2024 సెప్టెంబరు 1 న, విజయవాడలోని బుడమేరు వాగుకు తీవ్రస్థాయిలో వరద రావడంతో విజయవాడ నగరంలో చాలా భాగం నీటిలో మునిగింది. నగరానికి గణనీయమైన ముప్పు తెచ్చిపెట్టింది. మైలవరానికి ఎగువన ఖమ్మం జిల్లా నుండి వరదనీరు బుడమేరు ద్వారా విజయవాడలోకి పెద్దయెత్తున వచ్చింది. ఈ వరద ప్రవాహం 70,000 క్యూసెక్కులకు చేరుకుంది. సాధారణ గరిష్ట స్థాయి అయిన 11,000 క్యూసెక్కుల కంటే ఇది చాలా ఎక్కువ. అలాగే కృష్ణానది పరీవహక ప్రాంతంలో ఎగువన పడిన వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరే కృష్ణా నది నీటి ప్రవాహం కూడా మునుపెన్నడూ లేని విధంగా 11.43 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. కాగా, బ్యారేజీ నుండి దిగువకు 11.90 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. వరదల ఫలితంగా గణనీయమైన ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై విస్తృతమైన ప్రభావాలు, అలాగే పంట నష్టం కూడా గణనీయంగా సంభవించింది. వరద ముంపు నుండి నగరం కోలుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేసింది,

అజిత్ సింగ్ నగర్ ప్రధాన రహదారిలో నిలిచిన వరద నీరు
అజిత్ సింగ్ నగర్ ప్రధాన రహదారిలో నిలిచిన వరద నీరు

2005 లో జరిగిన చివరి పెద్ద వరద సంఘటనలో బుడమేరు పొంగిపొర్లడంతో నగరంలో 15% దాకా నీటమునిగింది. అప్పుడు జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలను వాయిదా వెయ్యాల్సి వచ్చింది.