ఆధునిక మహాభారతం

http://kinige.com/book/Adhunika+Mahabharatam+Revised Archived 2019-10-26 at the Wayback Machine

నా దేశం నా ప్రజలు
అనే
అవతారిక "ఇది నా కావ్య సంకలనం కాదు ఇది నా కావ్యం నా సంపూర్ణ కావ్యం. కవి అనేక కావ్యాలు రాయడు. కవి ఒకే మనిషి – ప్రవహిస్తున్న ఒకే జీవితం జీవిస్తాడు అలాగే ఒకే కావ్యం రాస్తాడు... జీవితం ఒక యాత్ర; యాత్ర అనేక మజిలీల ప్రయాణం. దీని అర్థాంతరమే, కవి కావ్యయాత్ర అనేక కృతుల సాముదాయిక స్వరూపం. అంటే ఒక కవి తన జీవితంలో ఒకే కావ్యం రాస్తాడు అయితే దాన్ని అప్పుడప్పుడూ క్రమక్రమంగా రాస్తూ ఉంటాడు. అలా రాయబడే ఒక్కో కృతి నిజంగా పూర్ణకృతి కోసం పుట్టే ఒక్కో పర్వం. కావ్యయాత్ర అంతిమ చరణంలో అన్ని పర్వాలూ కలిసి ఒక్క కావ్యం మాత్రమే అవుతుంది. కనుక నేను నా జీవితంలో అనేక కావ్యాలు వ్రాయలేదు. రాశింది ఒకే కావ్యం. దాని పేరు నా దేశం నా ప్రజలు దాని వర్తమాన నామాంతరం ఆధునిక మహాభారతము. ఆ కావ్యం యొక్క భాగాలు నా జీవితంలో అప్పుడప్పుడూ రాస్తూవచ్చాను. భిన్నభిన్న నామకరణాలతో ఆ భాగాల్ని అప్పుడప్పుడూ ప్రకటిస్తూవచ్చాను. ఆ భిన్నభిన్న నామకరణాలతో అప్పుడప్పుడూ వచ్చిన ఆ భాగాలే ఈనాడు నా ప్రజలకు సమర్పిస్తున్న సంపూర్ణ కావ్యంలో పర్వాలుగా ప్రత్యక్షమవుతున్నాయి. అవి పుట్టినప్పుడు నిజంగా చివరకు రూపొందే సమగ్రకావ్యం కోసం పుట్టిన తొలి అవయవాలే గనుక ప్రతి పర్వాంతంలో ఒక పగ ఉంది. పర్వాంతగద్య. ఈ ఆధునిక మహాభారతానికి జనవంశమనే అనుబంధ కావ్యం ఒకటి ఉంది. ఇంతటితో నా కావ్యయాత్ర ముగిసింది " - శేషేంద్ర

(నా దేశం – నా ప్రజలు, మండే సూర్యుడు, గొర్రిల్లా, అరుస్తున్న ఆద్మీ,

సముద్రం నా పేరు, నీరై పారిపోయింది, ప్రేమ లేఖలు, శేషజ్యోత్స్న)

***

ముఖ్య వివరణ

ఆధునిక మహాభారతం 1970 – 1986 మధ్యకాలంలో ప్రచురించిన శేషేంద్ర వచన కవితా సంకలనాల సమాహారం. 1984లో అప్పటి వరకు వెలువడ్డ కవితా సంకలనాలను పర్వాలుగా రూపొందించారు. ఆంధ్రప్రభ వారపత్రికలో ఈ వివరణతో సహా ఆధునిక మహాభారతం ధారావాహికంగా వెలువడింది. 1984 – 86 వరకు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో శేషేంద్ర జాలం శీర్షికన చిన్న కవితలు వెలువడ్డాయి. వీటికి అరుస్తున్న ఆద్మీగా పేరుపెట్టారు. ఆధునిక మహాభారతంలో ఆద్మీ పర్వంగా చేర్చారు. శేషేంద్ర ఆధునిక మహాభారతం వ్యాస విరచిత భారతానికి ఏ సంబంధం లేదు. శేషేంద్ర మాటల్లోనే ఆధునిక మహాభారతం అంటే నేటి మన భారతదేశం. ఫలితంగా శేషజ్యోత్స్న జ్యోత్స్నపర్వంగా, నా దేశం నా ప్రజలు ప్రజా పర్వంగా, మండే సూర్యుడు సూర్యపర్వంగా, గొరిల్లా పశు పర్వంగా, నీరై పారిపోయింది ప్రవాహాపర్వంగా, సముద్రం నా పేరు సముద్రపర్వంగా, ఇందులో రూపొందాయి.

***

అవతారిక

"ఇది నా కావ్య సంకలనం కాదు ఇది నా కావ్యం నా సంపూర్ణ కావ్యం. కవి అనేక కావ్యాలు రాయడు. కవి ఒకే మనిషి – ప్రవహిస్తున్న ఒకే జీవితం జీవిస్తాడు అలాగే ఒకే కావ్యం రాస్తాడు... జీవితం ఒక యాత్ర; యాత్ర అనేక మజిలీల ప్రయాణం. దీని అర్థాంతరమే, కవి కావ్యయాత్ర అనేక కృతుల సాముదాయిక స్వరూపం. అంటే ఒక కవి తన జీవితంలో ఒకే కావ్యం రాస్తాడు అయితే దాన్ని అప్పుడప్పుడూ క్రమక్రమంగా రాస్తూ ఉంటాడు. అలా రాయబడే ఒక్కో కృతి నిజంగా పూర్ణకృతి కోసం పుట్టే ఒక్కో పర్వం. కావ్యయాత్ర అంతిమ చరణంలో అన్ని పర్వాలూ కలిసి ఒక్క కావ్యం మాత్రమే అవుతుంది.

కనుక నేను నా జీవితంలో అనేక కావ్యాలు వ్రాయలేదు. రాశింది ఒకే కావ్యం. దాని పేరు నా దేశం నా ప్రజలు దాని వర్తమాన నామాంతరం ఆధునిక మహాభారతము. ఆ కావ్యం యొక్క భాగాలు నా జీవితంలో అప్పుడప్పుడూ రాస్తూవచ్చాను. భిన్నభిన్న నామకరణాలతో ఆ భాగాల్ని అప్పుడప్పుడూ ప్రకటిస్తూవచ్చాను. ఆ భిన్నభిన్న నామకరణాలతో అప్పుడప్పుడూ వచ్చిన ఆ భాగాలే ఈనాడు నా ప్రజలకు సమర్పిస్తున్న సంపూర్ణ కావ్యంలో పర్వాలుగా ప్రత్యక్షమవుతున్నాయి. అవి పుట్టినప్పుడు నిజంగా చివరకు రూపొందే సమగ్రకావ్యం కోసం పుట్టిన తొలి అవయవాలే గనుక ప్రతి పర్వాంతంలో ఒక పగ ఉంది. పర్వాంతగద్య. ఈ ఆధునిక మహాభారతానికి జనవంశమనే అనుబంధ కావ్యం ఒకటి ఉంది. ఇంతటితో నా కావ్యయాత్ర ముగిసింది "

- శేషేంద్ర

***

విప్లవ వస్తువు ఆధునిక రూపకళా సృష్టిలో లీనం చేసి భారతీయ చషకంలో పోసి ఒక అపూర్వ మిలన మాధురి ఇచ్చిన శేషేంద్ర ఆసియా ఐరోపాల మధ్య వేసిన ఇంద్రధనుస్సేతువు. ఈయనలోనే తెలుగుకవిత విప్లవబింబసృజనలో శిఖరాగ్రాలు అందుకుంది. కనుక ఆయన ఒక నూత్నకవితామార్గకర్త.

శేషేంద్రను చదవడం విప్లవ సంగీతాన్ని వినడమే. ఏ సంగీతం కర్మాచరణ ప్రేరకమో, మహోత్తేజ దాయకమో – దాన్ని; ఆ అనుభూతి ఒక సుగంధిల స్వప్నం, ఒక పూలతీగ, ఒక కొండవాగు. ఇలా ప్రతీకలుగా చెపుతూ పోవలసిందే తప్ప వేరే మార్గం లేదు. శేషేంద్ర కవిత్వమంతా లావాప్రవాహం లాంటి ప్రతీకల స్రోతస్సు.

***

ఇంత వరకూ సాహిత్యంలో ప్రముఖులు శేషేంద్ర కావ్య వాక్యాలు పేర్కొంటూ వస్తున్నారు . కానీ ఈ మధ్య చలన చిత్ర ప్రముఖులు కూడా చాలా మంది శేషేంద్ర కవితల్ని జండాలుగా ఎగరేస్తున్నారు . వీరికి లీడర్ తెలుగు సినిమా గబ్బర్ సింగ్ శ్రీ పవన్ కళ్యాణ్ . వీరు అంటించిన సీమ టపాకాయల సరం క్రమంగా అన్నిదిక్కులా పేలుతోంది . మొన్న ఈ మధ్య ఒక దిన పత్రికకిచ్చిన ఇంటర్వ్యూ లో సూటిగా ఆధునిక మహాభారతం ప్రస్తావించాడు పవన్ కళ్యాణ్ . ఎంతో కాలంగా పునర్ముద్రణ కోసం ఎదురు చూస్తున్న ఈ కావ్యేతిహాసాన్ని కవి కుమారుడు సాత్యకి మహా కవి శేషేంద్ర 9వ వర్ధంతి కానుకగా తెలుగు సాహితీ ప్రజానీకానికి బహూకరిస్తున్నారు .

For copies contact :

Seshendra Sharma’s Writings Copyright © Saatyaki S/o Seshendra Sharma

Contact : [[1]]

ఆధునిక మహాభారతం, గుంటూరు శేషేంద్రశర్మ వ్రాసిన కవిత. ఇది 1986లో ప్రచురితమైన పది పర్వాల బృహత్కావ్యం.

ఆలోచన, ఆవేశం, భావుకతల మేళవింపు "ఆధునికం" అనే సమీక్షా వ్యాసంలో దుప్పల రవికుమార్ అనే రచయిత ఇలా వ్రాశాడు[2]

సాహిత్యంలో అతి గొప్ప పురస్కారంగా నోబెల్ బహుమానాన్ని గుర్తిస్తున్నాం. ఆసియా ఖండంలోనే తొలి నోబెల్ పురస్కారం మన భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ తన గీతాంజలికి పొందారు. తర్వాత ఇండియాకు మరి నోబెల్ సాహిత్య పురస్కారాలు లేవు. రుడ్యార్డ్ కిప్లింగ్ ఇండియా వచ్చేసిన తరువాతే నోబెల్ బహుమానం పొందినా అది ఇండియా ఖాతాలో జమకాలేదు. ఇటీవల ఆర్.కె. నారాయణ్ లిస్టింగులో నిలిచినా కొద్ది పాయింట్ల తేడాతో నోబెల్ రెండుసార్లు మిస్సయ్యారు. ఇక తెలుగు విషయానికొస్తే ప్రపంచం గర్వించదగ్గ రచయితలున్నా భాష విశిష్టతను సరిగ్గా నోబెల్ కమిటీకి వ్యక్తం చేయలేక భంగపడుతున్నాం. మన వీరేశలింగం, మన గురజాడ, మన శ్రీశ్రీ, మన వట్టికోట, మన విశ్వనాథ ఎవరికంటే తక్కువ? ఇంతటి నిరాశామయ వాతావరణంలో తెలుగు సాహిత్యలోకాన్ని ఆనంద పరవశం చేసిన మాటొకటి రెండేళ్ల కిందట పట్టి కుదిపింది. మన గుంటూరు శేషేంద్రశర్మ సృజించిన "ఆధునిక మహాభారతం" కావ్యం నోబెల్ సాహిత్య పురస్కారం పరిశీలనలో ఉందని సంతోషపడ్డాం. బహుమతి సరే, తెలుగువాడి వాడి, వేడి, భాష సొగసు, ఆలోచనల అంతర్మధనం, సమాజంపట్ల బాధ్యత, తోటి మనిషి పట్ల సానుభూతి, ఇవన్నీ ప్రపంచమంతా తెలుసుకుంటారు కదా అని సంబరపడ్డాం.[1]

వ్యాసుడు రాసిన మహాభారతం ఎనిమిది వేల శ్లోకాలు గల "జయం" అనే ఇతిహాసం. భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరు కథనమైన ప్రాచీన భారతం చదివితే పుణ్యం వస్తుందని అంటారు. అదే భూమి కోసం, భుక్తి కోసం వర్గ చేతన కథనం ఆధునిక భారతం చదివితే ఎన్నో లాభాలు. రచయిత సూచించినట్లుగా ఎన్ని లాభాలో చూడండి — గులాం మనస్తత్వం కారణంగా వంగిపోయిన మోకాళ్లలో బలం వచ్చి, మనిషి కాళ్లు నిటారుగా నిలుస్తాయి. దాని పైన వంగి వంగి సలాములు చేసి చేసి వంకరటింకర్లు అయిపోయిన వెన్నెముక ఇనుప చువ్వలా నుల్చుంటుంది. సిగ్గు విడిచి తల వంచివంచి మెలిగే అలవాటుచేత సదా వేలాడే తల ఒక్కసారి భుజాలమీద లేచి నిర్భయంగా నిలబడుతుంది. మనిషి మనిషిగా మారిపోతాడు. భూగోళానికి ఇరుసు అవుతాడు.

శేషేంద్ర కవిగా సాగుచేసిన ఫలసాయమంతా ఒకచోట చేరిస్తే అదే "నా దేశం నా ప్రజలు" అనే ఆధునిక మహాభారతం. నిరంతర శ్రమ ఫలితమే మానవ నాగరికత. నగరీకరణలో ఎక్కడ, ఎప్పుడు, ఎలా లోపం జరిగిందో తెలీదు గానీ, దాని ఫలితమే నేడు మనం చూస్తున్న అసమ సమాజం. ఎందుకిలా జరిగిందో ఊహించగలం. మనిషి స్వార్ధంవల్ల, విశాల దృష్టి లేకపోవడం వల్ల, సంకుచితత్వం వల్లనే ఇదంతా. శేషేంద్ర దీనికి విరుగుడు స్పష్టంగా చెప్తారు. వీటన్నింటి గురించి బాగా ఆలోచించిన కవి కొన్ని చోట్ల విపరీతంగా ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తారు. మళ్లీ తనను తాను సముదాయించుకుంటారు. “నీకెందుకింత అశాంతి నీకెందుకింత ఆవేశం అంటే ఏం చెప్పను? సముద్రాన్ని అడుగు నీ కెందుకింత అశాంతి అని, ఝంఝామారుతాన్ని అడుగు నీకుందుకింత ఆవేశం అని“.

కావ్యం ప్రారంభంలోనే మనకు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పేస్తారు. -

పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి! నా అవయువాలకు నీచంగా వంగే భంగిమలు తెలియవు. నేను సత్యాగ్రాహి! సత్యం నా గుండెల్లో బద్దలవుతున్న అగ్ని పర్వతం. నా గొంతులో గర్జిస్తున్న జలపాతం!

పిల్లల చదువులను విసుక్కుంటారు శేషేంద్ర. ఈ చదువుల గమ్యం అంతు చిక్కదంటారు. ప్రత్యామ్నాయంగా ..:

నీవు కాలేజీకి పోతుంటే బాబూ! నిన్ను పొలాలు బిక్క మొహంతో చూస్తున్నాయి. ప్రతిరోజూ ఈ పుస్తకాల ఊరేగింపు ఎందుకు ఈ దేశపు వీధుల్లో… మీరు పలకా పుస్తకాలు పట్టుకుని పోతుంటే బాబూ! మీరు శిలువలు మోసుకుపోతున్న బాల క్రైస్తవుల్లా కనిపిస్తారు నా కళ్లకు – లే బాబూ లే, నీ బాల్యంలోంచి లే! పుస్తకాలవతల పేరెయ్! నాగలి భుజాన వేసుకో! ఈ కులాలు విడిచిపెట్టు ఆ పొలాల్లో కలువ్… పొలాలు మీకు స్వేచ్ఛాదానం చేస్తాయ్. హాయిగా పేల్చే ఊపిరి కానుకగా ఇస్తాయ్, పీఠభూమిలాంటి ఛాతీనిస్తాయ్, ఇనప ఊచల్లాంటి కాళ్లిస్తాయ్…!

ఫ్యూడల్ వ్యవస్థ పతనమై ధనస్వామ్య వ్యవస్థ అవతరించడంతో యాంత్రిక నాగరికత మధ్య తరగతి జీవితాన్ని మరింత దుర్భరం చేసింది. కార్మికుడు ధనస్వామి చేతిలో పనిముట్టుగా మారిపోయాడు. కర్షకుడు పాలకుల కుతంత్రాలలో చిక్కుకుని వ్యాపార సంస్కృతిలో పోటీపడలేక సంఘర్షణలో వున్న వ్యక్తికి సరైన దిశానిర్దేశం చూపగలిగేది నిశ్చయంగా కవి మాత్రమే.[1] అందుకు ఉదాహరణలు ఈ కావ్యంలో కోకొల్లలు. మచ్చుకు కొన్ని-

దేవుడ్ని గూర్చి దీర్ఘ చర్చలు చేసేంతటి మూర్ఖులమూ కాము, ధనికులమూ కాదు. మనవి పనిచేసి బ్రతకవలసిన చేతులు.
సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు. తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు. పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు. నేనింతా ఒక పిడెకెడు మట్టే కావచ్చు. కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.
రూపాయి నలిపి వాసన చూపిస్తే ఆపాతంగా అలా మూర్చపోతే ఎలా? కొత్త యుగపు తొడనుంచి చీల్చిన కండతో నిర్మించిన గరుడిడివి కావాలి. ఝంఝామారుతాలకు ఎదురొడ్డే ఇనప రెక్కలు తొడుక్కోవాలి. నలుగురి ముందు నీ మూపు వంగితే నీ కాళ్లు రెండు బందూకుళ్లా ఖచ్చితంగా నిలవలేకపోతే నీవు నా యుద్ధాల్లో పనికిరావు.
బాబూ మనం తుపాకుల్ని ఎదుర్కోగలం గానీ నియంతలు ప్రశ్నల్ని ఎదుర్కోలేరు.
సోదరా ఎలాంటి గుడ్డితనాన్ని కూడా కాంతి క్రౌర్యం నుంచి కాపాడబోకు
అందరమూ ఏ చెట్టుకో పుట్టిన ఆకులం, ఏ శాఖకో పూచిన పువ్వులం. అందరమూ అన్నీ విడిచిపోతాము. మరికొన్నింటికి తావిస్తాం. కానీ జీవిస్తాం. ఒరే సిద్ధాంతీ, నీ పంచాంగం కట్టిపెట్టు. ఒరే రాజకీయ ప్రభూ నీ లౌడ్ స్పీకరు పీకేసుకో – పాత చెట్టు కూడా కొత్త పూలు పూస్తుంది.
కొందరు పుట్టకముందే వాళ్లని గొప్పతనం నిరీక్షిస్తుంది. కొందరు చచ్చినతర్వాత కూడా వాళ్లని గొప్పతనం పరీక్షిస్తుంది. ఒకడు పుష్పహారాల బరువుతో పొంగిపోతాడు. ఒకడు గాయాలు లెక్కపెట్టుకుంటూ ఉప్పొంగిపోతాడు.

ప్రతి వాక్యం ఒక డైనమైట్ లా పేలే ఈ కావ్యం ఆలోచన, ఆవేశం, భావుకతల సమ్మేళనం.[1]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు, వనరులు

మార్చు
  1. 1.0 1.1 1.2 "చదువు" బ్లాగు లో దుప్పల రవికుమార్ వ్యాసం. (తన వ్యాసాన్ని తెలుగు వికీలోని కాపీచేయడానికి అనుమతి ఇచ్చిన రచయితకు కృతజ్ఞతలు.)

బయటి లింకులు

మార్చు