సిద్ధేశ్వరాలయం

నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పాటూరు గ్రామంలో ఉన్న దేవాలయం

క్రీస్తు శకం 1253 వ సంవత్సరంలో నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పాటూరు గ్రామ సిద్దేశ్వరాలయంలో తిక్కన తన ఆశయ సిద్దికి యజ్ఞం చేసి నట్లు చరిత్ర చెపుతున్నది. తన ఆశయ సిద్దికి ఈశ్వరాలయంలో యజ్ఞం చేసినందున ఆ ఆలయానికి సిద్దేశ్వరాలంగా పేరొచ్చింది. యజ్ఞం పూర్తి చేసిన తర్వాత తిక్కన సోమయాజిగా మారి మహా భారత రచనకు ఉపక్రమించాడు. అప్పటి యజ్ఞానికి సంబంధించిన అవశేషాలు నేడు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆయన పూజలు చేసిన నందీస్వరున్ని అపహరించారు. తిక్కన పూర్వీకులు "కొట్టురువు" ఇంటి పేరుతో పాటూరు గ్రామాధి పతులుగా పనిచేసి నట్లు చరిత్ర చెపుతున్నది. మనుమ సిద్ది కాలంలో తిక్కన ఇంటి పేరు "పాటూరుగా" మారినట్లు చరిత్ర కారులు చెపుతున్నారు. పదకొండు పర్యాలు ఆయన సిద్దేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లు కేతన తన దశకుమార చరిత్రలో పేర్కొన్నాడు. ఆలయ ప్రాంగణంలోని బావిలో తిక్కన స్నాన మాచరించి సంద్యా వందనాలర్పించే వాడు. ఆ బావి ఒరలో చెక్కిన దంద్రుడు, వినాయకుడు శిల్పాలు చాల అందంగా వుండేవి. కాని ఇప్పుడు ఆ బావిలో చెట్లు మొలచి ముళ్ల పొదలతో నిండి ఉంది. అందు చేత ఆ శిల్పాలను ఇప్పుడు చూడ వీలుగాదు. మహా భారత రచనకు ఉపయోగించి నట్లుగా చెప్పే ఘంటం తిక్కన వారసుల వద్ద వుండేదని చెప్పుతారు. "ఘంటం" వుంచే ఒరకు ఒకవైపు సరస్వతిదేవి, వినాయకుణ్ణి చెక్కారని, తాము చాలా సంవత్సరాల క్రితం దాన్ని చూశామని పాటూరు గ్రామ వయో వృద్దులు చెప్పారు. నెల్లూరుకు చెందిన సాహిత్య సంస్థ " వర్థమాన సమాజం" కొన్నేళ్ల క్రితం నిర్వ హించిన తిరునాళ్లలో దానిని ప్రదర్శించారు. ఆ తర్వాత అది కనబడకుండా పోయింది.

తిక్కన రూపాన్ని కేతన తన దశకుమార చరిత్రలో వర్ణించాడు. ఆ వర్ణన ఆధారంగా 1924 వ సంవత్సరంలో గుర్రం మల్లయ్య అనే చిత్రకారుడు ఆంధ్రా యూనివర్సిటి నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో తిక్కన రూపాన్ని చిత్రీకరించాడు. ఆ చిత్ర పటమే నేడు నెల్లూరు లోని వర్థమాన సామాజంలో పూజలందు కుంటున్నది. 1986 వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పునర్ నిర్మాణానికి రెండు లక్షల రూపాయలు మంజూరు చేసింది. అయితే.....సిద్ధేశ్వరాలయం, తిక్కన పూజించిన శిలలు అన్నీ తమ సొంతమనీ, ప్రభుత్వానికి గాని దేవాదాయ శాఖకు గాని సంబం లేదని పాటూరు వంశస్థుడు ఆలయ పునర్ నిర్మాణాన్ని అడ్డుకున్నాడు. పదేళ్ల క్రిందట ఒక భక్తుడు ఆలయానికి వెల్ల వేయించాడు. ఆ ఆలయం ఇప్పటికి శిథిలావస్థలోనే ఉంది." [1]

మూలాలు

మార్చు
  1. జనవరి,30 ఆదివారం, ఆంధ్ర జ్యోతి