ఆగమం
భగవంతుని చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు. భగవంతుడిని ఎలా అర్చించాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఏడాదిలో జరిగే నిత్యం, నైమిత్తికం, కామ్యం అనే ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, కంకణబట్టర్ ఎలాంటి అధ్యయనం చేయాలి, ఉత్సవాలు నిర్వహించే యజమానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను ఆగమాలు తెలియజేస్తున్నాయి.[1]
రకాలుసవరించు
వైష్ణవ ఆగమము లలో రెండు రకాలు ఉన్నాయి.
- వైఖానశ మునికి విష్ణువు నుండి వచ్చినది 'వైఖానశ ఆగమము'.
- గరుత్మంతునికి అయిదు రాత్రులు విష్ణువు వుపదేశించినదే 'పాంచరాత్ర ఆగమము'.
వైఖానస ఆగమం: శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమైన వైఖానస భగవత్ శాస్త్రమే తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం.[2]
పాంచరాత్ర ఆగమం: పాంచ అంటే ఐదు, రాత్ర అంటే రోజులు అని అర్థం. భగవంతుడు ఐదు రోజుల పాటు నాగరాజు అయిన అనంతుడు, గరుత్మంతుడు, విష్వక్సేనమూర్తి, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే ఐదుగురికి ఉపదేశించినవి కావున దీనికి పాంచరాత్రం అనే పేరు వచ్చింది. ఇది మనుషుల అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లోకంలో ప్రతి జీవి పునరావృత్తి రహిత శ్రీవైకుంఠానికి చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు పాంచరాత్రం దోహదపడుతుంది. ఈ ఆగమంలో భగవంతుని సేవించేందుకు దివ్యము, ఆర్ఘ్యము, దైవము తదితర 108 పూజా విధానాలున్నాయి. శ్రీ పాద్మ సంహిత, శ్రీ ప్రశ్న సంహిత మొదలైన శాస్త్రాల్లో సూచించిన ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్య, నైమిత్తిక, కామ్యోత్సవాలను జరుపుతున్నారు.
పూజలుసవరించు
నేడు అత్యధిక దేవాలయాలలో పాంచరాత్ర ఆగమానుసారమే పూజలు నిర్వహించబడుతున్నాయి. కానీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో మాత్రం వైఖానశ ఆగమానుసారం పూజలు నిర్వహించబడుతున్నాయి. మిగతా వైఖానశ ఆగమాలను అనుసరించే దేవాలయాలను పాంచరాత్ర ఆగమ విధానం లోనికి మార్చిన రామానుజాచార్యులవారు తిరుమలలో మాత్రం ఆ సాహసం చేయలేక వైఖానశ ఆగమం లోనే పూజలు చేయాలని కట్టడి చేసారు.
మూలాలుసవరించు
- ↑ edukondalu (2019-11-23). "పాంచరాత్ర ఆగమం అంటే ఏమిటి..? దానివలన లాభం ఏమిటి?". ఏడుకొండలు. Retrieved 2020-07-21.
- ↑ "వైఖానసం జాలగూడు". Archived from the original on 2014-06-13. Retrieved 2014-01-03.