అడ్లూరి అయోధ్యరామకవి

అడ్లూరి అయోధ్యరామకవి పత్రికా నిర్వాహకుడు, కవి, రచయిత, నైజాం విముక్తి పోరాట యోధుడు. ఆయన 1922లో వరంగల్ జిల్లా తాడికొండలో జన్మించారు.

రాజకీయ రంగం మార్చు

అయోధ్యరామకవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిజాం పాలనకు వ్యతిరేకంగా పనిచేశారు. ప్రజలను చైతన్యపరిచేందుకు నిజాం పాలన వ్యవస్థల్లోని లోపాలు తెలియజేసే బుర్రకథలు చెప్తూ ఊరూరా తిరిగేవారు. పత్రిక, పుస్తకప్రచురణ, కథారచన వంటివి ఆయుధంగా చేసుకుని నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు.

రచన రంగం మార్చు

అయోధ్యరామకవి కథలు, బుర్రకథలు, పద్యాలు, గేయాలు, నాటికలు, శతకాలు రచించారు. తెలంగాణా విముక్తి పోరాటం (నైజాం వ్యతిరేక పోరాటం) నేపథ్యంగా "బాంబుల భయం", "చీకటి రాజ్యం" కథలు రాశారు. బాంబుల భయం కథ గురించి ప్రముఖ కథా విమర్శకుడు వాసిరెడ్డి నవీన్ "వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ దళాలు సంచరించినా వీటికి సంబంధించిన సమాచారం చరిత్రలో ఎక్కువ నమోదు కాలే"దంటూ అలాంటి వివరం నమోదు చేసిన కథగా దీని విశిష్టత వివరించారు. తప్పిపోయి హిందువులతో జీవిస్తున్న తన కూతురుని రజాకారుగా మారి రాక్షసత్వంలో అంతం చేసిన వ్యక్తి కథ "చీకటి రాజ్యం".[1]

హైదరాబాదు రాజ్యాన్ని భారత దేశంలో విలీనం చేసేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన పోలీసు చర్య గురించి పోలీసు చర్యలు పేరుతో బుర్రకథ రచించారు.[2]

విశ్వనాథ సత్యనారాయణ రచించిన కిన్నెరసాని పాటలు విని పరవశించిన అడ్లూరి అయోధ్యరామకవి తాడికొండ గేయమాలిక అనే గ్రంథాన్ని రచించారు. ఆ విషయాన్ని స్వయంగా గ్రంథకర్త ముందుమాటలో చెప్పుకున్నారు. విశ్వనాథకు పరిచయమున్న కిన్నెరసాని వాగును గురించి ఆయన రాసినట్టే, అయోధ్యరామకవి తనకు చిన్నతనం నుంచీ తెలిసిన తాటిచెట్లున్న ప్రాంతాన్ని గురించీ ఈ రచన చేశారు. దీనికి ముందుమాట విశ్వనాథ వారు రాయడం మరో విశేషం.

ప్రచురణరంగం మార్చు

ప్రచురణకర్తగా, పత్రికానిర్వాహకునిగా కూడా అయోధ్యరామయ్య కృషిచేశారు. 1948-50 మధ్య కాలంలో భాగ్యనగర్ పత్రికను నడిపారు. విజ్ఞాన గ్రంథమాల సంస్థను ఏర్పాటు చేసి 10పుస్తకాలను ప్రచురించారు.

మూలాలు మార్చు

  1. "తెలంగాణా విముక్తి పోరాట కథలు"
  2. "పోలీసు చర్య".