సమాచార హక్కు

సమాచార

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు (Right to Information). సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం (Right to Information Act)[1] భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు పార్లమెంటు, లేక విధాన సభ లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ చట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది. ప్రభుత్వ అధికారులు అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 17 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి. సమాచార హక్కు చట్టంలో మెుత్తం 6 అధ్యాయాలు, 31సెక్షన్లు ఉన్నాయి.

సమాచార హక్కు
Emblem of India.svg
భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం. భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు పార్లమెంటు, లేక విధాన సభ లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ చట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది,
CitationAct No. 22 of 2005
Territorial extentWhole of India
Enacted byParliament of India
Date enacted15-June-2005
Date assented to22-June-2005
Date commenced12-October-2005
Status: In force

సమాచారంసవరించు

రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ మెయిళ్లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, నమూనాలు, తనిఖీ రికార్డులు మొదలైనవి. ఈ సమాచారం ఎలక్ట్రానిక్ రూపంలోనైనా వుండవచ్చు. ఉదాహరణకు,

 • రేషన్ డీలరు కార్డులు, అమ్మకాల వివరాలు
 • ప్రాథమిక ఆరోగ్యకేంద్రము వార్షిక నిధులు, ఖర్చులు, లబ్ధిదారుల వివరాలు
 • ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులు, వారికి అందిన సహాయం
 • జిల్లా ప్రజా ప్రతినిధులు (ఎంపీ, శాసన సభ్యులు) నియోజకవర్గ అభివృద్ధి నిధులు వినియోగపు వివరాలు
 • ఎన్నికల కమిషనర్‌ కార్యాలయంనుండి వివరాలు
 • 'ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలు

ఏ ప్రభుత్వ యంత్రాంగము వద్దనున్న సమాచారమునైనను సేకరించుకొనే హక్కును సమాచార హక్కు చట్టము 2005 కల్పించుచున్నది. అంటే, సదరు సమాచారమును కలిగిన పనులు, పత్రాలు, రికార్డులు తనిఖీ చేసేందుకు, వాటి యొక్క నోట్సు తీసుకొనేందుకు, ధ్రువీకృత ప్రతులు పొందేందుకు, ఏదైనా పదార్ధము యొక్క ధ్రువీకృత నమూనాలు పొందేందుకు, కంప్యూటర్ లేదా ఏదైనా పరికరములో నిక్షిప్తము చేయబడిన సమాచారమును డిస్కెట్లు, ప్లాపీలు, టేపులు, వీడియో కేసెట్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ రూపములో గాని లేదా వాటి ప్రింట్లు గాని పొందేందుకు లేదా సమాచారమును సేకరించుకొనే హక్కును సమాచార హక్కు చట్టము అందుబాటులోకి తెచ్చింది.

అన్వయింపులుసవరించు

ప్రభుత్వం, న్యాయ, శాసన వ్యవస్థల సంస్థలు, ప్రభుత్వం ఇచ్చే పాక్షిక నిధులతో నడిచే సంస్థలు పౌరులు కోరిన సమాచారాన్ని ఇవ్వాలి. అంటే జిల్లాపరిషత్ లు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీలు, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఇతర రెవిన్యూ అధికార కార్యాలయాలు, విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖ, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ బ్యాంకులు, సంస్థలు మొదలైనవన్నింటికి ఈ చట్టం అన్వయిస్తుంది. కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వం నిర్దేశించిన భధ్రతా లేక గూఢచార సంస్థలకి మినహాయింపు ఉంది. అయితే, అవినీతి ఆరోపణలు , మానవ హక్కుల అతిక్రమణలకు సంబంధించిన సమాచార విడుదల సందర్భములో ఈ మినహాయింపు వర్తించదు. ఈ చట్టము క్రింద కొన్ని నియమాల క్రింద సమాచారమును ఇచ్చేందుకు మినహాయింపు ఉంది. అయితే, వాటిలో బహుళ ప్రజా ప్రయోజనము దృష్ట్యా సమాచారము ఇచ్చేందుకు కూడా అవకాశము ఉంది.

పద్ధతిసవరించు

సమాచారం అవసరమైన వారు, సంబంధీత కార్యాలయం ప్రజా సమాచార లేక సహాయ ప్రజా సమాచార అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తెల్ల కాగితంపై రాస్తే చాలు. వ్రాయటం తెలియకపోయినా సమాచారము సక్రమముగా కోరే అవగాహన లేకపోయినా సంబంధిత పౌర సమాచార అధికారి వారు తగిన సహాయము/ఏర్పాటు చేస్తారు. తెల్లకార్డున్న పేదలకు, గ్రామస్థాయి సంస్థల్లో అడిగే సమాచారానికీ దరఖాస్తు రుసుము లేదు. మండల స్థాయిలో రూ.ఐదు, జిల్లా స్థాయిలో రూ.పదికి మించి రుసుము వసూలు చేయరాదు. అడిగిన సమాచారం ఇవ్వడానికి అయ్యే ఖర్చు మాత్రం దరఖాస్తుదారు నుంచి వసూలు చేయవచ్చు. అడిగిన తరువాత నెల (30 మాత్రము) రోజులు దాటితే ఎంతటి సమాచారమైనా ఉచితంగా ఇవ్వాలి. దరఖాస్తు స్వీకరణ రసీదు తీసుకోవాలి. ఆ తేదినుండి 30 రోజులలోగా సమాచారాన్ని ఇవ్వాలి. ఇవ్వలేకపోతే లేక తిరస్కరించినట్లయితే దానికి కారణాలను తెలపాలి. ఏ సమాచారము ఇవ్వకుండా దరఖాస్తుకు ప్రతిస్పందించకుండా ఉంటే 30 రోజులు ముగిసిన తరువాత ఆ దరఖాస్తును తిరస్కరించినట్లుగా భావించబడును. అంతకుముందు, సమాచార ప్రతిని అందజేయటానికి అయ్యే ఖర్చు చెల్లింపమని దరఖాస్తుదారుని కోరవచ్చు. అటువంటప్పుడు, దరఖాస్తు దారుడు డబ్బు చెల్లించటానికి అవసరమైన, తీసుకొన్న సమయాన్ని గడువునుండి మినహాయిస్తారు. తిరస్కరించిన లేదా ప్రతిస్పందించని దరఖాస్తు విషయములో లేదా ఇచ్చిన సమాచారములో లోపాలు, వాస్తవ విరుద్దాలు లేదా తప్పులు ఉన్నవని భావించేటట్లయితే దరఖాస్తుదారు సంబంధిత అప్పిల్లేట్ అధికారి వారికి అప్పటికి సమాచారము సక్రమముగా లేదా అసలు అందకపోతే సంబంధిత సమాచార కమిషన్ వారికి విహిత రీతిన అప్పీలు చేసుకొవచ్చు.

ఈ దిగువ సందర్భములలో ఏ వ్యక్తి అయిననూ సంబంధిత కేంద్ర సమాచార కమిషన్/రాష్ట్ర సమాచార కమిషన్ వారికి నేరుగా పిర్యాదు చేయవచ్చు:
1. ఏదేని ప్రభుత్వ యంత్రాంగములో సమాచారము కొరకు దరఖాస్తు సమర్పించేందుకు గాని అప్పీలు స్వీకరించేందుకు గాని సంబంధిత పౌర సమాచార అధికారి లేదా సహాయ పౌర సమాచార అధికారి లేదా అప్పిల్లేట్ అధికారి వారిని నియమించలేదను లేదా ఖాళీగా ఉందనో కారణముపై స్వీకరించుటకు తిరస్కరించిన దరఖాస్తు విషయములో
2. .సమాచారము ఇచ్చేందుకు చెల్లించ కోరిన ఫీజు అసంబద్ధముగా ఉన్నదని భావించినట్లయితే

సమాచారం కోరుచూ నేరుగా సంబంధిత కేంద్ర సమాచార కమిషన్/రాష్ట్ర సమాచార కమిషన్ వారికి దరఖాస్తు చేయరాదు.

సహ చట్టం వివరణలుసవరించు

అదనపు ఫీజుసవరించు

సమాచారం ఇచ్చేందుకు చట్టంలో నిర్దేశించిన రుసుం మినహా ఇతరత్రా ఎలాంటి అదనపు ఫీజు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయకూడదని సమాచార ప్రధాన కమిషనర్‌ తేల్చి చెప్పారు.[2] సాధారణంగా దరఖాస్తు రుసుం 10 రూపాయలు వసూలు చేయాలి. ఇది కాక ముద్రణ రూపంలో సమాచారాన్ని ఇస్తే ప్రతి పేజీకి రూ. 2 చొప్పున ఫోటోస్టాట్‌ ఖర్చుల్ని కూడా వసూలు చేయవచ్చు.కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని సమాచార కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రత్యేకంగా పుస్తకాలు, మ్యాప్‌లు, ప్లాన్లు, డాక్యుమెంట్లు సమకూరిస్తే ఇందుకు సంబంధించిన రుసుంను దరఖాస్తుదారుడి నుంచి వసూలు చేయవచ్చు. అలాగే సమాచారాన్ని తపాలా ద్వారా పంపితే అందుకయ్యే ఖర్చుల్ని కూడా దరఖాస్తుదారుడే చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వాధికారులు ఆస్తిపాస్తుల వివరాలుసవరించు

ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల ఆస్తి పాస్తుల వివరాలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఇవ్వాలి.ఆలిండియా సర్వీసుల (విధుల నిర్వహణ) చట్టం -1968 లోని 16వ నిబంధన ప్రకారం ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఎఫ్.ఎస్ అధికారులు తమ స్థిరాస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. అధికారుల ఆస్తివివరాల గురించి సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్, న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ తీర్పులిచ్చింది..

అమలుపై సమీక్ష, విమర్శలుసవరించు

దరఖాస్తు స్వీకరించక పొయిన, నిర్ణీత సమయములో సమాచారము ఇవ్వక పొయిన, దుర్బుద్ధితో నిరాకరించినా, తెలిసి తప్పు సమాచారం ఇచినా, మరే విధంగానైన ఆపిన రోజుకు 250 రూపాయలు జరిమాన విధించాలని సెక్షన్ 20 (1) చెప్థున్నది[3]

అమల్లో లోపాలుసవరించు

 • దరఖాస్తు రుసుం నగదు రూపంలో కూడా చెల్లించడానికి స.హ.చట్టం అవకాశం కల్పిస్తున్నా దరఖాస్తు తిరస్కరణతో చట్టాన్ని చట్టుబండలు చేస్తున్నారు.
 • అధికారులు తాము ఇవ్వదలచుకున్న సమాచారాన్నే ఇస్తున్నారు. స్పష్టంగా అడిగినా కోరిన సమాచారాన్ని ఇవ్వడం లేదు.
 • అడిగిన సమాచారంతో పాటు ఆ సమాచారం సకాలంలో పొందే హక్కు సమాచార హక్కు చట్టం కల్పించింది. దరఖాస్తు చేయడంలో లోపాలను, అస్పష్టతను ఆసరాగా తీసుకుని అధికారులు నెలల తరబడి తిప్పించుకుంటున్నారు.
 • సుపరిపాలన కేంద్రం సహకారంతో చేసే ప్రయత్నాలు వెబ్‌సైట్‌కే పరిమితమయ్యాయి.పూర్తిస్థాయిలో దరఖాస్తు నింపలేదని, సరైన సమాచారం అందులో పేర్కొనలేదని 65 శాతం దరఖాస్తులను ముందుగానే తిరస్కరిస్తున్నారు.
 • సమాచారం ఇవ్వడం ఇష్టంలేని అధికారులు కమిషన్ ముందు కూడా డొంక తిరుగుడు సమాధానాలతో సహనపరీక్ష పెడుతున్నారు. సమాచారం ఇస్తామని విచారణ సమయంలో అంగీకరించి తర్వాత మొండికేస్తున్నారు.
 • అప్పీల్ చేస్తే షోకాజ్ నోటీసులిచ్చి రెండోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

స.హ. చట్టం అమల్లో రాష్ట్రాల కమీషనర్లే కీలకంసవరించు

ఒకప్పటి కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ వజహత్ హబీబుల్లా అభిప్రాయాలు:

 • ఏ రాష్ట్రమూ ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. అప్పీళ్ల విషయంలో చురుగ్గా వ్యవహరించే కొందరు కమిషనర్ల పర్యవేక్షణలో ఉన్న ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం మెరుగ్గా అమలు అవుతోంది.పాత్రికేయులు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని ప్రజలకు ఉపయోగపడే పరిశోధనాత్మక జర్నలిజానికి పూనుకోవాలి.
 • చట్టం గ్రామ స్థాయి వరకు వెళ్లలేదు. గ్రామీణ ప్రజల నిరక్ష్యరాస్యత, మీడియా ఎక్కువగా పట్టణాలకే పరిమితం కావడం ఇందుకు కారణాలు. సమాచార చట్టంపై గ్రామీణుల్లో అవగాహన పెరగాలి. అప్పుడే వారికి ఇతర చట్టాలపైనా అవగాహన పెరుగుతుంది. గ్రామీణులు ఎవరైనా సమాచారం అడిగితే పంచాయతీ అధికారులు ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసివ్వాలి.
 • దరఖాస్తు చేసిన 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలన్న గడువును కుదించాల్సిన అవసరం లేదు. పూర్తి సమాచారం అందివ్వాలంటే ఆమాత్రం సమయం అవుతుంది. తగ్గిస్తే అధికారులు ఒత్తిడిలో తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది.
 • సమాచార కమిషన్లు విశ్రాంత ఐఏఎస్ అధికారులకు పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయన్న ఆరోపణ నిజమే. కానీ, నాలుగైదు శాఖల్లో 20 ఏళ్లకు పైగా పనిచేసిన అధికారులే సమాచారాన్ని సకాలంలో ఇవ్వలేకపోతే ఇతరులు ఇవ్వడం కాస్త కష్టమే. హక్కుల ఉద్యమకారులు అడుగుతున్నట్లు న్యాయమూర్తులను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, పాత్రికేయులను నియమిస్తే మరింత పారదర్శకత ఉంటుంది.
 • పీఐవోలు, అప్పిలేట్ అధికారుల్లో అవగాహన పెరగకపోవడానికి సమాచార అధికారికి దస్త్రాలు నమోదు చేయడం, వాటిని కార్యాలయాల్లో ప్రదర్శించడానికే సమయం సరిపోతోంది. కిందిస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వలేకున్నారు.

అంతర్జాలంలోసవరించు

 • రాష్ట్రప్రభుత్వం: https://sic.ap.gov.in/ Archived 2020-09-23 at the Wayback Machine
 • కేంద్ర ప్రభుత్వం: www.cic.gov.in. ఇది కేవలం కేంద్ర ప్రభ్యుత్వ కార్యాలయాలలో సమాచారం కోసమే
 • తెలుగులో సమాచారచట్టం, దరఖాస్తు ఫారాలకోసం: www.rti.eenadu.net అందుబాటులో ఉన్నాయి.
 • ఆఫీసులకు వెళ్ళలేనివాళ్ళు అంతర్జాలంలో సమాచారాన్ని దీనిద్వారా పొందవచ్చు.www.rtionline.gov.in.

దరఖాస్తుదారు ఏ ఆఫీసు నుంచయినా తనకవసరమైన సమాచారాన్ని 30 రోజులలోపు పొందవచ్చు. గడువులోగా సమాచారం రానియెడల ప్రజాసమాచార (P.I.O) అధికారికి రు.10/- రుసుం చెల్లించి ధరఖాస్తు చేసి 30 రోజులలోపు సమాచారం పొందవచ్చు. ఫీజు ఆఫీసులో చెల్లించి రశీదు పొందవచ్చు. లేదా పోస్టల్ ఆర్డర్ పోస్టాఫీసులో కొని జతపర్చాలి. నాన్ జుడీష్యల్ స్టాంప్ దరఖాస్తునకు అంటించాలి. నాన్ జుడీష్యల్ స్టాంప్ కేంద్రప్రభుత్వ కార్యాలయాలల్లో చెల్లదు. 30 రోజులలోపు సమాధానం రానియెడల రాస్ట్రసమాచార కమిషన్ కు దరఖాస్తుచేస్తూ తను ఇంతకుముందు సమర్పించిన దరఖాస్తు నకళ్ళను జతపత్చవలెను. ప్రభుత్వంనుంచి లబ్ధి పొడుతున్న జాతీయ పార్టీలకు కూడా ప్రభుత్వ సంస్థల్లాంటివేననీ, సమాచార హక్కుచట్టం వాటికి వర్తిస్తుందని జాతీయ సమాచార కమిషన్ తీర్పుయిచ్చింది. కానీ పార్టీలు దీని అమలుకు వ్యతిరేకిస్తున్నాయి.

వినియోగదారుల విజయాలుసవరించు

గడ్డిఅన్నారం వినియోగదారుల సంఘంసవరించు

గడ్డిఅన్నారం వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు సాధించిన కొన్ని విజయాలు.

 1. రైలులో భోజనం పెడతామని డబ్బులు వసూలుచేసి భోజనం అందించనందుకు రైల్వయ్నుంది రు.500/- నష్టపరిహారం, భోజనం డబ్బు వసూలుచేయటం అయినది.
 2. కొత్త బస్సులో షిర్డీ ప్రయాణం అనిచెప్పి డొక్కుబస్సువేసి యాత్రికులను ఇబ్బందిపెట్టిన ప్రైవేట్ ట్రావెల్ ఏజంట్ మీద వినియోగదారుల కోర్టులో కేసువేసి తనతోపాటు పదిమందికి పరిహారం ఇప్పించడం జరిగింది.
 3. బిల్లు కట్టినా టెలీఫోను కనెక్షన్ తీసివేసినందుకు ఆడిపాట్మెంట్ మీద కేసువేసి నష్టపరిహారం పొందారు.
 4. అధిక బిల్లువేసి ఒకవృద్ధురాలుని క్షోభ పెట్టినందుకు ఆమెతరపున కేసువేసి రు.10,000/- నష్టపరిహారం, ఆఫీసుకు 20 సార్లు తిప్పినందుకు రు.2000/- , కోర్టు ఖర్చులకు రు.1000/- ఇప్పించడం జరిగింది.
 5. కనీసమొత్తం బ్యాంకు ఖాతాలో లేనందుకు ప్రతినెలా పెనాల్టీ రుసుము తగ్గించినందుకు కర్ణాటక బ్యాంకు నుండి నష్టపరిహారం రు.1500/-పొందాము. కనీస మొత్తం పెరిగినపుడు ఖాతాదారునకు తప్పక తెలపాలి తీర్పు వచ్చింది.
 6. 1994-99 ఆటిపన్ను రివిజన్ గడ్డిఅన్నారంలో ఒకేసారి 400% పెంచినందుకు న్యాయపోరాటం జరిపి పన్నుతగ్గించేవరకు ప్రభుత్యంమెడలువంచాము. దీనివలన 6500 భవనయజమానులకు సుమారు ఒక కోటి నలభై లక్షలు లబ్ధిపోందారు.

ప్రతిసోమవారం ఈనాడు దినపత్రికలో సమాచారహక్కు గురించి వినియోగదారులు సాధించిన విజయాలను ప్రసురిస్తున్నారు.

నల్లగొండ జిల్లాలో సమాచార హక్కు సాధన సమితిసవరించు

 1. నల్లగొండ కార్మిక శాఖ నుండి భవన నిర్మాణ కార్మికులకు రావలసిన లబ్ధిని సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి రాష్ట్ర కార్మిక శాఖను కదిలించి సుమారు 48 మందికి లబ్ధిచేకూరే విధంగా చేశారు.
 2. మహిళ , శిశు సంక్షేమ శాఖలో వికలాంగులకు మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని సమాచార చట్టం ద్వారా ప్రశ్నించి సుమారు మూడు వందల మందికి లబ్ధి కలిగించి జిల్లాలో సామాజిక కార్యకర్తగా మంచి గుర్తింపు పొందారు.
 3. విద్యా శాఖ , వైద్య శాఖలలో ప్రైవేట్ యజమానులు చేస్తున్న దోపిడికి అడ్డుకట్టా వేసేందుకు చట్టం ద్వారా ప్రయత్నం చేస్తున్నారు.

GUARDS ఫర్ ఆర్ టి ఐ సాధించిన విజయాలుసవరించు

రాజమండ్రిలోని GUARDS స్వచ్చంద సంస్థ భారత రాజ్యాంగం  - సమాచారహక్కు చట్టం పై అనేక ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తోంది.

1) GUARDS ఫర్ ఆర్ టి అధ్యర్యంలో రాజమండ్రిలోని ఒక మీడియా సంస్థ తమ సంస్థలోని ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తున్న నేపథ్యంలో సమాచారహక్కు చట్టం దరఖాస్తు వేసి లేబర్ ఆక్ట్ అమలు చేయించి ఉన్న జీతాల కంటే డబుల్ జీతాలు పెంచడం జరిగింది. =

2) షెడ్యూల్డ్ తెగకు చెందిన ఒక ఉప కులమైన ఎరుకుల కుల వృత్తి పందుల పెంపకం. పందుల పెంపకందారులకు చాలాకాలంగా అపరిశ్రుతంగా ఉన్న సమస్య స్థల సమస్య. ఆ సమస్యను ఆర్ టి ఐ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి 2 ఎకరాల స్థలం మంజూరు చేయించడం జరిగింది.

3) రాజమండ్రికి అనుకుని ఉన్న లక్ష్మినగరంలో పాకలు వేసుకుని ఉన్నవారికి పట్టాలు ఇవ్వకపోవడంతో ఆర్ టి ఐ దరఖాస్తు వేసి వారికి పట్టాలు ఇప్పించే విధంగా కృషి చేయడం జరిగింది.

4) పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం గ్రామంలో అనేక సంవత్యరాలుగా అపరిశ్రుతంగా సమాధుల సమస్య, కంపోస్ట్ యార్డ్ వంటి అనేక సమస్యలు ఉండేవి. సహా చట్టం ఉపయోగించి 2020 లో గ్రామ సభ ఏర్పాటు చేయించి సమాధుల స్థల సమస్య, కంపోస్ట్ యార్డ్ సమస్య, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగింది.

5) విద్యాహక్కు చట్టంను ఉపయోగించి ప్రయివేట్ పాఠశాలలు, కాలేజీల్లో ఆర్ టి ఐ దరఖాస్తుల ద్వారా అనేకమందికి ఉచిత విద్యతోపాటు, రాయితో కూడిన విద్య అందేందుకు కృషి చేయడం జరిగింది.

మూలాలుసవరించు

 1. "సమాచార కమీషనర్ ప్రభుత్వవెబ్ సైట్". ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. Archived from the original on 2020-09-23. Retrieved 2021-01-24.
 2. ఈనాడు వార్త 9.11.2009
 3. "Right to Information: Public Officials Implementation Guide". www.humanrightsinitiative.org. Retrieved 2020-11-15.
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


లింకులుసవరించు