అమరకోశము

(అమరకోశం నుండి దారిమార్పు చెందింది)

అమరకోశము అనేది ఒక ప్రాచీన సంస్కృత నిఘంటువు. ఒకనాటి జాతీయ పాఠ్యపుస్తకం. అమరాన్ని రచించినది అమరసింహుడనే నిఘంటుకారుడు. ఆయన ఏ కాలీనుడో, ఏ ప్రాంతీయుడో, ఏ కులస్థుడో నిర్ధారించడానికి తోడ్పడే వివరాలేవీ ఆ గ్రంథంలో లేవు. బ్రిటీషువారు భారతదేశానికి రాకముందు మన ప్రాచీన గురుకుల పాఠశాలల వ్యవస్థలో పై తరగతుల పిల్లలకి అమరకోశంతో పాటు రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం, కిరాతార్జునీయం, శిశుపాలవధ అనే ఈ అయిదు పుస్తకాలూ తప్పనిసరి వాచకాలుగా నిర్దేశించబడ్డాయి. ఇవి కాక ఆంధ్రదేశ పాఠశాలల్లో మఱో అయిదు తెలుగు కావ్యాల్ని కూడా ఆంధ్ర పంచకావ్యాలుగా భావించి పిల్లల చేత చదివించేవారు. మహాకవులుగా పేరుపడ్డ గుఱ్ఱం జాషువా, శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ మొదలైన ఆధునిక కాల కవులతో సహా అందరూ తమ చిన్నప్పుడు అమరకోశ పాఠకులే.[1]

అమరకోశము పుస్తక ముఖచిత్రం.

ఎన్.టి. రామారావు కూడా ఆయన హయాంలో కొంతకాలం పాటు దాన్ని ఒక పాఠ్యపుస్తకంగా అమలు జఱిపారు. కానీ ఆ ప్రయోగాన్ని కొనసాగించలేకపోయాడు.

పేరుసవరించు

దీనికి గ్రంథకర్త పెట్టిన అసలు పేరు ’నామలింగానుశాసనమ్’. కానీ అమరసింహుణ్ణి బట్టి దీనికి జనంలో అమరకోశమనే పేరు ఖాయమైంది. నామమంటే పదం. పదాల్ని వాటి లింగాలతో సహా నిర్దేశించి (అనుశాసించి) చెప్పేది కనుక రచయిత దీన్ని ’నామలింగానుశాసన’మన్నాడు.

అమరాన్ని రచించినది అమరసింహుడనే నిఘంటుకారుడు. ఆయన ఏ కాలీనుడో, ఏ ప్రాంతీయుడో, ఏ కులస్థుడో నిర్ధారించడానికి తోడ్పడే వివరాలేవీ ఆ గ్రంథంలో లేవు. కానీ బౌద్ధుడనే వ్యవహారం పరంపరాగతంగా వస్తున్నది. దీని మీద ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. భారతదేశంలో బౌద్ధం క్షీణిస్తూ వైదికమతం మళ్ళీ పుంజుకుంటున్న దశలో ఒక వైదిక రాజు తన రాజ్యంలో వైదికానికి మారడానికి ఇష్టపడని మొండిబౌద్ధు లందఱినీ నఱికించేస్తున్నాడట. అలా ఒకరోజున అలాంటివాళ్ళు 1,500 మందిని పట్టుకొని తెచ్చి నిలబెట్టి వరసగా నఱికేస్తున్నారట. ఆ వరసలో మొట్టమొదటివాడు అమరసింహుడు. ’నఱకండి’ అని ఆజ్ఞ అయినాక తలారి అమరసింహుడి దగ్గఱికొచ్చి ఖడ్గం ఎత్తబోతే అమరసింహుడు ’అట్నుంచి నఱుక్కురా’ అని కోరాడట. తలారి ’సరే’ నని అటు వెళ్ళాక, తన వంతు వచ్చేలోపు అమరసింహుడు ఆశువుగా 1, 500 శ్లోకాల్లో నామలింగానుశాసనం చెప్పాడంటారు. ’అట్నుంచి నఱుక్కురావడం’ అనే తెలుగు జాతీయం అప్పట్నుంచే ప్రచారంలోకి వచ్చిందని కూడా అంటారు. ఆ వధ్యస్థలిలో అతడు చెప్పిన వందలాది శ్లోకాల్ని ఎవరు అంత ధారణాశక్తితో జ్ఞాపకం ఉంచుకొని పొల్లుపోకుండా లోకానికి వెల్లడి చేశారో తెలియదు.

విషయంసవరించు

 
అమరకోశము 1951 రాయలు అండ్ కో వారి పుస్తక ముఖచిత్రం.

అమరకోశాన్ని ’వర్గీకృత సంస్కృత పదజాలం’గా అభివర్ణించవచ్చు. ఈ రకమైన పుస్తకాలు ఈ రోజుల్లో ఆంగ్ల భాషక్కూడా లభిస్తున్నాయి. అయితే ఇది ఈనాడు పాశ్చాత్య పద్ధతిలో రచించబడుతున్న నిఘంటువుల్లా అకారాది (alphabetical order) గానో, వచనంలోనో కాక, విషయక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ధారణ కనుగుణమైన చిన్నిచిన్ని అనుష్టుప్ శ్లోకాలుగా వ్రాయబడింది.కారణం – ఇది పాశ్చాత్య నిఘంటువుల్లా ఆచూకీ (reference) కోసం కాక, విద్యార్థులు ధారణ చేయడం కోసం, వారు భాష మీద అతితక్కువ కాలంలో పట్టు సాధించడం కోసం ఉద్దేశించబడింది.

విభాగాలుసవరించు

ఇందులో మూడు కాండలున్నాయి.

  1. ప్రథమకాండ - మంగళాచరణము, పరిభాష, స్వర్గవర్గం, వ్యోమవర్గం, దిగ్వర్గం, కాలవర్గం, ధీవర్గం, వాగ్వర్గం, శబ్దాదివర్గం, నాట్యవర్గం, పాతాళవర్గం, భోగివర్గం, నరకవర్గం, వారివర్గం అనే విభాగాలున్నాయి. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 330.
  2. ద్వితీయకాండ - భూవర్గం, పురవర్గం, శైలవర్గం, వనౌషధివర్గం, సింహాదివర్గం, మనుష్యవర్గం, బ్రహ్మవర్గం, వైశ్యవర్గం, శూద్రవర్గం. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 750.
  3. తృతీయకాండ - విశేష్యనిఘ్నవర్గం, సంకీర్ణవర్గం, నానార్థవర్గం, అవ్యయవర్గం, లింగాదిసంగ్రహవర్గం, పున్నపుంసకలింగశేషం, త్రిలింగశేషం. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 483.

పూర్తిపాఠంసవరించు

మూలాలుసవరించు

  1. "పుస్తకం.నెట్ లో తాడేపల్లి లలితా బాలసుబ్రమణ్యం రాసిన వ్యాసం నుంచి".

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అమరకోశము&oldid=2983167" నుండి వెలికితీశారు