హైపర్‌సోనిక్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్ వెహికిల్

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేస్తున్న స్క్రామ్‌జెట్ తో నడిచే పునర్వినియో

హైపర్‌సోనిక్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్ వెహికిల్ (ఆంగ్లం: Hypersonic Technology Demonstrator Vehicle) - ఇది స్క్రామ్‌జెట్‌తో పనిచేసే, హైపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించే మానవ రహిత విమానం. ఇది ఒక సాంకేతికతా ప్రదర్శకం. ఈ కార్యక్రమాన్ని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది.[1] దీనికి ఇస్రోతో సంబంధం లేదు. ఇస్రో కూడా స్క్రామ్‌జెట్ ఇంజనుతో, హైపర్‌సోనిక్ వేగంతో నడిచే పునర్వినియోగ వాహనాన్ని అభివృద్ధి చేస్తోంది.

అబ్దుల్ కలాం ద్వీపంలోని లాంచ్ కాంప్లెక్స్-IV (LC-IV)లో 7 సెప్టెంబర్ 2020న లాంచ్ చేయడానికి ముందు HSTDV క్రూయిజ్ వెహికల్ సాలిడ్ బూస్టర్ స్టేజ్‌పై అమర్చబడింది.

ఉపోద్ఘాతం మార్చు

హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి తయారీలో భాగంగా, దాని కవసరమైన పరీక్షా సౌకర్యాల కల్పనలో భారత్ ముందుకు పోతోంది. ఈ ప్రదర్శకం ఆ క్షిపణి ప్రాజెక్టులో భాగమే. ఘన ఇంధన బూస్టరును వాడి ప్రయాణం మొదలుపెట్టి, తరువాత స్క్రామ్‌జెట్ ఇంజనుతో 20 సెకండ్ల పాటు ప్రయాణించాలనేది ఈ సాంకేతిక ప్రదర్శకం యొక్క ఉద్దేశం. 32.5 కిమీ ఎత్తున మ్యాక్ 6.5 వేగాన్ని అందుకోవాలనేది అంతిమ లక్ష్యం. పునర్వినియోగ వాహక నౌకలపై భారత ఆసక్తిని కూడా ఇది సూచిస్తుంది.

వాహనం యొక్క ఏరో డైనమిక్ లక్షణాలు, ఉష్ణ సంబంధ లక్షణాలు, స్క్రామ్‌జెట్ ఇంజను పనితనం మొదలైన వాటిని మూల్యాంకన చెయ్యడం తొలి పరీక్షల లక్ష్యం. ఈ వాహనం యొక్క రూపాన్ని బెంగళూరులోని ఏరో ఇండియా ఎక్జిబిషన్‌లో ప్రదర్శించారు. త్వరలోనే పూర్తి స్థాయి స్క్రామ్‌జెట్ ఇంజన్ను పరీక్షిస్తామని ప్రాజెక్టు డైరెక్టరు ఎస్. పన్నీర్‌సెల్వం చెప్పాడు.

రూపకల్పన, అభివృద్ధి మార్చు

ఇంజన్ను అమర్చే ఎయిర్‌ఫ్రేము రూపకల్పన 2004 లో పూర్తైంది.[2] 2008 మేలో అప్పటి డిఅర్‌డివో డైరెక్టరు వికె సరస్వత్ ఇలా చెప్పాడు: "HSTDV కార్యక్రమంలో ఇజ్రాయిల్ కొంత సాయం చేసింది. గాలి సొరంగ పరీక్ష ఈ సాయంలో ఒక భాగం. ఇంగ్లండుకు చెందిన క్రాన్‌ఫీల్డ్ యూనివర్సిటీ కూడా సాయం చేసింది." పేరు బయటపడని మరొక దేశం కూడా సాయపడుతోంది భారత్‌కు రక్షణ పరికరాల సరఫరాలో రష్యా ప్రధానమైనది. ఆ దేశం హైపర్‌సోనిక్ ప్రొపల్షనులో ఎంతో పరిశోధన చేసింది.

5.6 మీ పొడవుతో, 1 టన్ను బరువున్న విహాయస వాహనం (ఎయిర్ వెహికిల్) అష్టభుజి అడ్డుకోతతో, మధ్యభాగాన రెక్కలతో, తోక రెక్కలతో 3.7 మీ వెడల్పైన దీర్ఘ చతురస్రాకారపు ఎయిర్ ఇన్‌టేక్ కలిగి ఉంది. దేహపు మధ్య భాగాన కిందవైపున స్క్రామ్‌జెట్ ఇంజను అమర్చి ఉంది. దేహపు వెనకభాగం (యాఫ్ట్) ఎక్జాస్టు నాజిల్‌లో భాగంగా ఉంది. ఇంజను అభివృద్ధి కూడా పురోగతిలో ఉంది. 

ముందువైపున ఉన్న సమాంతర ఫెన్సులు స్పిల్లేజిని తగ్గించి థ్రస్టును పెంచేందుకు డిజైను చేసారు. రోల్ నియంత్రణ కోసం రెక్కల చివర ఫ్లాపులు అమర్చారు. 25 డిగ్రీల కోనం వరకూ వంగ గలిగే నాజిల్, వేగం అందుకోవడంలోను, వేగం తగ్గించడంలోనూ  ఇంజను సరిగా పనిచెయ్యడానికి తోడ్పడుతుంది.

దేహపు అడుగు భాగం, రెక్కలు, తోక టైటానియం మిశ్రలోహంతో తయారుచేసారు. పై ఉపరితలం అల్యూమినియం మిశ్రలోహంతో చేసారు. రెండు గోడల ఇంజను లోపలి భాగం నియోబియం మిశ్రలోహంతోను,  బయటి  భాగం నిమోనిక్ మిశ్రలోహంతోనూ తయారుచేసారు.

స్క్రామ్‌జెట్ ఇంజనుకు అవసరమైన సాంకేతికతల సరఫరా నిరాకరణ కారణంగా ఓ కొత్త కార్యక్రమం చేపట్టి, అవసరమైన పదార్థాల తయారీకి శ్రీకారం చుట్టారు. దీనితో స్వావలంబన సాధ్యమైంది. పూర్తి స్వదేశీ స్క్రామ్‌జెట్  ఇంజన్ను భూస్థాయి పరీక్షలో 20 సెకండ్ల సేపు పనిచేయించారు.

పరీక్ష మార్చు

1:16 నిష్పత్తిలో తగ్గించిన ఒక నమూనా వాహనాన్ని ఇజ్రాయిల్‌ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వారి గాలి సొరంగంలో పరీక్షించారు. బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ వారి గాలి సొరంగంలో ఐసొలేటెడ్ ఎయిర్ ఇన్‌టేక్ విధానాన్ని పరీక్షించారు. లాబొరేటరీ పరీక్షల్లో స్క్రామ్‌జెట్ ఇంజన్ను రెండు సార్లు 20 సెకండ్ల సేపు పరీక్షించారు. పరీక్షా ఫ్లైటుకు ముందు ఐదారు పరీక్షలు జరపాల్సి ఉంది. 2010 చివరి నాటికి మొదటి ఫ్లైటు పరీక్ష జరపాలని అనుకున్నారు.[3]

హైదరాబాదు దగ్గరలో రూ. 1,000 కోట్లు పెట్టుబడితో నాలుగు పరిశోధన కేంద్రాలను రాబోయే ఐదేళ్ళలో ఏర్పాటు చెయ్యనున్నట్లు 2010 నవంబరులో DRDO ప్రకటించింది. హైదరాబాదు క్షిపణి కేంద్రంలో 3 నుండి 4 వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఒక గాలి సొరంగాన్ని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది.[4] ఇంజను పనితీరుతో సహా HSTDV యొక్క అనేక పరామితులను పరీక్షించేందుకు ఈ కేంద్రం వీలు కల్పిస్తుం0ది.[4] "HSTDV ని మ్యాక్ 12 స్థాయిలో పరీక్షించడం కీలకం. ఇది భారత్‌లో ఒక విశిష్ట నిర్మాణం కానుంది." అని 2010 నవంబరు 22 న ని వికె సరస్వత్ చెప్పాడు.[4]

2011 డిసెంబరు నాటికి ఏరోడైనమిక్స్, ఏరో థెర్మోడైనమిక్స్, ఇంజను, హాట్ స్ట్రక్చర్ల సాంకేతికతలను భూస్థాయి పరీక్షల ద్వారా శాస్త్రవేత్తలు నిరూపించారు.

2016 మొదట్లో వెలువడిన ప్రకటన ప్రకారం  ఈ వాహనాన్ని 2016 డిసెంబరులో పరీక్షిస్తారు.[5]

ఇవి కూడా చూడండి మార్చు

ఆర్‌ఎల్‌వి-టిడి

మూలాలు వనరులు మార్చు

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; THEHINDU అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. Projects, Center for Aerospace research, Anna University
  3. "US still denying us technology". Archived from the original on 2010-07-28. Retrieved 2016-08-30.
  4. 4.0 4.1 4.2 "DRDO Establishing Four New Facilities"[permanent dead link].
  5. Hypersonic test flight in december 2016