అంబేద్కర్ మనుస్మృతి దహనం

1927 డిసెంబరు 25 తేదీన అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్, అతడి అనుచరులు కొందరూ కలిసి మనుస్మృతిని దహనం చేశారు. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతం రాయగడ్ జిల్లా లోని మహాద్ అనే చిన్న పట్టణంలో కొన్ని వేల మంది సమక్షంలో ఈ దహన కార్యక్రమం జరిపారు. ఈ గ్రామం ముంబాయికి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటినుంచీ దళితులు, అంబేద్కరైట్లు ఆ రోజును ‘మనుస్మృతి దహన దినం’గా పాటిస్తూ ఏటా ఆ రోజున ‘మనుస్మృతి’ని తగులబెడుతున్నారు.

బి.ఆర్‌. అంబేద్కర్‌
బి.ఆర్‌. అంబేద్కర్‌

మహాద్ పట్టణంలో సత్యాగ్రహ సదస్సు జరిగాక, అక్కడే ఒక చితి పేర్చి దహన క్రతువును నిర్వహించారు. రాత్రి తొమ్మిది గంటలకు ఈ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘ఇదే మనుస్మృతి దహన భూమి’, ‘అంటరానితనాన్ని రూపుమాపండి’, ‘బ్రాహ్మణీయ సంస్కృతిని పాతిపెట్టండి’ వంటి నినాదాలతో ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు.[1]

నేపథ్యం

మార్చు

1927 మార్చి 19 న మహాద్ పట్టణంలో జరిగిన మహాడ్ సత్యాగ్రహం ఈ సంఘటనకు నేపథ్యంగా నిలిచింది. బహిరంగ ప్రదేశాలన్నీ అంటరానివారికి ఇతరులతో సమానంగా అందుబాటులో ఉండాలని 1923 లో బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక తీర్మానం చేసింది. 1924 లో మహాద్ పట్టణ పంచాయితీ ఈ తీర్మానాన్ని నిర్ధారించింది. అయితే ఈ తీర్మానం వచ్చినప్పటికీ పరిస్థితులు అంతగా మెరుగుపడలేదు. అగ్రకులాల వారు అవలంబించిన స్పర్థా వైఖరి కారణంగా ఇది సాధ్యపడలేదు. దళిత వర్గాల వారికి దీనిపట్ల చైతన్యం కలిగించేందుకు అంబేద్కర్, మహాద్‌లో ఒక సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసాడు.

1927 మార్చి 19 న మహాద్ పట్టణంలో జరిగిన ఈ సత్యాగ్రహానికి మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల లోని జిల్లాల నుండి 2,500 మంది దాకా హాజరయ్యారు. అంటరానివారి హక్కులు, అంటరానితనం నిర్మూలన, దీనిపై ప్రభుత్వం కార్యాచరణ, బాంబే కౌన్సిల్ తీర్మానపు అమలు వంటి అంశాలపై సమావేశంలో ప్రసంగాలు, తీర్మానాలు చేసారు. మరుసటి రోజున సత్యాగ్రహంలో పాల్గొన్న సభ్యుడొకరు మహాద్ పట్టణంలో ఉన్న ఒక చౌదార్ చెరువు వద్దకు ఊరేగింపుగా వెళ్ళి అందులోని నీరు తాగాలని ప్రతిపాదించాడు. తద్వారా అంటరానివారు తమ హక్కును ఉద్ఘాటించాలని అన్నాడు. అంబేద్కర్ నాయకత్వంలో సభ్యులు ఊరేగింపుగా వెళ్ళి చెరువు లోని నీరు తాగారు. దీనిపై అగ్రవర్ణాల వారు ఒక కేసు పెట్టారు గానీ అది వీగిపోయింది. ఆ తరువాత అగ్రవర్ణాల వారు, అంటరానివారు చెరువు లోని నీరు త్రాగడంతో అది మైల పడిపోయిందని చెబుతూ గోపంచకం వగైరాలతో చెరువు నీటిని శుద్ధి చేసే క్రతువు నిర్వహించారు. అంబేద్కర్‌కు ఈ సంగతి తెలిసి కోపగించాడు. ప్రజాబాహుళ్య సౌకర్యాలను వినియోగించుకునే తమ హక్కును పునరుద్ఘాటించేందుకు మహాద్ లోనే మరొక సత్యాగ్రహం చెయ్యాలని నిశ్చయించాడు. 1927 డిసెంబరు 26 న దీనికి ముహూర్తంగా నిర్ణయించాడు.

సంఘటన

మార్చు

ఇంతలో ఛాందసవాద హిందువులు కొందరు, ఆ చెరువు బహిరంగ స్థలం కాదని, అది ప్రైవేటు ఆస్తి అని డిసెంబరు 12 న మహాద్ సివిలు కోర్టులో కేసువేసారు. కోర్టు, అంబేద్కరు ఆ చెరువులో నీళ్ళు తాగడాన్ని తదుపరి తీర్పు వచ్చే వరకూ నిషేధిస్తూ డిసెంబరు 14 న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు సమావేశంపై ప్రభావమేమీ చూపలేదు. 4,000 మంది వరకూ సమావేశానికి హాజరయ్యారు. డిసెంబరు 24 న అంబేద్కరు మహాద్ చేరుకున్నపుడు జిల్లా మేజిస్ట్రేటు అతడికి కోర్టు ఉత్తర్వులనిచ్చి, సమావేశాన్ని నిర్వహించుకోవచ్చనీ చెరువులో నీళ్ళు తాగే కార్యక్రమాన్ని చేపట్టవద్దనీ కోరాడు. సదస్సుకు హాజరైనవారు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించైనా సరే, చెరువులో నీళ్ళు తాగాల్సిందేనని పట్టుబట్టారు. వారిని శాంతింపజేయడం అంబేద్కర్ వంతైంది. కొన్నాళ్ళు వాయిదా పడినంత మాత్రాన ఉద్యమం ఆగినట్లు కాదని అతడు వారిని శాంతపరచాడు. వారంతా అంబేద్కర్ ఆధ్వర్యంలో ఊరేగింపుగా చెరువు వద్దకు వెళ్ళి దాని చుట్టూ ఒకసారి తిరిగి వెనక్కి సభాస్థలికి వచ్చేసారు.[2]

మరుసటి రోజు సాయంకాలం జరిగిన సభలో అంబేద్కర్ మనుస్మృతిని విమర్శించాడు. అంబేద్కర్ అనుచరుడు, చిత్‌పవన్ బ్రాహ్మణుడూ అయిన సహస్రబుద్ధే, మనుస్మృతిని తగలబెడదామనే సూచన చేసాడు. నేలలో అరడుగు లోతుతో, అడుగున్నర పొడవు వెడల్పులతో నలు చదరపు గొయ్యి తీసి గంధపు చెక్కలతో చితి పేర్చి ‘మనుస్మృతి’ గ్రంథాన్ని దానిపై ఉంచి హిందువులు నిర్వహించే అంత్యేష్టి లాగే ఆ క్రతువును నిర్వహించారు. ఆ రాత్రి 9 గంటల ప్రాంతంలో బౌద్ధ సాధువుల పర్యవేక్షణలో దహన కార్యక్రమాన్ని నిర్వహించారు.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "మనుస్మృతి దహనం - అంబేద్కర్". telugumedia9 (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-10-19. Archived from the original on 2020-08-02. Retrieved 2020-08-02.
  2. Samel, Swapna H. (1999). "Mahad Chawadar Tank Satyagraha of 1927: Beginning of Dalit Liberation Under B.r. Ambedkar". Proceedings of the Indian History Congress. 60: 722–728. ISSN 2249-1937. JSTOR 44144143.