అల్లూరి సత్యనారాయణరాజు
అల్లూరి సత్యనారాయణరాజు ప్రముఖ రాజకీయవేత్త. కాంగ్రెస్ పార్టీలో పలు ముఖ్యపదవులు అధిష్టించి జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పారు.
జీవిత విశేషాలు
మార్చుఅల్లూరి సత్యనారాయణరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని జిన్నూరు గ్రామంలో 25-1-1913న జన్మించారు. బాల్యంలో వీధిబడి విద్య తప్ప మరేమీ చదువుకోకున్నా, సంపన్న కుటుంబానికి చెందినవారు కాకున్నా స్వంత తెలివితేటలతో, స్వయంకృషితో రాజకీయాల్లో ఉన్నతస్థాయికి ఎదిగారు. మెట్టుపై మెట్టు ఎదగడంలోనూ, రాజకీయ వ్యూహచతురతలోనూ ఆయన అత్యంత అరుదైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు. అదే క్రమంలో తన సామాన్య జీవితం నుంచి అత్యున్నత రాజకీయ స్థితికి చేరుకున్నారు.
రాజకీయ రంగం
మార్చుఅల్లూరి సత్యనారాయణరాజు సర్దార్ దండు నారాయణరాజు అనుచరునిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. అనంతరం స్వయంకృషి, స్వశక్తి, స్వంత తెలివితేటలతో కాంగ్రెస్ రాజకీయాల్లో తమ ముద్రవేశారు. రాష్ట్రకాంగ్రెస్ లో అంచెలంచెలుగా అన్ని పదవులనూ ఆక్రమిస్తూ చివరికి అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయ్యారు.
ముఖ్యంగా అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, 1962లో ప్రజాపనులశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
సాహిత్యరంగం
మార్చుఆకర్షణీయమైన సంభాషణా శక్తి కలిగిన సత్యనారాయణరాజు సాహిత్యం పట్ల చక్కని అభిరుచితోపాటు సాహిత్యకారునిగా ప్రతిభనూ కలిగి ఉండేవారు. ఆయన తెలుగు భాషలోనే కాక హిందీలోనూ మంచి అభినివేశం ఉండేది. రచనాశక్తి, తెలుగు-హిందీ భాషలపై పట్టులకు ఫలితంగా ఆయన హిందీ నుంచి అనువాదాలు చేశారు. "వోల్గా నుండి గంగాతీరం"గా రాహుల్ సాంస్కృత్యాయన్ "వోల్గా సే గంగ" కథామాలికను అనువదించడంతో సాహితరంగంలో పేరొందారు. తెలుగు భాషకు తనవంతు సేవగా ఆయన అనువాదాలను ఎంచుకుని అనువదించాఉ.
వ్యక్తిత్వం
మార్చుఅల్లూరి సత్యనారాయణరాజు పలుకులు తేనె పలుకులు అంటూ సమకాలీకులు ప్రశంసించారు. ఆయన మాటలు ఎంతటివాడిపైనైనా సమ్మోహనాస్త్రాలుగా పనిచేస్తాయని వీరిని పాత్రికేయులు మెచ్చుకున్నారు. ఆంధ్రసచిత్ర వారపత్రికలోని తెలుగువెలుగులు శీర్షికలో "మనసు కలవని వారిని కూడా సమయానికి ఎలాగో చేరదీస్తారు. చిన్న పనికైనా పెద్దపనికైనా తెగింపు హెచ్చు. ఆత్మవిశ్వాసం అధికం." అంటూ ప్రస్తావించారు.[1] ఆయన కలుపుగోలుతనం, రాజకీయంగా ఏ మలుపైనా తిప్పగల లక్షణాలను ఎందరో ఎంతగానో మెచ్చుకునేవారు.
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రసచిత్రవార పత్రికలో తెలుగు వెలుగులుగా వచ్చిన వ్యాసపరంపరలో అల్లూరి సత్యనారాయణ గురించిన వ్యాసం