సముద్ర తీర గ్రామం (నవల)

(అనితా దేశాయ్ నవల సముద్ర తీర గ్రామం నుండి దారిమార్పు చెందింది)

అనితా దేశాయ్ జననం 1937, ముస్సోరిలో . తల్లి జర్మనీ వనిత, భారత దేశంలో స్థిరపడింది. తండ్రి మజుందార్, బెంగాలీ. మెసాచుటస్ Institute of Technology లో అనితా దేశాయ్ ప్రొఫెసర్ గా స్థిరపడింది.

“The Village by the Sea” an Indian Family Story (1982 ) నవలను సుప్రసిద్ధ పత్రికా రచయిత ఏం. వి. చలపతిరావు “సముద్ర తీర గ్రామం” పేరుతో చాలా చక్కగా అనువదించారు, నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 1997లో దీన్ని ప్రచురించింది.

210 పేజీల ఈ చిన్న నవలలో పశ్చిమ భారత దేశంలో బొంబాయికి 14 కి. మీ దూరంలోని(crow flight) సముద్రతీరంలో "తుళ్" అనే చిన్న మత్స్యకారుల గ్రామంలోని ఒక పేద కుటుంబం చుట్టూతా అల్లబడిన కథ.

తండ్రి తాగుబోతు, తల్లి అనారోగ్యంతో మంచానికి పరిమితమై ఉంటుంది. 13 ఏళ్ళ హరి, 12 ఏళ్ళ లీల, వీళ్ళ తర్వాత ఇద్దరు ఆడ పిల్లలు బేల, కమల. పిల్లలే ఎలాగో సంసారం ఈదుకొని వస్తుంటారు. ఆ పల్లె, ప్రజలు, సముద్రం, పడవల్లో చేపలు పట్టుకోడం, ఆకల్మషమయిన ప్రకృతి.. ఇదే నవల ఇతివృత్తం.

“సముద్ర తీర గ్రామం” నగరం, గ్రామం, పర్యాటక, సామాజిక పరివర్తన, స్థలం పరివర్తన, వర్షాకాలం, గ్రామీణ జీవనానికి సంబంధించిన వాస్తవిక చిత్రణ.

గ్రామం ప్రాంతానికి చెందిన కుర్రవాడు హరి ఎలా నగరంలో ఉద్యోగం సంపాదించి, భవిష్యత్తును గురించి నిశ్చితమైన ప్రణాళికలతో చివరికి యింటికి చేరడాన్ని రచయిత్రి చక్కగా చిత్రీకరించారు ఈ పుస్తకంలో. “అనితా దేశాయ్ విస్తారంగా నవలలు రచించారు, ఆమె రచనల్లో నవలలు, చిన్న కథలు, బాలల పుస్తకాలు ఉన్నాయి. ఆమె సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, సాహిత్యానికి సంబంధించిన రాయల్ సొసైటీ సభ్యురాలు.” -నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా.

ఈ నవల రచనకోసం దేశాయ్ తుళు బెస్తపల్లెలో ఆరు నెలలు ఉండి అక్కడి జీవనాన్ని పరిశీలించారు.

"తుళ్" మత్స్యకారుల పల్లె, అక్కడి రుతువులు, వర్షాగమనం, సముద్రతీరంలో విశ్రమించిన పడవలు, క్రమంగా జరగబోతున్న పారిశ్రామికీకరణ ఛాయలు, పురుషుల మద్యపాన ప్రవృత్తి, స్త్రీలు కుటుంబాలు కోసం శ్రమించడం చాలా సహజంగా నవలలో చిత్రించ బడినవి.

డిసెల్వియ సంపన్న కుటుంబం "తుళ్" సమీపంలో వేసవి విడిది బంగళా ఖరీదు చేసి అక్కడ కొన్ని రోజులు ఉంటారు. ఆ బంగళాలో ఈ కుటుంబానికి తాత్కాలికంగా పనిదొరుకుతుంది. తరవాత దాదా సలీం ఆలి వంటి పక్షిప్రేమిడు అందులో అద్దెకు చేరి ఈ కుటుంబానికి పనికల్పిస్తాడు. క్షయరోగం బారిని పడిన హరి తల్లికి డిసెల్వియ కుటుంబం వయిద్యం చేయించి నయం చేయిస్తుంది. 13సంవత్సరాల హరి బొంబాయికి వెళ్ళి అక్కడ టీకొట్టు యజమాని, వాచీలు బాగుచేసే వృద్ధుడి ఆదరణ పొందడం, బొంబాయి మురికి వాడల జీవితం అనుభవించి తిరిగి దీపావళి పండుగకు తన పల్లె తుళ్ రావడంతో నవల ముగుస్తుంది.