అసమర్థుని జీవయాత్ర

ప్రముఖ తెలుగు నవలా రచయిత త్రిపురనేని గోపీచంద్ కి నవలా సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సాధించి పెట్టిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మెట్టమొదటి మనో వైజ్ఞానిక నవల. ఈ నవల 1945-46లో రాశారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారపు సాహిత్యానుబంధాలలో సీరియల్‌ నవలగా వెలువడింది.

అసమర్థుని జీవయాత్ర
Telugubookcover AsamardhuniJeevayatra.JPG
కృతికర్త: త్రిపురనేని గోపీచంద్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ:
విడుదల: 1947

1947లో రచించబడిన ఈ నవలను సాహితీ విమర్శకుడు డి.ఎస్.రావు ఆంగ్లములో ది బంగ్లర్ - ఎ జర్నీ త్రూ ద లైఫ్ (The Bungler - A Journey Through Life) గా అనువదించాడు[1].

నవల నేపథ్యంసవరించు

గోపీచంద్‌ తొలి కథ రాసిన పదేళ్ల తర్వాతే ఆయన మొదటి నవల రాశారు. 'అసమర్ధుని జీవయాత్ర' ఆయన రెండవ నవల. దీనిని గోపీచంద్‌ తన తండ్రి రామస్వామికి అంకితం చేశారు 'ఎందుకు? ఎందుకు?' అని ప్రశ్న నేర్పినందుకు. త్రిపురనేని రామస్వామి (1887-1943) తెలుగు నాట పేరు మోసిన హేతువాది, నాస్తికుడు, కుల, మతాలని చీల్చి చెండాడిన వాడు. మూఢనమ్మకాల మీద అలుపులేని పోరు సాగించినవాడు.

నవల సమీక్షసవరించు

ఈ రచనలో అప్పటి మన పల్లెటూళ్లు, మానవ సంబంధాలు, అన్నీ తారసపడతాయి. ఆస్తి అంతస్తులు తమ వికృత రూపంలో మనకి సాక్షాత్కరిస్తాయి. వీటికి ఈ నవల అద్దం పట్టింది. జమీందారీ వ్యవస్థ ఎలా బీటలు వారుతుందో, మన సమాజంలో పెట్టుబడిదారీ బీజాలు ఎలా నాటుకుంటున్నాయో విశదపరిచాడు గోపీచంద్‌. నవల కనీసం ఒక తరం జీవితాన్నయినా కళ్లకు కట్టాలంటారు సాహితీవేత్తలు. ఈ నవల ఆ పనిచేసిందనీ, మన జీవితాలని మనకి ఎరుక పరిచిందనీ చెప్పవచ్చు. అందుకే ఈ నవల ఇంకా నిలబడి ఉంది. ఎన్నో ముద్రణలకు నోచుకుంది. ఈ నవలలోని సీతారామారావు ధీరోదాత్తుడూ, సకల గుణాభిరాముడూ కాదు. అంతర్ముఖుడు. గోరంతలు కొండంతలు చేస్తాడు. పరిసరాలని పట్టించుకోకుండా ఊహాలోకాల్లో తేలిపోతూ వుంటాడు. ఇతడు ఊహాశాలి. అంతేకాదు ఉన్మత్తుడు కూడా. దీనికి దాఖలాలు నవల పొడుగూతా కనిపిస్తాయి. అన్నిటికంటే తిరుగులేని సాక్ష్యం అసమర్ధుని అంతిమయాత్రే. అది బీభత్సరసప్రధానం. పిశాచగణ సమవాకారం. మానవ మనుగడలోని కీలకాంశాలను రచయిత చాలా ఒడుపుగా మనకు విశదపరిచాడు. కనకనే ఈ నవలది తెలుగు సాహిత్యంలో చెక్కు చెదరని స్థానం. దీనికి ఎంత మాత్రం వాసి తగ్గదు. ఇది నిస్సందేహంగా నిజం. 'అసమర్ధుని జీవయాత్ర' తెలుగులో మనోవైజ్ఞానిక నవలగా పేరు పొందింది. సీతారామారావు పాత్ర విచ్ఛిన్నమౌతున్న వ్యక్తిత్వానికి ప్రతీకగా నిల్చిపోయింది.

నవలలో కొన్నిసవరించు

బతకాలి అనుకోవడం మనుషులకు తప్పించుకోలేని వ్యసనం అయింది .”ఎందుకు బతకాలి ?” అనే ప్రశ్న వేసుకునే దైర్యం మనుషులకు ఇంకా అలవడలేదు ….. నీతి, ధర్మ శాస్త్రం అన్ని – బతికే వీలున్న వాళ్ళకి …. బతకటమే కష్టమైన వాళ్ళకి బతకటమే నీతి .. బతకటమే దర్మం, బతకటమే శాస్త్రం ……

ఒరేయ్ మనం పుట్టటం నిజం, చావడం నిజం, మద్యన బ్రతకడం నిజం .. పుట్టటం చావడం మనచేతుల్లో లేదురా, ఇక బ్రతకడం ఒకటేరా మిగిలింది,. బతకటానికి మనకు కావలసింది అన్నమె కదరా .. మరి దీని కింత గొడవెందుకు రా … నలుగురం కూడబలుక్కుని బతకలేమంటారా ? ఈ ప్రపంచంలో ఏదో వుందని మభ్య పెట్టి దానికోసం పోట్లాడుకు చచ్చేటట్లు చేస్తున్నారా … అంత కంటే ఎం లేదు రా, మనం కొన్నాళ్ళు ఇక్కడ బతకాలి … దీనికి కలహాలూ రక్తపాతాలు ఎందుకు రా …ఎవరు కట్టుకు పోయేది ఏముంది రా …. చచ్చేదాకా బతకండి ….

చావ దలచిన వాళ్ళకి కోరికెలు వుండడం మంచిది కాదు బాబూ … కోరికెలు వున్నవాడు చావడానికి అర్హుడు కాడు … చావు బతుకు రెండు సమాన మైన దృష్టితో చూడగలిగిన వాడే ఎ పనైనా చెయ్య గలుగుతాడు ….

ఈ జీవితం వుంది చూసావా … అందరిని తంతూనే వుంది బాబూ … ఎంత తన్నిన కొంత మందికి బుద్ధి రాదు ….

ఆడవాళ్ళని తగిలించుకోవడం తేలికే, వదిలించుకోవడం బ్రహ్మ ప్రళయం …..

అపవాదు కున్న ఆకర్షణ ఈ ప్రపంచంలో ఆడదానికి లేదు … అపవాదు ఇచ్చే ఆహ్లాదం మరొకటి ఇవ్వలేదు…..

జీవిత ప్రవాహం ప్రచండ వేగంతో వెళ్ళిపోతుంది .. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు .. అదొక మహాసంగ్రామం … సుఖం దుఃఖం అనేవి మానవ కల్పితాలు …కొన్ని ఉద్రేకాలకు ఆనంద పడడం కొన్ని ఉద్రేకాలకు విచారించటం నేర్చుకున్నాం … మనం కావాలని తెచ్చిపెట్టుకున్న వీటికి ఎందుకు ఇంత ఆర్భాటం ??….

తానూ ప్రయత్నించడు …అన్నం తనంత తానె వచ్చి పడాలి … సుఖాలు వాటంతట అవే వచ్చి తన్ను ముసురుకోవాలి … కష్టాలు తనదగ్గరకి రాకూడదు … తను ఉహించినవన్ని జరగాలి … తను ప్రయత్నించడు…

చచ్చే వరకు బ్రతకటం తప్ప ఈ ప్రపంచంలో చేసేదేమీ లేదు …. ప్రపంచానికి ఆదర్శం లేదు గనక ., అన్ని పనులు మంచే … అన్ని పనులు చెడే !! పెద్దలు ప్రతివిషయానికి బహుముఖాలు వుంటాయి అంటారు … అంతే గాని ఇది మంచి- ఇది చెడు అంటూ ఏమి లేదు …

టిక్కెట్ ఇచ్చె కిటికీ దగ్గర జనం విరగబడి -నేను ముందు తెచుకోవాలి అంటే నేను ముందు తెచ్చు కోవాలి అని త్రోక్కిసలాడుతూ వుంటారు చూడు … జీవిత సంగ్రామాన్ని తలచుకున్నప్పుడల్లా ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్లు అనిపిస్తుంది నాకు …. ప్రతి వాడు ముందు టికెట్లు తెచ్చుకోవాలని తాపత్రయపడే వాడే గాని …. మిగిలిన వాళ్ళ సంగతి ఏ ఒక్కడు ఆలోచించడు … కాళ్ళు నలుగుతాయి …చొక్కాలు చిరుగుతాయి … ఇలా చెయ్యటం తప్పు అనుకోడు ..చెయించు కోవడం అవమానం అనుకోడు … ప్రతి వాడి దృష్టి టిక్కెట్టు మీదే … ఒకడు ఇనప పాదాలతో వస్తాడు … అందరి కంటే వెనక వచ్చినా ముందే టిక్కెట్టు తెచ్చుకుంటాడు … అసమర్ధులు ఆ సంగర్షణ లోకి దిగలేక దూరంగా నిలబడి చుస్తూ వుంటారు .. వాళ్ళకు టిక్కెట్ కావలసిందే కాని ప్రయత్నించరు … పైగా టికెట్ కోసం తాపత్రయ పడేవాల్లని చూసి ” నీచులు " “మోసగాళ్ళు ” అనుకుని తృప్తి పడతారు … వాళ్ళు ఎవరన్నా గాని, వాళ్ళ స్వభావం ఏమైనా గాని, టిక్కెట్ దొరికేది వాళ్ళకే .. రైలు అందేది వాళ్ళకే .. రైలు కే వెళ్ళడం ముఖ్యమైనప్పుడు అందుకు అవసరమైన పనులన్నీ చేయవలసిందే … ..తమ ఉన్నత భావాలు తమకుంటే రైలు తమ దారిన తాము వెళుతుంది నాయన ….

నవలా నిర్మాణంసవరించు

జ్ఞానం అనేది నిత్యం సముద్రం లోకి ప్రవహించే కొత్త నీరులాంటిది అని తెలుసుకోకుండా, అసమగ్రమని ముందే తేల్చేసిన పాత సిద్ధాంతాల్ని అర్థం చేసుకున్న జ్ఞానంతో తాను జీవిస్తున్న ప్రస్తుత సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, తనకు మాలిన ధర్మానికి పోయి, సర్వం కోల్పోయి తన చాతకానితనాన్ని అసంబద్ధతర్కంతో సమర్థించుకోవడం వంటి వాటి వల్ల ఎలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోవల్సి వస్తుందోనన్న విషయాన్ని రచయిత ఈ నవలలో చెప్పదల్చాడు.

యిందుకుగానూ ఆయన ఎన్నుకున్న ఇతివృత్తం, దాన్ని నిర్వహించిన శిల్పం, పాత్రల మనస్తత్వాన్ని పట్టించే వర్ణన, నాటకీయత మధ్య సాగే ముగింపు...యివన్నీ గోపీచంద్ ప్రతిభను, ప్రయోగదీక్షతను, సృజనాత్మకతను, సమర్థతనూ చాటుతున్నాయి.

సీతరామారావు పాత్రలో కనిపించే ఆధిక్యతా, ఆత్మన్యూనతా భావాలు వివిధ రకాలైన మానసిక చిత్తప్రవృత్తుల దృష్ట్యా యిది ఫ్రాయిడ్, ఆడ్లర్ సిద్ధాంతాల ప్రభావంతో వచ్చిన మనోవైజ్ఞానిక నవల అని చెప్పవచ్చును.

యిందులో (సీతారామారావు) అసమర్థుడుగా మారటం అన్న ఆరంభం నుండి అతను కడతేరే వరకు సీతారామారావు జీవితాన్ని ఆరుభాగాలుగా విభజించి రచించాడు గోపీచంద్.

  1. అసమర్థుడు
  2. అసమర్థుని భార్య
  3. అసమర్థుని ఆదర్శం
  4. అసమర్థుని మేనమామ
  5. అసమర్థుని ప్రతాపం
  6. అసమర్థుని అంతం

ఆ ఆరుభాగాలూ సీతారామారావులోని క్రమపరిణామాన్ని చూపుతాయి.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఇండియాక్లబ్.కాం లో అసమర్థుని జీవయాత్ర ఆంగ్ల అనువాదము యొక్క సమీక్ష