దిగువ హిమాలయ శ్రేణి

(హిమాచల్ నుండి దారిమార్పు చెందింది)

దిగువ హిమాలయ శ్రేణి, సముద్ర మట్టం నుండి 3,700 నుండి 4,500 మీ (12,000 నుండి 14,500 అడుగులు) ఎత్తున, తూర్పు-పశ్చిమ దిశల్లో విస్తరించిన ప్రధానమైన పర్వత శ్రేణి.[1] దీన్ని లోపలి హిమాలయాలు లేదా చిన్న హిమాలయాలు లేదా హిమాచల్ అని కూడా అంటారు. శిఖరం వెంట, ఇది దీనికంటే చాలా ఎత్తున ఉండే ఎగువ హిమాలయాలకు సమాంతరంగా ఉంటుంది. దిగువ హిమాలయాలు పాకిస్తాన్‌లోని సింధు నది నుండి ఉత్తర భారతదేశం, నేపాల్, భూటాన్ అంతటా విస్తరించి ఉన్నాయి. అయితే తూర్పు భూటాన్‌ చేరుకుని ఆపై, బ్రహ్మపుత్ర నదికి చేరుకునేసరికి ఆ రెండు శ్రేణులు దాదాపు కలిసిపోయి, రెంటినీ వేరు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. హిమాచల్ శ్రేణి, దానికి దక్షిణాన ఉన్న దిగువ శివాలిక్ లేదా చురియా పర్వత శ్రేణులకు (బయటి హిమాలయాలు) కూడా సమాంతరంగా ఉంటుంది. పీర్ పంజాల్, చిన్న హిమాలయాలలో అతిపెద్ద శ్రేణి.

నేపాల్ లోని తాన్‌సెన్ వద్ద దిగువ హిమాలయాలు. వెనక ఉన్నది పెద్ద హిమాలయాలు

వివరాలు

మార్చు

'మెయిన్ బౌండరీ థ్రస్ట్' అనే పేరున్న ఒక పెద్ద భూగర్భ ఫాల్ట్ వ్యవస్థ కారణంగా దిగువ హిమాలయ శ్రేణి దక్షిణ వాలులు నిటారుగా ఉంటాయి. ఇక్కడ దాదాపుగా జనావాసాలు లేవు. శిఖరాలు, ఉత్తర వాలులు ఎక్కువ వాలుగా ఉంటాయి. మధ్య కొండలు, నేపాల్‌లో శిఖరం వెంట ప్రారంభమై, దిగువ లోయలు, ఇతర "కొండల" ద్వారా ఉత్తర దిశగా విస్తరిస్తాయి. వీటిపై బాగా జనసాంద్రత ఉంటుంది. 2,000 మీ కంటే ఎక్కువ ఎత్తుల్లో జనాభా సన్నగిల్లుతుంది. తృణధాన్యాల ఆధారిత వ్యవసాయం, కాలానుగుణ పశువుల పెంపకం, బంగాళాదుంపల వంటి చలిని తట్టుకునే పంటలు ఇక్కడి ప్రజల వృత్తి.

హిమాచల్ శ్రేణి లోను, దానికి ఉత్తరాన మధ్య కొండలలోనూ కనిపించే చాలా జాతి ప్రజలకు నేపాల్ మూలాలున్నాయి. నెవార్, మాగర్, గురుంగ్, తమాంగ్, రాయ్, లింబు వంటి ఈ జాతులకు టిబెటో-బర్మన్ అనుబంధాలు ఉన్నాయి. అయితే, అత్యధిక జనాభా కలిగిన జాతి పహాడీలు అనే ఇండో-యూరోపియన్ హిందూ జాతి. వీరిలో ఎగువ బ్రాహ్మణ, క్షత్రియ, లేదా ఛెత్రి కులాలు ఉన్నాయి.

హిమాచల్ శ్రేణి ముఖ్యమైన హైడ్రోగ్రాఫిక్ అవరోధం. చాలా కొద్ది నదులు దీని గుండా ప్రవహిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థలు హిమాలయ నుండి మధ్య కొండల గుండా దక్షిణాన ప్రవహించే అనేక ఉపనదులతో క్యాండెలాబ్రా ఆకృతులను అభివృద్ధి చేశాయి. ఇవి హిమాచల్ శ్రేణికి పక్కనే ఉత్తరాన కలిసి, కొండలను తొలుచుకుంటూ వెళ్ళి పశ్చిమాన కర్నాలీ, మధ్య నేపాల్‌లోని గండకి లేదా నారాయణి, కోసి వంటి ప్రధాన కనుమలను ఏర్పరచాయి.

ఏప్రిల్ నుండి జూన్‌లో వేసవి రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకు భారతదేశంలోని మైదానాలలో నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. అయితే హిమాచల్ శ్రేణిలో అవి పది నుండి పదిహేను డిగ్రీలు తక్కువగా ఉంటాయి. మొఘల్, బ్రిటిష్ పాలకులు, ఈ హిల్ స్టేషన్‌లను వేసవిలో ప్రత్యామ్నాయ రాజధానులుగా, రిసార్టులుగా అభివృద్ధి చేసారు. నేపాల్, భూటాన్‌లలో హిల్ స్టేషన్‌లు లేవు, ఎందుకంటే వాటి రాజధాని నగరాలు ఎత్తుల్లో ఉండడం చేత అక్కడ వేడి అంతగా ఉండదు.

మూలాలు

మార్చు
  1. "Lesser Himalayas - mountains, Asia". britannica.com. Retrieved 20 April 2018.

28°45′N 83°30′E / 28.750°N 83.500°E / 28.750; 83.500