అంటరాని వసంతం జి.కళ్యాణరావు రాసిన నవల.[1]

అంటరాని వసంతం
కృతికర్త: జి. కళ్యాణరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల:

రచన నేపథ్యం

మార్చు

కులప్రాతిపదికన ఓ వర్గం ఎదుర్కొన్న అనేకరకాల అక్రోశాల, బాధల, అన్యాయాల, తిరుగుబాటు వివరణలను చిత్రీకరించిన నవల "అంటరాని వసంతం".

ఇతివృత్తం

మార్చు

రూతు జ్ఞాపకంగా, రూబేను జీవితంగా ఆరంభమైన అంటరాని వసంతం నవల, తరతరాలను తడుముతుంది.దాదాపు ఎనిమిది తరాల్లోని వారి జీవితాన్ని తడుముతుంది అంటరాని వసంతం నవల. ఇలా ఎందరెందరి జీవితాలనో కలుపుకు సాగిన ప్రవాహం అంటరాని వసంతం. జీవిత అవసరాలకే నిత్యం ఆరాటపడే నిమ్నవర్గాలవారికి, కల పట్ల ఆసక్తి, అభినివేశం ఉండడమే అబ్బురం. అటువంటిది దానికోసం ప్రాణాలనైనా లెక్కచేయకపోవడం మరీ అద్భుతమంటారు ఈ కథాంశాన్ని విశ్లేషిస్తూ నవలా హృదయంలో వి.రాజారామమోహనరావు. అంటరాని వసంతంలో ప్రధానంగా ఈ అంశం కదులుతూ వారి జీవన నేపథ్యం ఆవిష్కరించింది. ఏడెనిమిది తరాల కథను చెప్పినా, వారి జీవితంతో పాటు ఈ అంశాన్ని జమిలిగా ముడిపెట్టడం జరిగింది.

రూబేనుతో కథ మొదలైనా, అంటరాని వసంతం నవల మొదటి భాగంలో సింహభాగం, రూబేను తాతయిన ఎల్లన్న జీవితానిది. ఎల్లన్నది వెన్నెల దిన్నె. అతని తండ్రి ఎర్రెంకడు. తల్లి లింగాలు. అత్త భూదేవి. చిన్నతనంలోనే ఎల్లన్నకి పాట అన్నా, ఆట అన్నా మక్కువ. పాటని అల్లే నేర్పు చిన్నతనంలోనే సహజంగా అబ్బింది. ఎర్రగొల్లల నాటకం చూసినప్పుడే అత్త మీద వరసలు అల్లాడు. ఎర్రగొల్లలు వివక్షతతో చితకబాదినప్పుడు భయంతో పారిపోయి, పక్కలదిన్నెలో ఉరుముల నాట్యం చూసినప్పుడు ఎల్లన్నలో కళావేశం పెల్లుబికింది. ఉరుముల నాట్యానికి నాగన్న పెట్టింది పేరు. నాగన్నది కూడా ఎన్నెల దిన్నే. ఒకే ఊరు, ఒకే వర్గం, ఒకే ఉత్సాహంతో నాగన్న ఎల్లన్నని తీర్చిదిద్దాడు.

కాలం ఎల్లన్నని పాట ఎల్లడు, ఆట ఎల్లడుగా వాళ్ల వాళ్లందరిలోనూ ప్రసిద్ధుణ్ణి చేసింది. అతనికి సుభద్రతో పెళ్ళి జరిగింది. శివయ్య పుట్టాడు. అయినా ఎల్లన్న స్థిరంగా నిలవలేదు. పాటలు అల్లాడు. గొంతెత్తి పాడాడు. ఊళ్లు తిరిగాడు. అతని పాటలు శశిరేఖ ద్వారా సుభద్రకు చేరుకున్నాయి. అవసానదశలో కొడుకు చేతులమీదుగా ఎల్లన్న ఇంటికొచ్చాడు. ఎల్లన్నతోటే సుభద్ర బ్రతుకు అంతమైపోయింది. శివన్న, శశిరేఖ కరువు దెబ్బతో వలస వెళ్ళారు. నానా బాధలు పడ్డారు. అక్కడా వివక్షతే ఎదురయ్యింది. దాంతో శివయ్య సిమోనుగా క్రిస్టియన్ అయ్యాడు. సిమోను కొడుకే రూబేను. రూబేను బోధకునిగా మారాడు. ఆ రూబేనునే రూతు అందమైన అంటరానివాడా అని పిలిచేది. వాళ్ళ మనవడు ఇమ్మాను యేలు. ఆ తర్వాత జెస్సీ.. ఇలా అంటరాని వసంతం తరతరాల కథ. ఎన్నో వందల జీవితాల కథ.[2]

పాత్రచిత్రణ

మార్చు

రూతు, రూబేను, సిన సిబ్బడు, ఎల్లన్న, ఎర్రెంకడు, మరో ఎల్లన్న, శివయ్య, ఇమ్మానుయేలు, జెస్సీ... ఇలా ఎన్నో తరాలను కలుపుతూ సాగుతుంది ఈ నవల. ఒకపక్క దారుణమైన అంటరాని తనాన్ని అనుభవిస్తూనే మరోవైపు కళల పట్ల విపరీతమైన అభినివేశం ఉండడమే ఈ పాత్రలన్నిటినీ కలిపే మూలసూత్రం. అదే అంటరాని వసంతం.

ఈ నవలలోని పాత్రల చిత్రీకరణ అంతా సాఫీగా నిజజీవిత వ్యక్తిత్వాలనే ఎంచుకుని చేసినట్టు సాగుతుంది. రచయితకు పరియమైన వాతావరణంలోంచే పాత్రల్ని సృష్టించడంతో సజీవమైన పాత్రలు తిరుగాడిన అనుభూతి కలిగుతుంది. పాత్ర చిత్రీకరణలో వ్యక్తీకరణలు కొన్నిచోట్ల చాలా విశిష్టంగా ఉంటాయి. ఉదాహరణకు:

  • లింగాలు అట్టాంటి ఇట్టాంటి మనిషి కాదు. నిలబడితే చూరుకప్పు దాటేట్టు ఉంది. వాకిలి ఎత్తు లేపాలి
  • మేనల్లుడు తన ముక్కు కొలుచుకు పుట్టాడు. ఆ చిన్న చేతివేళ్ళలో తన ముక్కు కొలుచుకొంది.

శైలి-శిల్పం

మార్చు

జ్ఞాపకంగా ఆరంభమై, కవిత్వంలా, ఊహలా, వెన్నెల దృశ్యంలా, వెన్నెలపిట్ట ధ్వనిలా సాగిన రచనలో భావుకత, పొయెటిక్ ఎక్స్ ప్రెషన్ చాలా సాంద్రంగా ఉన్నాయి అంటారు విమర్శకులు రామమోహనరావు. కథగా సాగిన వివరాల దగ్గర క్లుప్తత, కొన్ని చోట్ల మరీ వివరణ తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందరెందరి జీవితాలనో కలుపుకుపోయిన ప్రవాహం లాంటి నవల ప్రవాహవేగంలో కొన్ని మలుపులు, కొన్ని సుడిగుండాలు, కొన్ని వేగచ్ఛాయలు పదే పదే కనిపిస్తాయి. స్వల్ప భేదంతో అవన్నీ ఒకటే అనిపిస్తూ పునరుక్తి అనిపిస్తాయి. అంటరాని వసంతం నవలను ఈ నేపథ్యంలోనే పలువురు విమర్శకులు ఇది ఒక ఒద్దికైన పేర్పు కాదు. ఒక ఆవేశం, ఒక ఆక్రోశం, తరతరాల బాధ కలిసిన ప్రవాహం అంటారు.[3]

సమీక్షలు

మార్చు

"..అంటరాని వసంతం నవల ఒక పురాణం అని చెప్పవచ్చు. తెలుగు నాట మాలకులస్థుల జీవితంలో ఏడినిమిది తరాల కథ వర్తమానంలో మొదలై గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటూ, భవిష్యత్తులోకి తొంగి చూస్తూ మూడు కాలాల్లో నడిచిన మాల పురాణం ఇది. కథని కొనసాగిస్తూనే మధ్య మధ్య ఉపాఖ్యానాలూ, పిట్టకథలూ కోకొల్లలుగా చెప్పుకొస్తూ సుమారొక వందేళ్ళ పొడుగున్న జీవిత చిత్రాన్ని సజీవమైన పాత్రలతో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నది" అని ఈ నవల సమీక్షలో ఎస్. నారాయణస్వామి రాసాడు.

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. జి.కళ్యాణ రావు (2000-04-01). అంటరాని వసంతం.
  2. జి.కళ్యాణరావు రచించిన అంటరాని వసంతం
  3. వి.రాజారామమోహనరావు "నవలాహృదయం"లోని అంటరాని వసంతం పరిచయం:పేజీ 22,23

ఇవి కూడా చూడండి

మార్చు