న్యాయ నిపుణుడు ఆల్ ఇరాకీయ టెలివిజన్ తో చెప్పాడు.


ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత దక్షిణ ఇరాక్ లోని షైతే పట్టణం లో అతి పెద్ద కారు బాంబు ప్రేలుడు సంభవించింది.


భారతీయ విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రతిస్పందిస్తూ "సద్దాం ఉరి శిక్ష కొనసాగించ బడకూడదని తాము అభిప్రాయాన్ని వ్యక్త పరిచామని అయితే ఈ సంఘటన తమను నిరాశకు గురిచేసింద"ని అన్నాడు.