చరవాణి (సెల్ ఫోన్)
ఈ మధ్య సెల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. సా. శ. 2011 లో ఈ భూలోకం జనాభా 7 బిలియనులు (7,000,000,000) అయితే 5 బిలియనుల సెల్ ఫోనులు వాడకంలో ఉండేవిట! ప్రపంచవ్యాప్తంగా 1990 నుండి 2011 వరకు మొబైల్ ఫోన్ల వినియోగదారులు 12.4 మిలియన్ల నుండి 6 బిలియన్లకు ఎగబాకింది. దీనిని బట్టి మనకు తెలిసింది ఏమనగా ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతీవ్యక్తికి ఈ మొబైల్ ఫోన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవి ప్రస్తుత సమాజంలో ఒక తప్పనిసరి సాధనం అయేయి.
ముందుగా కొన్ని నిర్వచనాలతో మొదలు పెడదాం.
- "ంమొబైల్ ఫోన్ " అనే ఇంగ్లీషు మాటని తెలుగులో దూరవాణి అంటున్నారు. "టెలి" అంటే దూరం, "ఫోన్" అంటే శబ్దం కనుక ఈ దూరవాణి అనే పేరు అర్థవంతంగానే ఉంది. పూర్వకాలంలో ఈ టెలిఫోనులు గోడకి తగిలించో, బల్ల మీదనో, కదలకుండా ఒక చోట పడి ఉండేవి. కనుక ఫోనులో మాట్లాడాలంటే మనం ఫోను దగ్గరకి వెళ్లాల్సి వచ్చేది.
- దరిమిలా ఫోనుని ఎక్కడకి పెడితే అక్కడకి చేత్తో పట్టుకుపోయే సౌకర్యం మొట్టమొదట జపానులోని టోకియో నగరంలో, 1979 లో, వచ్చింది. ఈ రకం టెలిఫోనుని ఇంగ్లీషులో "మొబైల్ ఫోన్" అనడం మొదలు పెట్టేరు. "మొబైల్" అంటే తేలికగా కదలగలిగేది లేదా చలించగలిగేది. కనుక ఈ జాతి టెలిఫోనులని న్యాయంగా "చలన వాణి" అనో "చలవాణి" అనో అనాలి. 'చర' అనగా కదలునది. దీనిని తెలుగులో "చరవాణి" అంటున్నారు. తీగలతో గోడకి అతుక్కుపోకుండా విశృంఖలంగా ఉండే సదుపాయం ఉంది కనుక వీటిని నిస్తంతి ("వైర్లెస్") పరికరాలు అని కూడా అననొచ్చు. టోకియోలో జరిగిన ప్రయోగం విజయవంతం అవడంతో ఈ పద్ధతి ఐరోపా లోని కొన్ని దేశాలలో వ్యాపించింది. చివరికి 1983 లో మోటరోలా కంపెనీ అమెరికాలో ఈ రకం టెలిఫోనులకి ప్రాచుర్యం కల్పించింది. అప్పుడు దీని బరువు 2.2 పౌండ్లు (1 kg). అమెరికాలో పట్టణాలు విశాలమైన జాగాలలో విస్తరించి ఉండడం వల్ల, కారుల వాడకం ఎక్కువ అవడం వల్ల ఈ చేతిలో ఇమిడే టెలిఫోనులు ఇల్లు దాటి చాల దూరం వెళ్లే అవకాశం ఉంది. ఈ పరిస్థితులకి అనుకూలంగా ఉండాలని మోటరోలా కంపెనీ, తేనెపట్టులో గదుల మాదిరి, ఒక నిస్తంతి వలయం (సెల్యులార్ నెట్వర్క్) రూపొందించి, ఆ వలయంలో ఈ టెలిఫోనులు పనిచేసే సాంకేతిక వాతావరణం సృష్టించింది. అందుకని, అప్పటినుండి అమెరికాలో ఈ చరవాణిని "సెల్యులార్ ఫోన్" అనిన్నీ, "సెల్ ఫోన్" అనిన్నీ, చివరికి "సెల్" అనిన్నీ పిలవడం మొదలు పెట్టేరు. ఈ సాంకేతిక పరిధిని మొదటి తరం (1G or First Generation) అని కూడా అంటారు.
- తరువాత ఫిన్లండులో, 1991లో, రెండవ తరం (2G) ఫోనులు వచ్చేయి. అటు పిమ్మట 2001 లో మూడవ తరం (3G), తరువాత అంచెలంచెల మీద నాలుగవ తరం (4G) ఫోనులు వాడుకలోకి వచ్చేయి. ఈ తరాల మార్పుతో సరితూగుతూ కొత్త కొత్త వెసులుబాట్లు ("ఫీచర్స్") తో ఫోనులు బజారులోకి వస్తున్నాయి. ఎన్ని తరాలు మారినా, కొన్ని కనీస అవసరాలకి ఆసరగా ఈ చరవాణిలో కొన్ని వెసులుబాట్లు ఉంటూ వచ్చేయి:
- చరవాణి పని చెయ్యడానికి అత్యవసరమైన విద్యుత్తుని సరఫరా చెయ్యడానికి లిథియం అణుశకలాలతో పనిచేసే ఒక విద్యుత్ ఘటం (Lithium-ion battery cell).
- చేతిలో ఇమిడే అంత చిన్న చరవాణిలో టెలిఫోను నంబర్లు ఎక్కించడానికి కావలసిన మీటల ఫలకం ("కీ బోర్డ్") ఇమడ్చడానికి చోటు సరిపోదు. అందుకని స్పర్శతో స్పందించ గలిగే స్పర్శ ఫలకం లేదా తాకు తెర ("టచ్ పేడ్") కావలసి వచ్చింది.
- మన ఫోను నుండి ఇతరుల ఫోనులకి చేరుకోడానికి ఒక మార్గం సృష్టించడానికి ఒక "మధ్యవర్తి" ఉండాలి. ఈ మధ్యవర్తిని "సెల్యులార్ ఆపరేటర్" అంటారు. ఫోను వాడకానికి మనం రుసుం చెల్లిస్తే ఈ మధ్యవర్తి వాడుకరులకి ఒక "సిం కార్డ్" (SIM Card or Subscriber Identity Module card) ఇస్తాడు. ఈ సిం కార్డ్ ని చరవాణి లోపలికి దోపితే చరవాణి ప్రాణం పుంజుకుని పని చెయ్యడం మొదలు పెడుతుంది. సిం కార్డుల యొక్క సైజు తపాలా బిల్లా అంత ఉంటుంది. సిం కార్డులకు కూడా ఇండియాలో చాలా "సెల్యులార్ ఆపరేటర్" కంపెనీలు ఉన్నాయి. అందులో ఉన్న కొన్ని ముఖ్యమైనవి ఎయిర్టెల్, డొకమో, వోడాఫోన్ మొదలైనవి.
అన్ని రకాల చరవాణుల వాడకానికి సిం కార్డ్ అవసరం లేదు; కంపెనీని బట్టి, వారు వాడే సాంకేతిక పద్ధతులని బట్టి ఈ అవసరం మారుతూ ఉంటుంది. GSM (Global System for Mobile Communications) పద్ధతి ఉపయోగించే వారు SIM card వాడతారు, CDMA వారి పద్ధతి మరొక రకంగా ఉంటుంది.) అమెరికాలో వెరైజన్ (Verizon) కంపెనీ, స్పిరింట్ (Sprint) కంపెనీ CDMA పద్ధతి వాడితే ఎటి&టి (AT&T), టి-మొబైల్ (T-Mobile) GSM పద్ధతి వాడుతున్నాయి. ఏది మంచిది అని అడిగితే సమాధానం చెప్పడం కష్టం. మీటరు గేజి కోసం చేసిన రైలు బళ్లు బ్రాడ్ గేజి మీద, బ్రాడ్ గేజి కోసం చేసిన రైలు బళ్లు మీటరు గేజి మీద ఎలా నడవలేవో అదే విధంగా GSM కి అనుగుణంగా చేసిన ఫోనులు CDMA మీద పని చెయ్యవు. అమెరికాలో, బజారులోకి వెళ్లి సెల్ ఫోను కొనుక్కునే ముందు ఏ రకం ఫోను కావాలో నిశ్చయించుకోవాలి. ఉదాహరణకి Verizon కంపెనీ చందాదారులు iPhone వాడదలుచుకుంటే అప్పుడు Verizon కంపెనీ వారి నిస్తంతి జాలం మీద పనిచెసే విధంగా నిర్మించిన iPhone కొనుక్కోవాలి. Verizon కంపెనీ అంటే విసుగెత్తి కంపెనీని మార్చదలుచుకుంటే అంతవరకు వాడిన ఫోను AT&T వారి జాలం మీద పని చెయ్యదు; మరొక ఫోను కొనుక్కోవాలి. తస్మాత్ జాగ్రత్త!! ప్రతి దేశం లోను పద్ధతులు వేర్వేరుగా ఉన్నాయి.
జనాదరణ
మార్చుTop Five Worldwide Total Mobile Phone Vendors, Q4 2012 | |||
---|---|---|---|
Rank | Manufacturer | Gartner[1] | IDC[2] |
1 | Samsung | 22.7% | 23.0% |
2 | Nokia | 18.0% | 17.9% |
3 | Apple | 9.2% | 9.9% |
4 | ZTE | 3.4% | 3.6% |
5 | LG | 3.2% | - |
5 | Huawei | - | 3.3% |
Others | 43.5% | 42.3% |
భారతదేశములో మొబైల్ ఫోన్ పరిచర్యలు
మార్చుభారతదేశములో మొదటగా 1985 లో ఢిల్లీలో మొబైల్ పరిచర్యలు ప్రారంభమయ్యయి.[3].ప్రభుత్వ రంగములో బి.ఎస్.ఎన్.ఎల్, ఎం.టి.ఎన్.ఎల్లు ఈ పరిచర్యలు అందిస్తుండగా, ప్రైవేటు రంగములో రిలయెన్స్, ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా,ఎయిర్ సెల్, యూనినార్, ఇతర సంస్థలు ఈ పరిచర్యలను అందిస్తున్నాయి.
చరవాణి ఎలా పని చేస్తుంది?
మార్చుముందు అందరికీ బాగా పరిచయం ఉన్న రేడియో, టెలివిజన్ వంటి ఉపకరణాలకీ సెల్ ఫోనుకీ మధ్య పోలికలు, తేడాలు చూద్దాం. రేడియో కేంద్రం ఎక్కడో ఉంటుంది. అక్కడ నుండి ప్రసారితమైన వాకేతాన్ని (సిగ్నల్, signal) మన ఇంట్లో ఉన్న రేడియో గ్రాహకి (రిసీవర్, receiver) అనే “డబ్బా” అందుకుంటోంది. ఈ “డబ్బా” రేడియో వార్తలని అందుకోగలదు కాని పంపలేదు. ఆ వార్తలని అందుకోటానికి బయట వాకట్లో పొడుగాటి తీగని వేలాడగట్టేవారు పూర్వం. ఈ తీగనే ఏరియల్ అనేవారు, ఇప్పుడు ఎంటెనా (antenna) అంటున్నారు. ఇదే విధంగా వార్తలని పంపే రేడియో ప్రసారిణి (transmitter) కూడా ఒక పొడుగాటి తీగని వాడుతుంది. ఈ తీగని కూడా ఎంటెనా అనే అంటారు. ఈ ఎంటెనాని ఎత్తయిన, బురుజులాంటి కట్టడం (tower) మీద ప్రతిస్థాపిస్తారు.
సెల్ ఫోను రేడియో గ్రాహకిలా వాకేతాలని అందుకుంటుంది, రేడియో ప్రసారిణిలా వాకేతాలని పంపుతుంది. చేతిలో పట్టే ఉపకరణం కనుక పంపటానికి వాడే తీగ, అందుకోటానికి వాడే తీగ (ఎంటెనా) కూడా పొడుగ్గా, భారీగా కాకుండా, చిన్నగా ఉండి ఫోను లోపల ఇమడాలి. ఇలా అన్నిటిని కుదించి, చేతిలో పట్టే ఉపకరణంగా చెయ్యాలంటే రేడియోలలో వాడే “పొడుగాటి రేడియో తరంగాలు” పనికిరావు; అందుకని శక్తిమంతమైనవి అయిన “పొట్టిగా ఉండే రేడియో తరంగాలు” లేదా సూక్ష్మ తరంగాలు (మైక్రోవేవ్స్, microwaves) వాడతారు. మౌలికంగా అదీ సాధారణమైన రేడియోకి, సెల్ ఫోనుకి తేడా.
మరీ సాంకేతికంగా ఉండి బోరు కొడుతున్నాదనుకోకుండా ఉండేవారి కొరకు కొన్ని రేడియో తరంగాల వివరాలు ఈ దిగువ పట్టికలో ఇవ్వడం జరిగింది. ఈ పట్టికలో Hz అనే దానిని "హెర్ట్జ్" అని చదవాలి. ఉదాహరణకి 1,800 Hz అంటే ఒక సెకండు కాల వ్యవధిలో 1800 రేడియో తరంగాలు కనిపిస్తాయని అర్థం. అలాగే 1,600 KHz అంటే ఒక సెకండు కాల వ్యవధిలో 1,600,000 రేడియో తరంగాలు కనిపిస్తాయని అర్థం. అలాగే 850 MHz అంటే ఒక సెకండు కాల వ్యవధిలో 850,000,000 రేడియో తరంగాలు కనిపిస్తాయని అర్థం.
Frequency Bands Used in Telecommunication Applications | |||
---|---|---|---|
No. | Application | Frequency band | |
1 | Telephone modem | 1660 –1800 Hz | |
2 | AM Radio | 530 -1600 KHz | |
3 | FM Radio | 88 -108 MHz | |
4 | VHF TV | 178 - 216 MHz | |
5 | Cellular Radio | 850 MHz | |
6 | Indoor wireless | 1.8 GHz | |
7 | Satellite link | 3.7- 4.2 GHz |
భారతదేశంలో వాడే GSM పద్ధతిలో 900 MHz and 1800 MHz (or 1.8 GHz) అనే రెండు "ఫ్రీక్వెంసీ" లని వాడుతున్నారు. 3G/4G తరాలలో 2.3 GHz to 2.4 GHz వాడుతున్నారు.
ఆరోగ్యం పై చరవాణి ప్రభావం
మార్చుఇటీవలి కాలంలో సెల్ ఫోనుల వల్ల ఆరోగ్యం పాడయే ప్రమాదం ఉందేమో అని కొందరు అనుమానం పడుతూ ఉంటే కేన్సరు వచ్చే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి హెచ్చరికలలో ఆధారం ఉన్న నిజం ఎంత ఉందో, ఆధారం లేని భయం ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఈ సమస్యని కొంచెం లోతుగా పరిశీలించాలి.
మానవులని బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అని వర్గాలుగా విడగొట్టినా మనం అంతా మనుష్యులమే కదా; వయస్సులో తేడా, అంతే!. అలాగే రేడియో తరంగాలన్నా, సూక్ష్మ తరంగాలన్నా, పరారుణ తరంగాలన్నా, కాంతి తరంగాలన్నా, అతినీలలోహిత తరంగాలన్నా, X-కిరణాలు అన్నా, గామా కిరణాలు అన్నా – ఇవన్నీ పేర్లలో తేడా మాత్రమే. ఈ పేర్లలో తేడా ఈ ‘తరంగాల పొడుగు’ (wavelength) ని బట్టి మారుతూ ఉంటుంది. రేడియో తరంగాలు పొడుగ్గా ఉంటాయి. అందులో మళ్లా AM రేడియో తరంగాలు బాగా పొడుగు, FM రేడియో తరంగాలు మరి కాస్త పొట్టి, TV తరంగాలు ఇంకా పొట్టి, సెల్ ఫోను తరంగాలు ఇంకా పొట్టి, సూక్ష్మ తరంగాలు, కాంతి తరంగాలు అంతకంటే పొట్టి, ఎక్స్-కిరణాలు మరికొంచెం పొట్టి, గామా కిరణాలు బాగా పొట్టి. అవసరాన్ని బట్టి వీటిని విడివిడిగా పేర్లు పెట్టి పిలుచుకోవచ్చు లేకపోతే వీటన్నిటినీ కట్టగట్టి “విద్యుదయస్కాంత తరంగాలు” అని పిలవచ్చు.
“పొట్టి వాడికి పుట్టెడు బుద్ధులు” అన్నట్లు తరంగం పొట్టిగా ఉంటే దాంట్లో శక్తి ఎక్కువ ఉంటుంది. కనుక గామా కిరణాలు (ఇవీ తరంగాలే, సంప్రదాయికంగా కిరణాలు అని పిలుస్తారు) ఎంత శక్తిమంతమైనవి అంటే అవి మన శరీరాన్ని తాకితే చర్మం కాలిపోతుంది. ఎక్స్-కిరణాలు కూడా శక్తిమంతమైనవే. అందుకనే వైద్యుడు ఎక్స్-రే ఫొటోలు తీసేటప్పుడు చాల జాగ్రత్తలు తీసుకుంటాడు; కడుపులో ఉన్న పిండానికి ఎక్స్-కిరణాల తాకిడి మంచిది కాదు. ఇంకా పొడుగైన తరంగాలు అతినీలలోహిత కిరణాలు. ఇవి కంటికి కనబడవు కాని, మనం బయటకి ఎండలోకి వెళితే ఈ కిరణాల ప్రభావానికి శరీరం “కాలి” కమిలి పోతుంది. శీతల దేశాలలో ఉన్న తెల్లవాళ్లు శరీరం మరీ పాలిపోయినట్లు ఉంటే అందంగా ఉండదని ప్రత్యేకించి బీచికి వెళ్లి ఎండలో కూర్చుంటారు. అప్పుడు ఈ అతినీలలోహిత కిరణాల మోతాదుకి శరీరం కమిలి ఎర్రబారుతుంది. ఈ మోతాదు మరీ ఎక్కువైతే శరీరం కమిలి కందిపోవడమే కాకుండా చర్మపు కేన్సరు వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా పొడుగైన తరంగాలు కంటికి కనిపించే కాంతి కిరణాలు. ఎండలోకి వెళ్లటం వల్ల మనకి ఏమి ప్రమాదం వస్తున్నాది? వేడికి ఒళ్లు చుర్రుమంటుంది. ఎండలో ఎక్కువ సేపు కూర్చుంటే ఒళ్లు కాలినా కాలుతుంది. ఇంకా పొడుగైనవి పరారుణ తరంగాలు. ఇంకా పొడుగైనవి సూక్ష్మ తరంగాలు లేదా మైక్రోవేవ్స్. ఈ కిరణాలని ఉపయోగించి “సూక్ష్మతరంగ ఆవాలు” తయారు చేస్తున్నారు కదా. వీటిలో ఆహార పదార్థాలని వేడి చేసుకున్నప్పుడు ఆ ఆహారం 700 సెల్సియస్ డిగ్రీలవరకు వేడెక్కి పోతుంది. నీళ్లు 100 డిగ్రీల దగ్గర మరుగుతాయి కనుక 700 ఎంత వేడో మీరే ఊహించుకొండి. కనుక సూక్ష్మ తరంగాలు ఒంటికి తగిలితే ఒళ్లు కాలే ప్రమాదం ఉంది. ఇంకా పొడుగైనవి రేడియో తరంగాలు. వీటిని వాడటం మొదలుపెట్టి దరిదాపు ఒక శతాబ్దం అవుతోంది. వీటివల్ల ఆరోగ్యానికి భంగం అని ఎవ్వరు అనలేదు. ఇంకా పొడుగైనవి మన ఇళ్లల్లో దీపాలు వెలిగించుకుందుకి వాడే “కరెంటు” తరంగాలు.
పైన ఉదహరించిన తరంగాలన్నిటిని కట్టకట్టి “విద్యుదయస్కాంత తరంగాలు” (electromagnetic waves) అని కాని “విద్యుదయస్కాంత వికీర్ణం (లేదా వికిరణం)” (electromagnetic radiation) అని కాని అంటారు. ఈ కథనాన్ని బట్టి అన్ని వికీర్ణాలు ఆరోగ్యానికి హాని చెయ్యవు. శక్తిమంతమైన వికీర్ణాలే ప్రమాదం. ఈ శక్తిమంతమైన వాటిల్లో గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు ఎక్కువ ప్రమాదం. అతి నీలలోహిత తరంగాలు కొంచెం తక్కువ హాని చేస్తాయి. సూక్ష్మ తరంగాలు ఇంకా తక్కువ హానికరం. టెలివిజన్, రేడియో తరంగాలు, మన ఇళ్లకి విద్యుత్తు సరఫరా చేసే తీగలలో ప్రవహించే తరంగాలు సిద్ధాంతరీత్యా హాని చెయ్యటానికి వీలు లేదు.
ఇదే విషయాన్ని మరొక విధంగా చెప్పొచ్చు. గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు, అతి నీలలోహిత కిరణాల తాకిడి వల్ల కేన్సరు వంటి వ్యాధులు వస్తాయనటానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. వీటిల్లో శక్తి “మోలు ఒక్కంటికి 480,000 జూలులు” దాటి ఉంటుంది కనుక వీటి తాకిడి ధాటీకి తట్టుకోలేక మన శరీరంలోని రసాయన బంధాలు తెగిపోతాయి. ఆకుపచ్చ కాంతిలో శక్తి “మోలు ఒక్కంటికి 240,000 జూలులు” ఉంటుంది. ఈ శక్తికి మన కంటి రెటీనాలో ఉండే బంధాలు తెగవు కాని, చలించి ఒంగుతాయి. ఇలా ఒంగి నప్పుడు రెటీనా విద్యుత్ వాకేతాలని ఉత్పత్తి చేసి మెదడుకి పంపుతుంది. సెల్ ఫోనులో పుట్టే శక్తి “మోలు ఒక్కంటికి 1 జూలు” కంటే తక్కువ. ఈ శక్తి కంటే ఆకుపచ్చ కాంతి పుట్టించే శక్తి 240,000 రెట్లు ఎక్కువ, అతి నీలలోహిత కిరణాలు పుట్టించే శక్తి 480,000 రెట్లు ఎక్కువ.
ఈ లెక్క ప్రకారం సెల్ ఫోనులకి అపకారం చెయ్యగలిగే స్తోమత లేదు. ఎక్స్-కిరణాలకి అపకారం చేసే స్తోమత ఉన్నా వాటి వాడకం మానెస్తున్నామా? తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అతినీలలోహిత కిరణాలు హాని చేస్తాయని తెలుసు కనుక ఎండలోకి వెళ్లినప్పుడు ఒంటికి లేపనం పూసుకోవటం, చలవ కళ్లజోడు పెట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సెల్ ఫోనులు ప్రసరించే వికీర్ణం (రేడియేషన్) వల్ల ప్రమాదం లేకపోయినా, సెల్ ఫోనుల విషయంలో కొన్ని మౌలికమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
మొదటి జాగ్రత్త. సెల్ ఫోనుని చేత్తో పట్టుకుని, చెవికి ఆనించి మాట్లాడటం కంటే ఫోనుని జేబులోనో, బల్లమీదో పెట్టుకుని, దాని నుండి ఒక తీగని చెవిదాకా తీసుకొచ్చి వినటానికి, మాట్లాడటానికీ సదుపాయం ఉంటే కొంత ఊరట. తలకీ, సెల్ ఫోనుకీ దూరం పెంచండి. అదే విధంగా, వీలయినప్పుడల్లా శరీరానికి, సెల్ ఫోనుకీ దూరం పెంచండి. ఈ జాగ్రత్తలకి కారణం సెల్ ఫోనులో ఉండే బేటరీ పేలిపోయి, కాలిపోయే సావకాశం ఉంది కనుక!!
రెండవ జాగ్రత్త. సెల్ ఫోను అందుబాటులో ఉంది కదా అని ఇరవైనాలుగు గంటలు అదే పనిగా దానిని చెవికి ఆనించి మాట్లాడటం కంటె, సెల్ ఫోను లోకాభిరామాయణానికి కాదని, అవసరం వెంబడి వార్తలని చేరవెయ్యటానికనీ గమనించి, క్లుప్తంగా వాడటం నేర్చుకోవాలి.
పై రెండు జాగ్రత్తలు తీసుకుంటే వికీర్ణత వల్ల ప్రాప్తించే హాని – ఏ కొదిపాటి ఉన్నా - తగ్గుతుంది.
మూడో జాగ్రత్త. కారు, రైలు వంటి వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోను మీద మాట్లాడ వద్దు. నాకు తెలుసున్న వ్యక్తి, కుర్రాడు, నవీ ముంబాయిలో కారు తోలుతూ సెల్ ఫోనులో మైమరచి మాట్లాడుతూ ఎదురుగా వచ్చే బండిని చూసుకోకుండా గుద్దేసి నిష్కారణంగా అసువులు బాసేడు. బతికుంటే బలుసాకు ఏరుకు తినొచ్చు.
- సెల్ టవర్లు, సెల్‌ఫోన్ల రేడియేషన్ కారణంగా ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. టవర్లు, ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా క్యాన్సర్ ముప్పు ఉందనడానికి ఆధారాలు లేవని, మెదడుపైన, నిద్రపోయే సమయంపై పడే ప్రభావం కూడా చాలా స్వల్పమని పేర్కొంది. అయితే టవర్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల కన్నా సెల్‌ఫోన్ నుంచి వెలువడే తరంగాలు వెయ్యి రెట్లు అధికమని దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫోన్ వాడకాన్ని నియంత్రించుకోవాలని సూచించింది.
- లిఖిత సందేశాలు పంపండి: సెల్‌ఫోన్ మెదడుకు దూరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రేడియేషన్ ప్రభావమూ దానిపై పడదు.
- మాట్లాడుతున్నప్పుడే కాదు. పక్కన పడేసినప్పుడూ సెల్‌ఫోన్ నుంచి రేడియేషన్ వెలువడుతుంది. అందుకే దీన్ని తల పక్కనే పెట్టుకొని అలారం గడియారంలా వాడకపోవటమే మంచిది. .
- సెల్‌ఫోన్‌ని ప్యాంటు జేబులో పెట్టుకున్నా, బెల్ట్‌కు ధరించినా సంతాన సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. వీలైనప్పుడల్లా సెల్‌ఫోన్‌ని దూరంగా ఉంచటం మేలు. (ఈనాడు2.6.2011)
ప్రత్యేకమైన వెసులుబాట్లు
మార్చుపూర్వం సెల్ ఫోనులు తీగల ఫోనుల స్థానంలో వెలిశాయి. ఆ రోజుల్లో సెల్ ఫోనులని కేవలం మాట్లాడుకుండదుకే వాడేవారు. కాలక్రమేణా సెల్ ఫోనులతో చెయ్యలేని పనులంటూ ఏమీ లేకుండా పోయేయి.
- ఈ రోజులలో సెల్ ఫోనులతో ఫొటోలు తియ్యవచ్చు
- మన ఫోటోలు ఇతరులకి పంపించవచ్చు
- అంతర్జాలపు రహదారుల మీద పచార్లు చెయ్యవచ్చు, కారు తోలుకు పోతూ ఉంటే దారి చెబుతాయి
- బేంకులో ఉన్న ఖాతాలో డబ్బు జమకట్టవచ్చు
- ఆలశ్యంగా నడుస్తున్న రైలు బండి ఎక్కడ ఉందో చూసుకోవచ్చు
- పాటలు పాడించుకోవచ్చు
- సినిమాలు చూడవచ్చు
- ఇంటర్నెట్ ఉపయోగించి ప్రతి పని మన సెల్ ఫోన్లోనే చేసుకోవొచ్చు
అందుకని ఈ రోజుల్లో సెల్ ఫోనుని బుద్ధ ఫోను (smart phone) అని పిలుస్తున్నారు.
సైకిల్‌తో సెల్ ఛార్జింగ్
మార్చుసైకిల్కి అమర్చే ఈ పరికరంలో ఛార్జర్, డైనమో ఉంటాయి. సైకిల్ చక్రం తిరిగినప్పుడు విడుదలయ్యే శక్తి ఆధారంగా డైనమో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. నోకియా మొబైల్ ఫోనులని దీనితో ఛార్జింగ్ చేయవచ్చు. ధర 2014 లో సుమారు రూ. 860.
శరీరపు కదలికలతో సెల్ ఛార్జింగ్
మార్చుచార్జర్ల గొడవ అనేది లేకుండా శాస్త్రవేత్తలు 'జెన్నీయో' అనే ఒక కొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. మన కదలికల ద్వారా సెల్ ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. 'దీన్ని ఎక్కడికైనా చాలా సులభంగా తీసుకుపోవచ్చు. కదలికల వల్ల ఉత్పత్తయిన శక్తి దాంట్లో ముందే అమర్చిన బ్యాటరీలో నిక్షిప్తమవుతుంది. ఎల్ఈ డీ బ్యాటరీ కొలమానం బ్యాటరీలో ఎంత చార్జింగ్ ఉందో తెలియజేస్తుంది' అంటున్నారు. ఈ మొబైల్ జనరేటర్ రెండు మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.
నీటిలో తడవని సెల్ ఫోన్లు
మార్చుఅమెరికా శాస్త్రవేత్తల పరిశోధన ఫలితంగా సెల్‌ఫోన్లు కూడా చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా వాటర్‌ప్రూఫ్‌గా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికి సెల్‌ఫోన్లలోని ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఓఎల్ఈడీ)లు తడిస్తే పాడైపోతున్నాయి. కానీ, వీటికి రక్షణ కవచంలాగా ఆటామిక్ లేయర్ డిపొజిషన్ పద్ధతిలో ఒక ఫిల్మ్ (పొర)ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది అత్యంత పలుచనైనది. కానీ ఎంతో మన్నికైనది. ఎంత పలుచనైనదంటే... దీని మందం కేవలం 10 నానోమీటర్లు మాత్రమే! ప్రస్తుతం వాడుతున్న ఫిల్మ్‌లు దీనికి కంటే వేల రెట్ల ఎక్కువ మందంలో ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఫిల్మ్‌లను కేవలం సెల్‌ఫోన్లలోనే కాకుండా భవిష్యత్తులో బయోమెడికల్ పరికరాలు, ఎల్ఈడీ ఆధారిత లైటింగ్, డిస్‌ప్లేలు, సోలార్ సెల్స్, ఆర్గానిక్ ఎలక్ట్రానిక్ విం డోస్‌లలో కూడా ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు
సెల్‌ఫోన్‌లో ఈసీజీ
మార్చుగుండెపోటు ముప్పును పసిగట్టి తక్షణం వైద్యసాయం పొందటం అవసరం. బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులు తమ ఈసీజీ వివరాలను ఉన్న చోటు నుంచే వైద్యులకు చేరవేయవచ్చు. ఈ నివేదికను హృద్రోగ నిపుణులు పరిశీలించి రోగి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తక్షణం వివరిస్తారు. సెల్‌ఫోన్ సేవా సంస్థ వోడాఫోన్‌తో కలిసి మాస్ట్రోస్ మెడిలైన్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని eUNO R10 సొల్యూషన్ అని వ్యవహరిస్తున్నారు.
మరికొన్ని విశేషాలు
మార్చుసెల్ఫోన్ వాడకూడని ప్రదేశాలు
మార్చు- లౌడ్‌స్పీకర్లు, రేడియోలు ఉన్నచోట సెల్‌ఫోనును ఉపయోగించేప్పుడు గరగర శబ్దాలు రావడాన్ని గమనించే ఉంటారు. ఇందుకు కారణం సెల్‌ఫోన్‌కు చేరే విద్యుదయస్కాంత తరంగాలు, రేడియోలలో ఉన్న సున్నితమైన విద్యుత్ వలయాలు కృత్రిమంగా విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపించడమే. దీనిని ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇండక్షన్ అంటారు. ఈ సూత్రం ఆధారంగానే ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, జనరేటర్లు పనిచేస్తుంటాయి.
- పెట్రోలు బంకుల దగ్గర మనం సెల్‌ఫోన్ వాడేటప్పుడు సున్నితమైన విద్యుత్ పరికరాల్లో కూడా విద్యుత్ ప్రేరణ జరిగే అవకాశం ఉంది. వీటికి ఓ దిశ, దశ పద్ధతి లేకపోవడం వల్ల విద్యుత్ సర్క్యూట్‌తో స్పార్కులు రావచ్చు. అంటే అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. అందువల్లే పెట్రోల్‌పంపుల దగ్గర సెల్‌ఫోన్లు వాడకూడదు.
మొబైల్ లో ఎఫ్.ఎమ్ రేడియో
మార్చు- ఇంతకు ముందు వరకూ రేడియోను వినాలంటే ప్రత్యేకమైన్ పరికరము దానికి బ్యాటరీ అవసరమయ్యేవి కాని ఫోన్ కాల్ తో పాటే రేడియోను వినే సౌకర్యము నేటి మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నాయి ఇది ఒక గొప్ప అవకాశము
మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ టెలిఫోనీ
మార్చుమొబైల్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్, దూర వైద్యం, దూర విద్య (టెలీ ఎడ్యుకేషన్), మార్కెట్ ధరలు, మేలైన సాగు విధానాలు, మొక్కల సంరక్షణ, సస్యరక్షణ, వాతావరణం, ముఖ్యమైన పంటల వివరాలు రైతులు పొందవచ్చు.
సంఘర్షణ ఖనిజాలు
మార్చుమొబైల్ ఫోన్లు, ఇతర electronics కనిపించే లోహాల కొరకు డిమాండు రెండవ కాంగో యుద్ధం రాజుకుంది . యుద్ధం. దాదాపు 5.5 మిలియన్ చెందారు ఒక 2012 న్యూస్ స్టోరి, గార్డియన్ తూర్పు కాంగోలో భూగర్భంలోని, పిల్లలు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కోసం అవసరమైన ఖనిజాలు సేకరించేందుకు కృషి సురక్షితం గనుల్లో " , నివేదించారు. ఖనిజాలు నుండి లాభాలు ఆర్థిక రక్తపాత సంఘర్షణ రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ; . యుద్ధం సుమారు 20 సంవత్సరాల పాటు కొనసాగింది , ఇటీవల మళ్ళీ అప్ రాజుకున్నాయి ... గత 15 సంవత్సరాలుగా, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ మొబైల్ ఫోన్ పరిశ్రమ కోసం సహజ వనరులను యొక్క ప్రధాన వనరుగా ఉంది . "
సంఘర్షణ ఖనిజాలు కలిగివుండదు ఒక మొబైల్ ఫోన్ అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం.[4]
చరవాణి ద్వారా స్టాకు మార్కెట్లో వ్యాపార లావాదేవీలు
మార్చుచరవాణి ద్వారా స్టాకు మార్కెట్లో వ్యాపార లావాదేవీలు చేయడానికి మదుపర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. నగదు విభాగంలో సంప్రదాయ (ఆంగ్లము:ఆఫ్‌లైన్) వ్యాపార లావాదేవీలు తగ్గుతోందని, అంతర్జాల మాధ్యమం ద్వారా (ఆంగ్లము:ఆన్‌లైన్) లో ముఖ్యంగా చరవాణి ( ఆంగ్లము:మొబైల్) ద్వారా మదుపర్లు వ్యాపార లావాదేవీలు చేయడానికి ఇష్టపడుతున్నారని. రిటైల్ నగదు విభాగంలో చరవాణి ద్వారా జరుగుతున్న లావాదేవీలు గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సగటున రోజుకు రూ.2,399 కోట్లు ఉంటే.. ప్రస్తుత,2019 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి రూ.3,826 కోట్లకు చేరాయి. [5]
మూలాలు
మార్చు- ↑ "Newsroom, Announcements and Media Contacts". Gartner (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
- ↑ "Strong Demand for Smartphones and Heated Vendor Competition Characterize the Worldwide Mobile Phone Market at the End of 2012, IDC Says - prUS23916413". web.archive.org. 2013-02-16. Archived from the original on 2013-02-16. Retrieved 2023-01-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ http://en.wikipedia.org/wiki/Communications_in_India
- ↑ "whatsapp for pc". youngstershub.com. Jan 20, 2015. Archived from the original on 2015-10-03. Retrieved Jan 20, 2015.
- ↑ "మొబైల్ ట్రేడింగ్‌కు మొగ్గు". ఆంధ్రజ్యోతి. 2019-12-11. Archived from the original on 2019-12-11.
- వేమూరి వేంకటేశ్వరరావు, సెల్ ఫోనులు, ఆంధ్రప్రభ ఆదివారం, Indian Express, circa 2012