ఉస్మానియా విశ్వవిద్యాలయం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ప్రధాన విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ప్రధాన విశ్వవిద్యాలయం. దీని విస్తీర్ణం 3.90 హెక్టారులు.[1] ఈ విశ్వవిద్యాలయం పరిధిని 2011 భారత జనాభా గణాంకాలలో ఒక జనగణన పట్టణంగా గుర్తించింది.[2][3] ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసఫ్ జా VII చే 1917లో స్థాపించబడింది. దీని స్థాపనకు సంబంధించిన ఫర్మానాను 1917, ఏప్రిల్‌ 26న జారీ చేశారు. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.2011 జనగణన సమాచారం ప్రకారం ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రామ లొకేషన్ కోడ్ లేదా గ్రామం కోడ్ 573968.[4] ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రామం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లాకు చెందిన ముషీరాబాద్ తహసీల్‌లో ఉంది. ముషీరాబాద్ అన్ని ప్రధాన ఆర్థిక కార్యకలాపాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రామానికి సమీప పట్టణం.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
రకంప్రభుత్వ
స్థాపితం1918
ఛాన్సలర్సీ.పీ. రాధాకృష్ణన్
వైస్ ఛాన్సలర్దాన కిషోర్ (ఇంచార్జ్ వీసీ)
చిరునామఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు, తెలంగాణ - 500 007 భారతదేశం, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
కాంపస్పట్టణ
జాలగూడుwww.osmania.ac.in
NAAC ద్వారా ఐదు నక్షత్రాల నాణ్యత గుర్తింపు పొందినది

ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటుచేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం.[5] హైదరాబాదులోని ప్రస్తుత ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులతో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధనా భాషగా ఉండగా, స్వాతంత్ర్యానంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా భాషగా మారింది.

చరిత్ర

మార్చు
 
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఆర్ట్స్ కళాశాల భవనం

నిజాం పరిపాలన కాలంలో హైదరాబాదులో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజ కుటుంబీకులకు, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో వుండేవి. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం 1913 లో తమ పాలనలో వున్న ప్రాంతాలలోనే గాక సంస్థానాలలో కూడా విశ్వవిద్యాలయాలను స్థాపించాలని తీర్మానించింది. ఆవిధంగా పాట్నా, బనారస్, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు స్థాపించ బడ్డాయి. ఆబిడ్స్‌ గన్‌ఫౌండ్రి దగ్గర తరగతులు ప్రారంభమయ్యాయి.[6] భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదారాబాదు సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ. తన తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఈ విశ్వవిద్యాలయము అన్ని విభాగాలలోనూ మంచి పురోగతి సాధించింది.

ఇక్కడ ఉర్దూ ప్రథమ భాషగా మాద్యమంగా ప్రవేశ పెట్టి బ్యూరో ఆఫ్ ట్రాన్స్‍లేషన్ ను ఏర్పాటు చేసారు. మొదట గన్ ఫౌండ్రీ ప్రాంతంలో 25 మంది సిబ్బంది, 225 విద్యార్థులతో ఇంటర్మీడియట్ సాయంకాలం కోర్సులతో ప్రారంభించి క్రమంగా 1921 లో బి.ఏ, 1923 లో ఎం.ఎ.ఎల్.ఎల్.బి 1927 లో మెడిసిన్, 1929 లో ఇంజనీరింగు కోర్సులనూ ప్రవేశ పెట్టారు. అయితే నగరంలో వివిధ ప్రాంతాలలో వున్న కళాశాలలను పరిపాలనా సౌలభ్యం కొరకు ఒకే ప్రాంతంలో వుంటే బాగుంటుందని సంకల్పించి, తార్నాక ప్రాంతంలో 2400 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత కాంపస్ ను ఏర్పాటు చేసారు.

భవనాల నిర్మాణానికి ఆర్కిటెక్ లుగా సయ్యద్ అలీ, రజా, నవాబ్ జయంత్ సింగ్ బహదూర్ లను నిమమించారు. వారు అమెరికాలోని కాలిఫోర్నియా స్టాన్‍ఫోర్డ్, హార్వర్డ్, కొలంబియా, బ్రిటన్ లోని ఆక్స్ పర్డ్, కేంబ్రిడ్జ్ మొదలైన విశ్వవిద్యాలయాలను సందర్శించి వచ్చారు. బెల్జియానికి చెందిన ఇ.జస్సార్ ను సలహాదారుగా నియమించి లా, ఇంజరీరింగ్, ఆర్ట్స్ కళాశాల లైబ్రరి, సెనేట్ హాలు వంటి భవనాలను నిర్మించారు. ఆర్ట్స్ కాలేజి భవనానికి 1923 జూలై 5న పునాదులు వేసి, 1939 డిసెంబరు నాల్గవ తేదీన పూర్తి చేసారు. అదే రోజున హైదరాబాదు నిజాము దీనిని ప్రారంబించాడు. నైజాంలో విద్యాశాఖ మంత్రిగా ఉండిన అక్బర్ హైదర్ చాన్సెలర్ గా, నవాబ్ మెహదీయార్ జంగ్ బహదూర్ వైస్ ఛాన్సెలర్ గా నియమితులయ్యారు. 1949 లో హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి వరకు ఉన్న ఉర్దూ మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్లమాద్యమాన్ని ప్రవేశ పెట్టారు. ఇస్లాం యూనివర్సిటీగా నామకరణం చేయాలని మొదట్లో వచ్చిన ప్రతి పాదనను కాదని ఉస్మానియా యూనివర్సిటీగా పేరు పెట్టారు. ఇండియా టుడే పత్రిక మన దేశంలో వున్న 160 యూనివర్సిటీలపై సర్వే నిర్వహించగా 2010 వ సంవత్సరంలో 10వ స్థానం, 2011లో 7వ స్థానం, 2012 లో ఆరవ స్థానం లభించింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది.

స్నాతకోత్సవం

మార్చు
 
ఆర్ట్సు కళాశాల, డోము, ఉస్మానియా విశ్వవిద్యాలయం.

2019, జూన్ 17న 80వ స్నాతకోత్సవం జరిగింది. స్నాతకోత్సవానికి అప్పటి గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై 292 మందికి బంగారు పతకాలు, 700 మందికిపైగా అభ్యర్థులకు పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేశారు.[7][8] 1917 నుండి ఇప్పటివరకు 47మందికి గౌరవ డాక్టరేట్లు అందజేయబడ్డాయి.[9]

ప్రతిష్ఠ , బోధించే విషయాలు

మార్చు

1,600 ఎకరాల (6 చ.కి.మీ.) సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థలకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడి భూగోళ శాస్త్ర విభాగం దక్షిణ భారతావనిలోనే పురాతనమైనది, పెద్దది. ఇది 1942 లో స్థాపించబడింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ

మార్చు

ఆర్ట్స్ కళాశాలలో తెలుగు శాఖ చాలా ముఖ్యమైన శాఖ. ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఎకైక శాఖ. తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడటంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు తెలుగు భాష పై పరిశోధన (పీ.హెచ్.డి) లను అందిస్తున్నది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం

మార్చు

ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు ఎం. ఫిల్, పీహెచ్.డి డిగ్రీ లను అందిస్తున్నది.[10]

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం

మార్చు

ప్రత్యేక తెలంగాణకై విశ్వవిద్యాలయ విద్యార్థులు 1965 నుంచి పోరాడుతున్నారు. తెలంగాణ ప్రాతంలో ఇది అతిపెద్ద విశ్వవిద్యాలయంగా ఉండటం, ఇక్కడి విద్యార్థులు తెలంగాణ వారే అధికసంఖ్యలో ఉండటం ఇందుకు దోహదం చేసింది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఇక్కడ విజయవంతంగా జరిగిన వందేమాతరం ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడి విద్యార్థులు, మేధావులు ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చారు.

భవనాలు

మార్చు

సెంటెనరీ (శతాబ్ది) పరిపాలనా భవనం

మార్చు

15 ఎకరాల విస్తీర్ణంలో 33.75 కోట్ల రూపాయలతో జీ ప్లస్‌ టు అంతస్తులతో నిర్మించనున్న పరిపాలనా భవనానికి 2022 డిసెంబరు 7న శంకుస్థాపన జరిగింది. 123 గదులతో 1,08,020 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యున్నతమైన సకల సౌకర్యాలతో, అందరికీ అందుబాటులో ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు. 1960లో నిర్మించిన పరిపాలనా భవనం మరమ్మతుల కోసం అధిక మొత్తంలో నిధులు వెచ్చించాల్సివస్తుండడంతో నూతన పరిపాలనా భవనాన్ని నిర్మిస్తున్నారు.[11][12]

చెప్పుకోదగిన పూర్వవిద్యార్ధులు

మార్చు

ఉస్మానియా వర్సిటీ విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన అప్పటి విద్యార్థి నాయకులు, విద్యార్థులు రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారు. వారిలో ప్రథముడు పీవీ నరసింహారావు. బీ హాస్టల్ నుంచి ప్రారంభమైన వందేమాతరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా దేశానికే ప్రధానిగా సేవలు అందించారు.

అనుబంధంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు

మార్చు

అనుబంధంగా ఉన్న డిగ్రీ కళాశాలలు

మార్చు
  • సర్దార్ పటేల్ కళాశాల, సికిందరాబాదు
  • ఆంధ్ర విద్యాలయ కళాశాల, లిబర్టీ, హైదరాబాదు
  • ప్రగతి కళాశాల, కోఠి, హైదరాబాదు

ఇతర వివరాలు

మార్చు

ఉస్మానియి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఉస్మానియా విశ్వవిద్యాలయ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతోంది.

ఐఎస్‌వో గుర్తింపు

మార్చు

ఆయా విభాగాల్లో అత్యుత్తమ విధానాలు, కార్యకలాపాలు, మౌలిక వసతుల విభాగాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మక ఐఎస్‌వో ధ్రువీకరణ లభించింది. హెచ్‌వైఎం ఎండీ ఆలపాటి శివయ్య నేతృత్వంలోని బృందాలు 53 విభాగాలు, వివిధ పరిశోధనా కేంద్రాలు, కార్యాలయాల్లో విస్తృతంగా పర్యటించి, ఆడిట్‌ నిర్వహించగా విద్య, పరిపాలన, పర్యావరణ సుస్థిరత, నాణ్యతా ప్రమాణాల్లో శ్రేష్ఠతను కనబరిచి అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకుంది.[13] ఎనర్జీ ఆడిట్‌-ఐఎస్‌వో 50001:2018, పచ్చదనం, పర్యావరణం ఆడిట్‌-ఐఎస్‌వో 14001:2015, నాణ్యతా ప్రమాణాలు- ఐఎస్‌వో 9001:2015, అకాడమిక్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆడిట్‌, జెండర్‌ సెన్సిటైజేషన్‌ విభాగాల్లో ఐఎస్‌వో గుర్తింపు ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను విశ్వవిద్యాలయ అధికారులు హెచ్‌వైఎం ఎండీ నుంచి స్వీకరించారు.[14]

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Osmania University (Hyderabad, Telangana, India) - Population Statistics, Charts, Map, Location, Weather and Web Information". www.citypopulation.de. Retrieved 2022-12-16.
  2. https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999
  3. "Osmania University Population, Caste Data Hyderabad Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-12-16. Retrieved 2022-12-16.
  4. "Osmania University Village in Musheerabad (Hyderabad) Telangana | villageinfo.in". villageinfo.in. Retrieved 2022-12-16.
  5. ఆదాబ్ హైదరాబాద్, మల్లాది కృష్ణానంద్ రచన, ద్వితీయ ముద్రణ అక్టోబరు 2008, పేజీ సంఖ్య 70
  6. Morampudi, Satish. "ఉస్మానియా...వందేళ్ళ చరిత్ర". eVaarthalu (in ఇంగ్లీష్). Retrieved 2022-12-16.
  7. ఈనాడు, ప్రధాన వార్తలు (18 June 2019). "ఇక ఏటా స్నాతకోత్సవం". Archived from the original on 18 June 2019. Retrieved 18 June 2019.
  8. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (17 June 2019). "ఓయూలో 80వ స్నాతకోత్సవం వేడుకలు.. హాజరైన గవర్నర్". Archived from the original on 18 June 2019. Retrieved 18 June 2019.
  9. ఈనాడు, ప్రధానాంశాలు (17 June 2019). "80 స్నాతకోత్సవాలు..47 గౌరవ డాక్టరేట్లు". Archived from the original on 18 June 2019. Retrieved 18 June 2019.
  10. Sakshi (22 May 2021). "TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Sakshi. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  11. telugu, NT News (2022-12-07). "ఓయూ ప‌రిపాల‌న భ‌వ‌నానికి శంకుస్థాప‌న‌.. స‌బిత‌కు, వీసీకి కేటీఆర్ అభినంద‌న‌లు". www.ntnews.com. Archived from the original on 2022-12-07. Retrieved 2022-12-08.
  12. "ఓయూ ప‌రిపాల‌న భ‌వ‌నానికి శంకుస్థాప‌న‌". NavaTelangana. Archived from the original on 2022-12-08. Retrieved 2022-12-08.
  13. Ashok (2023-09-30). "ఓయూకు ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌ఓ గుర్తింపు". Mana Telangana. Archived from the original on 2023-09-30. Retrieved 2023-10-08.
  14. telugu, NT News (2023-10-01). "ఓయూకు ఐఎస్‌వో గుర్తింపు". www.ntnews.com. Archived from the original on 2023-10-01. Retrieved 2023-10-08.

వెలుపలి లంకెలు

మార్చు