మైక్రోమీటర్
ఒక వస్తువు పొడవును 0.001 మి.మీ వరకు కచ్చితంగా కొలిచే పరికరము మైక్రోమీటరు. ఇది స్వల్ప వ్యాసాలు, స్వల్ప మందాలు అతి కచ్చితంగా కొలవడానికి ఉపయోగిస్తారు. దీనిని స్క్రూగేజ్ అనికూడా అంటారు. ఒక వస్తువు పొడవును కొలవాలంటే సాధారణంగా స్కేలును ఉపయోగిస్తాము. స్కేలు యొక్క కనీసపుకొలత 1 మి.మీ. ఒక మి.మీ కంటే తక్కువ పొడవులను కొలుచుటకు వాడే పరికరం వెర్నియర్ కాలిపర్స్. ఇది ఒక మిల్లి మీటర్ లో పదవ వంతు వరకు కచ్చితంగా కొలవగలదు. ఒక మిల్లీ మీటరులో 100 వ వంతు వరకు కచ్చితంగా కొలిచే సాధనం స్క్రూగేజ్ లేదా మైక్రోమీటర్. దీనిని తెలుగులో సూక్ష్మమాపకం అంటారు. ఇది మర సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. స్క్రూ గేజ్‌ను 17 వ శతాబ్దంలో ఆంగ్ల గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త అయిన విలియమ్స్ గాస్కోయిన్ కనిపెట్టాడు.
ఇతర పేర్లు | స్క్రూగేజ్ |
---|---|
ఉపయోగాలు | 0.01మి.మీ వరకు ఖచ్చితంగా కొలుచుటకు |
ఆవిష్కర్త | మొదట ప్రవేశపెట్టినవారు -William Gascoigne |
యిందులో గల స్కేళ్ళు
మార్చు- తల స్కేలు
- పిచ్ స్కేలు
మరభ్రమణాంతరం
మార్చుమరశీల ఒక పూర్తి భ్రమణం చేసినపుడు మర కదిలిన దూరాన్ని మరభ్రమణాంతరం లేదా మరపిచ్ అంటారు.తలస్కేలు ఒక పూర్తి భ్రమణం చేయునపుదు అది పిచ్ స్కేలుపై కదిలిన దూరం మరభ్రమణాంతరం అవుతుంది. ఉదాహరణకు తలస్కేలు 10 భ్రమణాలు చేసినపుడు మరశీల పిచ్ స్కేలుపై కదిలిన దూరం 10 మి.మీ అయిన మరభ్రమణాంతరం 1 మి.మీ. అవుతుంది.
మరభ్రమణాంతరం = మరకదిలిన దూరం / మర చేసే భ్రమణాల సంఖ్య
కనీసపు కొలత
మార్చుఒక పరికరంతో కొలవగలిగే అతి తక్కువ కొలతను కనీసపు కొలత అంటారు. స్క్రూగేజ్ లో తలస్కేలుపై 100 విభాగాలుంటాయి. తలస్కేలు ఒక భ్రమణం చేయునపుడు మర కదిలిన దూరం 1 మి.మీ అయిన ఒక తలస్కేలు విభాగం కదిలినపుడు మర కదిలిన దూరం 0.01 మి.మీ అవుతుంది. అందువలన స్క్రూగేజ్ కనీసపు కొలత 0.01 మి.మీ. లేదా 0.001 సెం.మీ అవుతుంది.
కనీసపుకొలత = మరభ్రణాంతరము (P)/తల స్కేలు విభాగాల సంఖ్య (N)
తలస్కేలు మీద వున్న విభాగాలు N = 100
మరభ్రమణాంతరము P = 1మి.మీ.
కనీసపుకొలత=1మి.మీ/100 = 0.01మి.మీ
వర్ణన
మార్చుస్క్రూగేజ్ "U" ఆకారంపు లోహ చట్రం కలిగి ఉంటుంది. ఈ చట్రం ఒక చివర ఒక పొట్టి దండం బిగించి ఉంటుంది. దీనికి ఎదురు దిశలో బోలుగా, పొడవుగా వున్న ఒక లోహపు స్థూపాకార గొట్టం బిగించబడిఉంటుంది. ఈ ఖాళీ స్థూపం లోపలి భాగంలో సర్పిలాకారపు గాళ్ళు చెక్కబడి ఉంటాయి. అందువలన అది ఒక నట్తు మాదిరిగా పనిచేస్తుంది. దాని బాహ్య తలం మీద పొదవుగా అక్షం వెంబడి ఒక సూచీ రేఖ సమభాగాలుగా చేయబడి ఉంటుంది. ఇది "పిచ్ స్కేలు". పొట్టి దండం ఎదురుగా మరొక దండం ఉంటుంది. ఇది లోహపు స్థూపం లోపల ఉన్న సర్పిలాకారపు గాళ్ళు మాదిరిగానే ఉన్న గాళ్ళు రెండవ దండం మీద చెక్క బడి ఉంటాయి. దీనికి మరొక చివర గాడులు చేయబడిన ఒక మరశీల తల ఉంటుంది. తలస్కేలు స్థూపం పై 100 విభాగాలుంటాయి.
పొడవు కనుగొనే విధానం
మార్చు- మొదట స్క్రూగేజి యొక్క శూన్యాంశ దోషాన్ని కనుగొనాలి.
- స్క్రూగేజ్ యొక్క కనీసపు కొలతను కనుగొనాలి.
- యిచ్చిన గాజు పలకను రెండు దండముల మధ్య ఉంచి బిగించాలి.
- పిచ్ స్కేలు మీద తలస్కేలు ఏ విభాగం వద్ద ఆగిందో చూసి ఆ రీడింగ్ ను గుర్తించాలి. ఇది పిచ్ స్కేలు రీడింగ్ అవుతుంది.
- పిచ్ స్కేలు యొక్క సూచేరేఖను తలస్కేలు మీది ఏ విభాగం ఏకీ భవిస్తుందో గుర్తించి దానిని తలస్కేలు రీడింగ్ గా తీసికోవాలి.
- ఈ తలస్కేలు రీడింగుకు శూన్యాంశ దోషాన్ని సవరించాలి.
- పిచ్ స్కేలు రీడింగు+ (తలస్కేలు రీడింగ్xకనీసపు కొలత) అను సూత్రము ఉపయోగించి గాజు పలక మందం కనుగొనవచ్చు.
శూన్యాంశ దోషములు
మార్చు- ఋణ శూన్యాంశ దోషం: పిచ్ స్కెల లోని సూచీ రేఖ కంటే తలస్కెల లోని శూన్య విభాగం ఎగువన ఉంటే దానిని ఋణ శూన్యాంశ దోషం అంటారు. దీని సవరణ ధనాత్మకం.
- ధన శూన్యాంశ దోషం: పిచ్ స్కెల లోని సూచీ రేఖ కంటే తలస్కెల లోని శూన్య విభాగం దిగువన ఉంటే దానిని ధన శూన్యాంశ దోషం అంటారు. దీని సవరణ ఋణాత్మకం.
రకాలు
మార్చుసాధారణంగా మూడు రకాల మైక్రోమీటర్లను ఉపయోగిస్తారు.
1. వెలుపల మైక్రోమీటర్ : తీగలు, కమ్ములు వంటి వాటిని కొలవడానికి ఉపయోగిస్తారు.
2. లోపలి మైక్రోమీటర్లు : రంధ్రముల వ్యాసం (డయామీటర్) కొలిచేందుకు ఉపయోగిస్తారు.
3. లోతు మైక్రోమీటర్లు : స్లాట్స్ అండ్ స్టెప్స్ యొక్క లోతులను కొలవడానికి ఉపయోగిస్తారు.