పూసపాటి విజయానంద గజపతి రాజు

క్రికెట్ ఆటగాడు
(సర్ విజ్జీ నుండి దారిమార్పు చెందింది)

పూసపాటి విజయానంద గజపతి రాజు (1905-1965) భారతీయ క్రికెట్ కెప్టెన్, రాజకీయ నాయకుడు. విజయనగర గజపతి వంశానికి చెందిన యువరాజు. క్రికెట్ ప్రపంచంలో విజ్జీగా పేరొందాడు.

విజయానంద గజపతిరాజు

జీవిత విశేషాలు మార్చు

విజయానంద గజపతి, విజయనగరం పాలకుడైన పూసపాటి విజయరామ గజపతిరాజు రెండవ కుమారుడు. ఈయన 1905, డిసెంబర్ 28న జన్మించాడు. ఈయన మహారాజకుమార్ అన్న రాచరిక పట్టం పొందాడు. 1922లో తండ్రి మరణం తర్వాత కుటుంబం బెనారస్ ఎస్టేటును వారసత్వంగా పొంది, 1923 ఫిబ్రవరీలో కాశీపూర్ జమిందారు రాజా ఉదయరాజ్ సింగ్ యొక్క పెద్దకూతురు భగీరథీ దేవిని వివాహమాడాడు.[1] ఈయన విద్యాభ్యాసం అజ్మీరులోని ప్రిన్సెస్ కళాశాల, హెయిల్స్‌బరీ, ఇంగ్లాండులోని ఇంపీరియర్ సర్వీసు కాలేజీలలో సాగింది. టెన్నీస్, క్రికెట్ క్రీడలలో మంచి ప్రావీణ్యం సంపాదించిన విజ్జీ చేయితిరిగిన వేటగాడు కూడా. ఈయన 383 సింహాలను వేటాడాడని ప్రతీతి. అయితే ఈయన 1965, డిసెంబరు 2న కాన్పూరు సమీపంలో ఒక చెరుకు తోటలో ఏనుగుపై ఎక్కి వేటాడుతుండగా, గాయపడిన సివంగి లంఘించగా, ఏనుగు పైనుండి జారిపడిన ప్రమాదంలో కిడ్నీ దెబ్బతిని మరణించాడు.[2]

క్రికెట్ మార్చు

విజ్జీ కేవలం మూడు టెస్టు క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. ఈయన 1936లో ఇంగ్లాడు పర్యటించిన భారతజట్టుకు నేతృత్వం వహించాడు. ఆ సంవత్సరమే ఇంగ్లాడుకు చెందిన ఏడవ ఎడ్వర్డ్ రాజు జన్మదిన సందర్భంగా ఈయన్ను బ్రిటీషు ప్రభుత్వం సర్ బిరుదుతో సత్కరించింది. 1953లో ఆంధ్ర క్రికెట్ సమాఖ్యను స్థాపించి దానికి అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. ఆ సమయంలోనే ఉత్తరప్రదేశ్ క్రికెట్ సమాఖ్యకు కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఒకే సమయంలో రెండు రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు అధ్యక్షుడిగా ఉండే గౌరవం పొందిన వ్యక్తి ఈయన ఒక్కడే. విజ్జీ 1954 నుండి 1957 వరకు బి.సి.సి.ఐ అధ్యక్షునిగా పనిచేశాడు. సంయుక్త పరగణాల్లో, స్వాతంత్ర్యం తర్వాత ఉత్తరప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధికి విశేషకృషి చేశాడు.

రాజకీయాలు మార్చు

మన దేశ స్వాతంత్ర్యపోరాటంలో, రాజకీయాలలో విజ్జీ చురుకుగా పాల్గొన్నాడు. 1937లోఉత్తర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి పదవిని నిర్వహించాడు. 1941లో మహాత్మా గాంధీ పిలుపును అనుసరించి వ్యక్తిసత్యాగ్రహంలో పాల్గొన్నాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమకాలంలో రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించాడు. బెనారస్‌లో ఉన్న తన భవనంలో అనేకమంది రాజకీయవేత్తలకు ఆశ్రయం ఇచ్చాడు. 1942లో ఆంధ్రమహాసభ అధ్యక్షుడిగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం సర్ స్టాఫర్డ్ క్రిప్స్ వద్దకు రాయబారం వెళ్ళాడు. కొంతకాలం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సర్ బిరుదును విసర్జించాడు.

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-05-30. Retrieved 2010-07-29.
  2. The legend of the maneater By Arjan Singh