మధ్వాచార్యులు
మధ్వాచార్యులు ద్వైత వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో మూడవ వారు. సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది మధ్వాచార్యులు. క్రీ.శ. 1238–1317 మధ్య కాలంలో మధ్వాచార్యులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. మధ్వాచార్యులు, హనుమంతుడు, భీముడు అనంతరము వాయు దేవునకు తృతీయ అవతారమని నమ్మకం ఉంది.
మధ్వాచార్యులు | |
---|---|
![]() | |
జననం | వాసుదేవ 1238 CE ఉడిపి, (ప్రస్తుతం కర్ణాటక) -భారత దేశ |
నిర్యాణము | 1317 CE (అదృశ్యమైన రోజు) ఉడిపి, (ప్రస్తుతం కర్ణాటక) -భారత దేశ |
బిరుదులు/గౌరవాలు | పూర్ణప్రజ్ఞ, వైష్ణవ మత గురువు, ఆనందతీర్థ, జగద్గురు |
గురువు | అచ్యుతప్రజ్ఞ |
తత్వం | ద్వైతం |
సాహిత్య రచనలు | సర్వమూలగ్రంథాలు |
పుట్టుక / బాల్యముసవరించు
మద్వాచార్యులు ఉడిపి వద్ద నున్న పాజక గ్రామంలో క్రీ.శ. 1238 సంవత్సరంలో విజయదశమి రోజున జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించినది నారాయణ పండితాచార్యులు. అతను తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నారు. అతనుకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.
బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉడుపి సమీపంలో నివసిస్తున్న, ఆకాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన అచ్యుతప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించాడు. అప్పుడే అతను పేరు పూర్ణప్రజ్ఞుడుగా మారింది.
ఒక నెల తరువాత ఓ తర్క శాస్త్ర పండితుల బృందాన్ని తన వాదనా పటిమతో ఓడించాడు. అతను ప్రజ్ఞకు అబ్బురపడిన అచ్యుతప్రజ్ఞ అతను్ను వేదాంత పరమైన అంశాలపై అధిపతిగా నియమించి ఆనందతీర్థ అనే బిరుదు కూడా ఇచ్చాడు.
దక్షిణభారత యాత్రసవరించు
యుక్తవయస్సులో ఉండగానే మధ్వాచార్యుడు దక్షిణ భారతదేశమంతా పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, కన్యాకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా అతను ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురైంది. కానీ అయన వేటికీ చలించలేదు. యాత్ర పూర్తి చేసుకుని ఉడుపి చేరుకోగానే భగవద్గీత పై తన భాష్యాన్ని రాయడం ప్రారంభించాడు.
రచనలుసవరించు
తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు వ్రాసాడు. ఇంకా ఋగ్వేదంలోని మొదటి 40 సూక్తాలకు, భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాసాడు. తర్కంతోపాటు మొత్తం 37 గ్రంథాలను రచించాడు. ఇందులో ప్రముఖమైనవి
- గీతాభాష్యం
- గీతాతాత్పర్యం
- బ్రహ్మసూత్రభాష్యం
- అణువ్యాఖ్యానం
- న్యాయవివరణం
- అణుభాష్యం
- దేశోపనిషద్భాష్యం
- మహాభారతతాత్పర్యనిర్ణయం
- యమకభారతం
- దశప్రకరణం
- తంత్రసారం
- ద్వాదశస్తోత్రం
- కృష్ణార్ణవామృతం
- సదాచారస్మృతి
- జయంతినిర్ణయం
- ప్రణవకల్పం
- న్యాసపద్ధతి
- తిథినిర్ణయం
- కందుకస్తుతి
ద్వైత వాదంసవరించు
జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.
భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. ముక్తి నాలుగు విధాలు:
- సాలోక్యం - జీవాత్మ భగవంతుని లోకంలో భగవంతునితోపాటు నివసించడం
- సామీప్యం - భగవంతుని సన్నిధానంలో నివసిస్తూ కామితార్థాలను అనుభవించడం
- సారూప్యం - భగవంతుని రూపం పొంది ఇష్టభోగాలు అనుభవిస్తూ ఆనందించడం
- సాయుజ్యం - భక్తుడు భగవంతునిలో లీనమైనా అతను కంటే వేరుగా ఉంటూనే అతను ఆనందంలో పాలుపంచుకోవటం.
ద్వైతమత ప్రభావంసవరించు
మధ్వాచార్యుడు ఆసేతుశీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైత మతాన్ని ప్రచారం చేశాడు.దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు.
నిర్యాణంసవరించు
మధ్వాచార్యుడు తన 79వ ఏట, క్రీ.శ.1317లో శిష్య సమేతంగా బదరినారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా ఉత్తర బదరిని చేరుకొని వ్యాసభగవానుని కైంకర్యాలాలో నిమగ్నమైపోయారు.