ఆంధ్రవీరులు
ఆంధ్రవీరులు శేషాద్రి రమణ కవులు రచించిన పుస్తకం. దీని మొదటిభాగాన్ని 1929 సంవత్సరంలోను, రెండవభాగాన్ని 1931 సంవత్సరంలోను వేంకటరామ్ అండ్ కో, బెజవాడ వారు ప్రచురించారు.
ఆంధ్రవీరులు | |
కృతికర్త: | శేషాద్రి రమణ కవులు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | జీవితచరిత్ర |
ప్రచురణ: | వేంకటరామ్ అండ్ కో, బెజవాడ |
విడుదల: | 1929, 1931 |
ప్రచురణ మాధ్యమం: | ముద్రణ |
పేజీలు: | 137+183=320 పేజీలు |
పీఠిక
మార్చు"ఆంధ్రవీరరత్నావళి" పేరుతో ఆంధ్రులందు ప్రసిద్ధులైన లోకోత్తర పురుషుల జీవితములు కథలుగా వ్రాసి బాలురకు విద్యార్థిదశలోనే మాతృదేశాభిమానము గలిగించుట కోసం శేషాద్రి రమణ కవులు ఈ పుస్తకమును మొదలుపెట్టిరి. దీనిగురించి విని వేంకటరాం అండుకో వారు తాము స్వయముగా ప్రకటించెదమని ప్రోత్సహించిరి. విస్తృతమగు నాంధ్రదేశమునందు ఎందరో మహనీయు లుద్భవించిరి. ఇటువంటి ఆంధ్రవీరుల వికాసము, రాజ్యవిస్తృతి. పతనము క్రమముగా నీపుస్తకమునందు దెలుపబడినవి. ఆంధ్రుల చరిత్రము చాల వఱకు బురాణ యుగమున నజ్ఞాతముగ గున్నదనుటకు జాణక్యుని చరిత్రమును దార్కాణముగ దీసికొన వచ్చును. తరువాత నాంధ్రులు జాతీయతా ధర్మ నిర్వహణ ప్రవీణులై పొందిన మహత్తరమగు నభ్యున్నతికి గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్రము దృష్టాంతము. తరువాత బశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు తమలో దాము పోరాడుకొనుటయు జోడులు విజృంభించుటయు జరిత్ర విశేషములు. వీనిని గమనించితిమేని అసల నాంధ్రదేశము నంతయు నేకథాటిగ బాలించిన వీరుడు కులోత్తుంగ ఛోళదేవుడు. ఈతని యనంతరము ఆంధ్రదేశమును జీలికలు గావించుకొని చిన్న చిన్న రాజులు పాలించుటయు బ్రజలలో స్వతంత్రభావ ముదయించి తమలో దాము పోరాడు కొనసాగిరనుటకు బాలచంద్రుడు ఖడ్గ తిక్కనల చరిత్ర ముదాహరణముగ గొననగును. చీలిపోయిన యాంధ్రదేశమును గేంద్రీకరించి స్వతంత్రమగు సామ్రాజ్యమును బ్రజా క్షేమకరముగా బాలించిన మహోదారుడు ప్రతాపరుద్ర చక్రవర్తి. ఈతని కాలముననే సమస్త కళలు, భాష ఆంధ్రజాతీయిత అభివృద్ధికి వచ్చినవి. ఈయన యనంతరము దేశీయువీరులు చిన్న చిన్న రాజ్యములు స్థాపించి యెటుల నభివృద్ధిమార్గముల నన్వేషించిరో బ్రాహ్మణు వీరు లెటుల సామ్రాజ్య నిర్మాణమునకు దోడుపడిరో తెలిసికొనుటకు హరిహరరాయల బుక్కరాయల మాధవవిద్యారణ్యుల చరిత్ర సంగ్రహము సాధనము కాగలదు. ఆంధ్రసామ్రాజ్యము పునరుద్ధరించి తనకత్తి కెదురులేకుండా బోయినతావున నెల్ల జయము నొంది ద్రవిడాంధ్రోత్కలు దేశములను లోగొని ఆంధ్రదేశమును యపనులపాలుగాకుండ గాపాడినది శ్రీకృష్ణదేవరాయలు.
ఈ మహాత్ముని వాజ్మయసేవ, దేశసేవ, మాతృదేశాభిమానము నద్వితీయము. సమగ్రమగు నాంధ్రత్వ మంతయు నితనియెడ నిండి నిబిడీకృత మయ్యెను. ఆంధ్రుల పతనమునకు సూచనలు కృష్ణదేవరాయల తుది కాలము నుండియే యేర్పడెను. తరువాత నేకామిషవాంఛతో హిందూ మహమ్మదీయులకు రాజకుటుంబమునకు గలతలు సంభవించెను. అన్నింటిని సవరించి రాజ్యము పునరుద్ధరించిన వాడు రామరాజు. పూర్వులకంటే నీత డత్యున్నత వహించెను గాని యీతడు ఘోర మృత్యు ముఖమున నదృశ్యు డగుటతో నాంధ్రుల సంపద, పెంపు, ఉన్నతి నసించెను. ఇవియే పరాధీనతకు మొదటి దినములు. తరువాత నెంత వీరుడేని స్వతంత్రరాజ్యము స్థాపింప వీలు లేకపోవుటయు బరస్పరాసూయలు ప్రజల టయు ధర్మ సంస్థాపనార్థము వీరు లాత్మార్పణము గావించుటయు యాచశూరుని చరిత్రమువలన దెలియును. అంతటితో ఆంధ్రుల స్వాతంత్ర్య వికాసము కడబట్టి చిన్న చిన్న జమీనులతో దృప్తిపడవలసి వచ్చింది. మొగలు రాజ్యములలో నొకటగు గోలకొండ రాజ్యమునందు మంత్రులుగ నుండి ఆర్షధర్మములను యవనులు ద్రోహము గావింపకుండ జెల్లెలి కట్టవలె నడుపడి మంత్రిపదవిని నామమాత్రముగా నుంచుకొని ఆంధ్రదేశము నేక హేలగా బాలించిన యక్కన్న మాదన్నలనాడు మఱల నాంధ్ర వికాసము తలయెత్తినది. దురాగతులగు రాజద్రోహులచే మిగుల ఘోరముగా అక్కన్న మాదన్న లేనాడు గోలకొండ రాజవీధిలో జంప బడిరో ఆంధ్రజాతీయ పతనము దర్శింపజాలక యాత్మ రక్తముతో నాంధ్రమాత పదము లభిషేకించి యేనాడు అక్కన్న మాదన్నలు త్యాగము ప్రకటించిరో యానాటితో నాంధ్రులు చరిత్రశరణ్యులై పూర్వ వికాసము నంతయు గోలుపోయిరనియు నాటినుండి స్వతంత్ర రాజ్యస్థాపకుడగు వీరుడు జనింప లేదనియు నెఱుంగనగును. ఈవిధముగా క్రీస్తుపూర్వము నుండి 18వ శతాబ్దము వఱకు గల సంగ్రహచరిత్ర యీగ్రంథమున నిముడ్పబడెను.
విషయసూచిక
మార్చుమొదటిభాగములోని వీరులు
మార్చు- చాణక్యుడు
- గౌతమీపుత్ర శాతకర్ణి
- కులోత్తుంగ చోళుడు
- బాలచంద్రుడు
- ఖడ్గ తిక్కన
- ప్రతాపరుద్ర చక్రవర్తి
- కృష్ణదేవరాయలు
- రామరాజు
- యాచ శూరుడు
- అక్కన్న మాదన్న