సాయి పద్మ

సాయి పద్మ ఒక న్యాయవాది, వికలాంగురాలు, ప్రవృత్తి రీత్యా సామాజిక కార్యకర్త. ఒక సేవా సంస్థకు డైరెక

సాయి పద్మ ఒక న్యాయవాది, వికలాంగురాలు, ప్రవృత్తి రీత్యా సామాజిక కార్యకర్త. ఒక సేవా సంస్థకు డైరెక్టర్.

సాయి పద్మ
జననం: 1971
గజపతినగరం,విజయనగరంజిల్లా
మరణం:16 April 2024
వృత్తి: గ్లోబల్ ఎయిడ్ సంస్థకి ఫౌండర్ డైరక్టర్,
న్యాయవాది, సామాజిక కార్యకర్త, రచయిత్రి
భర్త/భార్య:ప్రజ్ఞానంద్
వెబ్‌సైటు:గ్లోబల్ ఎయిడ్ (ఎబిలిటీ ఇన్ డిజేబిలిటీ) అనే స్వచ్చంద సంస్థ
తండ్రి బి.ఎస్.ఆర్.మూర్తి, తల్లి ఆది శేషు.ఇద్దరు కూడా వైద్యులు.తమ్ముడు, చెల్లెలు కూడా వైద్యులే. ఆమె బాల్యం నుండే వికలాంగురాలు,

సాయి పద్మ ఒక గ్లోబల్ ఎయిడ్ సంస్థకి ఫౌండర్ డైరక్టర్. ఆమె వృత్తి రీత్యా న్యాయవాది. ఆమె బాల్యం నుండే వికలాంగురాలు, ప్రవృత్తి రీత్యా సామాజ సేవ, శారీరిక, సాంఘిక వికలాంగత్వంపై పని చేసింది. గ్లోబల్ ఎయిడ్, బ్రేస్ టెక్ వంటి సంస్థలు స్థాపించింది. తెలుగులో కథలు, కవితలు రాశారు. సామాజిక సేవ చేశారు. వికలాంగుల హక్కుల కోసం పోరాడారు. దేశ విదేశాలలో సభలు, సమావేశాలలో తన ఆలోచనలను వందల వేల మందితో పంచుకున్నారు. బ్రేసెస్ సాయంతో నడవడంతో పాటు ఈత కొట్టడం, కారు నడపడం నేర్చుకున్నారు.[1]

జీవిత విశేషాలు

మార్చు

సాయి పద్మ తమ స్వస్థలం విజయనగరం జిల్లా గజపతినగరంలో 1971లో జన్మించింది. తండ్రి బి.ఎస్.ఆర్.మూర్తి, తల్లి ఆది శేషు. తల్లి తండ్రులు ఇద్దరు కూడా విశాఖపట్నం, ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో వైద్యులు. ఆమె తమ్ముడు, చెల్లెలు కూడా వైద్యులే. ఆమెకు ఆరోగ్య నిబంధనల ప్రకారం 90 రోజులకు పోలియో వాక్సిన్ వేయించే ముందే, పుట్టిన నెలన్నరకే పోలియో వ్యాధి సోకింది. ఫలితంగా కాళ్ళు చేతులు చచ్చుపడ్డాయి. గొంతు రాలేదు. 52 షాక్ చికిత్సలు చేసారు. 18 శస్త్ర చికిత్సలు చేసారు. చివరికి కాళ్ళు తప్పించి మిగతా అవయవాలు పనిచేయడం ప్రారంభించాయి. ఫలితంగా ఆమె చక్రాల కుర్చీకే పరిమితమైంది.[2]

శారీరిక వైకల్యాన్ని అధిగమించి కామర్స్‌లో డిగ్రీ { ఎం.కామ్.} చేసి, ఆ పైన మేధోపరమైన హక్కులు, సైబర్ చట్టాలపై ప్రత్యేకంగా ఎల్‌ఎల్‌బి చదివి న్యాయవాది వృత్తి చేపట్టింది. సంగీతం లో అభిరుచితో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సంగీతంలో డిప్లమా చేసింది.[1] 2007 లో ఆమె అమెరికాలో పాడిన "వైష్ణవ జనతో " పాటకు 7 నిముషాలలో 20 లక్షల రూపాయలు సమకూరింది. ఆ మొత్తాన్ని వికలాంగుల సంక్షేమానికి వినియోగించింది.[2]

2005-2006 లో ఒక స్వచ్చంద సంస్థకు సంచాలకుడుగా పనిచేస్తున్న ప్రజ్ఞానంద్ తో పద్మకు పరిచయం ఏర్పడి 2008లో వివాహం చేసుకుంది. అప్పటినుండి సామాజిక సేవాకార్యక్రమాలలో, ఆమెకు నడక వైకల్యం విషయం లో చేదోడు వాదోడుగా నిలిచాడు.[2]

ఆమె ఏప్రిల్ 16, 2024 నెలలో అకస్మాత్తుగా మరణించింది. [3][4]

సేవా కార్యక్రమాలు

మార్చు

ఎం.కామ్., బ్యాచిలర్ అఫ్ లా చదివి న్యాయవాది వృత్తి చేపట్టింది. వికలాంగులకు కేసులు, దాంపత్య వివాదాలకు పరిష్కారాలు కూడా 75% విజయవంతంగా నిర్వహించింది.

తనలాంటి వికలాంగులకు ఆర్ధికంగా సామాజికంగా ఆసరా లేనివారికి ఉపయోగపడేలా ఒక సంస్థని స్థాపించే ఆశయముతో అమెరికా వెళ్లి అధ్యయనం చేసి ఆమె భర్త ప్రజ్ఞానంద్ తో కలసి గ్లోబల్ ఎయిడ్ (ఎబిలిటీ ఇన్ డిజేబిలిటీ) అనే స్వచ్చంద సంస్థ స్థాపించింది. దీనిద్వారా వికలాంగులకు, హెచ్. ఐ. వి. ఎయిడ్స్ బాధితులకు విద్య, వైద్యం, సాయం, చక్రాల కుర్చీలు, కాలిపర్స్, వంటివి ఇచ్చారు. ఉద్యోగావకాశాలకు తోడ్పాటు అందించింది. కార్లకు వికలాంగులు నడిపేలా మార్పులు చేసి, వీరికి శిక్షణ ఇచ్చి తమకు తామే వాహనాలను నడుపుకునే సౌకర్యం కలిపించారు. వికలాంగులకు క్రీడలలో కూడా ప్రోత్సాహం ఇస్తున్నారు.[5]

పేద విద్యార్థులకి గిరిజనులకు ఉచిత వసతి గృహం నడిపారు. ఈ కార్యక్రమానికి హబ్స్ (హాస్టల్స్ అండ్ హామ్లెట్స్), స్పోక్స్ (ఎడ్యుకేషన్ సెంటర్) అని పేరు పెట్టారు. 'జయంతి ఫౌండేషన్, అమెరికా నుండి ప్రత్యేక గుర్తింపు అవార్డును అందుకున్నారు.[6]

రచనలు

మార్చు

శస్త్ర చికిత్సలు జరిగేటప్పుడు చాలాకాలం మంచం లో ఉండవలసి రావడముతో సాయి పద్మ మార్పుకోసం రచనా వ్యాసంగం మొదలు పెట్టింది. ఆంగ్లంలో 'లైఫ్' అను కవితల పుస్తకం, తెలుగులో 15 కధలు, ట్రావెలోగ్, తమ్మి మొగ్గలు వంటి పుస్తకాలు రాసింది. [2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "ఆమె ఒక మహావృక్షం!". ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. 23 April 2024. Retrieved 23 April 2024.
  2. 2.0 2.1 2.2 2.3 కోటేశ్వర రావు, బెల్లం (31 March 2016). "నడుస్తోంది నడిపిస్తోంది". సాక్షి. Retrieved 23 April 2024.
  3. "కొందరి నిష్క్రమణ అంగీకరించలేం". దిశ. 18 April 2024. Retrieved 24 April 2024.
  4. "సాయి పద్మ గారికి నివాళి". సంచిక: తెలుగు సాహిత్య వెబ్ పత్రిక. 21 April 2024. Retrieved 24 April 2024.
  5. "సాయి పద్మ గారికి నివాళి". సంచిక : ఆన్లైన్ పత్రిక. 21 April 2024. Retrieved 24 April 2024.
  6. Jain, Reshma (28 September 2020). "From surviving Polio to being listed as one of the top 100 influential women, Sai Padma's grit says it all". SocioStory Foundation. Retrieved 24 April 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=సాయి_పద్మ&oldid=4195571" నుండి వెలికితీశారు