అడువాల సుజాత

తెలుగు కవయిత్రి, విమర్శకురాలు

అడువాల సుజాత తెలంగాణకు చెందిన కవయిత్రి, పరిశోధకురాలు, విమర్శకురాలు, తెలుగు ఉపాధ్యాయురాలు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను రుద్రమ సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షురాలిగా సేవలందిస్తుంది.[1]

అడువాల సుజాత
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల కవిసమ్మేళనంలో కవితాగానం చేస్తున్న అడువాల సుజాత
నివాస ప్రాంతంకరీంనగర్
వృత్తిఉపాధ్యాయురాలు
ప్రసిద్ధికవయిత్రి, పరిశోధకురాలు

జీవిత విశేషాలు

మార్చు

అడువాల సుజాత కరీంనగర్‌ జిల్లా, జగిత్యాల పట్టణంలో చేనేత కార్మికుల ఇంట సత్తెమ్మ, రాజన్న దంపతులకు ఆరుగురు సంతానంలో రెండవ సంతానంగా జన్మించింది. ఈమెకు ఒక అక్క ఒక చెల్లెలు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు. ఆమె మిషన్ కుట్టుకుంటూ తన కుంటుంబానికి సహకరిస్తూనే ఇంటర్ వరకు చదివింది. 1989లో కోరుట్లకు చెందిన మచ్చ రవీందర్‌తో వివాహం జరిగింది. [2] వివాహానంతరం కూడా బీడీలు చుట్టుకునేది. ఇద్దరు కుమారులు పుట్టిన తరువాత విద్యాకాంక్షతో మరలా విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. వరంగల్ లో తెలుగు సబ్జెక్ట్‌ తీసుకొని బి.పి. (లిట్‌)చేసింది. హన్మకొండలో తెలుగు పండిత శిక్షణ (టి.పి.టి) కూడా తీసుకుంది. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎం.ఏ. తెలుగు పూర్తి చేసింది. ‘తెలంగాణా పోరాట నవలల్లో స్త్రీ’ అన్న అంశంపై పరిశోధన చేసి ఎం.ఫిల్‌ పట్టా పొందింది. 2002లో ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. తర్వాత ‘డాక్టర్‌ పి. యశోదారెడ్డి కథలు – సమగ్ర పరిశీలన’ అన్న అంశంపై పరిశోధన చేసి పిహెచ్‌.డి. పట్టా అందుకుంది. ఈ రెండూ కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో సాగించిన పరిశోధనాంశాలే. ఆ తర్వాత మద్రాస్‌ యూనివర్సిటీ నుండి డి.లిట్‌ కూడా పూర్తి చేసింది.[2]

సాహితీ ప్రస్థానం

మార్చు

ఆమె అనేక కవి సమ్మేళనాలలో కవయిత్రిగా పాల్గొంది. ఆమె రాసిన అనేక సందర్భోచిత వ్యాసాలు పత్రికలలో ప్రచురితమయ్యాయి. నానీల కనయిత్రిగా ‘మట్టి మల్లెలు’ తో నానీల అతి పెద్ద కుటుంబంలో స్థానం సంపాదించుకుంది. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ జిల్లా శాఖ ఉపాధ్యక్షురాలుగా, తెలంగాణా రచయితల వేదిక, కరీంనగర్‌ జిల్లా శాఖకు కోశాధికారిగా, సమైక్య సాహితీ సంస్థకు కార్యవర్గం సభ్యురాలిగా, భారతీ సాహిత్య సమితి, కోరుట్ల సంస్థకు శాశ్వత సభ్యురాలిగా వివిధ సాహితీ సేవా కార్యక్ర మాల్లో ‘నేను సైతం’ అంటూ తన స్థానాన్ని పదిల పరచు కుంటూ సాహిత్య ప్రస్థానం సాగిస్తుంది.

రచనలు

మార్చు
 
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా అడువాల సుజాతను సత్కరిస్తున్న దృశ్యం
  1. మట్టిమల్లెలు (నానీలు)
  2. తెలంగాణ పోరాటనవలల్లో స్త్రీ (ఎం.ఫిల్. సిద్ధాంతగ్రంథం)
  3. యశోదారెడ్డి కథలు - సమగ్ర పరిశోధన (పి.హెచ్.డి.సిద్ధాంతగ్రంథం)
  4. కసమలా కాస్త వినుమా (వచనకవిత)
  5. వ్యాసపారిజాతం (సాహిత్య వ్యాసాలు)
  6. విలోకనం (సాహిత్య వ్యాసాలు)
  7. బతుకమ్మ పాటలు
  8. తెలంగాణ భాష – సంస్కృతి – మరి కొన్ని వ్యాసాలు
  9. దేశభక్తి గీతాలు
  10. అంతా రామమయం (సంపాదకత్వం కవితా సంకలనం)

బిరుదులు

మార్చు
  • సాహిత్యశ్రీ
  • పరిశోధక కళిక
  • కవితాభారతి
  • సాహితీజ్యోత్స్న

పదవులు

మార్చు
  • వ్యవస్థాపక అధ్యక్షురాలు - రుద్రమ సాహితీ స్రవంతి

మూలాలు

మార్చు
  1. ABN (2021-03-05). "మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి". Andhrajyothy Telugu News. Retrieved 2025-02-04.
  2. 2.0 2.1 NT (2023-05-10). "విజయానికి సంకేతం సుజాత జీవితం -" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-02-04.