అఫ్సర్ కవి, విమర్శకుడు, రచయిత, సీనియర్ ఉపన్యాసకుడు. ఈయన అసలు పేరు ముహమ్మద్‌ మహబూబ్‌ అలీ.

అఫ్సర్
జననంముహమ్మద్‌ మహబూబ్‌ అలీ
(1964-04-11) 1964 ఏప్రిల్ 11 (వయసు 60)
చింతకాని గ్రామం, ఖమ్మం జిల్లా, తెలంగాణ
వృత్తిసీనియర్ ఉపన్యాసకుడు
ప్రసిద్ధికవి, విమర్శకుడు, రచయిత
భార్య / భర్తకల్పనా రెంటాల
పిల్లలుఅనిందు
తండ్రిషంషుద్దీన్

జీవిత విశేషాలు మార్చు

అఫ్సర్ 1964, ఏప్రిల్ 11 న మునవర్ బేగం, షంషుద్దీన్ దంపతులకు ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలో జన్మించాడు. తండ్రి షంషుద్దీన్ అభ్యుదయ రచయితల సంఘం ఖమ్మం జిల్లాశాఖకు అధ్యక్షుడు. కౌముది అనే కలంపేరుతో ప్రసిద్ధుడైన రచయిత. కళంకిని, విజయ అనే రెండు నవలలు వ్రాశాడు. రంగభూమిని సుంకర, వాసిరెడ్డి తో కలిసి అనువదించాడు. మార్క్సిస్టు భావజాలం ఉన్న రచయిత కౌముది. తండ్రి ప్రభావం అఫ్సర్ మీద చాలా ఉండేది.

విద్యాభ్యాసం - ఉద్యోగం మార్చు

బాల్యం నుండి సాహిత్యవాతావరణంలో పెరగటం వల్ల ఇతనికి కవిత్వం పట్ల మక్కువ ఏర్పడింది. 1985లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. గోల్డ్ మెడల్‌తో ఉత్తీర్ణుడయ్యాడు. తులనాత్మక సాహిత్యంలో 1988లో ఎం.ఏ చేశాడు. 'ఆధునిక కవిత్వము తెలంగాణా నేపథ్యం' అనే విషయం పై 1992లో పి.హెచ్.డి చేశాడు. అమెరికా లోని విస్కాన్సిన్ యూనివర్శిటీ నుండి 2010లో Following the Saint: Devotion and Public Religious Performances in South India అనే అంశం పై పరిశోధించి డాక్టరేట్ సంపాదించాడు. 2002 నుండి అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీలలో దక్షిణాసియా సాహిత్య సంస్కృతుల సీనియర్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు.

ఇతర వివరాలు మార్చు

అమెరికాలోని ఆస్టిన్‌లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో దక్షిణ ఆసియా సాహితీ సంస్కృతుల గుఱించి పాఠాలు చెబుతున్నాడు. అంతర్జాల సాహిత్య వార పత్రిక సారంగ సంపాదకమండలిలో ఒకడు. అఫ్సర్ స్వంత బ్లాగు నిర్వహిస్తున్నాడు.

రచనలు మార్చు

  1. రక్తస్పర్శ (1986)
  2. ఇవాళ (1991)
  3. ఆధునికత - అత్యాధునికత (1992)
  4. వలస (2002)
  5. కథ - స్థానికత (2008)
  6. ఊరి చివర (2009)
  7. The Festival of Pirs (2013) (ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురణ) [1]
  8. సాహిల్ వస్తాడు (కథాసంపుటి) (2019)[2]

పురస్కారాలు, సత్కారాలు మార్చు

  1. 1992 ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు
  2. 1992 ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు
  3. 1999 అలిశెట్టి ప్రభాకర్ అవార్డు
  4. 2002 తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ విమర్శకుడు పురస్కారం
  5. 2002 మద్రాస్ తెలుగు అకాడెమీ వారి ఉగాది పురస్కారం
  6. 2003 సాహితీ గౌతమి అవార్డు
  7. 2007 భారత ప్రభుత్వంచే సరస్వతీ భాషాసమ్మాన్ అవార్డు
  8. 2002 భారతప్రభుత్వ సాంస్కృతిక మానవ వనరుల మంత్రిత్వశాఖచే ఫెలోషిప్
  9. 2006 అమెరికన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ వారిచే సీనియర్ ఫెలోషిప్
  10. ప్రతిభా పురస్కారం - తెలుగు విశ్వవిద్యాలయం, 20 డిసెంబరు 2O16.[3][4]

రచనల నుండి ఉదాహరణలు మార్చు

నాలుగు మాటలు
ఉండచుట్టి పారేసిన కాయితాల్లాంటి
చిత్తుపదాలమధ్య
వొకానొక భావావశేషం
మంచుపర్వతంలా -
ఎప్పటికీపగలని మంచులో
కూరుకుపోయిన పదసమూహాన్ని నేను.
తలుపులు
మూతపడి వున్నాయి పెదవుల్లా.
సమాధిలోకి వెళ్ళిన పదం పునర్జన్మించదు
వేళ్ళు తెగిపోయాయి
తలుపుతట్టలేను
శవపేటికకు ప్రాణం పోయాలా?
అదృష్టవంతులు కొందరు,
మాటలమీదే మళ్ళీమళ్ళీ బతుకుతుంటారు
మాటలకే రక్తాన్ని అద్దుతుంటారు
రక్తాన్ని నమ్ముకున్నవాణ్ణి
వొట్టిదేహాన్నిమాత్రం అమ్ముకోలేను. …
(వలస నుంచి)
రెండంటే రెండు మాటలు
…వుండచుట్టి పారేసిన కాయితాలు
కొన్ని ఆలోచనల భ్రూణ హత్యల మరకలు
చిత్తుపదాల శిధిలాలమధ్య
వొకానొక భావశేషం
ఎంతలెక్కపెట్టినా
శూన్యమే శేషం.
…తలుపులు మూతపడి వున్నాయి పెదవుల్లా
పదం సమాధిలోకి వెళ్ళింది
పునర్జన్మ వుందో లేదొ?
…అదృష్టవంతులు కొందరు
వాళ్ళమాటలు
బతికి బయట పడ్దాయి
నామాట
దేహం విడిచిన వస్త్రం.
నాదో
ప్రాణాంతక జనన యుద్ధం.
వాయిదా వెయ్యలేను
ఇలాగేలే అని వుండలేను.
(ఊరి చివరనుంచి)

మూలాలు మార్చు

  1. పీర్లపండగపై ఇంగ్లీషు పుస్తకం
  2. విలేకరి (27 January 2019). "'సాహిల్‌ వస్తాడు' కథా సంపుటి ఆవిష్కరణ". ఆంధ్రజ్యోతి. Archived from the original on 28 జూన్ 2019. Retrieved 28 June 2019.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (8 December 2016). "ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 6 June 2020. Retrieved 9 June 2020.
  4. ఆంధ్రభూమి (8 December 2016). "ఉభయ రాష్ట్రాల తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల గ్రహీతలు". Archived from the original on 9 December 2016. Retrieved 9 June 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=అఫ్సర్&oldid=4161710" నుండి వెలికితీశారు