అన్నారం హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావళి దర్గా

అన్నారం హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావళి దర్గా, వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం, అన్నారం షరీఫ్ గ్రామంలో ఉంది. హైదరాబాద్ నుంచి వరంగల్ 144 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ్నుంచి పర్వతగిరి 38 కిలోమీటర్లు, పర్వతగిరి నుంచి అన్నారం దర్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాకూబ్ షావళి బాబా కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. ఈ దర్గాకు వెయ్యేండ్లకుపైగా చరిత్ర ఉంది.[1]

అన్నారం హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావళి దర్గా
పేరు
ప్రధాన పేరు :అన్నారం హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావళి దర్గా
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:వరంగల్ జిల్లా
ప్రదేశం:పర్వతగిరి మండలం, అన్నారం గ్రామం.
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:యాకూబ్ షావళి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ముస్లీం

చరిత్ర మార్చు

యాకూబ్ షావళి అరబ్బుదేశం నుంచి వలస వచ్చారట. ఆయనకు గుంషావళి, బోలె షావళి అనే తమ్ముళ్లు, మహబూబీయమ్మ అనే చెల్లెలు, గౌస్‌ఫాత్ అనే గురువు ఉన్నట్లు భక్తులు చెప్తారు. యాకూబ్ షావళి పేదలకు దానధర్మాలు చేసేవారట. సొమ్మునంతా దానం చేయడంతో యావదాస్తి కరిగిపోయి దేశాటనకు బయలుదేరాడట. అలా వచ్చి అన్నారంలో స్థిరపడ్డారని భక్తులు చెప్తున్నారు. కొందరు భౌతిక దాడులకు పాల్పడటంతో చెరువు తూములోకి వెళ్లి ఆయన అక్కడే మాయమయ్యారని.. తర్వాత ఓ వ్యక్తికి కలలో వచ్చి తన పేరిట దర్గా నిర్మిస్తే ప్రజలకు రక్షణగా ఉంటానని చెప్పడంతో గ్రామస్థులంతా కలిసి దర్గా నిర్మించారట.

విశేషాలు మార్చు

భక్తుల కొంగుబంగారంగా ఈ దర్గా మారడంతో అన్నారం కాస్తా అన్నారం షరీఫ్‌గా మారిపోయింది. దర్గా ఒక మానసిక చికిత్సాలయంగా పేరు పొందింది. ఇక్కడకు వచ్చే భక్తుల్లో చాలామటకు మానసిక రుగ్మతల నుంచి బయటపడటానికే వస్తుంటారట. ఎక్కడెక్కడో పెద్ద పెద్ద వైద్యులు సైతం నయం చేయలేని రుగ్మతలు ఇక్కడకు వచ్చి కోరుకుంటే నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇదంతా ఎలా వ్యాప్తిలోకి వచ్చిందంటే.. మొదటగా ఒకాయన మానసిక సమస్యతో బాధపడుతూ ఇక్కడకు వచ్చాడట. యాకుబ్‌షా వళిని దర్శించుకుని దర్గాకు మొక్కితే తన రుగ్మతలు తగ్గిపోవడంతో ప్రజలకు ఈ దర్గాపై నమ్మకం ఏర్పడినట్లు గ్రామస్థులు అంటున్నారు. అన్నారం షరీఫ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కందూరు. భక్తులు తమ కోర్కెలు నెరవేరితే కందూరు చేస్తామని యాకూబ్ సాహెబ్‌కు మొక్కుతారు. కందూరు రెండు రకాలుగా ఉంటుంది. యాట కందూరు, కోడి కందూరు. యాట లేదా కోడిని ముందుగా దర్గా వద్ద బాబాకు మొక్కుకుని పక్కనే ఉన్న వరండాల్లో వీటిని బలిస్తారు. వేడి చేసిన బొగ్గులను ముంతలో వేసి పొగవచ్చేలా వూదు చల్లుంకుంటూ డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా దర్గాకు వద్దకు చేరుకుంటారు. దర్గాలో ఐదుగురు ముతావళిలు (ముజావర్లు, పూజార్లు) భక్తులు తీసుకొచ్చిన వాటిలో ఒక దానిని దర్గాలో ఉంచి నైవేద్యంగా సమర్పిస్తారు. మరొక దానిని తూములో వదిలివేసి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడో విశేషముంది. తూములో ఎన్ని ముంతలు వేసినా బయటకు రావు. తూము నిండదని ముజావర్లు చెబుతున్నారు. ఈ తంతు ముగిసిన తర్వాత భక్తులు తిరిగి తమ బస ఉన్నచోటకు వెళ్లి సామూహిక భోజనాలు చేస్తారు. ఈ దర్గా వద్ద ఏడాదికోసారి గంధం ఉత్సవం ఘనంగా చేస్తారు. మూడు రోజులపాటు జరిగే వేడుకలకు లక్షాలాది భక్తులు తరలివస్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనం హాజరవుతారు. ఆరు బయట చెట్ల కింద వసతి ఏర్పాటు చేసుకొని బస చేస్తరు. యాటలు, కోళ్లు, మలిద ముద్దలు, అత్తరు సువాసనాలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఈ వేడుకలతో అన్నారం షరీష్ గ్రామంలో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. తెలంగాణలోని జిల్లాలతోపాటు ఇతర రాష్ర్టాలనుంచి భక్తులు భారీగా తరలివస్తారు.. శుక్ర, ఆదివారాలు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. మన తెలంగాణ, దునియా (30 September 2018). "అన్నారం దర్గా..!". Archived from the original on 2 February 2019. Retrieved 2 February 2019.