అజితకేశ కంబళుడు
క్రీ.పూ.6 వ శతాబ్దంలో అంటే గౌతమ బుద్దుని కాలంలోనే సాంస్కృతిక తిరుగుబాటుకు ప్రేరణ కలిగిస్తూ ప్రజలలో భౌతికవాదాన్ని ప్రచారం చేసిన భౌతిక వాద దార్శనికులలో అజితకేశ కంబళుడు సుప్రసిద్దుడు. భారతీయ భౌతికవాదానికి మూలపురుషుడిగా ఇతన్ని భావిస్తారు. గౌతమ బుద్ధుని కన్నా వయులో పెద్దవాడైన ఇతను బుద్ధుని సమకాలికుడు. బౌద్ద గ్రంథాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో మూడవ వాడు. వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతిక వాదాన్ని ప్రచారం చేసిన తాత్వికుడు.
ఆధార గ్రంథాలు
బౌద్ధుల త్రిపిటకాలు, దిఘ నికాయ, బుద్దఘోషుని “సుమంగళ విలాసిని” మొదలగు గ్రంథాలలో అజితకేశ కంబళుని గురించిన వివరాలు పరోక్షంగా తెలియ చేస్తాయి.
జీవన శైలి
మార్చుఇతని అసలు పేరు అజితుడు. మానవ కేశాలతో నేసిన వస్త్రాలను (కంబళి) ధరించడం చేత అజితకేశ కంబళునికి ఆ పేరు వచ్చినదని, ఇతను పారిపోయిన బానిస అని బుద్ద ఘోషుని “సుమంగళ విలాసిని” ఇతన్నిచులకనగా చేసి పేర్కొంది. బౌద్దగ్రంధాల ప్రకారం ఇతను నైతిక జీవనం గడిపేవాడని తెలియవస్తున్నది. కఠోర బ్రహ్మచర్యం అవలంబించేవాడని, ఇంద్రియ నిగ్రహం పాటించేవాడని బౌద్ద గ్రంథాలు పేర్కొన్నాయి.
బోదనలు - ప్రచారం
మార్చుప్రాచీన భారతీయ భౌతికవాదులలో ఒకడైన అజితకేశ కంబళుడు గంగ మైదాన ప్రాంతాలలో పర్యటిస్తూ వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతికవాద తత్వాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసాడు. ఇతని అనుచరులను శ్రమణకులు అంటారు. బౌద్ద గ్రంథం 'దిఘ నికాయ' ఇతని మత తత్వాన్ని కొంతవరకు ఉటంకిస్తుంది. యజ్న యాగాదుల కర్మకాండలకు నిరసిస్తూ దానం-యజ్ఞం లేవని, పాప పుణ్యాలు లేవని, స్వర్గ నరకాలు లేవని ప్రచారం చేసాడు. పరలోకం గురించి ప్రత్యక్షంగా చెప్పేవాడెవడూ లేడు. మానవుడు మరణించిన తరువాత కాల్చిన బూడిద తప్ప మిగిలేది ఏదీ లేదు. ఆత్మ లేదు. చనిపోయినపుడు పండితుడూ, పామరుడూ ఒకటే, ఏమీ మిగలదు.దానము దండుగ. యజ్ఞం చేయడం వృధా. అని బోధించాడు.
- మానవుడు నాలుగు భూతాల ( భూమి, జలం, అగ్ని, వాయువు) కలయిక. ఈ చతుర్ భూతాల యాదృచ్ఛిక సంయోగమే మనిషిలో చైతన్యాన్ని (ప్రాణాన్ని) కలిగిస్తుంది. మనిషి మరణిస్తే ఏ భూతం ఆ భూతంలో విలీన మవుతుంది. మరణించిన తరువాత ఏదీ మిగలదు.
- అజితకేశ కంబళుని ప్రకారం దేహమూ చైతన్యమూ ఒకటే. అదేవిధంగా వస్తువూ దాని గుణమూ రెండూ ఒకటే అని సూచించాడు. పదార్దాన్నీ దాని లక్షణాల్ని అవిభాజ్యంగా పరిగణించాడు.
- ఏ పనిచేసినా ఒకటే. మంచి పనిచేసినా ఒకటే. చెడు పనిచేసినా ఒకటే. దాన ధర్మాలు చేసినా, యజ్న యాగాదులను చేసినా పుణ్యం రాదు. దాన ధర్మాలు చేయకపోయినా, యజ్న యాగాదులను చేయకపోయినా పాపం రాదు.
- ఇతని బోధనలు అక్రియావాదాన్ని తెలియ చేస్తాయి. అక్రియా వాదంలో ఆత్మ అకర్త. దానికి కర్మ ఫలం అంటదు. అంటే. చేసిన కర్మ ఫలితం ఆత్మకు అంటదు అన్నది ఇతని సిద్ధాంతం. ఏ పనిచేసినా దాని ఫలితం ఆత్మకు దక్కదు
- అయితే బౌద్ద, జైన గ్రంథాలు అజితకేశ కంబళుడు పాపం లేదు, పుణ్యం లేదు, ఇహం లేదు, పరం లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, ఇంద్రియ సుఖాలు అనుభవించమన్నాడని పరోక్షంగా ఉటంకించాయి. ఇతని అసలు బోధనలకు సంబంధించిన మూల ఆధార గ్రంథాలు ధ్వంసం అవడంతో, తదనంతర కాలంలో అతని తత్వాన్ని ద్వేషించిన వారు తమ గ్రంథాలలో అవహేళన చేస్తూ వ్రాసుకున్న వ్యాఖ్యలు, పరోక్ష ఉటంకలు విశ్వాస పరీక్షకు నిలబడవని అందువలన ఆ రాతలు నమ్మ తగినవి కాదని పండితుల అభిప్రాయం. కేవలం ఇంద్రియ సుఖాలకే ప్రాధాన్యం ఇచ్చినట్లయితే ఈ భౌతికవాది బోధనలు ప్రజలలో చొచ్చుకొనిపోలేవు. మొత్తం మీద అజితకేశ కంబళుడిని భారతీయ భౌతికవాదానికి మూలపురుషుడిగా భావిస్తారు.
అసితకేశ కంబళుడు కాఠీన్యంతో కూడిన మత ప్రచారం వల్ల, సామాజిక వత్తిళ్ళ వల్ల సమాజంలో ఆశించిన ఫలితం సిద్ధించలేకపోయిన వాస్తవాన్ని గుర్తించాడని తెలుస్తుంది. బుద్ధుడు జన్మించిన పిదప శుద్ధోదనునితో ‘ మహారాజా, మేము చేయలేని పనిని, మీ కుమారుడు భవిష్యత్తులో చేయగలడు ’ అని ఆశ్వీరదించాడని బొద్దగ్రంధాలలో ఒక కల్పన ఉంది. అంటే తమ సందేశాన్ని తమ ప్రచార పద్ధతి కంటే భిన్న రూపంలో బుద్ధుడు కొనసాగించగలడని ఆశించినట్లు తెలుస్తుంది.భౌతికవాదుల వలె వేదం ప్రామాణ్యాన్ని త్రోసిపుచ్చిన బుద్ధుడు కూడా ఇతని ఆశలకు తగినట్లుగానే తన ప్రచారంలో కాఠీన్యత చూపక వాద వివాదాలలో నిందనకు అస్కారమివ్వక, నచ్చచెప్పే ధోరణిలో మత ప్రచారాన్ని కొనసాగించి బౌద్దాన్ని జనబాహుళ్యంలో చోచ్చుకోనిపోయేటట్లు చేయగలిగాడు. భౌతికవాదులలో ఒక్క అజితకేశ కంబళుడు మాత్రమే బౌద్ధానికి సన్నిహితంగా మెలిగాడు.
మూలాలు
మార్చు- History and Doctrines of the Ajivikas, a Vanished Indian Religion - A.L. Basham
- The Culture & Civilization of Ancient India- D.D. Kosambi
- ప్రాచీన భారత దేశ చరిత్ర – రామ్ శరణ శర్మ
- విశ్వ దర్శనం, భారతీయ చింతన – నండూరి రామమోహన రావు
- భారతీయ భౌతికవాదం – చార్వాక దర్శనం –కత్తి పద్మా రావు
- ప్రాచీన భారతంలో చార్వాకం –సి.వి.