అగరాల ఈశ్వరరెడ్డి

అగరాల ఈశ్వర రెడ్డి (1933 డిసెంబరు 28 - 2020 ఫిబ్రవరి 16) ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. రేణిగుంట మండలం తూకివాకంలో జన్మించిన ఈయన 1957లో అదే గ్రామానికి సర్పంచిగా ఎన్నికయ్యాడు. 1962లో తిరుపతి శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. రెండోసారి అక్కడినుంచే గెలిచాడు. ఆరవ శాసనసభ (1978-1983) సభాపతిగా 1982వ సంవత్సరం సెప్టెంబరు 7వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1983వ సంవత్సరం జనవరి 16వ తేదీ వరకు ఆ పదవిని నిర్వహించాడు.[1][2]1983లో ఎన్.టి.ఆర్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఫిబ్రవరి 16, 2020 గుండెపోటుతో తిరుపతిలో మరణించాడు.

అగరాల ఈశ్వరరెడ్డి
అగరాల ఈశ్వరరెడ్డి


ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి
పదవీ కాలం
7 September 1982 – 16 January 1983
ముందు కోన ప్రభాకరరావు
తరువాత తంగి సత్యనారాయణ

వ్యక్తిగత వివరాలు

జననం 28 December 1933
తూకివాకం గ్రామం, రేణిగుంట మండలం, చిత్తూరు జిల్లా
మరణం 2020 ఫిబ్రవరి 16(2020-02-16) (వయసు 86)
తిరుపతి
జాతీయత భారత దేశం

జననం, విద్య మార్చు

ఈయన 1932వ సంవత్సరం డిసెంబరు 28 తేదీన రేణిగుంట మండలం, తిరుపతి సమీపంలోని తూకివాకంలో జన్మించారు.[3] మద్రాసు క్రిస్టియన్ కళాశాలనుండి డిగ్రీ పట్టా పొందిన తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో డబుల్ ఎమ్.ఎ., మద్రాసు న్యాయ కళాశాలలో ఎల్.ఎల్.బి., పిహెచ్డి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

ఇతను 1967వ సంవత్సరములో నాల్గవ శాసనసభ, 1978వ సంవత్సరములో ఆరవ శాసనసభకు చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇతడు 1980-1981 సంవత్సరాల మధ్యకాలంలో ప్రభుత్వ సంస్థల కమిటీకి అధ్యక్షునిగా పనిచేశాడు. 1981-1982 సంవత్సరాల మధ్య కాలంలో డిప్యూటీ స్పీకరు హోదాలో అర్జీల, విశేషాధికారాల కమిటీల అధ్యక్షులుగా పనిచేశాడు.

సభాపతిగా మార్చు

సభానిర్వహణ విషయంలో నియమ నిబంధనలను సమర్థవంతముగా అమలు చేసాడు. సభ్యులు ప్రసంగాలు చేసే సమయంలో సంయమనం పాటించి, నిరాధారమైన ఆరోపణలు చేయరాదని పలు ప్రశస్తమైన రూలింగులను ఇచ్చాడు.

ఇతర కార్యకలాపాలు మార్చు

ఇతను ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ కు ఉపాధ్యక్షునిగా, ఐ.ఐ.పి.ఎ. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా, మాడభూషి అనంతశయనం ఇన్స్టిట్యూట్ అధ్యక్షులుగా ఉన్నాడు. అంతేకాక ఎస్.వి. యూనివర్సిటీ సిండికేట్ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మేనేజ్ మెంట్ బోర్డు సభ్యునిగా, ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్ సభ్యునిగా పనిచేశాడు. ఈయన యునైటెడ్ కింగ్డమ్, యురోప్, రష్యా, చైనా, అమెరికా దేశాలలో పర్యటించాడు.

రచయితగా మార్చు

వీరు పేరుపొందిన రచయిత. “లోక్సభ ఎలక్షన్స్ ఇన్ 1977 అండ్ 1980 ఇన్ ఆంధ్రప్రదేశ్", "ది ఎలక్టోరల్ రిఫామ్స్ ఇన్ ఇండియా", "స్టేట్ పాలిటిక్స్ ఇన్ ఇండియా అండ్ హో హై ఈజ్ హైయర్ ఎడ్యుకేషన్ టుడే" పుస్తకాలను రచించి ప్రచురించాడు. ది హిందూ, ఆంధ్రజ్యోతి, డక్కన్ క్రానికల్ మొదలైన వార్తా పత్రికలలో వ్యాసాలు రాస్తున్నాడు.

సత్కారాలు మార్చు

ఈయన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు నిచ్చి సత్కరించింది.

మరణం మార్చు

ఫిబ్రవరి 16, 2020 ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు గుండెపోటుతో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[3]

మూలాలు మార్చు

  1. ఆంధ్రప్రదేశ్ పూర్వ శాసనసభాపతుల జాబితా
  2. ఆంధ్రప్రదేశ్ శాసనసభ జాలస్థలిలో ఈశ్వరరెడ్డి పరిచయం
  3. 3.0 3.1 "ఏపీ మాజీ స్పీకర్ ఆకస్మిక మృతి". www.eenadu.net. Retrieved 2020-02-16.