సత్యహరిశ్చంద్రీయం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి విరచిత ప్రఖ్యాత నాటకం సత్యహరిశ్చంద్రీయము. సత్యనిష్ఠకు నిలిచి దారాసుతులను తనకు తాను అమ్ముడై నిలిచి సత్యహరిశ్చంద్రునిగా పేరు గాంచిన అయోధ్య చక్రవర్తి ఇనవంశోద్భవుడు హరిశ్చంద్రుని కథను నాటకంగా హృద్యంగా మలిచారు బలిజేపల్లి వారు. ఈ నాటకాన్ని బలిజేపల్లివారు 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం సమయంలో కారాగారవాస సమయంలో రచించాడు.
నాటక రచయితసవరించు
ఈ నాటక రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంత కవి బాపట్ల దగ్గర ఇటికలపాడు గ్రామంలో పుట్టారు. వీరి తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ, నరసింహశాస్త్రి. వీరు మేనమామ భాగవతుల చిన్నకృష్ణయ్య గారి ఇంటిలో వుండి చదువుకున్నారు. కర్నూలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ గుమస్తాగా కొంతకాలం పనిచేశారు. గుంటూరు హిందూ కళాశాల ప్రధానోపాధ్యాయునిగా కూడా పనిచేశారు. తెలుగు సంస్కృత భాషలలో అనర్గలంగా కవిత్వం చెప్పగలిగేవారు. వీరు తన సహజ పాండిత్యంతో ఎన్నో అవధానాలు నిర్వహించారు. వీరు 1930 లో ఉప్పు సత్యాగ్రహం కాలంలో జైలులో ఈ నాటకాన్ని రచించారు. హరిశ్చంద్ర నాటకానికి కవి పెట్టిన పేరు "సత్య హరిశ్చంద్రీయం". ఇందులో సుమారు 25 పాత్రలున్నాయి. నలుగురైదుగురు స్త్రీపాత్రలున్నాయి. భటులు, వందిమాగదులు, సూత్రధారుడు తదితరులతో కలిపి కనీసం 35 మంది నటులు ప్రదర్శించవలసిన నాటకం ఇది. "ఫస్ట్ కంపెనీ" పేరుతో నాటక సమాజాన్ని స్థాపించి హరిశ్చంద్ర నాటకాన్ని దేశం నలుమూలలా ప్రదర్శించారు.
నాటక కథసవరించు
నాటకములో ఆరు అంకములు గలవు. అంక విభజనగా నాటక కథ ఈ క్రింది విధముగా ఉంది.
ప్రధమాంకంసవరించు
ఇంద్రసభ. వసిష్ఠుడు సత్య వత్ర మహాత్మ్యాన్ని తెలియచేస్తాడు. బృహస్పతి, అగస్త్యుడు, నారదుడు, గౌతముడు వసిష్ఠుడి మాటలు బలపరచగా, విశ్వామిత్రుడు వ్యతిరేకిస్తాడు. ఈ లోకములో సత్య నిష్ఠ వీడని వారు ఎవ్వరైనా ఉన్నారా అన్న ప్రశ్నకు, వసిష్ఠుడు అయోధ్య నేలు ఇక్షాకు వంశోద్భవుడు హరిశ్చంద్రుడు నిత్య సత్యవత్రుడని పలుకును. విశ్వామిత్రుడు దానిని ఖడించును. విశ్వామిత్రుల, వసిష్ఠుల మధ్య సంవాదమును పెంచి, కలహకారణము కల్పించుటకు హరిశ్చంద్రుని బొంకించు నంతటి సమర్ధత విశ్వామిత్రుని వద్ద నున్నదా అని ప్రశ్నించును. అంత విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుని సత్య సంధత పరీక్షింతునని వసిష్ఠుడు ఏమి పందెము వేయునని ప్రశ్నించును. అందుకు వసిష్ఠుడు హరిశ్చంద్రుడు బొంకిన శిరముండనము గావించుగొని, తపస్సు మాని, సాటిఋషులు ఛీ యనగా, గాడిదనెక్కి వాడవాడలా ఊరేగుదునని పల్కును. హరిశ్చంద్రుడు సత్యసంధత నిరూపింప బడిన హిమాలయమున వాయభక్షణ చేసి ఈశ్వరుని గురించి చేసినతపఃఫలమునందు అర్ధభాగము హరిశ్చంద్రునికి ధారపోసి, భూమిలో పెక్కుమహాయుగములు శ్రీలు మీఱ హరిశ్చంద్రుని చే ఏలించి, స్వర్గమున సురరాజ పీఠమునందు హరిశ్చంద్రుని నిలబెట్టుదునని పల్కును. నిష్కారణముగా కలహము కలిగినదని చింతించుచు దేవేంద్రుడు సభ చాలించును.
ద్వితీయాంకంసవరించు
హరిశ్చంద్రుని సభ. విశ్వామిత్రుడు ప్రవేశించి పరమేశ్వర ప్రీతిగా తానొక యాగము సంకల్పించితినని, అందుకు తగు ధనము కావలిసి యున్నదనగా ఎంత ధనము కావలెనని విశ్వామిత్రుడు ప్రశ్నించును. ఏనుగు పై నెక్కి, బలవంతుడు నిలిచి ఒక రత్నమును విసిరిన ఎంత ఎత్తు పోవునో అంతటి ధనరాశి కావలెనని తెలుపును. హరిశ్చంద్రుడీయ బోవగా, అతని ఆశ్రమమున అంతటి సొమ్మును దాయలేనని తనకు వలయు నప్పుడు ధనము గ్రహింతునని చెప్పి వెడలుచూ, హరిశ్చంద్రుని తన ఆశ్రమమునకు రావించుటకు క్రూరమృగములను సృజింతిని కదా యనుగొనుచు నిష్క్రమించును. ఇంతలో పౌరులు, క్రూరమృగములు జన వాసములపై బడి జనులను, పశువులను ప్రాణహాని కల్పించుచున్నవని పలుకగా, హరిశ్చంద్రుడు క్రూరమృగములు వేటాడుటకు వెడలును.
తృతీయాంకంసవరించు
వేటముగించుకొని హరిశ్చంద్రుడు, భార్య చంద్రమతి, కుమారుడు లోహితుడు ఒక రథముపై, మంత్రి సత్యకీర్తి మరొక రథముపై ప్రవేశింతురు. అలసిన హరిశ్చంద్రుడు, తాను పురోహిత, పండితులతో కొలువు తీరి ఉండగా, ఒక ముని కన్నుల నిప్పులతో హరిశ్చంద్రుని సమీపించి, సింహాసనమునుండి త్రోసి, కట్టుబట్టలతో అడవులకు పంపినట్లు కల గనును. చంద్రమతి తనకు కూడా అట్టి కలే వచ్చినదని పలుకును. ఇది అశుభ సూచకమనుకొనుచుండగా, సత్యకీర్తి విశ్వామిత్రుడు ముందు దినము వచ్చి ధనము అడుగట వలన అట్టి కలవచ్చి ఉండవచ్చునని, నిద్రించు సమయమున ఏ ఆలోచన కలిగిన అదియే కలలో కనబడుట సహజమని, ఇట్టివి దేవ బ్రాహ్మణ సంతర్పణములతో ఉపశమనము కలుగునని పలికి, వినోదముకలిగించుటకు ఆస్థాన సంగీత కళాకారులు లేరని విచారించుచుండగా మాతంగ కన్యలు ప్రవేశింతురు. మాతంగ కన్యలు పాడిన పాటలో భావము నచ్చకున్నను వారి కంఠస్వరము నకు హరిశ్చంద్రుడు ముత్యాలహారము బహుమతిగా ఇచ్చును. వారు బహుమతులను తిరస్కరించి రాజు పొందు కోరుదురు. దానికి హరిశ్చంద్రుడు అంగీకరింపక ఆవలకు పంపుమనును. వారిని భటుడు భద్రుడు నెట్టబోవగా వారు ఏడ్చుచూ, తమ తండ్రి విశ్వామిత్రునితో ఈ అకృత్యమును చెప్పి ఉసరు తీయుంతమని పల్కుచు నిష్క్రమింతురు. ఇంతలో విశ్వామిత్రుడు ఆగ్రహముతో ప్రవేశించి హరిశ్చంద్రుని తలపై తన్ని, తన ఆశ్రమమున అనుమతి లేకుండా ఎట్లు ప్రవేశింతివని ప్రశ్నించును. తెలియక చేసిన అపరాధమని హరిశ్చంద్రుడు పలుకగా, ఏమి విశ్వామిత్రునే ఎరుగువా, నిన్ను అలరింప వచ్చిన నా కుమార్తెలను అవమానింతువా అని ప్రశ్నించును. హరిశ్చంద్రుడు తాను చేసినవి తప్పులైననూ మునీంద్రులకు దీర్ఘకోపము తగదని వారు క్షమా గుణముతో ఒప్పుదురని అనగా, మాతంగ కన్యలను హరిశ్చంద్రుడు వివాహమాడిన తాను ప్రసన్నుడనగుదునని విశ్వామిత్రుడు పలుకును. హరిశ్చంద్రుడు వంశము నిల్పుటకు వివాహమని, తాను వివాహితుడనని, తనకు కుమారుడు కలిగినాడని పలుకుచూ రాజ్యమునైనను పరిజ్యింతును గానీ, తాను కన్యలను వివాహమాడ జాలనని తన నిశ్చయము తెలియ జేయును.ఐనచో రాజ్యము దానమీయమివ్వ మని విశ్వామిత్రుడడుగగా హరిశ్చంద్రుడు రాజ్యమును పరిదానము ఒసగి భార్యాసుతులతో కట్టుబట్టలతో వెడలుటకు ఉద్యుక్తుడు కాగా, విశ్వామిత్రుడు తనకానాడు ఇత్తునన్న ద్రవ్యము ఇవ్వమనును. హరిశ్చంద్రుడు ఒక నెల గడువడుగును. తన శిష్యుడు నక్షత్రకుని తన ఋణము వసూలు చేయుటకు హరిశ్చంద్రుని వెంట పంపును.
చతుర్ధాంకంసవరించు
అడవి గుండా హరిశ్చంద్రుని కుటుంబము వెనుక నక్షత్రకునితో హరిశ్చంద్రుని ప్రయాణము సాగును.అనేక కష్టములతో ప్రయాణము సాగును. సహజముగా దుర్గమమైన ప్రయాణముకు తోడు నక్షత్రుడు పెట్టు బాధలు అలవి కానవి. అడవిలో రక్కసిని వధించి హరిశ్చంద్రుడు నక్షత్రకుని కాపాడును. వారు కాశీ నగరం చేరుకొందురు.
పంచమాంకంసవరించు
కాశీవిశ్వనాధుని దర్శించి వచ్చిన పిమ్మట నక్షత్రకుడు గడువు పూర్తైనదని ఋణము తీర్చమని ఒత్తిడి చేయగా, చంద్రమతిని, లోహితుని కాలకౌశికుడను బ్రాహ్మణునకు విక్రయించి, ఆ సొమ్ము నక్షత్రకునకీయగా, అది తన బత్తెమునకు సరిపోయినదని, గురువు గారి ఋణము తీర్చమనగా వీరబాహుడను కాటికాపారికి తనను తాను విక్రయించుకొనును. ఆ సొమ్ము నక్షత్రకునొసగి ఋణవిముక్తుడగును.
షష్ఠాంకంసవరించు
కాలకౌశికుని ఇంట దాసిగా చంద్రమతి, వీరబాహుని సేవకునిగ వీరదాసు అను పేరుతో హరిశ్చంద్రుడు కుదిరినారు. చితుకలు తెచ్చుటకు కాలకౌశికుని శిష్యులతో అడవికి వెళ్లిన లోహితాస్యుడు పాము కాటుకు మరణించును. పని పూర్తగు వరకు కదలరాదని కాలకౌశికుని భార్య ఆజ్ఞాపించుటతో అర్ధరాత్రి వరకు ఇంటి పనులు చేసి పిమ్మట చంద్రమతి కుమారుని తీసుకొని హరిశ్చంద్రుడు కావలిగా ఉన్న సశ్మానమునకు కొని వచ్చి శవదహనము నకు పూనుకొనును. హరిశ్చంద్రుడు అది గమనించి కాటి సుంకము చెల్లింప కుండా శవదహనము కానింప రాదని గద్దించును. తన వద్ద సొమ్మేమి లేదనగా నగనేదైనా అమ్మి కాటిసుంకం చెల్లింప మనును. అంతట హరిశ్చంద్రుడు ఆమ మెడలో ఉన్న మాంగళ్యాన్ని ఏ ధరకైనా అమ్మమనును. వసిష్ఠుని వరము వలన భర్తకు దక్క తన మాంగల్యము ఎవరికి కనిపించదని, అందు చేత ఆమె అతని భర్త హరిశ్చంద్రునిగా గుర్తించును. ఇద్దరూ కుమారుని మరణమునకు వగచి, ఆమె యజమానురాలిని అడిగి సొమ్ము తీసుకురామని హరిశ్చంద్రుడు పలుకును. ఇంతలో విశ్వామిత్రుడు సృష్టించిన దొంగలు కాశీ రాజు కుమారుని వధించి సొమ్ములపహరించి, కాటి సుంకమును యజమానురాలి వద్ద తీసుకొనుటకు వచ్చుచున్న చంద్రమతి పై వడవైచి మాయమగుదురు. దొంగలను వెంబడించు రాజభటులు ఆమెనే దొంగగా, హంతుకురాలిగా భావించి రాజు వద్దకు కొనిపోవుదురు. ఆమె వద్ద దొంగసొత్తును చూసి, ఆమెను దోషిగా నిర్ధాకరించి రాజు, శిరచ్చేదము శిక్షగా విధించును. ఆమెను వధించు బాధ్యత కాటి కాపరిధి కావున ఆమెను హరిశ్చంద్రున వద్దకు కొనితెత్తురు. ఆమెను రాజాజ్ఞ ప్రకారము పధించబోవగా, విశ్వామిత్రుడు వచ్చి మాతంగ కన్యలను వివాహమాడిన హరిశ్చంద్రుని కష్టములన్నియు తొలగిపోవునని ప్రలోభ పెట్టును. కానీ, స్ధిరచిత్తుడైన హరిశ్చంద్రుడు చంద్రమతిని వధింపబోవగా, పార్వతీ పరమేశ్వరులు ప్రతక్ష్యమై హరిశ్చంద్రుని సత్యసంధతకు ప్రసన్నులగుదురు. చంద్రమతి కాశీ రాకుమారుని సజీవుని చేయమనగా వారు లోహితుని కూడా సజీవుని చేతురు. విశ్వామిత్రుడు ఇది అంతయూ హరిశ్చంద్రుని సత్యసంధతను లోకులకు ఎరిగించుటకు పరీక్షించితినని పలికి వీరబాహుడు యమధర్మరాజని, హరిశ్చంద్రుడున్నది మరుభూమికాదని తెలిప అతని రాజ్యమునతనికి ఒసగి, తన తపఃఫలమును హరిశ్చంద్రునికి ధారపోయును.
పాత్రపోషణసవరించు
హరిశ్చంద్రుడుసవరించు
సత్యసంధుడు, స్ధిర చిత్తుడు, స్థిత ప్రజ్ఞుడు, ధీరోదాత్తుడు, ధీరశాంతుడు. ఎన్ని కష్టములు వచ్చినను మాట తప్పడు. ఇతరులను నిదించడు. వినయ శీలి. రాజ్యమంతయు ధారపోసిన పిమ్మట విశ్వామిత్రుడు ఋణమడిగిన మాటకు కట్టుపడినాడు. అతని ఓర్మిని అనేక విధములుగ పరీక్షించిన నక్షత్రకుడు దారా సుతులనమ్మగా వచ్చిన సొమ్ము తన భత్యమునకు సరిపోయినదనను ఏ మాత్రము విచారింపక తనను తాను విక్రయించుకొని ఋణవిముక్తుడైనాడు. నక్షత్రకుడు ఎన్నో హరిశ్చంద్రునితో విశ్వామిత్రునకు ఋణగ్రస్తుడను కానని ఒక్కసారి అనిన చాలని అన్నను ఆలింపడు. కాలకౌశికుడు హరిశ్చంద్రుని పంపున న్యాయస్ధానములలో వాదింతునని అన్నను లొంగడు. చివరకు చంద్రమతిని వధించ వలసి వచ్చి నపుడు కూడా హరిశ్చంద్రు వంశము సత్యనిష్ఠకు అంతరించుచున్నదని పలుకుచూ చంద్రమతిని వధింప చూచును కానీ చలింపడు. విశ్వామిత్రుడు ఆ సమయమున ప్రలోభ పెట్టినను లొంగడు. కోపము అతని పాత్రలో ఎచ్చటా కానరాదు. భార్యాసుతులన్న అతనికి ఎనలేని ప్రేమ. అరణ్యము న ప్రయాణించునప్పుడు చంద్రమతి ఎండ కన్నెరుగనిదని ఆమె అడవిలో ఇడుములు పడుచున్నదని విచారించును. వల్లకాటిలో భార్యాసుతులను మాటిమాటికీ తలచుకొనుచూ దుఃఖించును. అతనికి దైవ బ్రాహ్మణ భక్తి హెచ్చు. తామెన్ని కష్టములు పడుచున్ననూ, నక్షత్రకునికి ఏ లోటూ రానీడు. బాలుడగు తన కుమారుని కంటే ప్రాధాన్యత నక్షత్రకునికి ఇచ్చాడు. నక్షత్రకుని సాగనంపు సమయమున నీడపట్టున విద్యాబ్యాసము ఒనరించవలిసిన నక్షత్రకుడు తన వలన అడవులు తిరగ వలసివచ్చినదని పలకుట హరిశ్చంద్రునికే చెల్లినది. హరిశ్చంద్రుడు స్వామిభక్తి పరాణయుడు. విధినిర్వహణలో ఆప్రమత్తుడు. తగిన బరువు లేక లేచి కాలు శవమును కాటి సుంకము చెల్లింపకుండా శహదహనము కావించుచున్నారని తలచి గద్దించును. కాటిసుంకము లేకుండా శవదహనము కానీయడు. అట్లని కఠినుడు కాడు. బీదవారని తలచిన తనకురావలిసిన భత్యమును వదలుకొనుటకు సిధ్దపడును. కుమారుని శవమైనా సుంకము చెల్లింపకుండా దహనము కారాదన్నది అతని విధినిర్వహణ పట్ల అతని దీక్షకు తార్కాణము.
చంద్రమతిసవరించు
పరమ సాధ్వీమణి. భర్త అడుగు జాడలలో నడచు ఇల్లాలు. భర్త సత్యసంధతకు తోడుగా నిలిచినది కానీ ఆతనిని ఏనాడు నిందించ లేదు. ఋణవిముక్తికి తనను విక్రయించమని చంద్రమతే హరిశ్చంద్రునికి సూచించింది. కుమారుడు మరణించిననూ, యజమానురాలు అనుమతి ఇచ్చువరకూ ఇంటి లోనుంచి కాలు కదపదు. ఆమె దొంగగా, హంతకురాలిగా నింద భరించింది. భర్త ఆచరిస్తున్న సత్యవ్రత దీక్షకు భోగములు త్యజించుటకూ, దాసిగా సేవించుటకు, పుత్రశోకమునకూ, భర్త చేతిలో మరణమునకు కూడా సిధ్దపడినది.
విశ్వామిత్రుడుసవరించు
వసిష్ఠునితో అకారణ కలహము, తన మాట నెగ్గించుకొను తత్వమూతో ఈ పాత్రను ఈ నాటకములో చిత్రించుట జరిగింది. నక్షత్రకునికి ఎట్లైననూ హరిశ్చంద్రునితో బొంకించుటే లక్ష్యమని తెలియ చేయును. దానికి తోడు కులాభిమానము మెండు. ఎవరైనా శ్లాఘిస్తూ, హరిశ్చంద్రుని ప్రస్తావన తెస్తే అతడు సాటి రాచపట్టి అని మురియు చుండును. కానీ, తన మాట నిలబెట్టుకొను విషయమున హరిశ్చంద్రుని పరీక్షించు సమయమున రాజీ పడ లేదు. హరిశ్చంద్రునికి రాజ్యభష్ట్రత, పుత్రశోకము, భార్యను వధించు పరిస్ధితులూ కలిగించాడు. నాటకము చివరన ఇది అంతయూ హరిశ్చంద్రుని సత్య సంధత లోకమునకు తెలియ చేయుటకే అని తెలుపును. నిజమే.. విశ్వామిత్రుడు సార్థక నామ ధేయుడు. ఐననూ ఈ నాటకమున సభామర్యాదకూడా పాటించని వానివలె చిత్రీకరించుట జరిగింది.
నక్షత్రకుడుసవరించు
ఈ నాటకములో ఈ పాత్రను విశిష్టముగా తీర్చిదిద్దుట జరిగింది. వటువు. విద్యాభ్యాసమున వెనుకబడిన వాడు. కానీ గురువు గారి మాట శిరోధార్యము. గురువు గారి మాట మీద హరిశ్చంద్రుని ఇబ్బందులు పెట్టినాడు. బాకీ లేదని అనిపించుటకు చంద్రమతినీ, హరిశ్చంద్రునీ అనేక విధములుగా ప్రలోభ పెట్టును. పనులు సాధించుకొనుటకు అదే పనిగా వెంటబడు వాడిని నక్షత్రకునిగా అభివర్ణించుట కద్దు. హరిశ్చంద్రునితో కఠినముగా సంభాషించాడు. భార్యా పుత్రులను అమ్మి ఇచ్చిన సొమ్ము భత్యమునకే సరి పోయినది గురువు గారి బాకీ ఏదని అడిగినాడు. గురువాజ్ఞ పాలించుటకే కఠినముగా ప్రవర్తించాడు కానీ అతడు కఠినుడు కాడు. హరిశ్చంద్రుడు ఋణవిముక్తుడైన పిమ్మట అతడిని ఓదార్చిన విధము శ్లాఘనీయము.
నాటకీయతసవరించు
నాటకీయతకు పెద్ద పీట వేసినారు కవి. నాటకీయతకు కొన్ని చోట్ల ఔచిత్యభంగం కలిగినా దానిని ఉద్దేశ పూర్వకంగా విస్మరించారని పిస్తుంది. ముఖ్యంగా దేవేంద్రుని సభలో వసిష్ఠుడు, విశ్వామిత్రుడు సభామర్యాదలు పాటించకుండా పరస్పర దూషణకు దిగడమూ, విశ్వామిత్రుడు అహంకారముతో ప్రవర్తించిన విధమూ దీనికి తార్కాణం. కానీ సన్నివేశాలు చక్కగా రక్తి కట్టేయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. నాటకీయత వలనే హరిశ్చంద్రుని సత్యసంధత ప్రేక్షకులకు తెలియ వస్తుంది.
నాటకం లోని కొన్ని పద్యాలుసవరించు
ఈ నాటకంలో పద్యాలన్నీ అనర్ఘ రత్నాలు. అన్నీ జనాదరణ పొందినవి. అందరి నోటిలో నానేవి. వాటిలో కొన్నిటినే ఎన్నకొనడం తలకి మించిన పని. నాటకంలో కొన్ని పద్యాలను క్రింద పొందుపరచడమైనది.
హరిశ్చంద్రుడు మాతంగ కన్యలను వివాహమాడడానికి నిరకారిస్తూ
మత్తేభం
అరయన్ వంశము నిల్పనేగద వివాహంబట్టి వైవాహిక
స్పురణంబిప్పటికెన్నడోజరిగెసత్పుత్రుండుపుట్టెన్ వయః
పరిపాకంబునుదప్పుచున్నయది యీ ప్రాయంబునన్ వర్ణసం
కరపుంబెండిలి యేల చుట్టెదవు నాకఠంబునన్ గౌశికా
రాజ్యాన్ని విశ్వామిత్రునికి దానమిస్తూ
శార్ధూలం
దేవ బ్రాహ్మణమాన్యముల్విడిచి భక్తిన్ సప్తపోధోదివే
లావిభ్రాజదఖండ భూవలయమెల్లన్ మీకు దానంబుగా
భావంబందొకశంకలేకొసగితిన్ బ్రహ్మార్పణంబంచుదే
వా విశ్రాంతిగా నేలుకొమ్మింకను నీవాచంద్రతారార్కమున్
కాశీనగర వర్ణన
తేటగీతి
భక్తయోగపదన్యాసి వారణాసి
భవదురితశాత్రవఖరాసి వారణాసి
స్వర్ణదీతటసంఖాసివారణాసి
పావనక్షేత్రములవాసి వారణాసి
చంద్రమతిని విక్రయింప చూచుచూ
సీస
జవదాటియెఱుగదీయువలీలామంబుపతి మాటరతనాల పైడిమూట
అడుగుదప్పి యెఱుగదత్తమామలయాజ్ఞకసమానభక్తిదివ్యానురక్తి
అణుమాత్రమైనబొంకను మాటయెఱుగదీ కలుషవిహీననవ్వులనైన
కోపందెఱుంగదీ గుణవితానవితాంతయెఱులంతనిదూఱుచున్నసుంత
తేటగీతి
ఈలతాంగిసమస్తభుపాలమకుట
భవ్యమణికాంతిశబలితపాదుడైన
సార్వభౌమునిశ్రీహరిశ్చంద్రుభార్య
దాసిగానీపెగొనరయ్యధన్యులార
కొన్ని పద్యాలలో హరిశ్చంద్రుడు వేదాంతం, కాదు జీవన సత్యాలు మనముందు ఆవిష్కరిస్తాడు. అటువంటి పద్యాలు కొన్ని
మత్తేభం
తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగిరావేరికే
సరికేపాటు విధించినో విధి యవశ్యప్రాప్తమద్దానినె
వ్వరు దప్పించెదరున్నవాడననిగర్వంబేరికిన్ గాదుకిం
కరుడే రాజగు రాజే కింకరుడగున్ గాలానుకూలంబుగన్'
శార్ధూలం
మాయామేయజగంబెనిత్యమనిసంభావించిమోహంబునన్
నాయిల్లాలనినాకుమారుడనిప్రాణంబుండునందాకనెం
తోయల్లాడిన యీశరీరమిపుడిందుగట్టెలంగాలుచో
నాయిల్లాలునురాదుపుత్రుండును దోడైరాడు తప్పింపగన్
చీకట రాత్రి వర్ణన
సీస
కలవారి ఇండ్ల లోపలి నిధానమునెత్తనరుగుదొంగలకు సిధ్దాంజనంబు
మగల గూరుకనిచ్చి తెగి యంటుగాండ్రకైతారాడుకులటలతార్పుగత్తె
అలవోకనలతి పిట్టలబట్టివేటాడుపాడుఘూకములకుబాడిపంట
మననంబులోనవింపెసలారుశాకినీఢాకినీసతులచుట్టాలసురభి
తేటగీతి
రేలతాంగికినల్లని మేలిముసుగు
కమలజాండంబునకునెల్లగన్నుమూత
సత్యవిద్రోహిదుర్యశశ్చవికిదోడు
కటికచీకచియలమెదిక్తటములందు
ప్రజాదరణ పొందిన నటులుసవరించు
హరిశ్చంద్రుడు పాత్ర చాలా మంది నటులు పోషించాలని ఉవ్వీళ్లూరుతూ ఉంటారు. కనీసం కాటిసన్నివేశానైనా ఏక పాత్రగా అభియిస్తారు. హరిశ్చంద్ర పాత్రకు డి.వి.సుబ్బారావు పెట్టింది పేరు. విశ్వామిత్రునిగా ఆచంట వెంకటరత్నం నాయుడు పేరెన్నిక గన్నారు. పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయ రాజు నక్షత్రక పాత్రపోషణకు జననీరాజానాలందుకున్నారు. చంద్రమతి పాత్రలో రేబాల రమణ, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రఖ్యాతి గాంచేరు.
హరిశ్చంద్ర పాత్రధారణలో మల్లాది సూర్యనారాయణ,బందరు డి.వి. సుబ్బారావు, కె.వెంకటేశ్వర రావు, బండారు రామారావు, చీమకుర్తి నాగేశ్వర రావు, బండారు రవి కుమార్ వంటి వారు పేరెన్నిక గన్నారు. ఇకచంద్రమతి పాత్రకు గూడూరు సావిత్రి, విజయ రాజు, జయనిర్మల; నక్షత్రక పాత్రకు యడ్ల గోపాలరావు వన్నె తెచ్చారు.
తుమ్మ సైదా రెడ్డి గారు (కందిపాడు గ్రామం) ఆ చుట్టూ పక్కల గ్రామాల్లో చాల పాత్రలు పోషించేవారు (కృష్ణుడుగా, రాముడిగా, హరిచంద్రుడుగా మరియు నక్షత్రుడిగాను).
తెలుగు సినిమాలుసవరించు
ఈ నాటకం ఆధారంగా మూడు సినిమాలు నిర్మించబడ్డాయి.
- హరిశ్చంద్ర (1935 సినిమా) - పి. పుల్లయ్య దర్శకత్వం వహించి నిర్మించిన తొలినాటి సినిమా.
- హరిశ్చంద్ర (1956 సినిమా) - ఎస్వీ రంగారావు నటించిన జంపన చంద్రశేఖరరావు దర్శకత్వంలో రాజ్యం పిక్చర్స్ సినిమా.
- సత్య హరిశ్చంద్ర (1965 సినిమా) - కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన విజయా పిక్చర్స్ సినిమా.
మూలాలుసవరించు
బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు రచించిన సత్యహరిశ్చంద్రీయము నాటకం.
ఆంధ్రనాటకం.కామ్