సర్కస్
సర్కస్ (Circus) అంటే ఒక చోటు నుంచి మరోచోటుకి ప్రయాణిస్తూ సందర్శకుల కోసం చిత్ర విచిత్రమైన విన్యాసాలు ప్రదర్శించే కళాకారులు, విదూషకులు, సుశిక్షితమైన జంతువుల బృందం లేదా ఆ బృందం ఇచ్చే ప్రదర్శన.
సర్కస్ కనుగొన్నది ఎవరు అని ఖచ్చితంగా తెలియకపోయినా ఫిలిప్ ఆస్ట్లీ అనే ఆయనను ఆధునిక సర్కస్ కు పితామహుడిగా భావిస్తారు. 1768లో ఫిలిప్ గుర్రపు స్వారీలో నిపుణుడైన గుర్రం మీద అనేక రకమైన విన్యాసాలు చేస్తూ థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఒక మైదానంలో అందరికోసం ప్రదర్శన ఇచ్చాడు.[1] 1770 లో ఈయన తాను చేసే స్వారీ ప్రదర్శనల మధ్యలో జనాలను వినోదపరచడం కోసం అక్రోబాట్లు (జిమ్నాస్టిక్ లేదా దొమ్మరి విన్యాసాలు చేసేవారు), తాడు మీద నడిచేవారు, జగ్లింగ్ (అనేక వస్తువులను గాలిలోకి విసిరి నేర్పుగా పట్టుకోవడం) చేసేవారు, విచిత్ర వేషధారణలతో నవ్వించే విదూషకులు వంటి వారిని తన బృందంలో చేర్చుకున్నాడు. ఇదే విధానాన్ని తర్వాతి కాలంలో సర్కస్ అని పిలవడం ప్రారంభించారు. తర్వాత 50 సంవత్సరాలల్లో సర్కస్ లో పెద్ద మైదానంలో యుద్ధాన్ని నటనలాగా ప్రదర్శించడం లాంటి కళలు బాగా పెరిగాయి.
చరిత్ర
మార్చుఆంగ్లభాషలో మొదటిసారిగా 14వ శతాబ్దంలో గుర్తించబడ్డ సర్కస్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది.[2] దీని అర్థం వృత్తం లేదా వలయం.[3]
సర్కస్ మూలాలు
మార్చుపురాతన రోమ్ లో సర్కస్ అనే ఒక విశాలమైన భవనంలో గుర్రాల, రథాల పరుగు పందేలు, గుర్రపు స్వారీ పోటీలు, కృత్రిమంగా ఏర్పాటు చేసిన యుద్ధ పోటీలు, యుద్ధ వీరుల (gladiators) విన్యాసాలు, శిక్షణ పొందిన జంతువులతో పోరాటాలు మొదలైనవి ప్రదర్శించేవారు.