హరిశ్చంద్రుడు పౌరాణిక హిందూ రాజులలో బాగా ప్రసిద్ధి చెందినవాడు. హరిశ్చంద్రుడు అయోధ్యకు చెందిన పేరుగాంచిన సూర్యవంశ (ఇక్ష్వాకువంశ, అర్కవంశ, రఘువంశ) రాజు. సత్యవ్రతుడి కొడుకైన అతడు ఎప్పుడు నిజమే పలకాలని అబద్దము చెప్పకూడదనే నియమము కలిగినవాడు. తనకు పేరు తెచ్చి పెట్టిన తన సత్యనిష్ఠ వలనే తను ఎన్నో కష్టాలు ఎదురుకోవాల్సి వచ్చింది.

అతని ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణం, మహాభారతం, మార్కండేయ పురాణం ఇంకా దేవీ భాగవత పురాణం వంటి అనేక పురాణాలలో కనిపిస్తుంది. వీటిల్లోగల్లా అందరికీ తెలిసినది మార్కండేయ పురాణంలో ఉన్న కథ. ఈ పురాణం ప్రకారం, హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని విడిచి, తన కుటుంబాన్ని అమ్మి, స్వయంగా బానిసగా అవ్వటానికి సైతం ఒప్పుకుంటాడు - అంతా విశ్వామిత్ర మహర్షికి ధనం ఇస్తానన్న మాటను నెరవేర్చడానికి.

హరిశ్చంద్రుడు, కుటుంబంతో సహా అమ్ముడు పోవడం: రాజా రవివర్మ చిత్రం.

పురాణాల ద్వారా హరిశ్చంద్ర కథ మార్చు

హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశములోని ప్రముఖ చక్రవర్తి. సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన వ్యక్తి, విశ్వామిత్రుని వద్ద జరిగిన వాదనతో అతను ఇవ్వవలసిన సొమ్ముకొరకు భార్యను అమ్మి, కాటికాపరిగా పనిచేసి తన సత్య సంధతను నిరూపించి చిరకాల కీర్తికిరీటాన్ని సంపాదించాడు...

వృత్తాంతము మార్చు

 
బాలుని శవాన్ని చూసి రోదిస్తున్న తారామతి - రాజా రవివర్మ చిత్రం

ఒక చక్రవర్తి. ఇతని తండ్రి త్రిశంకువు. భార్య చంద్రమతి. కొడుకు లోహితాస్యుఁడు. మంత్రి సత్యకీర్తి. ఇతఁడు మహాసత్యసంధుఁడు. ఒకనాఁడు దేవేంద్రుఁడు సుధర్మాభ్యంతరమున కొలువు తీరి ఉండి అప్పుడు అచట ఉండిన మహర్షులను కని ప్రపంచమున తాము ఎఱిఁగినవారి లోపల సత్యసంధుఁడు ఎవఁడు అని ప్రశ్న చేయఁగా వసిష్ఠ మహర్షి హరిశ్చంద్రుఁడు అని పలికెను. ఆమాటకు విశ్వామిత్రుఁడు సహింపక హరిశ్చంద్రుఁడు అంత సత్యసంధుడా అతనిని బొంకించెదను చూడుము అని శపథము చేసి ఇతనికి పెక్కులు ఇడుములు కలుగచేసెను. అది ఎట్లనిన తొలుత ఇతని రాజ్యమును దానరూపమున పరిగ్రహించి అనంతరము అంతకు ముందు ఇతఁడు తన యజ్ఞమునకై ఇచ్చునట్లు వాగ్దత్తముచేసి ఉండిన ధనమును ఇమ్మని నిర్బంధించి దానికి ఇతని భార్యను అమ్మించి చండాలుని కొలుచునట్లును శ్మశాన భూమియందు వసించునట్లును చేసి ఇతని కొడుకును పాముచే కఱపించి చంపి ఆవల నిరపరాధ అయిన ఇతని భార్యపై శిశుహత్యాపాతకమును మోవఁజేసి ఆమెను శిక్షార్హురాలు అగునట్లు చేయించి ఎట్లును బొంకింప నేరక పోయెను. కడపట తన ప్రయత్నము ఎల్ల వ్యర్థములు అయిపోఁగా రుద్రాదిదేవతలు ఈ హరిశ్చంద్రునికి ప్రత్యక్షము అయి ఇతని కొడుకును బ్రతికించి మరల మునుపటియట్ల రాజ్యాధిపత్యము వహించునట్లు అనుగ్రహించిరి. అప్పుడు విశ్వామిత్రుఁడు తాను తీసికొన్న రాజ్యమును ఇచ్చి బహుకాలము శ్రమకు ఓర్చి తపస్సుచేసి ఆర్చించిన మహాపుణ్యఫలమును ఇతనికి ధారపోసి చిరకాలము రాజ్యపదస్థుఁడవై సత్య హరిశ్చంద్రుఁడు అన విఖ్యాతిని ఒందుము అని ఆశీర్వదించి చనియెను. కనుకనే సత్యమునందు హరిశ్చంద్రునికి మించినవారు లేరు అని జగద్విఖ్యాతి కలిగి ఉన్నది.

ఇట్లు విశ్వామిత్రుఁడు కారణములేకయే హరశ్చంద్రుని మిగుల ఇడుములు పెట్టినందుకై వసిష్ఠుఁడు అతనిని బకము అగునట్లు శాపము ఇచ్చెను. అందుకు విశ్వామిత్రుఁడు అతనికి ఆడేలు అగునట్లు ప్రతిశాపము ఇచ్చెను. ఇట్లు ఒండొరులు మాత్సర్యమున శపించుకొని పోరాడుచు ఉండు నవసరమున బ్రహ్మ వారిని శాంతవచనములచే అనునయించి వారి పోరాటమును ఉడిపి వారి పూర్వరూపములను మరల వారికి ఇచ్చి ఇరువురకును మైత్రి కలుగఁజేసి పోయెను.

వినోద మాధ్యమాలలో మార్చు

హరిశ్చంద్రుడి కథని సినిమాగా అనేక భాషలలో పలుసార్లు తీశారు. తెలుగు సినిమాగా, నాటకంగా ఆంధ్రదేశంలో చాలా పేరు సంపాదించింది.

రాజా హరిశ్చంద్ర పేరుతో, భారత మొదటి హిందీ సినిమా. 1222లో నిర్మింపబడినది. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినది. దీనిని దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించాడు.

హరిశ్చంద్రుని కథను సత్యహరిశ్చంద్రీయము అనే నాటకంగా హృద్యంగా మలిచారు బలిజేపల్లి లక్ష్మీకాంతం వారు. ఈ నాటకాన్ని బలిజేపల్లివారు 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం సమయంలో కారాగారవాస సమయంలో రచించాడు.

ఆలయం మార్చు

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని వాద్వాని తాలూకాలోని పింప్రిలో హరిశ్చంద్రుడుని గుడి ఉంది.

మూలాలు మార్చు

  • "సత్యానికి పట్టం కట్టిన హరిశ్చంద్రుడు". Sakshi. 2021-01-02. Retrieved 2023-06-02.
  • "యుగాలు.. త‌రాలు మారినా చ‌రిత్ర‌లో నిలిచిన హ‌రిశ్చంద్రుడు - చంద్ర‌మ‌తి ప్రేమ గొప్ప‌త‌నం ఇదే..." indiaherald.com (in ఇంగ్లీష్). Retrieved 2023-06-02.
  • "Satyaharischandra only Truth". TeluguOne Devotional. Retrieved 2023-06-02.