అకీరా కురొసావా

జపనీస్ చిత్ర దర్శకుడు
(అకిరా కురొసావా నుండి దారిమార్పు చెందింది)

అకీరా కురొసావా (మార్చి 23, 1910 - సెప్టెంబరు 6, 1998) జపనీస్ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్. 57 సంవత్సరాల కెరీర్ లో 30 చలన చిత్రాలకు దర్శకత్వం వహించిన కురసోవా[note 1] సినిమా చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన, ముఖ్యమైన సినీ దర్శకుల్లో ఒకరుగా పేరొందారు. 1936లో కురసోవా జపనీస్ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. కొద్దికాలం పెయింటర్గా పనిచేశారు. సంవత్సరాల పాటు ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, స్క్రిప్ట్ రచయితగా పనిచేశాకా రెండో ప్రపంచ యుద్ధసమయంలో 1943లో పాపులర్ యాక్షన్ సినిమా సాన్షిరో సుగతా (అనే జూడో సాగా) ఆయన దర్శకునిగా తొలి సినిమా చేశారు. యుద్ధానంతరం విమర్శకుల ప్రశంసలు పొందిన డ్రంకెన్ ఏంజిల్ (1948). ఈ సినిమాతో కురసోవా జపాన్ లోని యువకులైన సినిమా దర్శకుల్లో అత్యంత ముఖ్యునిగా పేరొందారు. సినిమాలో అప్పటికి వర్ధమాన నటుడైన తొషిరో మిఫునే ప్రధాన పాత్ర ధరించారు. వీరిద్దరూ తర్వాత మరో 15 సినిమాలకు కలిసి పనిచేశారు. ఆయన భార్య యోకో యగుచి కూడా కురసోవా తీసిన ఒకానొక సినిమాలో నటిగా పనిచేశారు.

అకిరా కురసోవా
黒澤 明
1953లో సెవెన్ సమురాయ్స్ చలనచిత్రం సెట్స్ లో అకిరా కురసోవా
జననం(1910-03-23)1910 మార్చి 23
షినాగ్వా, టోక్యో, జపాన్
మరణం1998 సెప్టెంబరు 6(1998-09-06) (వయసు 88)
సెటాగయా, జపాన్
జాతీయతజపాన్, జపాన్ సామ్రాజ్యం
వృత్తిదర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత, ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు1936–1993
జీవిత భాగస్వామియోకొ యాగుచి (1945–1985)
పిల్లలుకజుకొ కురసోవా
హిసావో కురసోవా
తల్లిదండ్రులుఇసాము కురసోవా
షిమా కురసోవా

కురసోవా దర్శకత్వం వహించిన రషోమాన్ సినిమా 1950 ఆగస్టులో టోక్యోలో మొదట ప్రదర్శితమైంది. 1951 సెప్టెంబరు 10న వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అనూహ్యంగా గోల్డెన్ లయన్ పురస్కారాన్ని పొందింది, ఆ వెనువెంటనే ఐరోపా, ఉత్తర అమెరికాల్లో విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు, వ్యాపారాత్మక విజయం పొందడంతో మొట్టమొదటి సారి జపనీస్ సినిమా పరిశ్రమలో తయారైన సినిమాలకు పాశ్చాత్య సినీ మార్కెట్లు తెరచుకున్నాయి, తద్వారా జపనీస్ సినీ రూపకర్తలకు అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందింది. 1950 దశకమంతా, 1960ల మొదట్లోనూ, కురసోవా దాదాపుగా సంవత్సరానికి ఒక సినిమా చొప్పున దర్శకత్వం వహించారు. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇకిరు (1952), సెవెన్ సమురాయ్ (1954), యోజింబొ (1961) వంటి సినిమాలు కూడా ఉన్నాయి. 1960ల మధ్యభాగం తర్వాత కురసోవాకు అవకాశాలు తగ్గాయి అప్పటివరకూ సంవత్సరానికి ఒక సినిమా చొప్పున చేస్తూ వచ్చిన ఆయన సినిమాలు తగ్గిపోయాయి.[1] కానీ ఆ మలిదశలో చేసిన సినిమాల్లో ఆయన ఎపిక్స్ గా పరిగణించే కగెముష (1980), రాన్ (1985) ఉన్నాయి, అలానే పలు పురస్కారాలు కూడా గెలుచుకోవడం కొనసాగింది. వీటిలో జపాన్లో పల్మే డోర్ పురస్కారం (కగెముష సినిమాకు) కూడా ఉంది.

1990ల్లో ఆస్కార్ జీవిత సాఫల్యపురస్కారాన్ని అందుకున్నారు.[2][3] మరణానంతరం ఆసియన్ వీక్ పత్రిక, సి.ఎన్.ఎన్. సంయుక్తంగా తయారుచేసిన జాబితాలో "గత 100 సంవత్సరాల్లో ఆసియా మెరుగుదలకు కృషిచేసిన (ఐదుగురు) వ్యక్తుల్లో ఒకరిగా" పేర్కొంటూ "కళలు, సాహిత్యం, సంస్కృతి" విభాగం క్రింద "ఆసియన్ ఆఫ్ ది సెంచురీ"గా గుర్తించారు.[4]

ఇతరాలు

మార్చు

1910,మార్చి 23 వ తేదీన, జపాన్ లోని టోక్యో లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు అకిరా కురొసావా . ఏడుగురు సంతానం కలిగిన కుటుంబంలో ఆఖరి వాడు అకిరా కురోసావా. ఈయన పుట్టే నాటికి ఒక సోదరి పెళ్ళయ్యి, మరో సోదరుడు ఉద్యోగరీత్యా ఇళ్ళు వదిలి వెళ్ళిపోగా, మరో సోదరుడు ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయాడు. దాంతో ముగ్గురు అక్కలు ఒక అన్నలతో తన చిన్నతనం గడిపిన అకిరా కురొసావా, తన నాలుగో తరగతిలో వుండగా మరో సోదరిని కోల్పోయాడు. అందుకే కాబోలు death అనే concept ని తన సినిమాల్లో అధ్యయనం చేశారనిపిస్తుంది. జపాన్ ‘సమురాయ్’ (సైనిక) కుటుంబంలో జన్మించిన అకిరా సినిమాలు మాత్రమే తన ఉనికిగా బతికాడు. యుద్ధ సన్నివేశాలను చిత్రించడంలో, రిస్కు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి! నటీనటులకు అలవాటు కావడానికి, తద్వారా సహజత్వం కోసం సినిమా కాస్ట్యూమ్స్‌తో వాళ్లను కొంతకాలం గడపమనేవాడు. ఏరోజు రషెస్ ఆరోజు స్వయంగా ఎడిట్ చేసుకునేవాడు. ‘‘ఆలోచనలు సహజంగా వస్తాయి, కథ ఆ క్యారెక్టర్ వెంట సాగిపోతుంది’’ అని తను సినిమా తీసే విధానం గురించి చెప్పేవాడు కురసోవా. స్టోరీబోర్డ్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు. సినిమాకు ఫండింగ్ దొరకని విరామ సమయాల్లో తన సీన్లన్నింటినీ బొమ్మలుగా గీసుకునేవాడు. ఆయన స్వయంగా పెయింటర్ కూడా! సినిమాల్లోకి రాకముందు కమర్షియల్ ఆర్టిస్టుగా పనిచేశాడు. ‘‘నిజంగా డెరైక్టర్ కావాలనుకుంటే ముందు స్క్రీన్‌ప్లేలు రాయండి. రాయడం ద్వారానే సినిమా స్ట్రక్చర్ అర్థమవుతుంది, అసలు సినిమా ఏంటో కూడా అర్థమవుతుంది’’ అని ఔత్సాహిక దర్శకులకు సలహా ఇచ్చేవాడు. ‘‘నీలోపల ఎంతో రిజర్వు ఉంటేతప్ప, నువ్వు ఏదీ సృష్టించలేవు. జ్ఞాపకమే సృష్టికి మూలం. శూన్యం నుంచి దేన్నీ సృష్టించలేం’’. అందుకని చదవడం చాలా ముఖ్యమనేవాడు. ‘‘అయితే, చదవడం వల్లగానీ, నీ జీవితానుభవం వల్లగానీ వచ్చినదానికి జోడించగలిగేదేదో నీలోపల లేకపోతే నువ్వు ఏదీ సృజించలేవు’’ అనేవాడు.

ఆయన సినిమాలన్నీ ‘లార్జర్ దన్ లైఫ్’గా కనబడినా, ఆయన మాట్లాడిందంతా జీవితం గురించే! మనిషి ఎప్పుడూ తప్పకూడని నీతినీ, ఎప్పుడూ పాటించవలసిన మానవీయ విలువనీ ఆయన చిత్రాలు ప్రతిబింబించాయి. మనిషి బతకడం కోసం చేసే పోరాటాన్నీ, మనిషిగా నిలబడటం కోసం పడే ఆరాటాన్నీ, సమూహంతో కలిసిసాగే సంతోషపు వెతుకులాటనూ ఆయన చిత్రించాడు. అయితే, జీవితం ఎంత సంక్లిష్టమైందో ఆయన సినిమాలు కూడా అంతే సంక్లిష్టమైనవి. అందుకే కురసోవా తన సినిమాల్లో ‘ఫలానాది వెల్లడించాడు’ అనడం తప్పుడు విశ్లేషణే అవుతుంది.

‘‘నా సినిమా ఏం చెబుతుందో నేనేగనక వివరించగలిగితే అందరికీ వెళ్లి అదే చెప్తానుగానీ, అంత కష్టపడి సినిమా ఎందుకు తీస్తాను?’’ అన్నాడాయన. సినిమాను అర్థం చేసుకోవడంలో మెదడుకంటే హృదయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వమనేవాడు. ఆయన చిత్రరాజాలు మాత్రం మెదడునూ, హృదయాన్నీ రెంటినీ సంతృప్తిపరుస్తాయి.

మనిషి బతకడం కోసం చేసే పోరాటాన్నీ, మనిషిగా నిలబడటం కోసం పడే ఆరాటాన్నీ, సమూహంతో కలిసిసాగే సంతోషపు వెతుకులాటనూ ఆయన చిత్రించాడు.

జీవితం, కెరీర్

మార్చు

బాల్యం, యౌవనం (1910-35)

మార్చు

కురసోవా టోక్యోలోని ఓమొరి డిస్ట్రిక్ట్ లోని వోయిమచిలో 1910 మార్చి 23న జన్మించారు. ఆయన సమురాయ్ వంశానికి చెందిన ఇసాము ఆయన తండ్రి. ఆయన ఆర్మీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ యొక్క లోయర్ సెకండరీ పాఠశాలకు డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన తల్లి షిమా ఓసాకాకు చెందిన వాణిజ్య కుటుంబానికి చెందిన వ్యక్తి. అకిరా కుటుంబంలో ఎనిమిదోవాడు, అత్యంత చిన్నవాడు. వారిది ఎగువ మధ్యతరగతి కుటుంబం, అప్పటికే ఆయన తోబుట్టువుల్లో ఇద్దరు పెరిగి పెద్దయ్యారు, ఆయన జన్మించిననాటికే మరొకరు మరణించారు, దాంతో ఆయన ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్యతో కలిసి పెరిగారు.[5][6] శారీరిక వ్యాయామాన్ని ప్రోత్సహించడంతో పాటు, ఇసాము కురసోవా పాశ్చాత్య సంప్రదాయాలను ఆహ్వానించేవారు. ఆయన విద్యాభివృద్ధికి విజ్ఞానాన్ని పంచుతూ నాటకాలు, సినిమాలు ఉపకరిస్తాయని భావించేవారు. ఆయన తన పిల్లలను సినిమాలు చూడమని ప్రోత్సహించేవారు; యువ అకిరా మొట్టమొదటగా ఆరో సంవత్సరంలో సినిమా చూశారు.[7] చిత్రలేఖనంలోనూ, విద్యాభ్యాసంలోనూ పిల్లలకు ఆసక్తిని తన ప్రభావశీలమైన పద్ధతుల ద్వారా ఏర్పరిచిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు టచికవా అకీరా కురసోవాపై ప్రభావం చూపారు.[8] ఈ సమయంలో కాలిగ్రఫీ (అందమైన చేతిరాత), కెండో కత్తియుద్ధం వంటివి నేర్చుకున్నాడు.[9]

అకీరాపై ఆయనకన్నా నాలుగేళ్ళ పెద్దవాడైన అన్న హీరా కురసోవా ప్రభావం చూపారు. టోక్యోను అతలాకుతలం చేసిన 1953 నాటి గొప్ప కంటో భూకంపం తర్వాత దాని ప్రభావాన్ని చూపించేందుకు 13 సంవత్సరాల అకిరాను హీరా తీసుకువెళ్ళాడు. అకీరా అక్కడ చెల్లాచెదురుగా పడివున్న మానవుల శవాలు, జంతువుల కళేబరాలు చూడడానికి భయపడి పారిపోతూంటే, హీరా అడ్డుకుని దాన్ని నేరుగా చూసి నిజాన్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రోత్సహించారు. కొందరు వ్యాఖ్యాతలు కురసోవా సినిమాల్లో అప్రియమైన సత్యాలను చూపించడానికి వెనుదీయకపోవడం ఆధారంగా ఆయన కళాజీవితంపై ఈ సంఘటన ప్రభావం తీవ్రంగా ఉందని భావించారు.[10][11]

హీగో చదువు విషయంలో చాలా చురుకైనవాడే అయినా టోక్యోలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉన్నత పాఠశాలలో చేరే అవకాశం రానందుకు నిరుత్సాహపడి కుటుంబంతో కలవడం మానేశారు. హీగో తనకు ఆసక్తికరమైన విదేశీ సాహిత్య అధ్యయనంపై దృష్టి కేంద్రీకరించారు.[6] 1920 దశాబ్దం చివరికాలంలో విదేశాలకు చెందిన మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా మారి అందులో హీగో మంచి పేరు సంపాదించుకున్నారు. అదే సమయంలో చిత్రకారుడు కావాలని ప్రయత్నిస్తున్న అకిరా,[12] అన్న హీగోతో సాగారు, ఆ అన్నదమ్ములు విడదీయలేనివారు అయ్యారు.[13] హీగో, అకిరా థియేటర్ కి మాత్రమే కాక సర్కస్ ప్రదర్శనలకు కూడా తమ కాలాన్ని అంకితం చేశారు,[14] వామపక్ష శ్రామికవర్గ కళాకారుల లీగ్ కోసం అకిరా వేసిన చిత్రాలు ప్రదర్శించారు. ఏదేమైనా ఆయన తన చిత్రకళతో జీవిక సంపాదించుకోలేకపోయారు, శ్రామికవర్గ ఉద్యమంలోని అధికభాగాన్ని "నెరవేరని రాజకీయ ఆదర్శాలు నేరుగా కాన్వాసుపై చిత్రీకరించడంగా" అవగాహన చేసుకోవడం ప్రారంభించగానే చిత్రలేఖనంలో ఉత్సాహం కోల్పోయారు.[15]

1930ల తొలినాళ్ళలో టాకీ సినిమాల నిర్మాణం పెరుగుతూండడంతో హీగో లాంటి సినిమా కథ వివరించే వ్యాఖ్యాతలు పని కోల్పోతూవచ్చారు, దాంతో అకిరా తల్లితండ్రుల వద్దకు తిరిగి చేరుకున్నారు. 1933 జూలైలో హీగో ఆత్మహత్య చేసుకున్నారు. కురసోవాపై అన్న మరణం తీవ్రమైన ముద్రవేసింది, ఈ సంఘటన జరిగాకా దాదాపు అర్థశతాబ్దం అనంతరం రాసుకున్న ఆయన ఆత్మకథ సంథింగ్ లైక్ యాన్ ఆటోబయోగ్రఫీలోని సంబంధిత అధ్యాయం పేరును "ఎ స్టోరీ ఐ డోన్ట్ వాంట్ టు టెల్" అని పెట్టారు.[16] కేవలం నాలుగు నెలల తర్వాత, కురసోవా పెద్దన్న కూడా మరణించడంతో 23 సంవత్సరాల అకిరాను కురసోవా సోదరుల్లో అప్పటికింకా జీవించివున్న ఒకే ఒక్కనిగా మిగిలారు. ఆయనతో పాటుగా ఆయన తోబుట్టువుల్లో మరో ముగ్గురు సోదరిలు మిగిలారు.[13][16]

శిక్షణలో దర్శకుడు (1935–41)

మార్చు

1935లో పి.సి.ఎల్.గా పేరొందిన న్యూ ఫిల్మ్ స్టూడియో ఫోటో కెమికల్ లాబొరేటరీస్ (తర్వాతికాలంలో ప్రముఖ స్టూడియో టోహో అయింది), సహాయ దర్శకుడి కోసం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. కురసోవాకు సినిమాను వృత్తిగా ఎంచుకోవడంలో ప్రత్యేకమైన ఆసక్తి లేకున్నా, దరఖాస్తుదారులను జపనీస్ సినిమాల్లోని లోటుపాట్లు, వాటిని అధిగమించడానికి దారులు అన్న అంశంపై రాయమన్న వ్యాసాన్ని రాశారు. కురసోవా దృక్కోణం ప్రకారం ఒకవేళ లోటుపాట్లు మౌలికమైనవి అయితే, వాటిని సరిదిద్దేందుకు దారే లేదు. కురసోవా తర్వాతి పరీక్షల్లో హాజరయ్యేందుకు అవకాశం ఈ వ్యాసం ద్వారా పొందారు, పరీక్షకుల్లో ఒకరైన దర్శకుడు కజిరో యమామొటో అకిరా కురసోవాను ఇష్టపడి, అతన్ని తీసుకునేందుకు స్టూడియో వారిని గట్టిగా కోరారు. 25 సంవత్సరాల కురసోవా పి.సి.ఎల్. సంస్థలో ఫిబ్రవరి 1936న చేరారు.[17][18] అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన ఐదేళ్ళ కెరీర్ లో, కురసోవా ఎందరో దర్శకుల వద్ద పనిచేశారు, కానీ వారందరిలో చాలా ముఖ్యమైన వ్యక్తి కెనిచి ఎనోమోటో. సహాయ దర్శకునిగా పనిచేసిన 24 సినిమాల్లో 17 యమామొటో వద్దనే పనిచేశారు, వాటిలోనూ ప్రముఖ నటుడు కెనిచి ఎనొమొటొ నటించిన కామెడీ సినిమాలే ఎక్కువ.[19] కురసోవా ప్రతిభను యమామొటో అభివృద్ధి చేశాడు, సంవత్సరం తిరిగేసరికి మూడవ సహాయ దర్శకుని స్థాయి నుంచి కురసోవాను నేరుగా ముఖ్య సహాయ దర్శకుని స్థాయికి ఉద్యోగోన్నతి కల్పించాడు.[20] కురసోవా బాధ్యతలు పెరిగాయి, స్టేజీ నిర్మాణం, ఫిల్మ్ డెవలెప్మెంట్ మొదలుకొని, లొకేషన్ కోసం వెతుకులాట, స్క్రిప్ట్ మెరుగుపరచడం, రిహార్సల్స్, లైటింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, రెండో యూనిట్ దర్శకత్వం వరకు అనేక పనులు చేశాడు.[21] కురసోవా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఆఖరు సినిమా హార్స్ (ఉమ, 1941) సినిమా చిత్రీకరణ సమయానికి యమామొటో మరో చిత్ర నిర్మాణంలో తలమునకలై ఉండడంతో, హార్స్ నిర్మాణ బాధ్యతలు చాలావరకూ కురసోవానే తీసుకుని చేశాడు.[22]

కురసోవాకు యమామొటో ఇచ్చిన ప్రధానమైన సలహా ఏమిటంటే మంచి దర్శకుడు స్క్రీన్ ప్లే రచనలో సిద్ధహస్తుడై ఉండాలన్నది.[23] కురసోవాకు సహాయ దర్శకుడిగా తాను సంపాదిస్తున్న దానికన్నా తన స్క్రిప్టుల ద్వారా ఎక్కువ సంపాదించగలనని అర్థం చేసుకున్నాడు.[24] తర్వాత్తర్వాత కురసోవా తన స్క్రిప్ట్ లు రచన చేయడమో, సహ రచయితగా వ్యవహరించడమో చేశాడు. సత్సువో యమామోటో సినిమా ట్రంఫ్ ఆఫ్ వింగ్స్ వంటి సినిమాలకు స్క్రిప్ట్ అందించాడు, తరచుగా ఇతర దర్శకులకు స్క్రిప్ట్ అందించేవాడు. ఆయన ప్రపంచ ప్రఖ్యాతుడైన చాలాకాలం తర్వాత వరకూ అంటే 1960ల దాకా బయటివారికి స్క్రీన్ ప్లే రచన చేయడం అన్నది, ఆయనకు లాభసాటి పనిగా కొనసాగింది.[25][26]

యుద్ధకాలపు సినిమాలు, వివాహం (1942–45)

మార్చు

హార్స్ 1941లో విడుదల అయ్యాకా రెండు సంవత్సరాల పాటు కురసోవా తన దర్శకత్వ జీవితం ప్రారంభించేందుకు తగ్గ కథ కోసం వెతికాడు. జపాన్ పెర్ల్ హార్బర్ పై దాడిచేసిన సంవత్సరానికి 1942 చివరికి సునియో తొమిటా అన్న రచయిత జూడో నవల సన్షిరో సుగత నుంచి స్ఫూర్తి పొంది ముసాషి మియమొటో అన్న నవల రాశారు. దాని అడ్వర్టైజ్మెంట్స్ అకీరా కురొసావాకు ఆసక్తి కలిగించాయి. పుస్తకం ప్రచురితమైన రోజునే దాన్ని కొనుక్కుని వచ్చాడు, ఒక్కసారే చదివేసి, వెనువెంటనే రచయితను సినిమా హక్కుల కోసం సంప్రదించాడు. కురసోవా నిర్ణయం సరైనదని కొద్దిరోజుల్లోనే మూడు జపనీస్ స్టూడియోలు హక్కులు కొనడానికి రచయితను సంప్రదించినప్పుడు రుజువైంది. రచయిత హక్కులు కురసోవాకే ఇచ్చివుండడంతో దర్శకుడిగా తొలి సినిమాకు ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభమైంది.[27][28]

సన్షిరో సుగతా చిత్రీకరణ డిసెంబరు 1942లో హోకొహామాలోని లొకేషన్ వద్ద ప్రారంభమైంది. చిత్ర నిర్మాణం సాఫీగానే సాగిపోయింది, కానీ పూర్తైన సినిమా సెన్సార్ పూర్తిచేసుకోవడం కష్టతరమైంది. సెన్షార్షిప్ ఆఫీసు వారు ఆ సినిమా మరీ "బ్రిటీష్-అమెరికన్" తరహాగా ఉందని (ఆ రోజుల్లో ఇది రాజద్రోహ నేరంతో సమానమైనంత ప్రమాదకరమైన ఆరోపణ), సినిమాను గట్టిగా సమర్థించిన దర్శకుడు యసుజిరో ఓజు కలగజేసుకున్నాకే విడుదలకు అడ్డంకులు తొలగిపోయి 1943 మార్చి 25న సన్షిరో సుగతా విడుదలైంది. (అప్పటికి అకీరా కురసోవాకు 33 సంవత్సరాల వయసు వచ్చింది) సినిమా అటు విమర్శకుల మన్ననలు అందుకుంది, మరోవైపు వాణిజ్యపరంగానూ విజయం సాధించింది. తర్వాత సెన్సార్షిప్ ఆఫీసు 18 నిమిషాల నిడివి ఫుటేజి తొలగించాలని నిర్ణయించినా అదేమీ పెద్ద నష్టం కాలేదు.[29][30]

1944 తొలినాళ్ళలో యుద్ధకాలం నాటి స్త్రీల ఫ్యాక్టరీ పనివాళ్ళ కథాంశం తీసుకుని ద మోస్ట్ బ్యూటీఫుల్ అన్న ప్రచార చిత్రం సెమీ-డాక్యుమెంటరీ శైలిలో నిర్మించాడు. నటుల నుంచి సహజమైన వాస్తవిక నటన సాధించేందుకు, దర్శకుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు వారిని నిజమైన ఫాక్టరీలో ఉంచి, ఫ్యాక్టరీ ఆహారం తినడానికి పెట్టించి, వారి వారి పాత్రల పేర్లతో ఒకరినొకరు పిలుచుకునేలా చేశాడు. తన కెరీర్ మొత్తం కురసోవా ఇలాంటి విధానాలే అనుసరించాడు.[31][32]

ప్రభావం

మార్చు

ప్రపంచ సినిమాతో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు పాఠ్యపుస్తకాల వంటివి. యాభై సంవత్సరాలపాటు సినిమా కెరీర్ లో దాదాపు ముఫైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రచయితగా, ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహించి ఎన్నో కళాఖండాలకు ప్రాణం పోసారు అకిరా కురొసావా.

1929 లో ఇల్లు వదిలి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన అకిరా కురొసావా సాహిత్యం, చిత్రకళలను అభ్యసించాడు. సాహిత్యంలో ముఖ్యంగా Dostoevsky, గోర్కీ లంటే ఇష్టపడేవాడు అకిరా కురొసావా. ఇదే సమయంలో “Proletarian Artists’ League” చేరి కొన్నాళ్ళూ అక్కడా ఇక్కడా తిరుగుతూ లక్ష్యం లేని జీవితం గడిపిన తర్వాత కొన్నాళ్ళకు తన సోదరుడు హీగో ఆత్మహత్య చేసుకోవడంతో తన జీవితంకూడా అలా కాకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. తన సోదరునే అనుసరిస్తూ చిన్ననాటి నుండి జీవితం గడుపుకుంటూ వచ్చిన అకిరా కురొసావా, వారిద్దరి మధ్య సారూప్యం గురించి చెప్తూ “I saw him as a negative strip of film that led to my own development as a positive image” అనే వారు.

సినిమా మాస్టర్లు అనిపించుకున్న దర్శకులు ఇన్‌మార్ బెర్గ్‌మన్, ఫ్రెడరికో ఫెల్లిని, సత్యజిత్ రే, రోమన్ పోలన్‌స్కీ, జార్జ్ లుకాస్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, మార్టిన్ సోర్సెసే, స్టీవెన్ స్పీల్‌బర్గ్‌లాంటివాళ్లు కూడా కురసోవా వల్ల ప్రభావితమయ్యారు. అందుకే ఆయన్ని విమర్శకులు గౌరవంగా ‘ఎంపరర్ ఆఫ్ ద సెల్యులాయిడ్’ అంటారు.

సినిమాలు

మార్చు

ఒకసారి దర్శకుడు అకిరా కురసోవాకు ఈ ప్రశ్న ఎదురైంది: ‘‘మీరు ‘రాన్’లోని ఆ ఫ్రేమ్‌లో కెమెరా అలా ఎందుకు పెట్టారు?’’ దానికి కురసోవా ఇచ్చిన జవాబు: ‘‘నేను ఒక్క అంగుళం ఎడమకు ప్యాన్ చేసినా సోనీ ఫ్యాక్టరీ కనబడుతుంది, అదే ఒక్క అంగుళం కుడికి జరిపితే ఎయిర్‌పోర్టు కనబడుతుంది. పీరియడ్ సినిమాకు ఆ రెండూ అనవసరం’’. కురసోవా అంత పర్ఫెక్షనిస్టు! సినిమా కోసం ప్రాణం పెట్టేవాడు. 1948తో మొదలై నాలుగు దశాబ్దాలపాటు సాగిన ఆయన కెరీర్లో... రషోమాన్, ఇకిరు, సెవెన్ సమురాయ్, యొజింబో, థ్రోన్ ఆఫ్ బ్లడ్, దెర్సు ఉజాలా, ద లోయర్ డెప్త్స్, హై అండ్ లో, డ్రీమ్స్, రప్సోడీ ఇన్ ఆగస్ట్... ఒక్కో సినిమా ఒక్కో చరిత్ర!

కజిరా యమమొటో అనే దర్శకుని పరిచయంతో అకిరా కురసొవా ఉత్సాహాన్ని పుంజుకున్నారు. యమమొటో లో ఒక ఉత్తమ స్థాయి గురువును చూసిన అకిరా ఆయన వద్ద దర్శకత్వంలో తొలి పాఠాలు నేర్చుకున్నారు. అప్పటికే స్క్రీన్‍ప్లే రచనలు సాగిస్తూ ఇతర సినిమాలకు పనిచేస్తున్న అకిరా కురొసావా వార్తాపత్రికలోచదివిన ఒక కొత్త నవల (Sanshiro Sugata) కథాంశం చదివి బాగా ప్రభావితం చెంది ఆ నవలను సినిమాగా మలచాలన్న నిర్ణయానికి వచ్చాడు.అనుకున్నట్టుగానే 1943 లో తన మొదటి సినిమా, Sanshiro Sugata ను రూపొందించారు అకిరా కురొసావా.

జూడో అనే యుద్ధకళ ఆధారంగా రూపొందించిన Sanshiro Sugata సినిమా అకిరా కురొసావా మున్ముందు రూపొందించిన సినిమాలతో పోల్చలేనప్పటికీ ఈ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక శైలి ని ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత 1944 లో Ichiban utsukushiku,Tora no o wo fumu otokotachi, Sanshiro Sugata-2 లాంటి సినిమాలు రూపొందించినప్పటికీ Yoidore tenshi (Drunken Angel,1948), Shizukanaru ketto (A Silent Duel, 1949), Nora inu(Stray Dog, 1949) సినిమాలు అకిరా కురొసావాను అప్పటి జపాన్ లోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా గుర్తింపును తెచ్చిపెట్టాయి.

1950 వరకూ అకిరా కురొసావా రూపొందించిన సినిమాలు ఒక ఎత్తైతే 1950 లో ఆయన రూపొందించిన ’రషోమాన్’ సినిమా మరో ఎత్తు. ఈ సినిమాతో అకిరా కురొసావా జపనీస్ సినిమాను ప్రపంచానికి దగ్గర చేశారు. అప్పటివరకూ జపాన్ వరకే పరిమితమైన జపనీస్ సినిమా ప్రపంచ సినీ ప్రేమికులకు దగ్గరయింది. అదే సమయానికి జపాన్ లో కెంజి మిజొగుచి, యసుజిరో ఓజులు కూడా తమ సినిమాలను ప్రఖ్యాత ప్రపంచ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించి అవార్డులు గెలుచుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా జపనీస్ సినిమా అంటే ఒక క్రేజ్ ఏర్పడింది.

’రషోమాన్’ సినిమా తర్వాత అకిరా కురొసావా అంటే ప్రపంచ సినీ ప్రేమికులకు అత్యంత ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే అకిరా కురొసావా ఒక దాని తర్వాత ఒకటిగా అత్యధ్బుత సినిమాలను మలచసాగారు. ’రషోమాన్’తర్వాత అకిరా కురొసావా రూపొందించిన చిత్రం ’హకుచి’. యువకుడిగా రష్యన్ రచయిత దోస్తోవిస్కీ రచనలను ఆసక్తిగా చదివిన అకిరా కురొసావా ’హకుచి’ చిత్రానికి గాను దోస్తోవిస్కీ రచన ’The Idiot’ను కథాంశంగా ఎన్నుకున్నారు. కమర్షియల్ గా ఈ సినిమా విజయం సాధించనప్పటికీ తనకు బాగా నచ్చిన సినిమాల్లో ఇది ఒకటి అని కురొసావా భావించేవారట.

’హకుచి’ తర్వాత అకిరా కురొసావా ’ఇకిరు’, ’సెవెన్ సమురాయ్’ చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాలతో ఆయనకు ప్రపంచమంతా అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత వచ్చిన ’The Hidden Fortress’, ‘Throne of Blood’, ’యొజింబొ’, ‘సంజురో’ సినిమాలు అకిరా కురొసావాను ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా చేర్చాయి.

దాదాపు పదిహేనేళ్ళ పాటు జపాన్ చలనచిత్ర సీమను ఏలిన అకిరా కురొసావా కెరీర్ కు 1965లో వచ్చిన ‘Red Beard’ సినిమాతో పెద్ద బ్రేక్ పడింది. ఈ సినిమా వచ్చే సమయానికి కలర్ సినిమాలు రావడం, అప్పటి వరకూ తన సినిమాల్లో నటించిన Toshirō_Mifune తో గొడవలు రావడం, తను ఏర్పరచిన సినీ నిర్మాణ కంపెనీ నష్టాల్లో కూరుకుపోవడం లాంటి ఎన్నో అంశాలు కురొసావా కెరీర్ కు పెద్ద అడ్డుగోడగా నిలిచాయి. అప్పటివరకూ దాదాపుగా సంవత్సరానికి ఒక సినిమా రూపొందిస్తూ వచ్చిన అకిరా కురొసొవా 1965 నుంచి ఐదేళ్ళకొక సినిమా తీయడానికే ఎన్నో కష్టాలు పడాల్సివచ్చింది.

తన ఆఖరి శ్వాస విడిచే వరకూ సినిమాకే తన జీవితం అంకితం చేయాలనుకున్న అకిరా కురొసావా సినిమాలు రూపొందించే అవకాశాలు లేక ఒకానొక సమయంలోఆత్మహత్యకు కూడా పూనుకున్నారు.సినిమాలే జీవితంగా భావించిన అకిరా కురొసావా కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా తన సినిమాలన్నింటికీ స్క్రిప్టు సమకూర్చుకోవడంలోనూ, అలాగే కొన్ని సినిమాలకు ఎడిటర్ గానూ బాధ్యతలు నిర్వహించారు.

1985 లో అకిరా కురొసావా రూపొందించిన ‘Ran’ సినిమాతో తన పూర్వవైభవాన్నిసంపాదించుకున్నారు. షేక్స్పియర్ నాటకం ’కింగ్ లీయర్’ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను అకిరా కురొసావా తన సినిమాల్లోకెల్లా గొప్ప సినిమా అని పేర్కొన్నారు. ఈ సినిమా తర్వాత అకిరా కురొసావా మరో మూడు సినిమాలు రూపొందించారు. ’డ్రీమ్స్’ సినిమా ద్వారా తన జీవితంలోని కలలను తెరకెక్కించారు అకిరా కురొసావా. ఎనిమిది లఘు చిత్రమాలిక అయిన ఈ సినిమా అకిరా కురొసావా చిత్రాల్లో ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు.

అవార్డులు

మార్చు

తన సినిమాలకు ప్రపంచంలోని వివిధ చలన చిత్రోత్సవాల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న అకిరా కురొసావాకు 1989 లో ’లైఫ్ టైమ్ అచివ్మెంట్’కి గాను అస్కార్ అవార్డు అందుకున్నారు.

“I like unformed characters. This may be because, no matter how old I get, I am still unformed myself.” అని నమ్మిన అకిరా కురొసావా ప్రపంచ సినిమాకు విశిష్ట సంపదను మిగిల్చి 1998 లో తుది శ్వాస విడిచారు. ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళినాఆయన సినిమాల ద్వారా చిరకాలం మన మధ్య బ్రతికే వుంటారు అకిరా కురొసావా!

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

నోట్స్

మార్చు
  1. 1946లో, కురసోవా హిడియో సెకిగవా, కజిరో యామమొటోలతో కలిసి దోజ్ హూ మేక్ టుమారో (అసు ఓ సుకురు హిటొబిటొ) సినిమాకు సహ దర్శకత్వం వహించారు; బహుశా అప్పటికి ఆయన కాంట్రాక్టులో ఉన్న టొహొ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మించమని నిర్దేశించివుండొచ్చు. (సినిమా కేవలం ఒక్క వారంలో నిర్మించినట్టు కురసోవా పేర్కొన్నారు.) ఇది ఆయనకు దర్శకునిగా పూర్తి క్రెడిట్ దక్కని ఒకేఒక సినిమా, అందులోనూ జపాన్లో వీడియోగా ఎన్నడూ విడుదలైవుండలేదు. కురసోవా తర్వాతికాలంలో పొందిన ఖ్యాతివల్ల వెలుగులోకి వచ్చింది, సాధారణంగా ఈ సినిమాను చాలామంది ఆయన ఇతర 30 సినిమాల్లో చేర్చరు, అయితే ఇది ఆ దర్శకుని సినిమాల జాబితాలో చేరుతూంటుంది. గాల్ బ్రైత్, పిపి. 65-67, , కురసోవా ఐడిఎంబి పేజీ చూడండి.

సైటేషన్లు

మార్చు
  1. సిద్ధారెడ్డి, వెంకట్ (October 2010). "అకిరా కురసోవా". నవతరంగం. Archived from the original on 2014-04-01. Retrieved 3 September 2015.
  2. "Academy Award Acceptance Speech Database". Archived from the original on 2010-02-17. Retrieved 2022-04-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Akira Kurosawa Tribute with George Lucas, Steven Spielberg". November 19, 2008. Retrieved June 28, 2010.
  4. "ASIANOW – Asiaweek – Asian of the Century – Kurosawa Akira – 12/10/99". Archived from the original on 2013-06-03. Retrieved June 18, 2010.
  5. Galbraith, pp. 14–15
  6. 6.0 6.1 Kurosawa 1983, p. 17
  7. Kurosawa 1983, pp. 5–7
  8. Kurosawa 1983, pp. 12–13
  9. Galbraith, p. 16
  10. Kurosawa 1983, pp. 51–52
  11. Prince, p. 302
  12. Kurosawa 1983, pp. 70–71
  13. 13.0 13.1 Galbraith, p. 19
  14. Kurosawa 1983, pp. 72–74, 82
  15. Kurosawa 1983, p. 77
  16. 16.0 16.1 Kurosawa 1983, p. 84
  17. Kurosawa 1983, pp. 89–93
  18. Galbraith, p. 25
  19. Galbraith, pp. 652–658
  20. Galbraith, pp. 29–30
  21. Goodwin 1994, p. 40
  22. Galbraith, p. 35
  23. Kurosawa 1983, p. 103
  24. Goodwin 1994, p. 42
  25. "Akira Kurosawa". Archived from the original on 24 జూలై 2010. Retrieved August 9, 2010.
  26. Galbraith, pp. 658–707
  27. Galbraith, p. 39
  28. Kurosawa 1983, pp. 121–123
  29. Galbraith, pp. 43, 45–46
  30. Kurosawa 1983, pp. 124–128, 130–131
  31. Kurosawa 1983, pp. 132–135
  32. Galbraith, pp. 46–51

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.