హైదరాబాదు ఎగ్జిబిషన్

హైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శనశాల ద్వారం
హైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శనశాలలోని పిల్లల రైలు
హైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శనశాల లోపటి దృశ్యం

హైదరాబాదు నగరంలో ప్రతి యేటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు నాంపల్లిలో జరిగే పారిశ్రామిక ప్రదర్శననే హైదరాబాదు ఎగ్జిబిషన్ (నుమాయిష్).[1] దీనిని అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాల (All India Industrial Exhibition) గా కూడా వ్యవహరిస్తారు. నాంపల్లిలో ఈ ప్రదర్శన జరిగే మైదానం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌గా ప్రసిద్ధి చెందినది.

చరిత్రసవరించు

1937లో కేవలం 100 స్టాల్స్‌తో ప్రారంభమైన ఈ ప్రదర్శన శాల ప్రస్తుతం 2600 స్టాల్స్‌లతో శోభాయమానంగా ప్రదర్శించబడుతోంది. చిన్నలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సందర్శించడానికి ఆసక్తి చూపబడే ఈ ప్రదర్శనశాలలో కేవలం పారిశ్రామిక వస్తువులే కాకుండా పలు రకాల ఆటలు, వినోద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పలు దుకాణాలు సరాసరిగా ఆయా పారిశ్రామిక సంస్థల వారే నిర్వహిస్తుండటం విశేషం. దీని వలన సందర్శకులకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయి. పలు రకాలైన తినుభండారాలు కూడా ప్రదర్శనశాల లోపల లభిస్తాయి. ఈ ప్రదర్శనశాల నిర్వహించబడే 46 రోజులపాటు ప్రతి రోజు సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రదర్శన స్థలం వరకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తుంది.

హైదరాబాదులో నిర్వహించబడుతున్న ఈ పారిశ్రామిక ప్రదర్శన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరు సంపాదించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రాత్సహించడమే కాకుండా వినియోగదార్లను చైతన్యవంతం చేయడానికి ఇది దోహదపడుతోంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు అనేక కార్యక్రమాలను, అభివృద్ధి పథకాలను కూడా ప్రదర్శనకు ఉంచుతారు. జనవరి 1వ తేదీ నాడు ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రదర్శనా మైదానంలో స్టాల్స్‌ల కేటాయింపు, సందర్శకులకు సౌకర్యాలు మొదలగు నిర్వహణా కార్యకలాపాలను ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తుంది. ఈ సొసైటీకి నగరంలోని పురపాలక శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్డు భవనాల శాఖ, ట్రాఫిల్ పోలీస్ శాఖ మొదలగు శాఖలు సహకరిస్తాయి.

ఈ ప్రదర్శన వలన ఆదాయంతో సొసైటీ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అనేక కళాశాలలు కూడా ఈ సొసైటీ విరాళాలతో నిర్వహించబడుతున్నాయి.

ప్రదర్శనశాల విషయాలుసవరించు

  • స్థలం : నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ (ముకర్రంజాహి రోడ్)
  • స్టాల్స్‌ల సంఖ్య : 2600
  • ప్రవేశ టికెట్టు ధర : రూ.10/-
  • ప్రదర్శనా తేదీలు : జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15
  • సమయం : మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 10.30 [2]
  • సందర్శకులు : 25 లక్షలు [3]

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-14. Retrieved 2008-02-13.
  2. http://hyderabad.click.in/community/events/13595/all-india-industrial-exhibition/february/viewevent.html
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-01-21. Retrieved 2008-02-12.