ఆవారా ఒక తెలుగు డబ్బింగ్ సినిమా. దీని మాతృక తమిళంలోని "పయ్యా". ఇది ఆంధ్రప్రదేశ్ లో శతదినోత్సవం జరుపుకున్నది.

ఆవారా
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.లింగుస్వామి
తారాగణం కార్తిక్, తమన్నా
భాష తెలుగు

శివ (కార్తిక్ శివకుమార్) అందరిలాగా సరదాగా బ్రతికే ఓ మామూలు యువకుడు. శివకి ఉద్యోగం ఇప్పించాలని తన స్నేహితులు ఎంతో ప్రయత్నిస్తుంటారు కానీ ఏవీ ఫలించవు. తన స్నేహితుల బృందంలో ప్రియ (సోనియా దీప్తి) శివ ప్రాణస్నేహితురాలు. అన్ని విషయాలనూ శివ ప్రియతో చర్చిస్తుంటాడు. తను ఇంటర్వ్యూ పనిమీద బెంగళూరుకి తన స్నేహితులతో కలిసి వెళ్ళినప్పుడు శివ ఓ అమ్మాయి (తమన్నా)ని చూసి ప్రేమలో పడతాడు. అప్పటి నుంచీ ఎప్పుడు ఆ అమ్మాయి ఎదురయినా ఆమెను కలవాలనుకుని విఫలమవుతుంటాడు. ఆ అమ్మాయి కనిపించిందని ఇంటర్వ్యూ వదులుకుని తనను వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ అప్పుడు తనని కలవడంలో విఫలమవుతాడు. శివ, తన స్నేహితులు వాడే కారు ఓనర్ బెంగళూరుకి వస్తాడు. తనని రిసీవ్ చేసుకోడానికి శివ ఆ కారుతో రైల్వే స్టేషను దగ్గర ఎదురుచూస్తుంటాడు. ఇంతలో ఆ అమ్మాయి, తనని తిడుతూ కంగారుపడుతున్న ఓ పెద్దమనిషి శివకి తారసపడతారు. శివ ఓ కార్ డ్రైవర్ అనుకుని ఆ పెద్దమనిషి నెల్లూరుకి తీసుకెళ్తావా అని అడుగుతాడు. శివ అందుకు ఒప్పుకుని వాళ్ళని బండిలో ఎక్కించుకుని బయలుదేరతాడు. బండిలో పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు ఆ అమ్మాయి శివని బండి తియ్యమంటుంది. ఆ పెద్దమనిషిని వదిలేసి శివ, ఆ అమ్మాయి తప్పించుకుపోతారు. ముందు ఆ అమ్మాయి విమానాశ్రయానికి, అక్కడ విమానం మిస్స్ అవ్వడం వల్ల రైల్వే స్టేషనుకి తీసుకెళ్ళమంటుంది. అక్కడ పరిస్థితి అనుకూలించక అక్కడి నుంచి వెళ్ళిపోయి శివ కారు ఎక్కుతుంది. తనని ముంబై తీసుకెళ్ళమని అడుగుతుంది. అందుకు శివ ఒప్పుకుంటాడు. ఆ అమ్మాయితో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. మొదట నిరాకరించినా, శివపై కొంత నమ్మకం ఏర్పడ్డాక తన కథంతా చెప్తుంది. ఆ అమ్మాయి పేరు చారులత. తన తల్లిదండ్రులు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కొన్నాళ్ళకి తన తండ్రి జీవితంలో ఇంకో అమ్మాయి రావడం వల్ల తన తల్లిని మోసగించాడు. తనకి ఇష్టం లేని పెళ్ళి చేసుకోమని చారులత తండ్రి తనని బలవంతపెడుతుంటే చారులతకి ఎప్పుడూ సహకరించే తన తల్లి తన తండ్రితో జరిగిన ఓ గొడవలో చనిపోతుంది. తన తండ్రి ఆశలకు తలొంచక చారులత బెంగళూరు పారిపోయి వస్తే తన తండ్రి బిజినెస్ పార్ట్నర్ జయరామన్ తనని బలవంతంగా నెల్లూరు తీసుకెళ్ళాలనుకుంటాడు. వాళ్ళిద్దరూ శివ కారు ఎక్కాక శివ సహాయంతో చారులత పెట్రోల్ బంక్ దగ్గర జయరామన్ నుంచి తప్పించుకుంది. ఇప్పుడు తను ముంబైలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలనుకుంటోంది. కానీ శివ, చారులత వెళ్తున్న కారుని తన తండ్రి పంపిన కొంత మంది కారులతో తరుముతుంటారు. శివ వాళ్ళని మభ్యపెట్టి దారి మార్చి తప్పించుకోవాలనుకుంటాడు, కానీ ఇంకో గ్యాంగ్ తమని తరుముతుండటం చూస్తాడు. ఇప్పుడు తరుముతున్న వాళ్ళు చారులత కోసం కాక తన కోసం ముంబై నుంచి వచ్చిన బాలి (మిళింద్ సోమన్) మనుషులని తెలుసుకుంటాడు. వాళ్ళని కొట్టి తరిమేసాక చారులత శివని వాళ్ళెందుకు నిన్ను తరుముతున్నారని అడుగుతుంది. అప్పుడు శివ ముంబైలో జరిగిన ఓ గొడవని గుర్తుతెచ్చుకుంటాడు. కొన్నాళ్ళ క్రితం ఇంటర్వ్యూ పని మీద ముంబై వెళ్ళిన శివ తన స్నేహితుడు పండు (జగన్) ఇంటికి వెళ్ళాడు. అక్కడ బాలికి ఉన్న బలం బలగం గురించి తెల్యక బాలి మనిషిని, ఆపై బాలిని కొడతాడు. విషయం తెలుసుకుని బెంగళూరుకి వెళ్ళిపోతాడు. రెండు గ్యాంగులూ ఆ ఇద్దరికోసం గాలిస్తూనే ఉంటారు.ముంబై చేరాక కొన్ని సంఘటనల వల్ల పండు ఇంటికి శివ, చారులత వెళ్తారు. చారులత అమ్మమ్మ ఇంటి చిరునామా తెచ్చాక శివ ధనవంతురాలయిన చారులత అమ్మమ్మ ఇంట్లో తనని దింపేస్తాడు. తన ప్రేమ ఇక గెలవదని తెలుసుకున్న శివ బాధతో తిరుగు ప్రయాణం మొదలుపెడతాడు, కానీ మళ్ళీ చారులతని రోడ్డుపై చూస్తాడు. మొదట చెప్పేందుకు సిగ్గుపడినా చివరికి తన అమ్మమ్మ ఇంట్లో తన తల్లిదండ్రుల గురించి చులకనగా మాట్లాడటం వల్ల ఉండలేక వచ్చేసానని చెప్తుంది. సరిగ్గా ఇక్కడే బాలి, తన మనుషులు, అలాగే జయరామన్ పంపిన గూండాలు వచ్చి చారులతని తీసుకుపోవాలనుకుంటారు. ఒంటి చేత్తో వాళ్ళందితో పోరాడిన శివ చారులతని వాళ్ళందరి నుంచి కాపాడి ఇంకెప్పుడూ తమ జోలికి రావద్దని హెచ్చరిస్తాడు. తిరిగి ఇద్దరూ బెంగళూరు వెళ్తుండగా శివ స్నేహితులు దారిలో కలుస్తారు. అక్కడ ప్రియ ద్వారా చారులత శివ తనని ఎంతగా ప్రేమించాడో తెలుసుకుంటుంది. అప్పటికే శివతో ప్రేమలో పడినా చెప్పలేక ఇబ్బంది పడుతున్న చారులత శివతో తన ప్రేమ విషయం చెప్పి తనని దగ్గరికి తీసుకోవడంతో సినిమా ముగుస్తుంది.

సంగీతం

మార్చు

యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. చంద్రబోస్, వెన్నెలకంటి, భువనచంద్ర పాటలను రచించారు. యువన్ సంగీతం అందించన పాటల్లో నేటికీ ఈ సినిమా పాటలు భారీవిజయంగా నిలిచాయి. ముఖ్యంగా చిరు చిరు చిరు, నీ ఎదలో నాకు పాటలు ఎవర్గ్రీన్ పాటలుగా నిలిచిపోయాయి.

నెం. పాట గాయకులు రచన నిడివి
1 "చిరు చిరు చిరు" హరిచరణ్, తన్వీ షా చంద్రబోస్ 4:49
2 "మందార పూవల్లే" బెన్నీ దాయాల్ భువనచంద్ర 5:27
3 "అరెరే వానా" రాహుల్ నంబియార్, సైంధవి వెన్నెలకంటి 4:32
4 "చుట్టేసై చుట్టేసై" కార్తిక్, సునీత సారథి భువనచంద్ర 5:01
5 "నీ ఎదలో నాకు" యువన్ శంకర్ రాజా, తన్వీ షా వెన్నెలకంటి 4:58
"https://te.wikipedia.org/w/index.php?title=ఆవారా&oldid=4203425" నుండి వెలికితీశారు