ప్రధాన మెనూను తెరువు
కాకతీయ సామ్రాజ్యం
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
Warangal fort.jpg
కాకతీయ పాలకులు
కాకతి వెన్నయ 750-768
మొదటి గుండయ 769-824
రెండవ గుండయ 825-870
మూడవ గుండయ 870-895
ఎఱ్ఱయ 896-925
మొదటి బేతరాజు 946-955
నాల్గవ గుండయ 956-995
గరుడ బేతరాజు 996-1051
మొదటి ప్రోలరాజు 1052-1076
రెండవ బేతరాజు 1076-1108
దుర్గరాజు 1108-1115
రెండవ ప్రోలరాజు 1116-1157
గణపతి దేవుడు 1199-1262
రుద్రమ దేవి 1262-1289
ప్రతాపరుద్రుడు 1289-1323

‡ రాణి

ఇతరులు
మాలిక్ మక్బూల్
నిర్మాణాలు
*వరంగల్ ఖిల్లా
*వేయి స్తంభాల గుడి
*రామప్ప దేవాలయం
మార్చు

ప్రతాపరుద్రుడు కాకతీయ రాజవంశమునకు చెందిన చివరి రాజు. ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈయన్ను వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. ప్రతాపరుద్రునికి మొదట వీరరుద్రుడు, కుమారరుద్రుడను పేర్లుండెను. జినకళ్యాణాభ్యుదయమను రచనను ముగించుచూ గ్రంథకర్త అప్పయార్యుడు తన్న గ్రంథమును రుద్రకుమారదేవుని రాజ్యములో శకము 1241లో ముగించితినని చెప్పుకున్నాడు.

1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనాకాలమంతయూ యుద్ధములతోనే గడచింది[1].

రాజ్యముసవరించు

రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో పెక్కు సంస్కరణలు చేశాడు. ఈతని కాలములో వ్రాయబడిన "సరస్వతీ విలాసము" అను గ్రంథములో హిందూ ధర్మములు, ఆచారములు, ఆస్తి హక్కులు మొదలగు చట్టములు క్రోడీకరించబడినవి [2]. పెక్కు గ్రామాలకు నీటి వసతి కొరకు చెఱువులు తవ్వించాడు. వీటిలో బయ్యారము చెరువు ప్రసిద్ధమైనది

యుధ్ధములుసవరించు

క్రీ. శ. 1289లో రుద్రమ దేవి మరణానంతరము రాజ్యాధికారము చేబట్టిన వెంటనే అంబదేవుని తిరుగుబాటు అణచివేయుటకు ప్రతాపరుద్రుడు పూనుకున్నాడు. అందుకోసం నాయంకారవిధానమును కట్టుదిట్టం చేశాడు. నాయకుల సైన్యమునంతనూ తీర్చిదిద్ది మంచి శిక్షణ ఇప్పించి సిద్ధపరిచాడు. తన దాడిని మూడుగా విభజించి మూడు మార్గములలో నడిపించాడు. ఒకటి అంబదేవుని పైకి, రెండవది నెల్లూరు పైకి, మూడవది సేవుణ రాజ్యము పైకి. ఇందులూరి అన్నయ త్రిపురాంతకముపై దాడిచేసి క్రీ. శ. 1291లో అంబదేవుని తరిమివేశాడు. ఆడిదము మల్లు నెల్లూరు పైకి వెడలి అచట మనుమగండభూపాలుని హతమార్చాడు. పశ్చిమరంగములో గోన గన్నయ, విటలుడు యాదవరాజాక్రాంతములైనున్న ఆదవాని, తుంబళము కోటలు పట్టుకొని రాయచూరుదుర్గముపై దాడికి వెడలారు. కన్నడప్రాంతాలైన మాణువ, హాళువలను కూడా సాధించి కృష్ణా తుంగభద్రల నడిమిదేశమంతటినీ జయించారు. దీనితో సేవుణ రాజు దురాక్రమణము కట్టుబడింది. ఆంతరంగిక వ్యవహారాలీవిధముగా చక్కదిద్దుకొనగలిగినను ప్రతాపరుద్రునికి గొప్ప విపత్కరపరిస్థితి ఉత్తరదేశము నుండి ముంచుకొచ్చింది.

ముస్లిం దండయాత్రలుసవరించు

ఢిల్లీ సుల్తాను జలాలుద్దీను అల్లుడు గరషాస్ప్ మాలిక్ క్రీ.శ. 1296లో యాదవరాజ్యముపై దండెత్తి దేవగిరిని దోచుకుపోయాడు. గరషాస్ప్ మామను హత్యచేసి అల్లావుద్దీన్ ఖిల్జీ అను పేరుతో సింహాసనమెక్కాడు. సిరిసంపదలతో తులతూగుతున్న ఓరుగంటిపై ఖిల్జీ కన్ను బడింది. తెలుగుదేశముపై ముస్లిముల దాడులకు క్రీ.శ. 1303లో అంకురార్పణ జరిగింది.

మొదటి దాడిసవరించు

అల్లావుద్దీను ఖిల్జీ తన విశ్వాసపాత్రులైన సర్దారులు మాలిక్ ఫక్రుద్దీన్ జునా మరియు జాజు లను గొప్ప సైన్యముతో బంగాళదేశము మీదుగా పంపాడు. కాకతీయ నాయకుడు పోతుగంటి మైలి ఉప్పరపల్లి (ప్రస్తుత కరీంనగర్ మండలం) వద్ద తురుష్క సైన్యాన్ని ఎదుర్కొని తరిమివేశాడు.

రెండవ దాడిసవరించు

క్రీ.శ. 1309లో సుల్తాను మరింత సైన్యముతో మాలిక్ నాయిబ్ కాఫూర్ ను పంపాడు. అతడు దేవగిరిమీదుగా పయనించి దారిలో సిరిపూరు కోటను స్వాధీనము చేసుకుంటాడు. విషయము తెలిసి ప్రతాపరుద్రుడు సైన్యమును సిద్ధముచేసి కోట సంరక్షణకు సన్నిద్ధుడవుతాడు. కాఫూర్ హనుమకొండను ఆక్రమించి ఓరుగల్లు ముట్టడించాడు. బురుజునకొక నాయకుని చొప్పున తగు సైన్యముతో నెలరోజులు వీరోచితముగా కోటను కాపాడారు. తుదకు ముస్లిం సేనలు మట్టిగోడను చుట్టిఉన్న అగడ్తను దాటి లోపలికి ప్రవేశించగలిగాయి. ప్రతాపరుద్రుడు రాతికోటను సురక్షితముగా కాపాడగలిగాడు. విసిగి వేసారిన కాఫూర్ ఓరుగంటి పరిసరప్రాంతం, గ్రామాలు భస్మీపటలం చేసాడు. అమాయక ప్రజలను, ఆడువారిని, పిల్లలను, ముసలివారు అని కూడా చూడకుండ నరసంహారం చేశాడు. సైనికులు స్త్రీలపై అత్యాచారాలు చేశారు. ఇది తెలిసి ప్రతాపరుద్రుడు సంధికి ఒప్పుకొని అపారమైన ధనమును, ఏనుగులను బహూకరించాడు.

మూడవ దాడిసవరించు

క్రీ. శ. 1318లో సుల్తాను పేరిట సర్వాధికారము వహించి పాలన చేస్తున్న మాలిక్ కాఫుర్ను హత్య చేసి అల్లావుద్దీన్ కొడుకు కుతుబుద్దీన్ ముబారక్ సింహాసనమాక్రమించాడు. దక్కన్ వ్యవహారములు చక్కబెట్టడానికి ముబారక్ స్వయంగా దేవగిరి మీదుగా ఓరుగల్లు వస్తాడు. ఆతని దురాగతముల గురించి విన్న ప్రతాపరుద్రుడు ధనకనకవస్తువాహనాలిచ్చి పంపుతాడు.

నాలుగవ దాడిసవరించు

క్రీ. శ. 1320లో ఢిల్లీ రాజకీయాలలో పెద్ద మార్పు వచ్చింది. ఖిల్జీ వంశం పోయి తుగ్లక్ వంశం అధికారములోకి వచ్చింది. ఘియాజుద్దీన్ తుగ్లక్ సుల్తానయ్యడు. ఇది అదనుగా చూసి ప్రతాపరుద్రుడు వార్షిక కప్పం ఆపివేస్తాడు. లోగడ సుల్తానుకప్పగించిన బీదర్ కోట మరల ఆక్రమిస్తాడు. కోపగించిన ఘియాజుద్దీన్ తన కొడుకు ఉలుఘ్ ఖానును ఓరుగల్లుపై దండయాత్రకు పంపుతాడు. దారిలోగల బీదర్, కోటగిరి లోబరుచుకొని ఓరుగల్లు కోట ముట్టడించాడు. ఎంత ప్రయత్నించినా కోట స్వాధీనము కాలేదు. అయిదు నెలల ముట్టడి తర్వాత విఫలుడైన ఉలుఘ్ ఖాన్ ఢిల్లీ మరలి పోయాడు. చరిత్రకారులు ఈ విషయముపై పలువిధాలుగా వ్రాశారు. కాని ప్రతాపరుద్రుని నాయకుల, సేనల ధైర్యసాహసములకు, పోరాట పటిమకు ఇది ఒక మచ్చుతునక.


అయిదవ దాడిసవరించు

ఇక ఉపద్రవములుండవని భావించిన ప్రతాపరుద్రుడు యుద్ధములో జరిగిన నష్ఠాలను పూడ్చుకొనక ఉపేక్షించాడు. కొటకు మరమ్మతులు చేయించలేదు. సామగ్రి సమకూర్చుకొనలేదు. నెలరోజులలో మహాసైన్యముతో తిరిగివచ్చిన ఉలుఘ్ ఖాన్ తో తలబడిన ప్రతాపరుద్రుని సేనలు వీరోచితముగా పోరాడినను పరాజయము తప్పలేదు. కాకతీయ నాయకులలో తలెత్తిన అనైక్యత, ఈర్ష్యాద్వేషాలు కూడా ఓటమికి కారణాలని చరిత్రకారుల అభిప్రాయం.

మరణంసవరించు

ప్రతాపరుద్రుడు, కటకపాలుడు గన్నమ నాయుడు మరియూ పెక్కు సేనానులు బందీలయ్యారు. ప్రతాపరుద్రున్ని బంధించిన ఉలుఘ్‌ఖాన్, వరంగల్ లోనే ఉంచితే ప్రమాదమని విశ్వాసపాత్రులైన ఖాదిర్ ఖాన్, ఖ్వాజాహాజీలకు ఆయన్ను ఢిల్లీకి తరలించే బాధ్యతను అప్పగించాడు. అయితే ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. అయితే ఇవన్నీ గ్రంథస్తం చేసిన షాంసి సిరాజ్ అఫీఫ్ ప్రతాపరుద్రుడు ఎలా మరణించాడో వివరించలేదు. సుల్తాను సైన్యం ప్రతాపరుద్రుని ఢిల్లీ తీసుకు వెళుతుండగా మార్గమధ్యాన సోమోద్భవ (నర్మదా నది) తీరంలో ఆయన కన్నుమూశాడని ముసునూరి ప్రోలయ నాయకుని క్రీ.శ. 1330 విలసదానపత్రం పేర్కొంది.[3] ప్రతాపరుద్రుడు సహజ మరణం చెందలేదని స్వఛ్ఛందంగానే భగవదైక్యం చెందాడని క్రీ.శ. 1423లో రెడ్డిరాణి వేయించిన అనితల్లి కలువచేరు తామ్రశాసనంలో ఉంది.[4] దీనిని బట్టి ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకోవటమో లేదా అతని కోరిక మేరకు సహచరులెవరైనా చంపటమో జరిగివుంటుందని భావిస్తున్నారు.[5]

సాంస్కృతిక వారసత్వంసవరించు

ప్రతాప రుద్రుని వీరగాథ తెలుగు సాహిత్యంలో ఎన్నో విధాలుగా కీర్తింపబడింది.

శాసనాలుసవరించు

ఢిల్లీ పాలకులు ఓరుగల్లును ఆక్రమించుకున్న తర్వాతి కాలంలో వారితో పోరాడి ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాలను తిరిగి ఆక్రమైంచిన పలువురు రాజులు, వారి సేనానులు తమ శాసనాలలో ప్రతాప రుద్రుని వీరగాథను ప్రశంసించారు. తీరాంధ్రను పరిపాలించిన మునుసూరి కమ్మ రాజులు, రెడ్డి రాజులు వేయించిన పలు శాసనాలలో కాకతీయ సామ్రాజ్య పతనానికి సంబంధించిన విషాదం, కాపాడుకునేందుకు ప్రతాప రుద్రుడు చేసిన వీరోచిత పోరాటాలు వంటీవి ప్రస్తావనకు వచ్చాయి.

కాల్పనిక సాహిత్యంసవరించు

నాటకాలు, కావ్యాలు, చారిత్రిక నవలలు వంటి వాటిలో ప్రతాప రుద్రుని గురించి ఎన్నో ప్రస్తావనలు రావడమే కాక కొన్ని రచనల్లో ప్రతాప రుద్రుని పోరాటాలు, వీరత్వం, దురదృష్టకరమైన ఓటమి, మరణం వంటివే ఇతివృత్తాలు. వీటిలో కొన్ని చారిత్రికపరమైన వివరాలను కాకుండా కాల్పనికాంశాలకు పెద్దపీట వేసినవీ ఉన్నాయి.

 • ప్రతాపరుద్రీయం: కాకతీయ సామ్రాజ్యపు ఆఖరి చక్రవర్తి ప్రతాప రుద్రుని జీవితంలో కొన్ని జరిగిన ఘటనలు ఆధారంగా చేసుకుని ప్రముఖ పండితుడు వేదము వేంకటరాయ శాస్త్రి రచించిన నాటకం ఇది. ఈ నాటకంలోని ఇతివృత్తం ప్రకారం ప్రతాపరుద్రుని మంత్రి యుగంధరుడు. ఇతడు మహామేధావి, గొప్ప రాజభక్తి కలవాడు. ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్, సేనాధిపతి వలీఖాన్. అతడు ఒకనాడు ఓరుగల్లు వచ్చి, తమ సుల్తానుకు కాబూల్ సుల్తానుకు మధ్య యుద్ధం జరగబోతోందనీ, దానికి ప్రతాపరుద్రుని సహాయం అర్థించడానికి వచ్చామనీ చెబుతాడు. కాని అతడు ప్రతాపరుద్రున్ని ఎలాగైనా కుట్రతో నిర్భంధించి, ఢిల్లీకి పట్టుకుపోవాలనే పన్నాగంతో వస్తాడు. అప్పుడు మంత్రులు, రాజు నగరంలో లేడని, ఒక వారంలో వస్తాడని చెబుతారు. ఇంతలో వలీఖాన్ తన రహస్య అనుచరులతో, వేటకు వెళ్ళిన ప్రతాపరుద్రుని బంధించి, ఢిల్లీ సుల్తాన్ వద్దకు తీసుకొనిపోతాడు. విషయాన్ని వేగుల ద్వారా తెలుసుకొన్న మంత్రి యుగంధరుడు, పేరిగాడనే వానికి మారువేషం వేయించి, ప్రతాపరుద్రుని స్థానంలో, ఢిల్లీ సుల్తాన్ రాజదర్బారులో ప్రవేశపెట్టి, వలీఖాన్ ఆట కట్టించి, ఢిల్లీ సుల్తాన్ ద్వారా అతనికి శిక్ష వేయించి, నాటకాన్ని రక్తి కట్టిస్తాడు. అలా తన అచంచలమైన రాజభక్తిని చాటుకొంటాడు మంత్రి యుగంధరుడు. ఈ కథకూ చారిత్రిక యధార్థాలకు పొంతన లేకున్నా పాత్రలు చాలా వరకూ చారిత్రికాలే.[6]
 • మహాంధ్ర సామ్రాజ్య పతనము: ఇది చారిత్రిక నవల. త్రిపురనేని వెంకటేశ్వరరావు రచించగా నరేంద్ర గ్రంథమాలను ఏర్పాటుచేసి పలు ప్రచురణలు చేసిన ముళ్ళపూడి తిమ్మరాజుకు అంకితమిచ్చారు. మహాంధ్ర సామ్రాజ్యమన్న పదాన్ని ఈ నవలలో కాకతీయుల పరిపాలనకు ప్రతిగా ప్రయోగించారు. ఈ గ్రంథంలో అతిశయోక్తులను కాక ప్రామాణిక ఆధారాలతో నిర్మితమైన చరిత్రనే ఇతివృత్త నిర్మాణానికి ఆధారంగా స్వీకరించినట్టు రచయిత పేర్కొన్నారు. ప్రతాప రుద్రుని మరణంతో పూర్తైన కాకతీయ సామ్రాజ్య పతనాన్ని ఈ నవలలో చిత్రీకరించారు.[7]

వనరులుసవరించు

 • ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రము, సి. వి. రామచంద్ర రావు, 1984, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి, హైదరాబాదు .
 • సిద్ధేశ్వర చరితము.

మూలాలుసవరించు

 1. A Social History of the Deccan, 1300-1761, R. M. Eaton, 2005, Cambridge University Press, ISBN 0521254841
 2. Hindu Law, Sir Thomas Strange, 1830, Parbury, Allen, & Co., London
 3. Precolonial India in Practice: Society, Region, and Identity in Medieval Andhra By Cynthia Talbot పేజీ. 178 [1]
 4. A Forgotten Chapter of Andhra History (history of the Musunuri Nayaks) By Mallampalli Somasekhara Sarma పేజీ.14 [2]
 5. కాకతీయులు - పి.వి.పరబ్రహ్మశాస్త్రి పేజీ.136,137
 6. సంగ్రహ ప్రతాపరుద్రీయ నాటకము (రంగప్రతి), వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మదరాసు, 1992
 7. మహాంధ్ర సామ్రాజ్య పతనము:త్రిపురనేని వెంకటేశ్వరరావు:1975

ఇవి కూడా చూడండిసవరించు