అఘోరనాథ్ చటోపాథ్యాయ

అఘోరనాథ ఛటోపాధ్యాయ హైదరాబాదుకు చెందిన ఒక విద్యావేత్త. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు ఇతని కుమార్తె.

నేపధ్యము

మార్చు

అఘోరనాథ ఛటోపాధ్యాయ ఆచార్యుడు మాత్రమే కాదు, శాస్త్రవేత్త కూడా. ఇంగ్లాండు వెళ్లి, డీఎస్సీ పూర్తి చేసిన తొలి భారతీయుడు ఆయనే.[1]

బాల్యము, విద్యాభ్యాసము

మార్చు

ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకా శివార్లలోని బ్రాహ్మణగావ్‌లో 1851లో పుట్టిన అఘోరనాథ పాఠశాల విద్య అంతా ఢాకాలో సాగింది. తర్వాత కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. సంస్కృత పండితుడైన రామచరణ్ ఛటోపాధ్యాయ తనయుడైన అఘోరనాథ చిన్ననాటి నుంచే చురుకైన విద్యార్థిగా గుర్తింపు పొందారు. గిల్‌క్రిస్ట్ స్కాలర్‌షిప్ సాధించి, ఉన్నత విద్య కోసం ఇంగ్లాండు వెళ్లారు. ఎడిన్‌బర్గ్ వర్సిటీలో చదువుకుంటుండగా, భౌతిక శాస్త్రంలో ‘బక్స్‌టర్’ బహుమతి, రసాయనిక శాస్త్రంలో ‘హోప్’ బహుమతి సాధించారు. అదే వర్సిటీ నుంచి డీఎస్సీ పట్టాను అందుకున్నారు. అఘోరనాథ ఛటోపాధ్యాయ శాస్త్రవేత్త మాత్రమే కాదు, బహుభాషా కోవిదుడు కూడా. బెంగాలీ, ఇంగ్లిష్, సంస్కృతం, గ్రీక్, హిబ్రూ, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్ భాషలలో ఆయనకు ప్రావీణ్యం ఉండేది. సంస్కృత పాండిత్యానికి గుర్తింపుగా అప్పట్లో శంకరాచార్య పీఠం నుంచి ‘విద్యారత్న’ బిరుదు కూడా పొందారు.[2]

నిజాం కాలేజీ స్థాపన

మార్చు
 
ప్రస్తుత నిజాం కళాశాల.

నిజాం వద్ద అప్పటి ప్రధాని మొదటి సాలార్‌జంగ్ ఆహ్వానంపై అఘోరనాథ 1878లో హైదరాబాద్ వచ్చారు. నిజాం రాజ్యంలో ఆధునిక విద్యావ్యాప్తి కోసం చొరవ తీసుకున్న మొదటి సాలార్‌జంగ్, అప్పటి బ్రిటిష్ భారత ప్రాంతం నుంచి మరికొందరు విద్యావేత్తలను కూడా ఇక్కడకు రప్పించారు. అఘోరనాథ తొలుత ఒక ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత 1881లో హైదరాబాద్ కాలేజీని స్థాపించి, దానికి తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. తర్వాత అది నిజాం కళాశాలగా మారింది. అఘోరనాథ భార్య వరదాదేవి కూడా భర్త కృషిలో పాలు పంచుకున్నారు. స్వతహాగా కవయిత్రి, విద్యావంతురాలు అయిన ఆమె, నాంపల్లిలో బాలికల కోసం పాఠశాల ప్రారంభించారు. నగరంలో తొలి బాలికల పాఠశాల ఇదే. బ్రిటిష్ పాలిత ప్రాంతంలో అప్పట్లో ఉధృతంగా ఉన్న సంస్కరోణద్యమం ప్రభావంతో అఘోరనాథ దంపతులు ఇక్కడ సంస్కరణల కోసం తవు వంతు కృషి చేశారు. హైదరాబాద్‌లో వారి నివాసం సాహితీ, సాంస్కృతిక, రాజకీయ కేంద్రంగా ఉండేది. నిత్యం మేధావులు, కళాకారులతో కళకళలాడుతుండేది. అఘోరనాథ ఎనిమిది మంది సంతానంలో సరోజినీదేవి ‘భారతకోకిల’గా సుప్రసిద్ధురాలు. వీరేంద్రనాథ్ విప్లవకారుడు కాగా, హరీంద్రనాథ్ బహుముఖ ప్రజ్ఞశాలి.

నిజాం నిరాదరణ

మార్చు

హైదరాబాద్‌లో ఆధునిక విద్యావ్యాప్తికి పునాదులు వేసిన అఘోరనాథ ఛటోపాధ్యాయపై నిజాం సర్కారు ఏమాత్రం కృతజ్ఞత చూపకపోగా, నిరాదరణనే ప్రదర్శించడం ఒక చారిత్రక విషాదం. అప్పట్లో చందా రైల్వే ప్రాజెక్టు కోసం ఇంగ్లాండు నుంచి ఆర్థిక సాయం తీసుకోవాలన్న నిజాం సర్కారు ప్రతిపాదనను వ్యతిరేకించడమే అఘోరనాథ నేరమైంది. నిజాం సర్కారు నిర్దాక్షిణ్యంగా ఆయనను హైదరాబాద్ నుంచి బహిష్కరించింది. దీంతో ఆయన 1882లో హైదరాబాద్‌ను వీడి కలకత్తా వెళ్లిపోయారు.అయితే, అప్పటి వైస్రాయ్ ఈ వివాదంలో జోక్యం చేసుకుని, నిజాం సర్కారుకు అక్షింతలు వేయడంతో అఘోరనాథను వెనక్కు పిలిపించింది. అయితే, ప్రిన్సిపాల్ పోస్టు నుంచి తప్పించి, ప్రొఫెసర్ పోస్టుకే పరిమితం చేసింది. అఘోరనాథ ఇంగ్లాండులో కెమిస్ట్రీ చదువుకున్నా, మన ప్రాచీన శాస్త్రాల్లోని ఆల్కెమీలోనూ పరిశోధనలు సాగించేవారు. ఆయన మనవరాలు మృణాళిని కథనం ప్రకారం.. కొందరు సాధువుల వద్ద తక్కువ లోహాలను బంగారంగా మార్చే విద్యను నేర్చుకున్నారట. కొద్దిపాటి రాగితో ఆయన బంగారు నాణాన్ని తయారు చేయడాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తక్కువ లోహాలను బంగారంగా వూర్చి, ఆ డబ్బును దేశమంతటా ఉచిత, నిర్బంధ విద్య కోసం ఖర్చు చేయాలని భావించేవారట.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-10. Retrieved 2014-10-30.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2014-10-30.

బయటి లంకెలు

మార్చు